Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 9

 

    "నీకు తెలీదే - ఆ భవానీ శంకరు మరీ ఆకతాయి వ్యవహారంలా కనిపిస్తున్నాడు. కావాలని నాతొ చనువు కోసం ప్రయత్నిస్తున్నాడని నా అనుమానం-"
    "ఛ! అతనలాంటి వాడు కాదె! మా వారికి బెస్టు ఫ్రెండ్ - నాకు చాలా మంచి చనువుందతనితో - నేనూ, మా వారూ అంటే ప్రాణం ఇచ్చేస్తాడనుకో!"
    "ఏం చేస్తుంటాడతను?"
    "ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు ---------ఫోటో గ్రాఫర్ గా ఓ దినపత్రికలో పనిచేసేవాడు అదివరకు. ఆ ఉద్యోగం కాస్తా పోయిందీ మధ్య"
    "ఎందుకని?"
    "ఓ పత్రిక ఓనర్ వద్ద్దన్నా కూడా వినకుండా వాళ్ళ బంధువుల ఫ్యాక్టరీలో పని చేస్తున్న చైల్డ్ లేబర్ ఫోటోలు తీశాడట. దాంతో వళ్ళు మండి తీసిపారేశాడు.
    వీళ్ళ సంభాషణ ఇలా సాగుతుండగా బయట సైకిల్ బెల్ వినిపించింది. శ్యామ్ చిరునవ్వుతో ఓ సంచీ తీసుకుని లోపలికొచ్చాడు. లోపల బట్టతల ఆకారాన్ని చూడగానే సంబరపడిపోయాడు.
    "హల్లో సార్ -- వచ్చేశారా - ఇప్పుడే అనుకుంటున్నాను - మా యిల్లు కనుక్కోగలిగారో లేదో అని! ఆ రోజూ మొదటిసారి వచ్చినప్పుడు పాపం చీకట్లో వచ్చారు కదా." అన్నాడు జగన్నాధంతో.
    "ఏం ఫరవాలేదు. చాలా ఈజీగానే కనుక్కోగాలిగాను - కానీ ఇలా గేస్తుల మీదకు మానసకస్థితి సరిగా లేని వాళ్ళను వదలడం నాకేం నచ్చలేదు" అన్నాడు జగన్నాధం నిష్టూరంగా.
    శ్యామ్ కేమి అర్ధం కాలేదు.
    "మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళా?"
    "అవును - నేను మిస్టర్ భవానీ శంకర్ మరదలు గురించి మాట్లాడుతున్నాను."
    "భవానీ శంకర్ మరదలా?"
    అప్పుడే ఆ గదిలోకి వచ్చిన అఖిలభాను శ్యామ్ కి కనుసైగ చేసింది.
    "అవును శ్యామ్ - మన భవానీ శంకర్ మరదలు స్మితారాణి -"
    శ్యామ్ కి సంగతేమిటో అర్ధం కాక స్మితారాణి వేపు చూశాడు.
    స్మితారాణి చిన్నగా నవ్వటానికి ప్రయత్నించి విఫలురాలయింది. అతను చప్పున అరడజను సైగలు చేసేశాడు.
    "ఓ - స్మిత - ఆ- అవును- కొంచెం పాపం - ఆమె మానసిక పరిస్థితి - కొంచెం - " అన్నాడు సర్దుకుంటూ.
    జగన్నాధం కోపంగా చూశాడు.
    "కొంచెమేమిటి బాగానే ముదిరింది. ఎంత ఎక్కువ లేకపోతే ఇంటికొచ్చిన అతిధుల నెత్తిమీద కొడతారు!"
    "అదీ లావుపాటీ కర్రతో - " అందించాడు భవానీ శంకర్.
    "అయాం సారీ జగన్నాధం గారూ! అయాం వెరీ వెరీ సారీ - మీ కసలు ముందే  హెచ్చరిక చేయకపోవడం నా తప్పు - " అన్నాడు జగన్నాధం చేతులు పట్టుకుంటూ.
    "దట్స్ ఒకే. " అన్నాడు జగన్నాధం.
    "అందరూ రండి! లంచ్ సర్వ్ చేసేస్తాను -" అంది అఖిలభాను.
    అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. స్మితారాణి వేపు వుండుండి భయంగా చూస్తున్నాడు జగన్నాధం.
    కూరలన్నీ ముందు రుచి చూసి మరీ వేసుకుంటున్నాడు. టేబుల్ కింద కప్పలేమయినా ఉన్నాయేమోనని వెతుకుతున్నాడు. అనుమానం వచ్చినప్పుడల్లా!
    జగన్నాధం వెళ్ళిపోయాక భవానీశంకర్ మీద విరుచుకుపడింది స్మిత.
    "మీ అతి తెలివి నా దగ్గర చూపించకండి!" అంది కోపంగా.
    "మీరు అపార్ధం చేసుకుంటున్నారు కామ్రేడ్ ...........ఆ పరిస్థితుల్లో అంతకంటే మంచి ఉపాయం ఇంకొకటే ముందో ఎవరయినా సరే చెప్పండి. చూద్దాం!"
    "ఆఫ్ కోర్స్ యూ ఆర్ కరెక్టు." అన్నాడు శ్యామ్.
    "ఆఫ్ కోర్స్" అంది అఖిలభాను.
    "ఏ ఉపాయము లేకపోతే నేనే ఆయనకు క్షమార్పణ చెప్పుకునే దానిని -" రోషంగా అంది స్మితా రాణి.
    "దాంతో మా ఆర్.కె. శ్యామ్ ఉద్యోగం గోవిందా - గోవిందా " అన్నాడు భవానీశంకర్ -స్మిత  మరింత ఉలికిపడిపోయింది.
    "ఎనీవే - అయాం ఎక్స్ ట్రీంలీ సారీ! మిస్ స్మితా!" అన్నాడతను.
    "ఇంక నేను వెళతానే! " అంది స్మితా రాణి అభిలభానుతో.
    "నేను వెళతాను" అన్నాడు భవానీ శంకర్.
    స్మిత అనుమానంగా అతనివేపు చూసింది. అతగాడు మళ్ళీ తనకు బాడీ గార్డుగా రాబోతున్నాడని అర్ధమై పోయిందామెకి.
    ఇద్దరూ బయటికొచ్చారు.
    "థాంక్స్ ఫర్ యువర్ గ్రాండ్ హాస్పిటాలిటీ వదినమ్మా" అన్నాడు భవానీశంకర్.
    "మీ ఇద్దరి ఇళ్ళూ ఒకేచోటా కదా , వై డోంట్ యూ గో బై అటో అన్నాడు శ్యామ్.
    బెస్ట్ అయిడియా , మీరేమంటారు మిస్ స్మితా - ---ఆఫ్ కోర్స్ సగం చార్జీ నేను పెట్టుకుంటాను."
    "అవసరం లేదు .....నేను బస్ లో వెళతాను" అంది స్మిత.
    "ఓ.కే. - మిస్ - మీ ఇష్టప్రకారమే వెళదాం."
    ఇద్దరూ రోడ్ మీద కొచ్చారు. స్మిత ఎంత వేగంగా నడిచినా భవానీశంకర్ కి దూరంగా వెళ్ళటం సాధ్యం కావటం లేదు. ఎప్పుడు చూసినా అతను తనకు ఓ నాలుగడుగుల దూరంలోనే ఉంటున్నాడు.
    ఇద్దరూ బస్ స్టాప్ దగ్గరకొచ్చి నిలబడ్డారు.
    బస్ లు మాములు ప్రకారం స్టాప్ లో ఆగకుండా వెళ్ళిపోతున్నాయ్.

 Previous Page Next Page