Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 8

"అయితే నువు నేరుగా వాడి గదిలోకే వచ్చేసావన్నమాట." అంది రాణి అచ్చయ్యమ్మా దేవి అణువేద మాట్లాడలేదు. "ఎంత దగ్గిర వాళ్ళనైనా చివరికి అక్కనైనా వాడి గదిలో వుండనియడు. నిన్నక్కడుంటే......మీకింతకు ముందే పరిచయముందా?"
ఆ మాటల ధోరణి కౌసల్య సహించలేకపోయింది.
"ఈవిడ సుప్రసిద్ధ నాట్యకళాకారిణి. ఎందరెందరో యివిడ దర్శనం కోసం పడిగాపులు పడుతూ ఎలాగైనా యిమే నొకసారి కలుసుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. మీ అబ్బాయి కూడా అలాగే యివిడ స్నేహితురాలి నడ్డు పెట్టుకుని యింతకు ముందోకసారి తిరుపతిలో మా బసలో కలుసుకున్నారు. మీరిక వెళ్ళండి మేడమ్ రెస్టు తీసుకోవాలి. "కౌసల్య అంత స్పష్టంగా చెప్పినా, రాణి అచ్చయ్యమ్మాదేవి కదల్లేదు.
"నా యింట్లోంచే నన్నే వెళ్ళమంటావా?" అనే ధోరణిలో మొండిగా నిలబడి, "ఇంతకీ నీ కన్నెరికం యెవరు చేశారు?" అంది.
"అమ్మా!" అది పిలుపు గాదు, సింహగర్జన జీవన్ యెప్పుడొచ్చాడో తల్లి వెనుక నిలబడి ఆవిడ జబ్బ పట్టుకుని, "నువు యిక్కడ్నుంచి వెళ్ళు నా అతిధుల్ని అనుమానించకు"అంటూ ఇంచు మించుగా ఆవిణ్ణి బయటికి గెంటి అణువేదతో నమ్రతగా,
"క్షమించండి! మా అమ్మ నూతిలో కప్పలా ఒక శతాబ్దం వెనక కాలంలో నిలిచిపోయింది. గురజాడ , వీరేశలింగం మొదలైన వారెందుకు బయలుదేరినా మా అమ్మాతరం వరకు ఆడవాళ్ళల్లో కొంతమంది యిలాగే వుండిపోయారు. మా అక్కయ్య బి.ఎ. పాసైంది. అయిదేళ్ళ కిందట పెళ్లయింది. మా బావగారిది జమిందారీ వంశమే. ఒక కొడుకు కూడా ఉన్నాడు. హాయిగా వున్నారు వాళ్ళు. మా అమ్మ ధోరణికి ఆమె తరపున నేను క్షమాపణ తెలుపుకుంటున్నాను."
"ఫరవాలేదులెండి" మొహమాటంగా అంది అణువేద. "మేడమ్ రెస్టు తీసుకోవాలి" హెచ్చరించి కోసల్య జీవన్ ఖంగారు పడిపోతూ "సారీ! సారీ!" అంటూ వెళ్లిపోయాడు. అతని దర్జా, అహంకారాల వెనక యీ పసితనపు ఖంగారు చూసి నవుకుంది.
ఆరోజు నాట్య ప్రదర్శనకి చల్లపల్లి నుంచే కాక, చుట్టుపక్కల పల్లెటుళ్ళ నుంచి కూడా జనం విరగబడి వచ్చారు. ప్రదర్శన ముగిసాక స్వయంగా అణువేదని ఘనంగా సన్మానించాడు జీవన్. అప్పుడే జీవన్ ఒక్కడే తన స్వంత ఖర్చుల మీద చల్లపల్లిలో డాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయింది అణువేద. సాధారణంగా యేదైనా ఒక సంస్థగాని, లేక నాలుగైదు సంస్థలు గాని కలిసి ఇలాంటి కార్యక్రమాలు యేర్పాటు చేస్తాయి. జీవన్ ఒక్కడూ తన స్వంత డబ్బు పదిహేనువేల వరకు ఖర్చు పెట్టాడు. అంత కళాభిమానమా?
బసకి వచ్చాక, "మీకు నాట్యకళ అంటే అభిమానమా" అని అడిగింది అతన్ని.
"నిజం చెప్పేయమంటారా!"
"చెప్పండి అదేదో"
"నాకు నాట్యకళ గురించి ఏమి తెలియదు. ఆ విషయం తిరుపతిలోనే చెప్పాను మీకు. మిమ్మల్ని మరొకసారి కలుసుకోవాలనిపించింది. ఇంతకంటే మరో మార్గం తోచలేదు."
"నన్ను ఒక్కసారి కలుసుకోవటం కోసమే పదిహేను వేలు ఖర్చు పెట్టారా?"
నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు.
"ఇంకా ఖర్చు పెడ్తాను మీరు అవకాశం యిస్తే. రెండు రోజులుండి వెళ్ళకూడదు."
"సారీ! నేను పరాయి చోట డాన్సు ప్రోగ్రాం సమయంలో తప్ప వుండను. మీరు హైదరాబాద్ రండి." ఆ చిన్న మాట చాలు జీవన్ కి ఆ తరువాత అతడు హైదరాబాద్ లో అణువేద చిరునామా వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అతనిని నిర్ధారణ చేయలేకపోయింది.
ఆమెని ప్రాధేయపడి వొప్పించే రెండు మూడుసార్లు డిన్నర్సుకి తీసుకెళ్ళాడు జీవన్. పరిచయం పెరిగిన కొద్ది ఆమె వ్యక్తిత్వం అన్నీ విధాలా అతనిని ఆకర్షించింది.
"నీకభ్యంతరం లేకపోతే మనం పెళ్ళి చేసుకుందాం!" అనేశాడు. అప్పటికి అనువేద కూడా ఈ అందమైన యువకుడి చేత చాలా వరకు ఆకర్షింపబడింది. అతడి జమిందారీ వంశము దాని తాలూకు ఆడంబరాలు, దర్జాలు, అతడి తల్లి యివి ఆమెని కొంత భయపెట్టాయి.
"మా అమ్మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు. చిన్నాన్న గారింట్లో పెరిగాను. మా మావయ్య కూడా నా శ్రేయోభిలాషి డాన్సురుగా యింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా ఈనాటి వరకు వాళ్ళిద్దరి మాట కాదని నేనేది చెయ్యలేను. వాళ్ళిద్దరూ వొప్పుకుంటే నాకభ్యంతరం లేదు."
జీవన్ అందుకొప్పుకున్నాడు. భువనేశ్వర్ వెళ్ళి అక్కడ ఆడిటర్ గా వున్న ఆమె మేనమామ సుందరేశరరావుని కలుసుకుని తన అభిప్రాయం చెప్పాడు. పినతండ్రి మేనమామ ఇద్దరూ యీ సంబంధానికి సంతోషం వొప్పుకున్నారు. బంధువర్గమంతా అణువేద అదృష్టవంతురాలని అభినందించారు.
పెళ్ళికి ముందే అణువేద జీవన్ తో "నాకు నాట్యకళ అంటే ప్రాణం కానీ గృహిణిని అయ్యాక నాట్యప్రదర్శనలు యిస్తూ యింటిని పిల్లల్ని నిర్లక్ష్యం చెయ్యడం ఇష్టం లేదు. ముఖ్యంగా పిల్లలు చక్కగా పెరిగి పెద్దవాళ్ళవడానికి తల్లి ప్రేమతో పాటు శ్రద్ధ, జాగ్రత్త కూడా చాలా అవసరం. నేను నాట్యం మానేస్తే నీ కభ్యంతరం వుండదుగా!"
హుషారుగా ఈల వేశాడు జీవన్. కంగారు పడటం, ఈల వేయడం ఈ రెండు అతనిలోని వదలని పసి లక్షణాలు.
"సారీ! సరిగ్గా ఇదే నేను నిన్ను ఆదాగాలనుకుని నువు కష్టపెట్టుకుంటావేమోనని సందేహించాను ఇంకా నాట్య ప్రదర్శనలిస్తూ డబ్బు సంపాదించవలసిన అవసరం ఏం వుంది నీకు? ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు. ఆదర్శ గృహిణి పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ ఆనందగా గడిపెయొచ్చు."
తమ ఇద్దరి అభిప్రాయాలు ఒకటై నందుకు ఏంతో ఆనందించింది అణువేద. ఎంతో అట్టహాసంగా బంధు మిత్రుల శుభాకంక్షలతో అణువేద జీవన్ ల పెళ్ళి హైదరాబాద్ తుల్జా భవన్ లో జరిగింది. కన్నీళ్ళతో కౌసల్యకు వీడ్కోలు చెప్పి భర్తతో చల్లపల్లి వచ్చేసింది.
జీవన్ అంటే యెంత ప్రేమ వున్నా పాడుబడ్డ వున్న జమిందారీ బంగాళా చూసినప్పుడు మాత్రమే ఆమెలో ఏదో అవ్యక్తమైన ఆందోళన చెలరేగటం మానలేదు. జీవన్ యెలాగో ఆ యిల్లు అమ్మేసి హైదరాబాద్ లో కొత్త యిల్లు కొంటానంటున్నాడు. అది త్వరగా జరిగితే బాగుండును.
జీవన్ గది సర్దిస్తోంది అణువేద. పెరిగిపోయిన అడవి పొదలా వున్న ఆ గది కొక ఆకారాన్ని తేవాలని తాపత్రయపడుతోంది. తలుపు తీసుకుని లోపలికి వచ్చింది రాణి అచ్చయ్యమ్మాదేవి ఈ నాటికి ఆవిణ్ణి చూస్తే గుండె గుబగుబ లాడుతుంది అణువేదకి.
"ఈ నగలు చూశావా?" రాళ్ళ నగలు చూపిస్తూ అడిగింది రాణి అచ్చయ్యమ్మ.
"బాగున్నాయి."

 Previous Page Next Page