Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 9


    
    " మరి నేవెళతా" అంది అమె.


    అమె వెళ్ళబోయేందుకు అతనికి ఏదో ప్లాష్ అయినట్టు ముఖం వెలిగింది. " ఒక్కమాట" అన్నాడు.


    అమె ఆగి ఏంటయ్యా?" అని అడిగింది.


    "రేపు పది గంటలకి రోడ్డులో వుంటే మా మామిడితోటకు  ఓసారి వస్తావా? నీతో పనుంది" అన్నాడు.


    "నాతోనా?" అమె అశ్చర్యపోతూ అడిగింది.


    "అ" అన్నాడు సురేష్ వర్మ.


    అమె ఆలోచనలో పడింది. పని ఏమిటని అమె అడగలేదు. రేపు పదిగంటలకల్లా తెలిసిపోయే విషయానికి ఇప్పట్నుంచే ఎందుకు ఏదేదో వూహించుకోవడం?" అందుకే పనేమిటని రెట్టించకుండా "అట్లానే" అంది.


    "అరవయ్యేళ్ళ వయసుకదా ఈ మధ్య చూపు మందగిస్తోంది" అంటూ తిన్నె పట్టుకుని దిగింది.


    శశిరేఖ తిరిగి ఇంటికి వెళ్ళేవరకు అక్కడేవుండి ఆ తరువాత ఇంటికి చేరుకున్నాడు. మరుసటిరోజు ఉదయం ఠంచనుగా పదిగంటలకల్లా మామిడితోటకు వెళ్ళాడు. ఓ చెట్టుకింద రెండు కుర్చీలు వేయించాడు.


    చింతామణి కోసం వెయిట్ చేస్తూ ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు. అయినా చదువుమీద దృష్టిపోవడంలేదు. అలా లేచి తోటంతా తిరిగి వచ్చేటప్పటికి చింతామణి కనపడింది. అమెను చూడగానే అతనికి గుండెంతా తెలియని భయం, జంకూ అవరించాయి.


    అమె అతన్ని చూడగానే లేచి నిలబడింది.


    "ఫరవాలేదు కూర్చో" అని తన కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు.


    చింతామణి ఓపికగా వింటోంది తప్ప విషయం ఏమిటో అడగడం లేదు. చివరికి అతను తెగించాడు " నువ్వు నాకో సాయం చెయ్యాలి" అన్నాడు ఉపోద్గాతంగా.


    "సహాయమా? నీలాంటివారికి నేను చేసే సాయం ఏముంటుంది?" అమెకు అర్దం కాలేదు.


    "నువ్వు చేయాలి. నువ్వే చేయగలవు" అని ఓ క్షణం ఆగి " ఎప్పుడో బతుకుతెరువుకోసం చేసిన పనిని ఇప్పుడు నాకోసం చెయ్యాలి" అని చెప్పి అమె యాక్షన్ కోసం చూస్తుండిపోయాడు సురేష్ వర్మ.


    అమెకి కొద్దిగా అర్ధమౌతోంది. అయితే అతను బయటపడితేనే మంచిదనుకుంది. అమె అతనివైపు చూస్తోంది.


    "అది మధ్యవర్తిత్వం" అని చెప్పి తల తిప్పుకున్నాడు.


    ఇప్పుడు తేటగా అర్దమైంది. అమెకి. తను  ఓ జంటను కలపాలి. కానీ ఈ వయసులో ఎప్పుడో వదిలేసిన వృత్తిని తిరిగి  చెపట్టాలా? తనకు దేనికి ఢోకాలేదు. ఇతను ఊరికంతా డబ్బున్న  అసామి కావచ్చుగాక. ఏ అడపిల్లమీదో మనసు పెట్టి వుండవచ్చుగాక. తను ముందుండి ఆ ఇద్దర్ని కలపాల్సిన అగత్యం తనకు లేదు. అందుకే కుదరదని చెప్పేయ్యాలి.


    ఆ ఒక్క క్షణంలోనే అమె నిర్ణయం తీసుకుంది.


    అతను తెలివైనవాడు. బాగా చదువుకున్నవాడు. ముఖ్యంగా సైకాలజి. అందుకే అమె ముఖంలో కలిగిన మార్పుల్ని మాటల్లోకి మార్చుకోగలిగాడు.


    "నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్లీజ్!" అని బ్రతిమలాడుతున్నాడు.


    అమె షాక్ తింది. తన నిర్ణయం చెప్పకముందే అతను ఎలా కనిపెట్టేశాడు?


    "అది కాదు...." అమె ఏదో చెప్పబోతుంటే అడ్డు తగులుతూ "నిజమే- నువ్వు చెప్పే విషయాన్ని దేన్నీ నేను కాదనను. కాని అమెపట్ల కలిగిన  ఇష్టం అంత బలమైంది. అమె లేని రోజున నేను ఏమైపోతానో తెలియదు. పిచ్చి పట్టడం అనేది కనీసం జరిగే పని. మరి నన్ను పిచ్చివాడి కింద మారిపోమ్మంటావో వద్దో చెప్పు"


    అతను గొంతులోని వణుకు చూసి అమె తగ్గింది.


    "ఈ పనికి నువ్వు ఒప్పుకుంటే నేనెంత ఇస్తానో తెలుసా? ఈ మామిడితోటలో రెండెకరాలు . అంటే నగదు రూపంలో చెప్పాలంటే రెండు లక్షలు. అక్షరాలా రెండు లక్షల రూపాయలు. అయితే ఈ సొమ్ముతో నిన్ను ఒప్పించాలని కాదు. అమెపట్ల నేనెంత మోహం పెంచుకున్నానో నీకు చెప్పడం కోసం రెండెకరాల రాసిచ్చేస్తాను . సరేనా? సరేనను." అతను తొందరపెట్టాడు.


    అమె వెంటనే ఏమీ చెప్పలేకపోయింది. అతను అమెను ఎంతగా కోరుకుంటున్నాడో అర్థమౌతోంది. తనకు చేతనైన సాయం చేయాలి. అంతేకదా. లోలోపల అంతరాత్మ వద్దంటున్నా చివరికి ఒప్పుకుంది.


    "నేను ఒప్పుకుంటోంది నువ్విచ్చే రెండెకరాల కోసం కాదు. అమె మీదున్న నీ ప్రేమ చూసి. ఆ రెండెకరాలూ తీసుకుంటాను. అయితే నా కోసం కాదు. మనది రైల్వే జంక్షన్ దగ్దరున్న వూరు. ఎంతోమంది స్త్రీలు- భర్తతో పోట్లాడి. ఇంట్లో వాళ్ళమీద తిరగబడి మగవాడికోక నీతి, అడదానికొక నీతి చెప్పే సంఘాన్ని ఎదిరించి ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తుంటారు. తరువాత తమ మజిలీ ఏమిటో నింపాదిగా ఆలోచించడానికి ఎవరూ ఓ రెండు రోజుల అశ్రయం కూడా ఇవ్వరు. అలాంటి అశ్రయం ఇవ్వడం కోసం నువ్విచ్చే రెండెకరాల్లో అనాథ మహిళా సదన్ ను ప్రారంభిస్తాను. స్థలం కుదిరితే మిగిలిన వాటికోసం మళ్ళీ ఏదో ప్రయత్నం చేయవచ్చు"


    అతను అమె ఒప్పుకున్నదానికి తప్ప మిగిలినదానికి ప్రత్యేకించిన ఇంపార్టెన్స్ ఏమీ యివ్వలేదు. కాని ఓ అమ్మాయిని కుదిర్చేందుకు ఓ మగాడు ఇస్తున్న రెండెకరాల్లో అనాథ మహిళ సదన్ కోసం కేటాయిస్తున్న అమెను చూస్తుంటే ఎనలేని గౌరవం కలిగింది.


    "మరినే వస్తాను. అయితే నేను చేయగలిగింది  ఒక్కటే" అంటూ లేచింది చింతామణి.


    అది ఏమైవుంటుందోనన్న అలోచనలో పడ్డ అతను ఏమిటని అడగలేడు.


    అమె చెప్పింది "కురుక్షేత్రంలో కృష్ణుడు యుద్దం చేయలేదు. కేవలం రథం మాత్రమే నడిపాడు. నేనూ అంతే. మద్యవర్తిత్వం అంటే చీటీలు మోయడం కాదు. రహస్య ప్రదేశాలు చూసిపెట్టడం కాదు. ఇలాంటివి చేసేవాళ్ళను మధ్యవర్తులని గౌరవంగా పిలవరు. హంసరాయ.బారులని గొప్పగా పొగడరు. దానికి మరేదో పేరుంది. నేనలా కాదు. ఇదిగో ఇలాంటి సంబందం పెట్టుకోవడం అన్నది నీతోనే మొదలుకాలేదు. నీతోనే అఖరువదు. అంటూ అమెలో వున్న భయాన్ని పోగొడతానంతే. మిగిలినదంతా నీ ఇష్టమే."


    "అంతే చాలు. " చింతామణి గొప్ప ఏమిటో అతనికి తెలుసు. ఆ మేరకు చేయడమంటే చాలా ఎక్కువే. చింతామణి ఎఫెక్ట్ అంత గాఢంగా వుంటుంది మరి. అతను తలూపాడు. అమె వెళ్ళబోయింది.


    "రేపే రెండెకరాలు అనాథ మహిళసదన్ పేరుమీద రిజిష్టర్ చేయిస్తాను" అన్నాడు.


    పనయ్యాక కదా- ఇంకా మొదలేపెట్టలేదు" అంది అమె అంత తొందరెందుకన్నట్టు చూస్తు.


    "నువ్వొప్పుకున్నావంటేనే పని అయిపోయినట్టు లెక్క. నాకు తెలుసు.... నువ్వెంత ప్రతిభావంతురాలివో నాకు తెలియదా? రేపే పత్రాలిచ్చేస్తాను. అవును... అమ్మాయి ఎవరో అడగనేలేదు"


    " ఆ మాత్రం ఊహించలేకపోతే నేను చింతామణినే కాదయ్యా.... శశిరేఖ" అని నవ్వింది.

 

                                                                *        *        *

 Previous Page Next Page