Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 8

    "ఏమిటోనమ్మా! ఈ రోజుల్లో కొంతమందికి పూజలూ, పునస్కారాలూ లేకుండా పోతున్నాయిగాని మాకింకా ఆ చాదస్తాలు వదలలేదు. మా అత్తగారు నేను కాపురానికి వచ్చీ రాగానే నాచేత శ్రావణ మంగళ వారం నోము పట్టించేసింది. అ తరువాత ఆపుణ్యాత్మురాలు చచ్చి స్వర్గాన ఉన్నా, నేను మాత్రం ఒక్క నోమూ వదలలేదు. దంపతి తాంబూలం నోము మొదలుకొని నందికేస్వరుడి నోమువరకూ అన్ని నోములూ నోచాను. ఇప్పటికీ ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ భారతమో, భాగవతమో చదివి తేనే కానీ, నా మనసుకి స్థిమితంగా ఉండదు. ఏదో ఇంతవరకూ ఇలా వెళ్ళమారిపోతున్నాయి రోజులు."    
    విస్తుపోయి భయంతో బిగుసుకుపోయి నోట మాటరాక వింటున్న విమల కాలిని, తన కాలితో నెమ్మదిగా తొక్కాడు, విమల ఉలిక్కిపడి శర్మ సైగ అందుకుని "అయ్యో! ఎంతమాట అత్తయ్యగారూ మీ నోములూ వ్రతాలూ గురించి కామేశ్వరి నాకు చెప్పింది ఈ రోజుల్లో మీరు గనుక ఇంతమంది దేవుళ్ళకి ఇంత నిష్టగా పూజలు చేస్తున్నారు గాని మరొకరైతే ...." అని ఆగి, "ఒక్క దేవుడికయినా చెయ్యరు" అని ముగించింది 'కామేశ్వరి ఎవరా అని మనసులో మధనపడుతూ.    
    ఈశ్వరి పొంగిపోయింది. "ఈ పూట నువ్వు మా ఇంట్లో భోజనం చేసి కాని వెళ్ళటానికీ వీల్లేదు" అని అహ్వానించేసింది కూడా.    
    తల్లి హృదయానికి అతి దగ్గిర దారేదో శర్మకి బాగా తెలుసు. ఆ సమయంలో లుంగీ, బనీనుతో, నుదుట విభూది రేకలతో సీతాపతివచ్చాడు. అంతటి వృద్దాప్యంలోనూ ఆయనలో ఏదో హుందాతనం ఉంది. ఆయన చూపులు ఎదుటి వ్యక్తుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఉంటాయి. ఆయన వస్తూనే నేరుగా విమలనే "ఎవరమ్మా నువ్వు?" అని అడిగేశారు. విమల కంగారు పడింది. ఆ గంభీరమూర్తిని చూస్తూ సమాధానం చెప్పాలంటే అమె గొంతు పొడారి పోయింది.    
    "అమ్మ పురాణం వినటానికి వచ్చింది నాన్నగారూ?" అన్నాడు శర్మ.    
    "అలాగా! నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా?"    
    విమల గతుక్కుమంది తెల్లబోయి చూసింది.    
    ఆయన నవ్వుతూ "పురాణాలు వినటానికొచ్చే మామూలు ఆడపిల్లలు చేతికి వాచీలు పెట్టుకొని రారు" అన్నాడు.    
    విమల భయంగా నవ్వి "అవునండీ!" అంది.    
    ఆయన వెంటనే తన జేబులోంచి టిక్కట్ల పుస్తకం తీసి "అయితే అమ్మా! నువ్వు మా వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి ఒక టిక్కెట్టు కొనవలసిందే! పది, అయిదు, రెండు ఏదయినా సరే!" అంటూనే పది రూపాయల టిక్కెట్ చేత్తో పట్టుకున్నాడు. శర్మ వెంటనే తన జేబులోంచి పది రూపాయలు తీసి, "ఆ టిక్కెట్ ఇలా ఇవ్వండి నాన్నగారూ!" అన్నాడు. ఆయన తెల్లబోయి "నువ్వు కొనటమేమిటీ?" అన్నాడు.    
    "దానివల్ల వచ్చే పుణ్యఫలం మా కిద్దరికీ కావాలి!"    
    సీతాపతి తెలబోయినట్లు కాసేపు ఆగిపోయి భావగర్భితంగా నవ్వుతూ విమలా శర్మలను చూసి "ఆదా, సంగతి! నా కర్ధమయింది" అన్నాడు.    
    ఈశ్వరి కల్పించుకొని, "ఏమిటండీ, అర్ధమయిందీ?" అంది.    
    "ఏం లేదు, ఈ ఇంట్లో కొత్త పురాణం ప్రారంభం కాబోతోంది."    
    "కొత్త పురాణమా! ఎవరు రాశారూ?"    
    "రాయలేదు రాస్తారు!"    
    "అబ్బ! ఏమిటండీ సరిగ్గా చెప్పండి!"    
    "తరువాత చెప్తాలే! నాకు పని ఉంది. వస్తానమ్మా!"    
    సీతాపతి వెళ్ళిపోయాడు! విమలకు కాళ్ళూ, చేతులూ వణుకుతున్నాయి తెలివి తప్పి పోతానేమో నన్నంతగా ఉద్వేగపడి పోతోంది. లేచి నిలబడి, "నేను వెళ్ళొస్తానండీ!" అంది. ఈశ్వరి "ఉండమ్మా!" అని బొట్టు పెట్టి తాంబూలం చేతిలో పెట్టింది. "మధ్యాహ్నం పురాణం వినటానికి రావటం మరిచిపోకు!" అని హెచ్చరించింది. విమల 'అలాగే' అన్నట్లు తల ఊపి బయట పడింది. శర్మ కూడా బయటికొచ్చి ఏదో మాట్లాడబోతోంటే, వినిపించుకాకుండానే, ఖాళీగా పోతున్న ఆటోను ఆపుచేసి అందులో కూర్చుంది.
    
                                                                6
    
    శకుంతలతో బంతి ఆడుతోంది విమల, తను కూడా పసిపిల్ల అయినట్లు శకుంతలతో సమంగా పోట్లాడుతూ ఆడుతోంది. ఆ సమయంలో వచ్చాడు శర్మ. రేగిన జుట్టుతో అలంకరణ లేని ముఖం, సాదాచీర అయినా ఎంతో అందంగా ఉంది విమల. శకుంతల ముఖంలో ఎంత నైర్మల్యం కనిపిస్తోంది. శర్మను చూడగానే శకుంతల బంతి పారేసి, "డాడీ" అంటూ వచ్చి కౌగిలించుకుంది. విమల పైట చెంగుతో ముఖం తుడుచుకొంటూ వచ్చి నవ్వింది. ఆ నవ్వులో వికాసం లేదు. అది గుర్తించాడు శర్మ శకుంతలను ఎత్తుకొనే, లోపలకు వచ్చాడు! ఆ సంధ్య సమయంలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూనే ఉంది అనసూయ, ఆవిడను చూస్తోంటే, ఏవో కాశీ మజిలీ కదలలోని ముసలమ్మ గుర్తుకొచ్చింది శర్మకి. ఎప్పుడూ అదేచోట కూచుంటుంది. కళ్ళజోడులోంచి చూస్తూ ఏకాగ్రతగా కుట్టుకుంటూ ఉంటుంది. తనలోకమంతా అదే అయినట్లు, శర్మని చూసి ఆవిడ తన చేతిలో బట్టలు పక్కనున్న బుట్టలో పెట్టి లేచి నిలబడింది. ఆవిడ ముఖంలోనూ ఏవో మబ్బులు శర్మ భుజం మీద ఉన్న శకుంతలను చూస్తూ, వెలుగు, నీడా పరచుకొన్న ఆకాశంలా నవ్వుతూ "కూర్చోబాబూ! ఏం పనిమీద వచ్చావ్?" అంది. ఆ ప్రశ్నతోనే శర్మకు విషయం అర్ధమయిపోయింది. తన ఇంటి వాతావరణం చూసి విమల బెదిరిపోయిందని, ఆ రోజే అనుకున్నాడు. కుర్చీలో కూర్చుని శకుంతలను తన వళ్ళోనే కూచోబెట్టుకుని, తెచ్చిన చాక్లెట్లు అందించాడు.    
    "అత్తయ్యగారూ! మా అమ్మా-నాన్నా, నేను విమలను పెళ్ళి చేసుకోటానికి ఒప్పుకున్నారు. ఇక! మీ అంగీకారమే కావాలి."    
    అనసూయ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆ తర్వాత సాలోచనగా విమలను చూసింది విమల ముందుకు వచ్చి "క్షమించండి శర్మగారూ! మీ ఇంటి వాతావరణం అర్ధమయ్యాక, నేనక్కడ ఇమడలేనని అనిపిస్తోంది" అంది.    
    "విమలా! నువ్వు మా ఇంటి వాతావరణం పూర్తిగా అర్ధం చేసుకోలేదు. మా అమ్మ మనసులో ఎంత మమకారం ఉందో,  నాన్నగారి హృదయం ఎంత విశాలమైనదో, అర్ధం చేసుకోగలిగితే మా ఇంటికి రావటానికి నీకే సంకోచమూ ఉండేదికాదు. ఈ పై పై తతంగాలకు భయపడే దానివి కాదు. మనకంటే ఒక తరం ముందు వాళ్ళయిన పెద్దవాళ్ళ ఆచారాలూ అలవాట్లు మనం నీరసించకూడదు. సానుభూతితో అర్ధంచేసుకోవాలి సంఘంలో మార్పు క్రమక్రమంగా వస్తుంది కాని ఒక్కసారిగా రాదు. ఆ విషయం గుర్తుంచుకో, వాళ్ళ ఆచార సాంప్రదాయాలకంటే, ఆ మనసులలో ఉండే మమకారాలకు విలువ ఇవ్వాలి మనం."    
    విమల మాట్లాడలేదు శర్మ తన కళ్ళముందు లేనప్పుడు తను పెళ్ళి మాట తలపెట్ట కూడదనుకుంది. కానీ శర్మ తన ఎదుట నిలిచి మాట్లాడుతూంటే ఆమె మనసు మళ్ళీ ఉయ్యాలలూగుతుంది.    
    అనసూయ కల్పించుకొని, "మీ తల్లిదండ్రులతో అన్నివిషయాలూ చెప్పావా, బాబూ?" అంది.

 Previous Page Next Page