Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 10

 

    అ ఆలోచన చాలా ఉత్సాహం , అనందం కలిగించిందతనికి.
    కానీ అంతలోనే ఆ ఉత్సాహం నీరుకారిపోయింది.
    ఆ అద్దాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
    కనీసం యాభై రూపాయలు కావాలేమో! ఫ్రేమ్ మార్చనవసరం లేదు. పెళ్ళయిన కొత్తలో తనే కొన్నాడా గోల్డ్ ఫ్రేమ్! ప్రస్తుతం తనున్న పరిస్థితుల్లో యాభై రూపాయలు సంపాదించటం కొంచెం కష్టంతో కూడుకున్న పని.
    నిజంగా తను కొత్త అద్దాలతో ఆమెకు కళ్ళజోడు బహుకరించగలిగితే, సీతకు అంతకు మించిన అనందం యింకేమీ కలిగించదు.
    కళ్ళ డాక్టర్ దగ్గరకెళ్ళి కొత్త అద్దాలు రాయించుకుని కూడా తనకున్న ఇబ్బందుల వల్ల కొనమని అడగకుండా ఊరుకుందామె.
    కొద్దిసేపటి తర్వాత ఓ నిర్ణయానికొచ్చాడతను.
    ఏదేమయినా సరే......సీతకు కొత్త అద్దాల కళ్ళజోడు పెళ్ళిరోజు బహుమతిగా యివ్వలసిందే! మళ్ళీ క్రాస్ వర్డ్ పజిల్ బుక్ తెచ్చుకున్నాడతను.
    శాంతి పరుగుతో వచ్చింది లోపలకు.
    "అంకుల్ చూశావా! రెండు వేళ్ళలో ఒకటి నువ్వు కరెక్టుగా పట్టుకోబట్టి అదే కొశ్చన్ వచ్చింది పరీక్షలో. నేను ఆ కోశ్చనే చదువు కెళ్ళాను కదా! బ్రహ్మండంగా రాసేశాను. ఇప్పుడేమంటావ్......? నాది యింకా మూర్ఖత్వావమే అంటావా?"
    రామచంద్రమూర్తి నవ్వాడు.
    "కాదు! మూర్ఖత్వం మాది....."\
    శాంతి ఆశ్చర్యపోయింది.
    "మీదెలా అవుతుంది?"
    "నీకు నచ్చజేప్పాలనుకునే వాళ్ళెవరైనా మూర్ఖులే కదా.......! ఎందుకంటే నువ్వు ఎలాగూ ఎవరేం చెప్పినా వినవు. నువ్వు పట్టిన కుందేలుకి మూడే'కాళ్ళంటావు."
    "నేనలా ఏం అనను. అసలది కుందేలే కాదంటాను......."
    'అది సరే గానీ ఇది నువ్వేమైన చెప్పగలవేమో చూడు. ఇది ఎక్కువ శ్రమ పడేవారికొస్తుంది . అలుపు, గెలుపు ఏది కరెక్ట్?"
    "అలుపు, గెలుపు" అంటూ ఒక్క క్షణం ఆలోచనల్లో పడింది. "రెండు కరెక్టే.'
    "రెండూ కరెక్టే గానీ, అందులో ఇంకొంచెం ఎక్కువ కరెక్ట్ అన్నమాట. అదేదో చెప్పు."
    'అయితే శ్రమపడే వారికి ఇది వస్తుంది అలుపు మాములుగా వస్తుందనుకో ......కొంచెం ఎక్కువ శ్రమ పడితే .....ఆ.....గెలుపే అంకుల్ స్పోర్ట్స్ లో అంతే కదా! ఎవరు ఎక్కువ శ్రమపడి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకే గెలుపు షూర్!"
    రామచంద్రమూర్తికి అనందం కలిగింది.
    "వండర్ పుల్! మంచి లాజిక్ తో చెప్పావు గనుక అదే టిక్ చేస్తున్నాను, ఇంకోటి కూడా చెప్పగలవేమో చూడు. ప్రతి మనిషికి యీ........
    "సారీ అంకుల్! అవతల మా ఫ్రెండ్ శోభ ఎదురు చూస్తూంది ఇద్దరం కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాం" పరుగుతో వెళ్ళిపోయింది.
    రామచంద్రమూర్తి మళ్ళీ క్రాస్ వర్డ్ వరల్డ్ లోకి వెళ్ళిపోయాడు.


                                                *    *    *    *

    నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది సీత. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ గదిలో లైటు డిమ్ గా వెలుగుతోంది. గడియారం వేపు చూసిందామె.
    టైం ఒంటిగంటయింది.
    అంతా నిశ్శబ్దం .అంత నిశ్శబ్దం లోనూ ఏదో సంగీతం, గజ్జల చప్పుడు.
    అప్పుడు ధైర్యం వచ్చిందామెకి.
    అది కల.......నిజం కాదు! పీడ కల!
    చనిపోయిన తన తల్లి తిరిగి వచ్చింది. ఆమెతో పాటు తన తండ్రి కూడా వున్నాడు. వారిద్దరినీ చూసి తను ఎంతో అనందిస్తోంది. ఇంతకాలం వాళ్ళు చనిపోయారని అనుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది. మాట్లాడుతుండగానే తండ్రి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నరెవరో , తను భయంతో , దుఖంతో తండ్రితో మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. కానీ తండ్రి కళ్ళు తెరుచుకోవటం లేదు. తను ఏడ్చేస్తూ వుంది.
    తల్లి తనను ఓదార్చుతోంది.
    అప్పుడు మెలకువ వచ్చింది.
    అలాంటి కలోస్తే అర్ధమేమిటో తనకు తెలుసు. ఒక పత్రికలో చదివింది. తన కుటుంబంలోని వారికి అనారోగ్యం వస్తుంది. ఎవరు దానివాత పడతారో తెలీదు.
    భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.
    రామచంద్రమూర్తిని నిద్రలేపి మాట్లాడాలనిపించింది. అతని మంచం ఖాళీగా వుండటం చూసి మరింత ఆశ్చర్యపోయింది.

 Previous Page Next Page