"పోనీ అటో పుల్ ఫేర్ నేనే భరిస్తే ఆటోలో వస్తారా మిస్?" అడిగాడు భవానీ శంకర్.
"దయచేసి నాతొ మాట్లాడకండి" అందామె కోపం అణుచుకుంటూ.
"ఓ.కే. మిస్ - మాట్లాదననీ హామీ ఇస్తున్నాను! నాకూ సైలెన్స్ అంటే చాలా ఇష్టం! టెన్త్ క్లాసు చదివేటప్పుడు ఓ రోజు అరగంటసేపు సైలెంట్ గా గడిపాను."
"బహుశా ఆ అరగంటా ఏదో జ్వరం వచ్చి స్పృహ లేని స్థితిలో ఉండి ఉంటారు" కసిగా అందామె.
"ఎగ్జాక్ట్ లీ మిస్ - మీరు భలే కనిపెదతారే - బైదిబై మీకూ ఫోటోగ్రఫీ హబీనా."
"మీకనవసరం-"
"నాకవసరం మిస్ - నేనూ ఫోటోగ్రాఫర్నే కదా - ఇలా ఇద్దరూ ఫోటో గ్రాఫర్స్ అయితే సంసారం సాఫీగా సాగుతుందని మా ప్రెండ్ సింహాచలం అంటుండేవాడు........."
"డోంటాక్ నాన్సెన్స్"
"నేను ఊరికే చెప్పాను మేడమ్ అంతే. అది ఫాక్ట్ కావాలనిలేదు."
౩
అప్పుడే బస్ వచ్చి ఆగింది.
ఆమె వెనుకే బస్ ఎక్కేశాడు భవానీశంకర్.
అదే కండక్టర్ చిరునవ్వుతో వచ్చాడతని దగ్గరకు.
భవానీశంకర్ పదిరూపాయలు నోటు తీసి ఇచ్చాదతనికి.
కండక్టర్ చిరాకు పడ్డాడు.
"చిల్లర లేద్సార్! చిల్లర ఇవ్వండి. అందరూ పదులు, అయిదులూ ఇస్తే ఎలా? నా దగ్గరేం కాయిన్స్ తయారుచేసే ఫ్యాక్టరీ ఉందనుకున్నారా?"
"లేకపోతే త్వరగా ఓపెన్ చెయ్ బ్రదర్! సింగిల్ విండో సిస్టం లో రెండు నెలల్లో గవర్నమెంట్ లోన్ కూడా దొరుకుతుంది నీకు."
"సారీ బాస్! నో చేంజ్? ఇందాక నీ ఎదురుగుండానే కదా ఓ అందమైన అమ్మాయికి సహాయం చేయడం కోసం నా దగ్గరున్న చిల్లరనంతా త్యాగం చేశాను."
కండక్టర్ అతని మీద జాలిపడ్డాడు.
"అవున్సార్! పాపం! చాలా త్యాగం చేశారు! నైన్ టీన్ ఎయిటీసిక్స్ లో కూడా నేను దిల్ షుక్ నగర్ డిపోలో పనిచేస్తున్నప్పుడు, ఒక స్టూడెంట్ అచ్చం మీలానే త్యాగం చేశాడు ఓ అమ్మాయి కోసం!"
"అలాగా బ్రదర్! చరిత్రలో అక్కడక్కడా నాలాంటి త్యాగమూర్తులు కనబడుతూనే ఉంటారని మా టి.జె. యమ్ . బాబు చెప్పినమాట నిజమేనన్నమాట.
"అవున్సార్! చాలా నిజం - ఇప్పుడు మీరు చిల్లర కావాలంటే ఆమె నడగండి ! ఆ అమ్మాయి కోసమేగా ఇందాక మీరు అంత త్యాగం చేసిందీ?" సలహా ఇచ్చాడతను.
భవానీశంకర్ కాసలహ అర్ధవంతంగా తోచింది.
"హలో మిస్" అన్నాడు చిరునవ్వుతో!
"హు!" అంది స్మితారాణి తల తిప్పుకుంటూ.
"నా టికెట్ మీరు దయతో తీసుకుంటే ......"
"హు!" అందామె ఇంకా కోపంగా.
"మనీ ఓ రూపాయి చిల్లర అప్పివ్వండి, బస్సు దిగగానే ఎక్కడో చోట చిల్లర తీసుకొచ్చి మీ రుణం తీర్చేసుకుంటాను."
"నో! నేనివ్వను" ఖచ్చితంగా చెప్పేసిందామె.
భవానీశంకర్ ఆశ్చర్యంగా చూశాడామె వేపు.
"ఇది అన్యాయం మిస్! మనం ఇంత దగ్గరవారమయుండి ఇలా ......."
ఆమె కోపంగా అతనివేపు తిరిగింది.
"దగ్గరవారమేమిటి?" అంది మండిపడుతూ.
"అంటే అదే మిస్! రెండు రకాలుగా మనం దగ్గరి వాళ్ళం, మొదటిదేమిటంటే బస్సులో మనం చాలా దగ్గరగా నిలబడ్డాం గనుక దగ్గరవాళ్ళం రెండోదేమిటంటే నేను ఆర్.కె . శ్యామ్ బెస్టు ఫ్రెండ్ ని! అలాగే మీరు మిసెస్ అఖిలభానుకి బెస్టు ఫ్రెండు! మరి వాళ్ళిద్దరూ బెస్టు భార్య భర్తలు కనుక మనం కూడా."
కండక్టర్ తో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా భవానీ శంకర్ కి శ్రోతలుగా మారారని తెలిసేసరికి స్మితారాణికి కోపం ముంచుకొచ్చేసింది.
"డోంటాక్ రబ్బిష్" అంది అతని మాట పూర్తీ కానీకుండా.
"పోనీ ఇందాక మీ బస్సు టికెట్ నేను తీసుకున్నాను కదా మిస్ - ఇప్పుడు నా టికెట్ మీరు తీసుకుంటే ......"
"మిమ్మల్ని తీసుకోమని నేనేం అడగలేదు ......." రోషంగా అంది ఆమె.
"ఆఫ్ కోర్స్ అడగలేదు గానీ అలా ప్రాణాలకు రిస్కు తీసుకుని సహాయాలు చేస్తుంటే ఏదొక రోజు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ప్రెసిడెంట్ గాలంట్రీ ఎవార్డు రిపబ్లిక్ పెరేడ్ లో అందుకోవచ్చానీ ఆశ! సరే మీరిప్పుడు వప్పుకోవడం లేదు కాబట్టి."
కండక్టర్ బెల్ కొట్టాడు . బస్ ఆగిపోయింది.
"కమాన్ మిస్టర్- బస్సు దిగు" అన్నాడు కండక్టరు.
భవానీశంకర్ స్మితా రాణి వేపు చూశాడు.
"మీ స్వగ్రామం రాయలసీమలో ఉంటుందని నాకు పూర్తి నమ్మకం కలిగింది మిస్. మీ హృదయం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది సంగతి. నాపరాయి - కడపరాయి - " అనేసి బస్సు దిగాడతను. బస్సు బయలుదేరింది మళ్ళీ.
"ఇడియట్" కోపం అణుచుకుంటూ అందామె. అయితే ఆమె సంతృప్తి ఏంతోసేపు నిలువలేదు. బస్సు వెనుకే వస్తోన్న ఆటోను చూడగానే మళ్ళీ కోపం ముంచుకొచ్చింది. ఆటోలో అతను చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు.