వేసవికాలం సాయంకాలాలు బావుంటాయి. అంతవరకు ఎండతో వుడికిపోయిన ప్రపంచం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. అద్దం ముక్కలాగా నీలం అకాశం మెరుస్తుంటుంది.
చెట్లు గాలిని మేస్తున్నట్టు కదులుతుంటాయి. అప్పటివరకు ఇళ్ళల్లో బిగుసుకుపోయిన జనం వీధుల్లోకి ప్రవహించడం మొదలుపెడతారు.
ఎలాగయినా ప్రసాదం పెట్టే సమయానికి దేవాలయం దగ్గిరికి వెళితే శశిరేఖను చూడొచ్చని అతనికి తెలుసు. బాబు వుంటే ఇబ్బందిగా వుంటుందని అతన్ని పంపించేశాడు.
ఆ సాయంకాలం వేళ అమెనే తలుచుకుంటూ అటూ ఇటూ నడవటం మొదలుపెట్టాడు.
సినిమా పాటలైపోయి భజన ప్రారంభమైంది.
ఒకరి గొంతులు మరొకరి గొంతులతో కలపక భజన ఛండాలంగా వుంది. ఈ భజనకంటే ఆ సినిమా పాటలే కాస్తంత నయమనిపిస్తోంది.
మరో గంటకు భజన ముగిసింది.
ఆరోజు ఉభయదాత వెంకటరెడ్డి హూంకరించి రాబట్టి ఆ మాత్రమైన భజన జరిగుంటుంది. లేదంటే అదీలేదని తెలుసు సురేష్ కి.
భజన అయిపోవడంతో తొందరగా మిద్దెపైనుంచి దిగాడు. షర్ట్ వేసుకును బయలుదేరాడు
అప్పటికే కొందరు అరుబయట నిద్రపోతున్నారు. ఎండాకాలం కాబట్టి మొత్తం వీధంతా బెడ్ రూమ్. ఆకాశంలో చందమామ బెడ్ లైట్. అతను దేవాలయం దగ్గర్లోవున్న చిన్నస్వామి ఇంటి ముందున్న గోడదగ్గర నిలబడ్డాడు.
చిన్నస్వామి ఇల్లు చాలా పెద్దది.
ముందుభాగంలో విశాలమైన వరండా.దానికి ఇరువైపులా పూర్వం కూర్చోవడానికి కట్టే పెద్ద అరుగులున్నాయి.
ఆ అరుగుల్లో తూర్పువైపు ఉన్నది దేవాలయం. వెనక ఉంటుంది. అక్కడ నిలబడితే దేవాలయం ముందున్నవాళ్ళు మనకి స్ఫష్టంగా కనిపిస్తారుగానీ వాళ్ళకి మనం అంత స్పష్టంగా కనిపించం. ఆ ఉద్ధేశ్యంతోనే అతను అక్కడ నిలబడ్డాడు.
భజన అయిపోవడంతో గంధం పంచే కార్యక్రమం సాగుతోంది. దేవుడికి ప్రసాదంతోపాటు గంధం కూడా పంచుతారు. దాన్ని వచ్చిన వాళ్ళకంతా పంచుతారు.
అందులో కొంత రాసుకుని మిగిలినదాన్ని పక్కవాళ్ళకి పూసి ఆట పట్టిస్తుంటారు కొందరు.
జనం రావడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరూ వచ్చి గుంపులో చేరి ప్రసాదం కోసం చూస్తున్నారు.
వెంకటరెడ్డి హడావుడి పడిపోతున్నాడు.
"హారతయ్యాక ముందు మర్యాదలు పంపు...." అని లోపలున్న వాళ్ళకి హెచ్చరించాడు. ఆ ఊళ్ళో మొత్తం ముగ్గురికి దేవుడి హారతి తరువాత ప్రత్యేకంగా పళ్ళాలతో ప్రసాదాన్ని ఇళ్ళకు పంపుతారు.
అందులో ఒక కుటుంబం సురేష్ వర్మది.
రెండోది ఆ ఊళ్ళో గతంలో జమిందారుగా వున్న వెంకటరెడ్డిది. మూడవది ఓ కరణాల కుటుంబం.
సురేష్ తన చేతుల్లోని గంధాన్ని అలానే వుంచుకున్నాడు. గుప్పెటను ఎంత మూస్తే అంత సువాసన పైకి లేస్తోంది.
"ఏమిటయ్యా గంధం అలా అరచేతిలో పెట్టుకున్నావ్? నీకు నచ్చిన వాళ్ళు లేరనా? లేదూ ఇంకా రాలేదనా?" అన్న మాటలు వినిపించాయి.
అతను ఎవరిని పక్కకి తిరిగాడు. చింతామణి నవ్వుతోంది. పళ్ళు కనపడని అమె నోరు అచ్చం గంధం అయిపోయిన గిన్నెలా వుంది.
సురేష్ వర్మ ఏమీ మాట్లాడలేదు. చింతామణిలాంటి తెలివయిన దాని దగ్గర మౌనమే మంచిది. అందులోనూ ఇలాంటి విషయాల్లో చింతామణి ఘటికురాలన్న పేరుంది. ప్రేయసీ ప్రియుల్ని కలపడంలో అమె చాలా అందెవేసిన చేయి. అమెది బాల్యవివాహం. అమెకు ఊహ తెలిసేసరికి భర్త సన్యాసుల్లో కలిసిపోయాడు.
అప్పట్నుంచి ఒంటరి జీవితం. కొన్నాళ్ళకు బతుకు మరీ దుర్భరమైపోయింది. ఆ సమయంలోనే మధ్యవర్తిత్వం నెరపేది. చింతామణి టాకిల్ చేసిందంటే విడిగా వున్నవాళ్ళు జంటలైపోవాల్సిందే.
"నా దృష్టిలో ఏదీ అక్రమసంబంధం కాదు. మనసుపడి చేసేది ఏదైనా సక్రమమే. మనసులేకుండా భర్తతో కాపురం చేసినా అది అక్రమ సంబందం. కిందకి వస్తుంది. అందుకే ఇష్టంవుండీ కలవలేనివాళ్ళను సహాయం చేసేదాన్ని. నా దృష్టిలో ఏ ఇద్దరి పరిస్ధితులూ ఒకటివిగా వుండవు. కాబట్టే ఒకర్ని విమర్శించే హక్కు ఇతరులకు వుండదు" ఇదీ చింతామణి తత్వం. అప్పట్లో ఎందరో జంటల్ని కలిపిన పేరుంది అమెకు.
"అప్పుడు నేనున్న దరిద్రం అలాంటిది. ఒక లీటర్ కిరసనాయిల్ కోసం కూడా జంటల్ని కలిపిన సంధర్భాలున్నాయి. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. అందుకే అలాంటి వాటికి పుల్ స్ఠాప్ పెట్టేశాను" చింతామణిని ఏవరయినా పాతజీవితాన్ని గుర్తుచేస్తే చెప్పేదది.
అవన్నీ నిజమే. అప్పుడెప్పుడో అలా తను మద్యవర్తిత్వం చేసేది. గాని చాలా ఏళ్ళుగా అలాంటివి మానేసింది. అప్పట్లో ఎన్నో బాధలుపడి కొంత డబ్బు పోగెయ్యగలిగింది. దాన్ని వడ్డీకి తిప్పుకుంటుంది. అదీ ధర్మ వడ్డీ నూటికి నెలకు రూపాయి.
ఎవరికి ఏ కష్టమొచ్చినా తన చేతనయిన సాయం చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడంలో చింతామణిలో సమవుజ్జీగా నిలిచేది. ఆ ఊళ్ళో ఎవరయినా వున్నారంటే అది గంగారత్నమే! అమెకీ చింతామణి వయసే వుంటుంది.
"అదిగో... వస్తోంది చూడు నీ సుందరి" అంది తల అటువైపు తిప్పుతూ.
అమె తలతిప్పిన వైపుకి అతను తన చూపును నిలబెట్టాడు.
శశిరేఖ మరో యిద్దరితో కలిసి వస్తోంది. చుట్టూ మానవకాంతలే కాదు. గంధర్వస్త్రీలు, అప్సరసలు, ప్రబంధనాయికలుగా వున్నా అమె అంటే ప్రత్యేకంగా కనబడుతుందనిపిస్తోంది.
అమె బావిదగ్గరే ఆగిపోయింది.
అక్కడేదో అదృశ్యరేఖ ఉన్నట్టు, అది తను దాటరాదన్నట్టు ఆ వెళ్ళినవైపు చూస్తూ నవ్వుతోంది.
అక్కడికి బార్ లైట్ షేడ్ మాత్రం వెళ్ళడంవల్ల అమె ఆ వెలుగుల్లో పాలరాతి దేవాలయంలో వున్న రాగిదీపపు స్ధంభంలా వుంది. అందులోని వత్తి వెలుగుతున్నట్టు అమె పెదవులమీద చిరునవ్వు కనబడుతోంది.
వెన్నెల బ్యాక్ డ్రాప్ లో బావిగట్టున అమె నిలబడి వుండటం, అమె వెనక బావికున్న గిలక నిశ్చలంగా కనబడటం- అదేదో తైలవర్ణచిత్రంలా వుందే తప్ప కనబడుతున్న దృశ్యంలా లేదు. అతను అమెను అలాంటి తన్మయత్వంలోనే కన్నార్పకుండా చూస్తున్నాడు.
అతను ఆ లోకంలో లేడని గుర్తించిన చింతామణి తన ఉనికిని తెలియజేయడానికన్నట్టు పొడిగా దగ్గింది.
అతను ఉలి్క్కిపడ్డట్టు కదిలాడు.