Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 8


    "ఇతరుల నెత్తిమీద కర్రతో బాదటం మీరు ప్రాక్టీస్ చేస్తున్న అద్భుతమైన స్పోర్ట్స్ అన్న విషయం అర్ధమయింది మేడమ్! కానీ మీ స్పోర్ట్సు బాదితులకు మంచినీళ్ళు అందివ్వటం కూడా మీ బాధ్యత అని గైడ్ లైన్స్ లో వుంది."
    స్మితా రాణి పరుగులాంటి నడకతో లోపలికెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి భవానీ శంకరుకి అందించింది.
    ఆ అకారంకు మంచినీళ్ళు గడగడ తాగాక స్థిమితం చిక్కినట్లనిపించింది. "నేనెక్కడున్నాను?" అన్నాడు చుట్టూ చూస్తూ.
    "ఆర్. కె. శ్యామ్ ఇంట్లో కామ్రేడ్ . ఇంకోసారి ట్రై చేయండి మాట సరిగ్గా వచ్చేస్తుంది" అన్నాడు శంకరు.
    అప్పుడే అఖిల వడివడిగా ట్రేలో కాఫీ తీసుకొచ్చింది.
    "తాగండి సార్! అయన మార్కెట్ కెళ్ళారు? ఈపాటికి వచ్చేస్తూ వుండాలి" అంది కంగారుగా.
    అతను కాఫీ ముట్టుకోలేదు.
    "నన్నెవరు కొట్టింది? అడిగాడు నెత్తిమీద బొప్పి తడుముకుంటూ అఖిలభాను పూర్తిగా భయపడిపోయింది.
    "పొరపాటున మా స్మిత" నిస్సహాయంగా భవానిశంకరు వేపు చూస్తూ అందామె.
    భవానీ శంకరు చప్పున కల్పించుకున్నాడు.
    'అదా ---అదీ ------ఆహ్------మీరు మన్నిస్తే --------మిస్ స్మిత ---------మా మరదలు -------అదిగో ఆ పిల్ల"
    స్మిత ఉలిక్కిపడి కోపంగా చూసిందతని వేపు.
    భవానీశంకరు ఆమె వేపు చూసి కన్నుకొట్టాడు.
    "కామ్రేడ్ జగన్నాధం! -----ఈ బావ - మరదళ్ళ సరసాల గురించి మీకు తెలీందేముంది? ఆ? వాడ్డూ యూ సే? ఒకరి కళ్ళల్లో ఒకరు కారం కొట్టుకోవడం, కూరలు ఉప్పుకళం చేసి వండటం, కుర్చీ కాళ్ళు తీసెయ్యటం కోటు జేబులో తేళ్ళూ జెర్రులు వదలటం - ఇలా ఎన్ని రకాలని? అందులో జస్ట్ ఇది కూడా ఒకటి కామ్రేడ్! స్మిత మరీ అల్లరి వ్యవహారం కావటం వల్ల ఈ సరసాలు మరింత ప్రమాదకర ధోరణిలో సాగుతుంటాయ్."
    జగన్నాధానికి కోపం మరింత ఎక్కువయింది. స్మిత వేపు మండిపడుతూ చూశాడు.
    సరసాలు మీ ఇద్దరి మధ్యా వుండాలి గానీ ఇంటికొచ్చిన గెస్ట్ లతో ఏమిటి?"
    "అక్కడే దెబ్బతిన్నారు కామ్రెడ్. మీరు నా ఫ్రెండనుకుని - బైదిబై మీకు చెప్పటం మర్చిపోయాను. మిస్ స్మిత కు నా ఫ్రెండ్ తో కూడా సరసాలడటం సరదా-"
    స్మిత కోపం అణుచుకోలేక అభిలభాను వేపు చూసింది.
    అభిలభాను ఆమెను శాంతంగా వుండమన్నట్లు సైగలు చేసింది.
    "దటీజ్ వెరీ బాడ్" అన్నాడు జగన్నాధం తన తలమీద ఏర్పడ్డ బొప్పిని తడుముకుంటూ.
    "ఎగ్జాక్ట్ లీ కామ్రేడ్! నేనూ అదే చెపుతుంటాను స్మితకు -----మా ఫ్రెండ్ చాలామందిని ముప్పతిప్పలు పెట్టింది. డూ యూ నో - మనోహర్ మెహతా అనే మా ఫ్రెండ్ ఇలాగే పాపం నాకోసం ఇంటికొస్తే వాడి కాఫీలో స్లీపింగ్ పిల్స్ కలిపేసింది - వాడు పాపం ఆర్రోజులు హాస్పిటల్లో వుండటమే కాకుండా ఆత్మహత్యా నేరం మీద కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది ......."
    జగన్నాధం ఈసారి స్మిత వేపు భయంగా చూశాడు . స్మితకు సహనం నశించిపోతోంది.
    "నన్నడిగితే అది సరసాల స్టేజీ దాటిపోయిందని నా అనుమానం" అన్నాడతను.
    "యస్ కామ్రేడ్ - ఆరోజు నన్ను క్రికెట్ బాల్ తో నెత్తిమీద కొట్టినప్పుడు నాకు కుట్లు వేసిన డాక్టర్లు కూడా అదే అన్నారు -"
    "మైగాడ్ - క్రికెట్ బాల్ తో కొట్టిందా?"
    "అవును! డైనింగ్ టేబుల్ కింద పదహారు కప్పల్ని ఓ అట్టపెట్టెలో పెట్టి భోజనం చేసేటప్పుడు నా మీదకు వదిలిన తర్వాత రోజే క్రికెట్ బాల్ ఉపయోగించింది కామ్రేడ్."
    "దిసీజ్ నధింగ్- " అన్నాడు జగన్నాధం. "బహుశా సైక్రియాటిస్ట్ కి చూపించడం మంచిదేమోనని నా అభిప్రాయం -"
    "సెంట్ పర్సెంట్ కామ్రేడ్ - నా అభిప్రాయం కూడా అదే -"
    స్మిత ఇక సహించలేకపోయింది.
    "ఏయ్ మిస్టర్! స్టాప్ దిస్ నాన్సెన్స్ -" అంది ఉగ్రురాలౌతూ.
    అభిలభాను చప్పున భవానిశంకరుని అందుకుంది.
    "స్మితా - మళ్ళీ అందరి ఎదురుగా గొడవపడుతున్నారా? వెరీ బాడ్. పద లోపలకు- " అంది ఆమె చేయి పట్టుకుని లోపలకు తీసుకేళుతూ.
    "మొత్తంమీద చాలా మంచి పిల్ల కామ్రేడ్ - ఏదో అప్పుడప్పుడు కొంచెం అతిగా ప్రవర్తిమ్స్తుంది గానీ - ఐ లవ్ హర్-"
    జగన్నాధం అర్ధమైనట్లు తల పంకించాడు.
    "ఆఫ్ కోర్స్ - "లవ్" అంటే అంతే - పిచ్చికి లవ్ కీ తేడా ఏమీ లేదు."
    లోపల స్మిత అభిలభాను మీద మండిపడుతుంది.
    "ఏమిటే ఇది - అతనెవరో అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే నువ్వూ వత్తాసు పలుకుతావెం?" నిష్టూరంగా అంది.
    "అయ్యో! నీకు చెప్పాను కదే. అయన సహాయం చేస్తే మావారి ఉద్యోగం ఊడిపోకుండా నిలబడుతుంది. పాపం భవానిశంకరు ఏవేవో కల్పించి చెప్పటం వల్ల ఆ ముసలాడు కొంచెం తగ్గిపోయే ఛాన్స్ వుంది. కాసేపు నువ్వేమీ మాట్లాడకుండా ఊరుకో చాలు."
    స్మితకి ఏమనాలో తోచలేదు.

 Previous Page Next Page