Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 10

సమస్యల్ని ఎదుర్కొని ఆలోచించడం అతనికి ఏనాడు అలవాటు లేదు. ఇప్పుడు అణువేద చాకచక్యంగా ఆలోచించి పరిష్కార మార్గాలు చెప్తుంటే కష్టంగా వున్నా కాదనలేకపోతున్నాడు. జీవన్ వైపు నుంచి ఈ మాత్రం అంగీకారం చాలు అణువేదకి. చకచకా తన కార్యక్రమాలు ఒకదాని వెంట ఒకటి ప్రారంభించింది. ఇల్లు పొలాలు అమ్మించేసి అప్పులు తిర్చేసింది. గాంధీనగరులో టూ బెడ్ రూమ్ ప్లాట్ అద్దెకు తీసుకుని అత్తగారితోను- భర్తతోను కాపురం హైదరాబాద్ కి మార్చేసింది.
ఇళ్ళు పొలాలు అమ్ముతున్నప్పుడు రాణి అచ్చయ్యమ్మాదేవి అన్నం నీరు ముట్టకుండా గది తలుపులు వేసుకుని ఏడుస్తూ గడిపింది. అణువేదకి జాలి కలిగింది కాని మెత్తబడదలచుకోలేదు. జేవితం పెద్దపులిలా నోరు తెరచుకుని మీద పడిపోతున్నప్పుడు సెంటిమెంట్లతో ఆడుతూ కూర్చుంటే లాభం లేదు.
ఒక్కక్షణం కూడా తీరిగ్గా కూర్చోవడం లేదు అణువేద. గవర్నమెంటు మ్యూజిక్ అండ్ డాన్సు స్కూలులో డాన్సు టీచరుగా జాయినయింది. ఇంటిదగ్గర కూడా పదిమంది పిల్లలకి డాన్సు నేరుపుతోంది.
జీవన్ కి అటో మొబైల్ రిపేరింగులో మంచి అనుభవం వుంది. కార్లు, మోటారు సైకిల్సు మొదలైన వాటి పైన అతని కున్న మోజు అందుకు కారణంకావచ్చు.
గాంధీనగర్ కి దగ్గర్లోనే మెయిన్ రోడ్డు పక్కగా కొంత విశాలమైన ఆవరణ లిజ్ కి తీసుకుని అతని చేత అటో మొబైల్ వర్కు షాపు తెరిపించింది. జీవన్ మనస్తత్వానికి అతడు మరొకర్ని బాస్ గా అంగికరించలేడని అర్ధమైంది ఆమెకి. అందుకే ఈ మార్గం యేన్నుకుంది. జీవన్ చాలావరకు రాజీ పడిపోయాడు కని, రాణి అచ్చయ్యమ్మాదేవి మాత్రం సమాధనపడలేక పోయింది. అవిణ్ణి దార్లోకి తెచ్చుకోవడానికి చాలా అవస్థ పడవలసివచ్చింది.
"అత్తగారూ! ఈ పాతకాలపు వెలిసిపోయిన , చిరిగిపోయిన జరి చీరల కంటే , సరికొత్త గుంటూరు జరి చీర మీ కెంతో బాగుంటుంది అది కట్టుకోండి." అని నచ్చచెప్పబోయింది.
"మా రాణివాసపు దర్జాలు నీకేం తెలుసు?" ఈసడించింది ఆవిడ. ఆ అవమానమంతా మింగేసి చిరునవ్వు తెచ్చుకుని, "మీరు తెల్లగా వుంటారు ముదురు రంగు గుంటూరు జరి చీరలో యెంతో బాగుంటారు. " అందుకని చెప్పాను" అంది. సృష్టికర్త ఎంతటి చిలిపివాడోకాని కాటికి కాళ్ళు చాచుకున్న ముసలమ్మైనా సరే, "నువు అందంగా వుంటావు" అంటే పొంగిపోకుండా వుండలేదు. రాణి అచ్చయ్యమ్మాదేవి జీవితంలో మొదటిసారిగా తన అరవైమూడో ఏట వెలసిపోయి మాసికలు వేసుకున్న పట్టుజరిచీర వదలి పెట్టి కళకళలాడుతున్న నేత జరి చీర కట్టుకుంది.
ఆవిడ చేత గిల్టు నగలు మానిపించడానికి మరో ఉపాయం ఆలోచించింది అణు.
"అత్తాగారు! ఈ మధ్య గిల్టు నగలు కొందరి శరీరాలకి పడటం లేదట. వొంటినిండా రేష్ లా వచ్చి ఇనజక్షన్స్ తీసుకోవలసివస్తోందిట. ఇన్ని గిల్టు నగలకంటే ఒక్క బంగారు గొలుసు మీ కెంతో బాగుంటుంది." అంది. రాణి అచ్చయ్యమ్మా దేవికి ఇంజక్షన్ అంటే విపరీతమైన భయం ఆవిడ వెంటనే గిల్టు నగలన్నితీసేసి వొంటి పేట బంగారు గొలుసు మాత్రం వుంచుకుంది. అయితే ఆవిడ విషయంలో యింతకు మించి సాధించలేకపోయింది అణువేద.
ఆవిడ ఒక్కపని ముట్టుకోదు నౌకర్లని అజ్ఞాపించినట్లే అణువేదని కూడా "కాఫీ తీసుకురా!'"అన్నం లోపల పెట్టు." "స్నానానికి నీళ్ళు పెట్టు," వగైరా ఆజ్ఞలు జారి చేస్తుంది. కోడలు నిండు చూలాలని కూడా ఆలోచించదు. ఇరుగు పోరుగుల్నో, వాళ్ళు దొరకక పొతే వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసే పనివాళ్లనో పిలిచి కూర్చోబెట్టుకుని వాళ్ళకి కూరలు పచ్చళ్ళు లంచాలు పెట్టి వోకప్పటి తమ ఇంటి గొప్పలు, చెప్పుకుంటూ యీ తైతక్కలాడే కోడలొచ్చి తమ యింటి గౌరవాన్ని ఎలా నాశనం చేసిందో కధలు కధలుగా చెప్పుకునేది. ఇలాంటివి అణువేదకి యెంత మాత్రం నచ్చవు. ఆవిడకి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే, "ఈనాటికి నాకు చెప్పేదానివి తయారయ్యావా! నేను ఏనాడైనా మా అత్తగారి ఎదురు నిలబడి మాట్లాడేదాన్నా! మంచి మర్యాదా వంశంతో రావాలి. తైతక్కలాడేవాళ్ళకి మగాళ్ళని బుట్టలో వేసుకోవడం తప్ప మంచి మర్యాదలేలా తెలుస్తాయి?" అని విదిలించింది.
అణువేద అనుమానంతో దహించుకుపోయినా తను ప్రేమించే జేవన్ ముఖం చూసి గర్భంలో పెరుగుతున్న శిశువుని తల్చుకుని అన్నీ సహించింది.
పురిటినొప్పులు ప్రారంభమయ్యే వరకూ కూడా డాన్సు స్కూలులోను, యింట్లోను పనిచేస్తూనే గడిపింది. అణువేద నొప్పులు ప్రారంభంకాగానే జీవన్ ఆమెని జగదంబ నర్సింగ్ హొమ్ లో జేర్పించాడు. ప్రసవం అయ్యేవరకు ఒక్క నిమిషం కూడా వదలకుండా ఆమె దగ్గరే వున్నాడు. హొటల్ కి వెళ్ళి కాఫీ టిఫిన్ కూడా తీసుకోలేదు లేబర్ రూమ్ లోకి కూడా రాబోతుంటే డాక్టర్లు, నర్సులు తిట్టి అవతలకి పంపించారు. గులాబీ మొగ్గలాంటి పసిపాపని నర్సు లేబర్ రూమ్ లోంచి తీసుకొచ్చి చేతుల్లో పెట్టి, ఇదుగో! మీ కూతురు" అని చెప్పేవరకు అతడు పిచ్చి వాడిలాగే తిరిగాడు బాల్కనిలో. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన కూతుర్ని సంతృప్తిగా, గర్వంగా చూసుకుని అప్పుడు హొటల్ కి వెళ్ళాడు కాఫీ తాగడానికి.
రాణి అచ్చయ్యమ్మాదేవి కోడలికి పత్యం వొండి పట్టలేదు. అప్పటికి ఆవిడకి నిజంగానే వంతరాదు. కౌసల్య విషయం తెల్సుకుని వచ్చి నెల వెళ్ళేవరకు అణువేద దగ్గిరే వుండి ఆమెకి  సాయం చేసి వెళ్లింది. పాపకి నెల నిండగానే నమ్మకమైన అయాని కుదుర్చుకుని తిరిగి తన కార్యక్రమాలు ప్రారంభించింది అణువేద. అయితే విపరీతమైన శ్రమ వల్ల తరచు జ్వరం వచ్చేది లేచి వంట చేద్దామన్నా సాధ్యమయ్యేది కాదు. ఆ పరిస్థితుల్లో కూడా రాణిగారూ మొదట్లో వంట గది దరిదాపుల్లోకి రాలేదు. కని అణువేద బొత్తిగా లేవలేకపోవడంతో ఆవిడ, జీవన్ ఒకరోజంతా మాడవలసివచ్చింది. అప్పుడు మొదటిసారిగా తల్లి కొడుకులు వంశ మర్యాదలను మరిచి ఒకరితో ఒకరు లేనివాళ్ళ కన్నా ఆధాన్నంగా హొరహొరిగా పోట్లాడుకున్నారు తరువాత అచ్చయ్యమ్మాదేవికి వంటింట్లో ప్రవేశించక తప్పలేదు. రుచిపచి లేకుండా ఏదో ఒకటి వండిపడేసేది.
ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కువ రోజులు సెలవుల్లో వుండటానికి వీల్లేదు. అందుచేత అణువేద వోపిక లేకపోయినా , నిలబడితే శరీరం తూలి పడిపోతున్నా ఎలాగో తయారయి డాన్సు స్కూలుకి బయలుదేరింది. రాణి అచ్చయ్యమ్మాదేవి నీరసంతో వున్న కోడలికి కాఫీ అయినా యివకపోగా, "వంట చెయ్యడానికి నీరసం అని మూలుగుతుంది. సింగారించుకుని తైతక్కలాడడానికి బయలుదేరుతుంది" అని దెప్పిపొడిచేది. అంతేకాదు అణువద కాలేజికి వెళ్ళాక పాప కోసం పెట్టుకున్న ఆయా దగ్గర్నుంచి కాస్త పచ్చడి లంచం పెట్టి కాళ్ళు పట్టించుకునేది. పసి పాప ఏడుస్తున్నా వినిపించుకునేది కాదు. ఒకసారి అణువేద కాలేజి నించి వచ్చేసరికి పాప ఏడుస్తుంటే భరించలేక అత్తగార్ని, "అయాని వేరే పనులకి పిలవద్దని" మందలించింది.
అక్కడితో ఆవిడ ఘోల్లుమని ఏడుస్తూ "ఈ యింట్లో నాకు పనిమనిషితో పని చేయించుకునే పాటి దిక్కు కూడా లేదన్నమాట మా ఆస్తి పాస్తులన్ని హారతి కర్పూరంలా కరిగించేసింది. ఇప్పుడు నన్ను ముష్టి ముండలా చూస్తోంది." అని ఆ వీధివిధంతకి వినబడేలా నానాగొడవ చేసింది. పనిపాటా లేని కొందరు యింటికి కొచ్చి ఆవిడ కధంతా విని పరామర్శించి వెళ్లారు కూడా.

 Previous Page Next Page