ఆఫీస్ కి తాళం వుంది అక్కడి నుంచీ క్లబ్ కి చేరుకున్నాడు క్లబ్ లో కూడా అతనేక్కడా కనిపించలేదు.
బయటకొచ్చేస్తుంటే ఓ టేబుల్ దగ్గర సరోజినీ, దీప , మరో ఇద్దరు యువతులు కలిసి భోజనం చేస్తూ కనిపించారు."
"హయ్!" అంది దీప. ఆమె అలంకరణ, అందం చాలా ఆకర్షణీయంగా వున్నాయ్.
"హాయ్!"
"ఈ టైం లో ఇక్కడేం చేస్తున్నారు?"
"మా బ్రదర్ కోసం వచ్చాను."
"టిక్కెట్లన్నీ అమ్మేశారా?"
"అప్పుడేనా?"
"మిగతావాళ్ళంతా అమ్మేశారు?"
"ఆయామ్ వాట్ దట్ ఫాస్ట్!"
"జాయినవకూదడూ?" అడిగిందామె.
"మరోసారి ......" అనేసి బయటికొచ్చేశాడు.
సుభద్ర తలుపు దగ్గరే నిలబడి వుంది.
"ఎక్కడా లేడోదినా? ఆఫీస్, క్లబ్ అన్నీ చూశాను. ఒకవేళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడెమో."
సుభద్ర ఏమీ మాట్లాడలేకపోయింది.
సోఫాలో కూర్చుండిపోయింది మళ్ళీ.
"నువ్ భోజనం చేశావా వదినా?" అన్నాడు సృజన్ అనుమానంగా.
"మీ అన్నయ్య వచ్చాక తింటాను.
సృజన్ తన గదిలోకొచ్చి పుస్తకం తెరిచాడు మళ్ళీ. పన్నెండింటికీ నిద్రపోయే సమయంలో అన్నయ్య సంగతి గుర్తుకొచ్చింది మళ్ళీ.
హాల్లోకి వచ్చి చూశాడు.
సుభద్ర సోఫాలోనే వెనక్కు జారగిలబడి కూర్చుని ఎదురు చూస్తోంది.
"వదినా -నువ్ భోజనం చేసి నిద్రపో! అన్నయ్య వస్తాడులే"
"నాకు భోజనం చేయాలనిపించటం లేదయ్యా!"
సృజన్ వెళ్ళి తన మంచం మీద పడుకున్నాడు. "ఒరేయ్ - నా బంతి నాకివ్వక[పొతే మా బాబాయితో చెపుతాను" అంటూ నిద్రలో కలవరించాడు శంకు. సృజన్ కి నవ్వొచ్చింది. లేచి వాడిని ముద్దు పెట్టుకొని మళ్ళీ పడుకున్నాడు. సుభద్ర మళ్ళీ లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి రోడ్డు వేపు చూస్తూ నిలబడింది.
ఈ మధ్య భర్త ప్రవర్తనలో ఏదో మార్పు కనబడుతోంది తనకు! ఒంటరిగా వున్నప్పుడల్లా ఏదో ఆలోచిస్తూ దిగులుగా కనబడుతున్నారు.
కేవలం తన మనసుకి అలా అనిపిస్తొందో లేక నిజంగానే అతను అన్యమనస్కం,గా వుంటున్నాడో అన్న అనుమానం!
దూరంగా కారు లైట్లు కనిపించియామెకు.
అయన కారే --సందేహం లేదు. కారు గారేజ్ లో వుంచి ఇంట్లో కొచ్చాడతను. హల్లో లైట్లు వెలుగుతుండటం చూడగానే అతనికి తెలిసిపోయింది. సుభద్ర తనకోసం ఎదురు చూస్తుండి వుంటుందని.
"ఇంకా పడుకోలేదూ!" ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు?
"ఊహు! ముక్తసరిగా అందామె.
శ్రీధరానీకేం మాట్లాడాలో తెలీటం లేదు.
ఎందుకాలస్యం అయిందో ఆమెకు చెప్పాలి. కానీ ఏం కారణం చెప్పాలా అనే విషయం ఇంకా ఆలోచించుకోలేదు.
"ఓ అర్జెంట్ పని మూలాన ఆఫీసులో వుండిపోయాను" అబద్దం చెప్పేశాడతను.
"ఇప్పటివరకూ ఆఫీసులోనే వున్నారా?"
ఆమె ఆఫీస్ కి ఫోన్ చేసిందేమో అన్న అనుమానం వచ్చింది అతనికి.
"అవును! డిస్టర్బెన్స్ లేకుండా వుండాలని ఫోన్ వేరే గదిలో పెట్టేశాము."
సుభద్ర చిన్నబుచ్చుకుంది.
అతను అంత ఆలస్యంగా వచ్చినదుకు తను బాధపడటం లేదు కానీ మొట్టమొదటిసారిగా తనకు అబద్దం చెపుతున్నందుకు బాధగా వుంది.
"పదండి ....భోజనం వడ్డిస్తాను"
"వద్దు సుభద్రా! తిన్నాను"
ఆమె ఇంకేమీ మట్లాడలేదు.
అతను బట్టలు మార్చుకుని వచ్చి పడుకోవటం గమనిస్తూనే వుండామే. ఆమెను తనకు దగ్గరగా లాక్కున్నాడు శ్రీధర్.
"నాకోసం ఎందుకు మేలుకోవటం! నీ ఆరోగ్య పాడుచేసుకోకు!"
మరికాసేపట్లో నిద్రలో మునిగిపోయాడతను.
సుభద్రకు హటాత్తుగా దుఃఖం ముంచుకొచ్చింది.
ఎనుకిలా చేశాడతను? తననెందుకు దూరం చేస్తున్నట్లు! భార్యా భర్తల మధ్య కూడా "నిజం" బ్రతకలేకపోతే ....ఇంక దానికి "జీవం ఎక్కడుంటుంది?"
తెల్లవారు జామున గానీ నిద్రపట్టలేదామెకీ----
* * * *
ఉదయం శ్రీధర్ ఫలహారం చేస్తుండగా సృజన్ వచ్చాడు.
"అర్జంటుగా నాలుగొందలు కావాలన్నయ్యా?"
"ఎందుకు?"
"మా ఫ్రెండ్ కి అవసరమయితేనూ -- దీప వాళ్ళ డొనేషన్ కూపన్ల ఎమౌంట్ నుంచి వాడాను. రేపు ఆమె డబ్బు ఆమె కిచ్చేయ్యాలి.....!"
"సరే ఇస్తాన్లే?"
"రాత్రి ఎక్కడి కెళ్ళావన్నయ్యా? ఆఫీస్ లోనూ, క్లబ్ లోనూ నీకోసం వెతికాను - ఆఫీసుకి తాళం వేసి వుంది, క్లబ్ కి రాలేదని చెప్పారు" శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు.
"నువ్ ఆఫీస్ కొచ్చావా?"