"ఓ......."అన్నాడు శ్రీధర్ అర్ధమయినట్లు.
"నిన్ను ఇక్కడ ఫస్ట్టైం చూస్తున్నాను."
"మొదటిసారేం కాదు గానీ .........ఒక్కడినే రావడం ఫస్ట్ టైమ్."
"జ్ఞానానికీ అది రహదారి . ఏం తీసుకుందాం?"
"ఏదో ఒక విస్కీ ఒక విబ్ చాలు"
"నీకో కధ తెలుసా?"
"ఏమిటది?"
"ఒక యువకుడు ఓ నది దాటటానికని ఓ బోటు వాడి దగ్గర కెళ్ళాడుట బోటు దాటాలంటే అర్ధరూపాయి చార్జి అన్నాడు బోటువాడు . "నేను బీదవాడిని" అన్నాడా యువకుడు."
"అయితే పదిపైసలివ్వు చాలు" అన్నాడు బోటువాడు.
"నా దగ్గిర ఒక్క పైసా కూడా లేదు" అన్నాడా యువకుడు.
"ఒక్క పైసా కూడా లేనివాడు నదికి అటువేపున్నా, ఇటు వేపున్నా ఒకటేలే వెళ్ళు" అన్నాడా బోటువాడు.
శ్రీధర్ నవ్వాడు.
"ఈ కధ నాకెందుకు చెప్పినట్లు?"
"ఒక నిబ్ తాగాలనుకునేవాడు తాగినా , తాగకపోయినా ఒకటే."
బేరర్ వచ్చాడు.
"మాములే" అన్నాడు ప్రకాష్ బేరార్ తో.
"బేరర్ వెంటనే ఓ పుల్ బాటిల్ గ్లాసులు, ఐస్ తెచ్చి టేబుల్ మీడుంచాడు."
"పుల్ బాటిల్ మామూలా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"తప్పదు గురూ! పొద్దున్నుంచీ మందు లేకపోతే మామూలుగా మాట్లాడటం, నడవడం, నిద్రపోవటం ఇవేమీ కుదరవ్."
శ్రీధర్ నవ్వాడు.
"మనం హైస్కూల్ ల్లో చదివేటప్పుడు ఓ కప్పు కాఫీ తాగమంటే - హెల్తు పాడయిపోతుందని పరుగెత్తేవాడివి."
"ఆ మాటకి ఇపుడు కట్టుబడే వున్నానుగా, చస్తే కాఫీ టీలు తాగను" తానూ నవ్వేశాడతను.
"ఎలా వుంది నీ సెంట్రల్ ఎక్సయిజ్ జాబ్?"
"మూడు పూలు ఆరు కాయలుగా వెలుగుతుండబట్టే ఇక్కడి కొచ్చాను ----నీ మందుల కంపెనీ ఎలా వుంది.?"
శ్రీధర్ నవ్వాడు మళ్ళీ.
"పరిస్థితి బావుండకే ఇక్కడి కొచ్చాను."
"అంటే?"
"కంపెనీ మూతపడుతోంది."
ప్రకాష్ కొద్ది క్షణాల పాటు మాట్లాడలేకపోయాడు. ఇద్దరికీ గ్లాసులో విస్కీ పోశాక అతనికో గ్లాసు అందించాడు.
"చీర్స్?"
"నో చీర్స్ " అన్నాడు శ్రీధర్.
"ఇంత సడెన్ గా ఎందుకిలా జరిగింది మీ కంపెనీకి?"
"మా ప్రొడక్ట్స్ కొన్నిటిమీద ప్రభుత్వం "బాన్" తెచ్చింది."
"వెరీ బాడ్ సిట్యుయేషన్."
"యస్"
"ఆయామ్ రియల్లీ సారీ!"
"దట్స్ ఓ.కే."
"ఈ బిజినెస్ లైన్ ఎప్పుడూ రిస్కీయే."
"అని ఇప్పుడనిపిస్తోంది నాకు. కానీ ఇప్పుడిక ఎన్ననుకుని ఏం లాభం?"
"కంపెనీ మూతపడితే తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావ్."
"ఏం ప్లాన్ చేయడానికి కాపిటల్ ఏదీ?"
ప్రకాష్ ఉలిక్కిపడ్డాడు.
"అంటే కంప్లీట్లీ బాంక్రాప్టా?"
"అల్ మోస్టాల్."
"ఆయామ్ సో సారీ."
ఇద్దరూ గ్లాసులు ఖాళీ చేశారు. ఆ తరువాత శ్రీధర్ కింక అక్కడ కూర్చోవాలనిపించలేదు. చాలా ఆందోళనగా , అస్తవ్యస్తంగా తయారయింది మనసంతా, బేరర్ పిలిచాడతను.
"ఇదిగో బిల్లెంతయిందో తీసుకో" అంటూ డబ్బివ్వబోయాడు.
"అవసరం లేద్సార్! అయ్యగారి దగ్గర బిల్ తీసుకోము."
శ్రీధర్ ఆశ్చర్యంగా ప్రకాష్ వేపు చూశాడు.
"డోంట్ బ్రదర్! మా క్లయింట్స్ లో ఈ బార్ ఓనర్ కూడా ఒకడు" అన్నాడతను చిరునవ్వుతో.
"అల్ రైట్ నేను వెళతాను."
* * * *
సుభద్ర శ్రీధర్ కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగింది.
రాత్రి పదిన్నారయిపోయింది సాధారణంగా ఎనిమిది లోపలే ఇల్లు చేరుకుంటాడతను. కేవలం ఆదివారాలు మాత్రం క్లబ్ లో రాత్రి రెండింటి వరకూ గడుపుతాడు. ఒకవేళ కంపెనీ తాలుకూ ఏ పనులున్నా పార్టీలున్నా ముందే తనకు చెపుతాడు.
సృజన్ గదిలోకి నడిచిందామే. అతను కూర్చుని చదువుకుంటున్నాడు.
ఆమెను చూసి ఏం కావాలి వదినా?" అనడిగాడు.
"ఓసారి మీ అన్నయ్య ఆఫీసు కెళ్ళి వస్తావేమోనని-----"
టైము చూచుకున్నాడతను.
"ఇంకా రాలేదా అన్నయ్య?"
"ఊహు! మీటింగ్ లు, పార్టీలు వున్నా ఇంత అలస్యమవదుకదా?"
"ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా?"
ఫోన్ ఎవరూ ఎత్తడం లేదు.
"ఓ - అయితే ఆఫీసు కెళ్ళి కనుక్కోమంటావా?"
"ఊ"
స్కూటర్ మీద బయలుదేరాడతను.