Previous Page Next Page 

 

    "అవునన్నాయ్యా.....!"
    "ఎన్ని గంటలకు?"
    "పదిన్నరకు:"
    "అప్పుడు ..అప్పుడు నేనక్కడ లేనులే! మా ఫ్రెండోకతనితో వెళ్ళాను."
    "నేనూ అదే అన్నాను వదినతో ......అయినా వదిన వట్టి కంగారు వదిన!"
    సృజన్ వెళ్ళిపోగానే సుభద్ర మొఖంలోకి చూశాడు శ్రీధర్. ఆమె ముఖంలో ఎలాంటి భావమూ కనిపించలేదు.
    అంటే తను అబద్దం చెప్పినట్లు ఆమెకు తెలిసిపోయిందన్న మాట! మరా విషయం తననెందుకు అడగలేదు?
    ఇప్పుడెలా ఆమెతో మాట్లాడటం? ఏమని జవాబు చెప్పటం........? ఎలా వివరించటం? ఆఫీసుకి బయల్దేరే వరకూ అశాన్తిగానే వుందతనికి.
    డ్రస్ చేసుకొని హాల్లోకొచ్చాక ఆమెను పిలిచాడతను.
    "సుభద్రా!"
    "ఏమిటండీ?"
    "నిన్నరాత్రి నేను చెప్పింది అబద్దమని నీకు తెలుసు కదూ?" ఆమె నవ్వింది.
    "నా దగ్గర కొన్ని విషయాలు దాచాలనుకుంటే - అది మీ యిష్టమండీ! మీ కిష్టం లేనివి చేయమని నేనెప్పటికీ బలవంతం చేయను ---"
    అతను సిగ్గుపడిపోయాడు . ఆమె హుందా ప్రవర్తనతన తప్పు ఎన్నో వేలరెట్లు పెంచేస్తోంది.
    "సుభద్రా! ఆయామ్ సారీ! నీకు అబద్దం చెప్పాను."
    "నాకేమీ కోపం లేదండీ!"
    "నీ దగ్గర ఏదీ దాచాలని నేననుకోవటం లేదు. కాని కొన్ని నిజాలు చెప్పి నిన్ను బాధ కలిగించకూడదని .......అబద్దం చెప్పాను."
    "మీ బాధ పంచుకోవటం నాకు అనందం కలిగిస్తుందండీ! బాధ కలిగించదు."
    ఆమె చేతిని తీసుకుని తన పెదవులతో స్పృశించాడతను.
    "ఇలా కూర్చో" అంటూ ఆమెను సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.
    సుభద్రకు హటాత్తుగా భయం ప్రారంభమయింది. నిజాలు తెలిస్తే తనకు బాధకలుగుతుందేమో అన్నారు. ఏం నిజాలవి?
    "మన కంపెనీ త్వరలో మూతపడబోతోంది సుభద్రా! చాలా రోజులనుంచీ ఈ పరిస్థితి వస్తుందని అనుకుంటూనే వున్నాము. చివరికిప్పుడు అది రానే వచ్చింది. ఇంకొద్ది రోజులు! అంతే! తరువాత ఏం జరుగుతుందో తెలీదు."
    సుభద్ర ఆందోళనగా చూసిందతనివేపు.
    "ఎందుకని?"
    "మనం తయారుచేస్తున్న కొన్ని మందులు మంచివి కావని ప్రభుత్వం బాన్ చేసింది.
    ఆమెకు అర్ధమయింది.
    "అందుకే మనసు బాగుండక బార్ కెళ్ళాను."
    "మరి ఇప్పుడెం చేయాలని నిర్ణయించుకున్నారు?"
    "ఇంతవరకూ ఏమీ నిర్ణయించుకోలేదు"
    కొద్దిసేపు మౌనంగా వుండిపోయారు.
    "సుభద్రా! నువ్వీమీ భయపడనక్కర్లేదు. మరీమీ సాధ్యం కాకపోతే నేను ఇంకెక్కడయినా ఉద్యోగం చూసుకుంటాను. మనకున్న పరిచయాలకు అది అసాధ్యమేమీ కాదు!"
    "అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడండీ! మనల్ని అన్యాయం చేయడని నాకు నమ్మకం ఉంది."
    "ఇంకొక్క విషయం సుభద్రా........! ఈ విషయాలేమీ సృజన్ కి తెలీకుండా చూడాలి మనం! ఎందుకంటె వాడు డిస్టర్బ్ అయి చదువుని నిర్లక్ష్యం చేసే అవకాశం వుంది. తనూ చదువు మానేసి ఉద్యోగం చేస్తానని అన్నా అనవచ్చు."
    "సరే" అంది సుభద్రా.
    "మరి నేను వెళుతున్నాను. అన్నట్లు మర్చిపోయాను. యిదిగో ఈ ఐదువందలూ సృజన్ కివ్వు ఇందాక అడిగాడు నన్ను" ఆమెకు డబ్బు అందించి ఆఫీస్ కి బయల్దేరాడతను.
    సుభద్ర ఆ డబ్బు తీసుకుని సృజన్ గదిలో కొచ్చింది.
    "ఇదిగో డబ్బు ! మీ అన్నయ్య ఇచ్చారు"
    "థాంక్యూ వదినా! అందుకే నేనెప్పుడూ పాడేది "వదినా బంగారు వదినా! దేశానికి వదినేగా మాత....."
    "కొంచెం ఆపుతావా?"
    "ఎందుకోదినా?"
    నీకో విషయం చెప్పాలి?"
    "ఏమిటోదినా అది?"
    "నువ్ దాన వీర శూర కర్ణ వన్న విషయం ప్రపంచమంతటికీ తెలుసు గానీ - కొంచెం నీ దానగుణాన్ని కంట్రోల్ చేసుకుంటే బావుంటుంది."
    సృజన్ ఆశ్చర్యపోయాడు.
    వదినేనా ఈ మాటలంటుంది?
    "ఎవరికయినా సరే - అవసరానికి సహాయం చేయాలి సృజన్! మన దగ్గ్గరున్నంతవరకూ ఎవరికీ లేదనకూడదు" అని తనకు బోధలు చేసిన వదినేనా ఈ మాటలనేది?
    "ఎందుకిలా మాట్లాడుతోందిప్పుడు? ఏం జరిగింది?"
    తాము గతిలేని వారయితే ఆ పరిస్థితి వేరు! తమకు ఏ విషయం లోనూ లోటు లేదు కదా!
    వదినలో ఏదో మార్పు వచ్చి వుండాలి.
    చాలాసేపు ఆమె గురించే ఆలోచిస్తుందిపోయాడతను. ఏదేమైతేనే తానేమీ తప్పు చేయటం లేదనీ తన అంతరాత్మకు తెలుసు.
    అవసరంలో ఉన్న తన స్నేహితులను ఆడుకుంటున్నాడు అంతే.......

 Previous Page Next Page