"ఈ నగలు బజారు నగలు అనుకుంటున్నావా?"
"గిల్టునగలని తెలుసు. అవి మీరెందుకు పెట్టుకున్నారో తెలియలేదు."
"అది చెప్పడానికే వచ్చాను. చెప్పెయానా!"
"చెప్పాలనుకుంటే చెప్పండి"
"చెప్పాలి చెప్పాలి నీకు తప్పకుండా చెప్పాలి. నాకు బంగారు నగలు లేవు. గిల్టు నగలు తప్ప రాణికి నగలు లేకపోతే వంశ మర్యాదకి లోపమని గిల్టు నగలు తగిలించుకుని తిరుగుతున్నాను. జీవన్ తాత ఆ తరువాత తండ్రి, ఇప్పుడు జీవన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈ యిల్లు, ఉన్న కొద్దిపాటి పొలాలు అప్పుల్లో వున్నాయి. నిన్ను పెళ్ళి చేసుకున్నది నీతో నాట్యాలు చేయించి, ఆ డబ్బులతో అప్పులు తీర్చడానికి నీ అందం చూసి మోహించి కాదు. అహ్హహ్హా......"
ఎన్నాళ్ళుగానో ఎవరి మీదో తన మనసులో పేరుకున్న కసి కరిగించుకుంటున్నట్లు విరగబడి నవ్వింది రాణి అచ్చయ్యమ్మా దేవి.
పాతకాలపు వంటిల్లు, రెండు పెద్దగాడి పొయ్యిలు, రెండు యినప కుంపట్లు తప్ప ఆధునికమైన సదుపాయాలు యేమి లేవు. చివరికి గ్యాస్ స్టవ్ కూడా లేదు. ఆ గాడి పొయ్యిలమీద పెద్దపెద్ద గిన్నెలు యెక్కించి పంపడానికి ప్రయాసపడుతోంది అణువేద. ఆ రోజు మొదటిసారిగా ఆమె వంటింట్లో ప్రవేశించి వంట పని ప్రారంభించింది. ఇప్పుడామెకు ఏడో నెల. వొంగుని లేవడానికి అయాసపడుతోంది.
"అరె! నువు ఇక్కడున్నావా?" వంటింటి గుమ్మం పట్టుకుని చుట్టూ చూస్తూ కంపరంగా అన్నాడు జీవన్.
"ఇంటి ఇల్లాలు ఎక్కడుండాలిట మరి?"
"అద్దాలమెడలో"
"ఛ! నాకా అద్దాల గది చూస్తుంటే పాతకాలం నాటి ఛండాలపు అచారాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆడదాన్ని సమాజం యెంతటి అధమాధమస్థితికి ఈడ్చుకొచ్చిందో తలచుకుంటే కంపరం వొస్తోంది. ఆ అద్దాల గది కంటే యీ వంటిల్లు కోటి రెట్లు బాగుంది.
నాకు, ఇక్కడ శ్రమ వున్నా అనందం వుంది."
"అయినా నువెందుకు శ్రమపడాలి? వంట వాళ్ళేమయ్యారు?"
"వంటలుచేసేవాళ్ళు, పోసుకోలు కబుర్లు చెప్పేవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. గదులు వూడ్చి , గిన్నెలు తోమడానికి మాత్రమే పనిమనిషి వుంది"
"వెళ్ళిపోయారా! ఎక్కడి కెళ్ళారువీళ్ళంతా? ఎవరినడిగి వెళ్ళారు?"
"మూడు సంవత్సరాలుగా రావలసిన జీటలన్నీ చేతుల్లో పడేసరికి ఎవరి కంటికి కనపడకుండా పారిపోయారు. " నవుతాలుగా అన్నట్లు అంది అణువేద. జీవన్ మాత్రం దాన్ని జోక్ గా తీసుకోలేదు. అతని ముఖం కందగడ్డలా అయింది. నిగ్రహించుకోలేని రోషంతో పెదవులు అదిరాయి.
"వాళ్ళని తరతరాలుగా మేపుతోంది మా వంశం. కొన్నాళ్ళు ఏవో యిబ్బందులు వచ్చి జేతాలు యివకపోతే పనులు మానేస్తారా! వుండు వాళ్ళ పని......"
ఉద్రేకంతో ఉగిపోతున్న జీవన్ భుజం మీద చేతులు వేసి ఎంతో అనునయంగా. "జీవన్! వాస్తవాలను మన నుంచి మరుగుపరచుకొన్నంత మాత్రాన అవి మాయమైపోవు. వాటిని దైర్యంగా ఎదుర్కోవటమే ఉత్తమ మార్గం" అంది. షాక్ తిన్నట్టయ్యాడు జీవన్.
తను జమిందారీ వంశస్థుడినన్న అహమే అతని వ్యక్తిత్వానికి ఆధారమైంది చిన్నప్పటి నుంచి ఇంటి పరిస్థితులు చూచాయిగా తెలుస్తున్నా ఎప్పటికప్పుడు ఆ సమస్యలని వాయిదా వేసేసి తన జమిందారీ దర్జాని నమ్ముకోడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. హటాత్తుగా మేడి పండులాంటి ఈ దర్జాల లోపలి పేదరికం బట్టబయలయ్యే సరికి అది తను ఎంతగానో ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య ముందు యిలా బయట పడిపోవలసి వచ్చేసరికి అతడు భరించలేకపోయాడు.
"నో.....నో నువు వెంటనే వంటింట్లో నుంచి బయటికి వచ్చేయి. ఇంటి సమస్యల గురించి, ఖర్చుల గురించి ఆలోచనలు నీకెందుకు? అవన్నీ నేను చూసుకుంటాను. ఈ సమయంలో నిన్ను శ్రమ పడనియను. గదిలోకి వచ్చి విశ్రాంతి తీసుకో!"
"కడుపుతో వున్నవాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని ఎవరు చెప్పారు మీకు? ఎంత శ్రమ పడితే అంత తేలిగ్గా డెలివరి అవుతుంది. మీరు వెళ్ళండి నేనిప్పుడే వస్తాను."
జీవన్ అప్పటికి కదలకుండా మొండిగా వదిన్చాబోయాడు. కని అణువేద అతన్ని పసిపిల్లాడిని బుజ్జగించినట్లు బుజ్జగించి పంపేసింది. జీవన్ లో గొప్పతనం, బలహీనత- రెండూ అవే అణువేద చేతుల్లో పసిపిల్లాడిగా మారిపోవటం. జీవన్ తో అసలు నిజాలు ఓపెన్ గా చర్చించి అతడి చేత ప్రాక్టికల్ గా ఆలోచింపచేయడం చాలా కష్టమని అణువేదకి తెలుసు.
అలాంటి క్షణం యెప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె వారం రోజుల నుంచి యెన్నో రకాలుగా రిహార్సల్సు వేసుకుంటూనే వుంది. అయినా జీవన్ ని బాహాటంగా ఎదుర్కోవలసి వచ్చేసరికి ఆమెకి కాళ్ళు, చేతులు చల్లబడినట్లు అయిపోతున్నాయి.
అణువేద గదిలోకి రాగానే వడలిపోయిన ఆమె ముఖం అక్కడక్కడ మసి మరకలంటుకున్న ఆమె చీర చూసి యెంతో జాలి కలిగింది. జీవన్ లో మరుక్షణమే అది తన చేతకానితనానికి ఫలితంగా తోచింది. నిస్సహాయమైన ఉక్రోషం కోపంగా మారింది.
"నువు మా వంశ మర్యాదని గంగలో కలుపుతున్నావు. మా యిళ్ళలో యెవరు వంట పనులు చెయ్యరు"
"జీవన్! ప్రాక్టికల్ గా ఆలోచించు. వంశ మర్యాదా వంశమర్యాదా అంటూ ఆకారం లేని వుహని పట్టుకుని భూ దివాలా మధ్య వుగులాడకు. ఈరోజుల్లో డబ్బు లెవరి దగ్గరుంటే వాళ్ళేదే గొప్ప వంశం. హరిజన మినిస్టరు గారిని మనమందరం గౌరవించటంలేదా?"
"అయితే ఇప్పుడు మాకు బ్యాంకు బేలన్సులు లేవని దెప్పుతున్నావా! నీలో ఇంత దురాశ వుందని అనుకోలేదు."
"నాలో ఉన్నది దురాశ కాదు. దూరాలోచన. అర్ధం పర్ధం లేకుండా వంశం, వంశం అని గొప్పలు చాటుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మన స్తోమతకి తగినట్లు ఏదో ఒక బ్రతుకు తెరువు చూసుకోవాలి."
"వాట్ నాన్ సెన్స్ ఈ ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బుతో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాను.
జాలిగా నవ్వింది.
"ఇప్పటికి మీరు వస్తావాలు పట్టించుకోకుండా ఊహల్లో తేలుతున్నారు. ఈ యిల్లు మీ పొలాలు అన్నీ అమ్మేసినా అప్పులు పూర్తిగా తీరవు. ఇక మిగిలేదేమి వుండదు. కలలు కంటూ కూర్చోకు మన మేనేజరు అన్నీ ఏర్పాట్లు చేసేశాడు నువు సంతకాలు చెయ్యడమే మిగిలింది. ఈ అప్పులు యింకా పెంచుకుంటూ కూర్చోవద్దు. ఉన్న అప్పులు తీర్చేసి హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒకటి చూసుకుని మిగిలిన అప్పులు నెమ్మదిగా తిర్చుకుందాం."
ఏం మాట్లాడలేక తల వొంచుకున్నాడు జీవన్. అతనికి ఇదంతా ఏ మాత్రం నచ్చడం లేదు. కానీ ఏం చెయ్యాలో తోచడం లేదు.