"కానీ ఆ ఖరీదయిన సరుకులేందుకు తీసుకున్నావ్? అసలే ఇబ్బందుల్లో వుంటే....."
"ఆ మాట నిజమే గానీ సార్! వచ్చేవారం మీ పెళ్ళి రోజు కద్సార్! ఆ రోజు మీ ఇద్దరికీ అద్భుతమైన భోజనం పెట్టాలని నా ప్రయత్నం. ఆ ఒక్కరోజైనా మీరు ఈ ఇబ్బందులన్నీ మర్చిపోవాలి."
రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు. నటరాజ్ మీద విపరీతమయిన అభిమానం కలిగింది. "ఇలాంటి విషయాలన్నీ ఎంత బాగా గుర్తు పెట్టుకుంటావోయ్?"
"ఏదో చిన్నప్పటినుంచీ అలా జీనియస్ గా వుండటం అలవాటయి పోయింది సార్!"
సీత కిచెన్ లోంచి కేక వేసింది.
"అలా కబుర్లు చెప్తూ కూర్చోవటమేనా ఇంట్లో పని చేయటం కూడా ఏమయినా ఉందా? రా ఇటు! ఈ సరుకులన్నీ డబ్బాల్లో పోసి అల్మారాలో పెట్టు."
"వస్తున్నానమ్మా!" అంటూ అక్కడి నుంచి కదిలాడతను.
రామచంద్రమూర్తి ఉయ్యాల బల్ల మీద పరుపు చుట్ట నానుకుని పడుకున్నాడు. వుయ్యాల నెమ్మదిగా వూగుతోంది కొంచెంగా కీచుమని శబ్దం చేస్తూ.
అతని మనసు కూడా తీపిచేదు ఆలోచనల మధ్య వూగుతోంది.
మళ్ళీ పెళ్ళిరోజు వచ్చేస్తోందన్న మాట! తనకసలు గుర్తేలేదు సీతకు గుర్తుందో లేదో మరి.
ఎక్కడ గుర్తుంటుంది ? విషాదం మీద విషాదం వచ్చి పడుతుంటే?
ప్రతి పెళ్ళిరోజుకీ తను సీతకేమయినా మంచి బహుమతి ఇచ్చి ఆశ్చర్యపోయేట్లు చేసేవాడు. ఆమె కూడా తనకోసం ఏదొక బహుమతి ఇస్తుండేది.
అవునూ! ఈసారి సీతకే బహుమతి ఇవ్వాలి?
ఒక సంవత్సరం ఆమెకు 'కన్యాశుల్కం' పుస్తకం కొనిచ్చాడు. ఆ పుస్తకం అమెకెంత సంతోషం కలిగించిందో తనకు తెలుసు. మనసు బాగోనప్పుడల్లా ఆ పుస్తకమే చదువుతుండేది.
'అందమే అనందం, ఆనందమే జీవిత మకరందం' అనే గ్రామ ఫోన్ రికార్డ్ తనకెంత ఇష్టమో ఆమెకు కన్యాశుల్కం అంత ఇష్టం.
మరో సంవత్సరం రవివర్మ పెయింటింగ్ బహుమతిగా ఇచ్చి ఆమెను ఆశ్చర్యానందాలతో ముంచెత్తాడు. ఆమె కూడా అంతే!
ఒక సంవత్సరం తనకు ఆమె దాచుకున్న డబ్బుతో పి.జి. వొడ్ హోస్ పుస్తకాలు అరడజను బహుమతిగా ఇచ్చింది.
తమాషా ఏమిటంటే ఆ అరడజను తనంతకు ముందు చదివినవే! అంతకంటే విలువయినదీ, ఆనందకరమయిన బహుమతీ ఇంకేముంటుంది?
ఆ పుస్తకాలు ఎన్ని విషాద ఘట్టాల్ని తనను తను మర్చిపోయేట్లు చేసినయ్? కళ్ళవెంబడి నీళ్ళు కారుతోన్న సమయంలో కూడా మనసుని తెలికపరచి హృదయమంతా ఆహ్లాదంతో నింపిన అద్భుతాలవి.
ఒక్కో పుస్తకం కొన్ని వందలసార్లు చదివాడోమో! ఇంకా చదువుతూనే వున్నాడు.
ఇంకోసారి బుల్ బుల్ ప్రెజెంట్ చేసింది.
పెళ్ళికాక ముందు తను తమ ఇంట్లో ఉన్న పాత బుల్ బుల్ మీద పాటలు నేర్చుకునేవాడు.
దానిని చక్కగా నేర్చుకున్న టైములోనే అది పాడయిపోయింది. కానీ మళ్ళీ కొనటం సాధ్యం కాలేదు. మొదటి రాత్రి సీతకి ఆ విషయం చెప్పాడు తను. ఆ మాట ఆమె మనసులోనే వుండిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత తనకు బుల్ బుల్ బహుమతి యిచ్చింది.
నిజంగా ఆరోజు తనెంత ఆనందించాడో!
ఒక్కసారిగా ఎవరయినా ఒకరిని పదేహేనేళ్ళ వెనక్కు తీసుకెళ్ళి పడేస్తే ఆ అనుభూతి ఎంత అద్భుతంగా వుంటుంది?
దాని మీద మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఎలాగయితేనేం చాలా రోజులకు 'ఫిర్ వహిదిల్ లాయాహు' సినిమాలో ఓ.పి నయ్యర్ పాటలు వాయించాగలిగాడు.
ఆ పాటలు విని ఆమె ఎంతగా మైమరిచిపోయింది!
ఇంతకూ ఈసారి సీతకేమిటి బహుమతిగా యివ్వటం?
హటాత్తుగా గుర్తుకోచ్చిందతనికి......
అవును! సీత కళ్ళజోడు చాలా కాలం నుంచీ ఉపయోగించటం లేదు. ఆమె కళ్ళకు సైట్ మారినంత పెరిగిపోయింది . సంవత్సరంలో ఆ కళ్ళ జోడుకున్న అద్దాలు మార్చి పెరిగిన పవర్ తో కొత్త అద్దాలు వేస్తె గానీ ఆమె ఆ కళ్ళజోడు వుపయోగించలేదు.
ఆమె కిష్టమైన మాగ్ జైన్స్, న్యూస్ పేపర్, ఇతర పుస్తకాలూ ఏమీ చదవలేకపోతోంది. చాలా కాలంగా. తనక విషయం తెలిసినా తెలీనట్టు నటిస్తున్నాడు అద్దాలు మార్చే స్తోమత లేక!
తనిప్పుడు ఆమెకు తెలీకుండా ఆ కళ్ళజోడు తీసుకెళ్ళి, పవర్ పెంచిన అద్దాలు వేయించి అప్పుడు ఆమెకిది బహుమతిగా యిస్తే?