"శాంతి ! నీకనేకసార్లు చెప్పాను! ఇలాంటి పిచ్చి లింక్ లు పెట్టవద్దని. రెండూ చదవటం కష్టమయితే నీ కిష్ట మయినది ఏదో కటి చదువుకో. అంతేగానీ......"
"అంకుల్! ప్లీజ్! టైమయిపోతోంది."
రామచంద్రమూర్తి యింక కాదనలేకపోయాడు. రెండు వేళ్ళలో ఓ వేలు పట్టుకున్నాడు.
"థాంక్యూ అంకుల్! లవ్ లీ అంకుల్" అనేసి బయటకు పరుగెత్తింది.
"రాన్రాను పిల్లలెలా తయారవుతున్నారో చూడు! అన్నీ లాటరీలే" సీత నవ్వింది.
"మన సరిత కూడా అంతేగా!"
అనేశాక గానీ ఆమెకు తను చేసిన తప్పు గుర్తుకి రాలేదు సరిత విషయం తమ మాటల్లో రాకుండా వుండటానికి యిద్దరూ గత పదేళ్ళుగా విశ్వప్రయత్నం చేస్తూనే వున్నారు చాలావరకూ సఫలీకృతులయ్యారు గానీ అప్పుడప్పుడూ యిలా బయటపడి పోక తప్పటం లేదు.
సరిత గుర్తుకొస్తే యిద్దరికీ ఆ రోజంతా మనసు పాడయిపోతుంది. భోజనం చేయబుద్ది కాదు. ఇంట్లో కటిక నిశ్శబ్దం తాండవం చేస్తుంది.
నటరాజ్ చప్పున విషయం గ్రహించి వెంటనే టాపిక్ మార్చేశాడు.
"నేను సరదాకీ అనటం లేద్సార్! మీరే ఆలోచించండి! అంత లోతు గోతిలోకి దిగి మంచినీళ్ళు పైకి తేవటం మాటలా? నేనంటే సరే ననుకోండి? మొండి ఘటాన్ని! పాపం సీతమ్మ గారి సంగతేమిటి? మంచినీళ్ళు ఆమె స్వయంగా తెచ్చుకుంటారు కదా? ఎంత కష్టమవుతుంది? ఎంతమంది కార్పోరేటర్లకు చెప్పినా ఏమైనా ఉపయోగముందా? అందుకనే మీరేమైనా సరే కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందే."
ఆ ఫీల్డ్ మనలాంటాళ్ళకు కాదోయ్! మస్తాన్రావ్ లాంటి కాంట్రాక్టర్లకు కరెక్ట్. ఎలక్షన్స్ ని కూడా ఓ కాంట్రాక్ట్ లాగానే డీల్ చేస్తారు గనుక డోకా వుండదు."
రామచంద్రమూర్తి భోజనం చేయటం ముగించాడు. లేచి హాల్లోకి నడిచి పాతకాలం నాటి బల్ల తూగుటుయ్యాల మీద కూర్చుని నెమ్మదిగా వూగాసాగాడు. సీత ఆయన తెచ్చిన సరుకులన్నీ బాగుచేస్తోంది పెరట్లో. మస్తాన్రావ్ లోపలికొచ్చాడు హడావుడిగా.
"కంగ్రాచ్యులేషన్స్ ! ఈసారి కార్పొరేటర్ గా నిలబడుతున్నారటగా?" అన్నాడు బలవంతంగా కరచాలనం చేస్తూ.
"ఎవరు చెప్పారు?"
"మన వార్డు వార్డంతా కోడై కూస్తోంది."
"అదంతా నటరాజ్ చేసిన పని . నేను ఎలక్షన్స్ లో నిలబడటం ఏమిటి? ఎవరయినా వింటే నవ్వుతారు."
"ఎవ్వరూ నవ్వరు. నా మాట విని నిలబడు. నేనెలాగూ నిలబడ్డానికి వీల్లేదు. ఆ ఓవర్ హెడ్ వాటర్ టాంక్ కూలిపోయిందని అందరూ నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు. సిమెంట్ లేకుండా ఒట్టి ఇసుకతో కట్టించానట.ఉట్టి ఇసుకతో ఎవరయినా కట్టిస్తారా అసలు? అవునయ్యా! సిమెంట్ వేయాల్సిన పాళ్ళలో వేయలేదు. ఎలా వేస్తాం? అందులో ఇంజనీర్స్ కి పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇవన్నీ కాక మినిస్టరోచ్చినా , పెద్ద అధికారులోచ్చినా హోటల్ ఖర్చులన్నీ మేమే పెట్టుకోవాలి. వాళ్ళేవరిళ్ళల్లో నయినా పెళ్ళిళ్ళూ పేరంటాలూ అయితే మేమే ఖర్చులు భరించాలి. మరింత బ్రిడ్జిలు, వాటర్ టాంక్ లూ, పడకుండా వుండమంటే ఎలా ఉంటాయ్?"
"అవును! ఉండవ్!" వప్పుకున్నాడు రామచంద్రమూర్తి.
"నే చెప్తున్నాగా! నువ్వు తప్పకుండా గెలుస్తావు. నువ్వు గెలిస్తేనయినా మన వార్డ్ కొంచెం బాగుపడుతుంది. పెద్ద పేరు మాత్రం సర్దార్ పటేల్ రోడ్ అని పెట్టారు గవర్నమెంటోళ్ళు . ఆ రోడ్ మీదకొచ్చిన వాడెవడూ తిరిగి వెనక్కి వెళ్ళడు. ఏ డ్రయినెజ్ గోతిలో పడి హరీ మంటాడు. స్కూటర్లతో సహా అండర్ గ్రౌండ్ లో కెళ్ళి పోతారు."
"అవున్సార్! మనింటి ముందున్న వీది దీపం ట్యూబ్ పాడయిపోయి ఎంత కాలమయింది? ఇంకో ట్యూబ్ వేయమని మీరేన్నిసార్లు కార్పొరేటర్ ఇంటిచుట్టూ తిరగలేదు? ఎవడయినా మీ మాట విన్నారా?" మీరెలాగూ ఖాళీగానే వున్నారు గనుక నా మాట వినండి" అందుకున్నాడు నటరాజ్.
రామచంద్రమూర్తి ఆలోచనలో పడ్డాడు.
ఒకవేళ వాళ్ళ మాట విని తను నిలబడితే ఏం జరుగుతుంది? గెలవటానికి ఏమాత్రం చాన్స్ లేదు. ఎందుకంటే ఓట్లు కొనడానికి తనకు స్తోమత లేదు. ఓడిపోతే ఇంక సమస్యే లేదు. అలాకాక పొరపాటున గెలుస్తే?
ఆ ఆలోచన చాలా ఎగ్జయిట్ మెంట్ కలిగించిందతనికి.
నిజంగానే వార్డ్ కోసం సిన్సియర్ గ పనిచెయ్యొచ్చు. ఇంతకు ముందున్న కార్పోరేటర్లందరూ మరీ అవినీతి పరులవటం వల్ల వార్డ్ మరింత అధోగతికి దిగజారింది.
తన సిన్సియారిటీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగపడవచ్చు గానీ ఇలాంటి పదవుల్లో వుంటే సొసయిటీకీ ఉపయోగపడుతుందేమో!
"ఇంకేం ఆలోచించకు మూర్తీ! నీ తరపున నటరాజ్, నేనూ ఉమా కాన్వాసింగ్ చేస్తాం. వాల్ పోస్టర్లకూ, కరపత్రాలకూ మన మెయిన్ రోడ్ లో వ్యాపారస్తులు డొనేషన్స్ ఇస్తారు. సరే అను! ఇవాళ మంచి రోజు ."
"సరే!"
"ఏమిటి 'సరే' అంటున్నారు?" వాళ్ళ మాటలు వింటూ విసురుగా వచ్చింది సీత.
"రామచంద్రమూర్తి ఎలక్షన్స్ లో నిలబడ్డానికి వప్పుకున్నాడు" ఆనందంగా చెప్పాడు మస్తాన్ రావ్.
"అలాంటి పిచ్చి పనులు చేయడానికి నేనొప్పుకోను" ఖండితంగా చెప్పెసిందామె.
మస్తాన్ రావ్ గతుక్కుమన్నాడు. రామచంద్రమూర్తి వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"సీత మాటలు అంతేలే మస్తాన్రావ్! నీకు తెలీందేముంది? మగాళ్ళు చెప్పిందల్లా కాదు అనటమే ఆడాళ్ళ నైజం! ఏమంటావ్ సీతా? అవునా కాదా?"
"ఏం కాదు" రోషంగా అందామె.
అందరూ ఘొల్లున నవ్వేసరికి ఆమె వుడికిపోయింది.
ఒకవేళ మీరు ఎలక్షన్స్ లో నిలబడితే నేనే మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా గుర్తుంచుకోండి" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయిందామె.
మస్తాన్రావ్ ఆమె కోపం చూసి పగలబడి నవ్వాడు. మా చెల్లాయ్ కి ఎలాగోలా మస్కాకొట్టి మంచి చేసుకోక తప్పదు మనకు . 'ఎగినేస్ట్' గ ప్రచారం చేసిందంటే డిపాజిట్లు పోతాయి. మనదసలే సెంటిమెంట్ జనాభా. నువ్వు మాత్రం మనసు మార్చుకోకు."
అతను వెళ్ళిపోయాడు.
"నిజం చెప్పాలంటే నాకూ పొద్దున్న దాకా అయిడియా లేదు సార్! వూరికే ఒక గాలం వేసి చూద్దామని రెహమాన్ దగ్గర అన్నాను అంతే! టక్కున పడిపోయాడు. ఉదయం సరుకులివ్వనన్నందుకు క్షమాపణ చెప్పేసి వెంటనే ఏం కావాలంటే అవి పట్టుకెళ్ళమన్నాడు. దొరికిన చాన్స్ ఎందుకు వదలాలని జీడిపప్పూ, కిస్ మిస్, మసాలా దినుసులు అన్నీ పెద్ద ఎత్తున అర్దరిచ్చేశాను. వాడింక అప్పివ్వకపోయినా రెండు నెలలదాకా మనకేం ఫర్లేదు."