ఉదయం ఎనిమిదైంది. నరేంద్ర హడావుడిగా తయారువుతున్నాడు. ఆరోజు అతని జీవితం మరో కొత్త మలుపు తిరగబోతోంది. మరిమాటలా! ఎనిమిదికోట్ల రూపాయలు కాంట్రక్ట్. తగిలిందంటే జాక్ పాట్ తగిలినట్టే.
అతని హడావుడి కనిపెట్టే శశిరేఖ అన్నిట్ని చకచకా అమరుస్తోంది. అమె తెలివైనది. కాపురం వచ్చిన కొన్నాళ్ళకే భర్త మూడ్స్ అంతా గ్రహించగలిగింది.
అయన ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలాంటి టెంపర్ మెంట్ ప్రదర్శిస్తాడో తెలసుకుంది.
సాధారణంగా చాలామంది జంటల్లో ఇది అరుదు. సంవత్సరాలు సంవత్సారాలు కాపురం చేసినా ఒకరి ఇష్టాలు కూడా మరొకరికి తెలిసి వుండవు. చాలామంది దృష్టిలో కలిసి నిష్కామకర్మ చేయడం తప్ప అంత రంగంలో చోటు సంపాదించరని అనుకోరు. అందుకే భార్యభర్తల్లో బెడ్ ను పంచుకోవడం తప్ప బావావేశాల్ని పంచుకోవడమంటూ వుండదు.
కాని శశిరేఖ మాత్రం అలాకాదు. తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తోంది. మానసికంగా అతనితో ఎంత సాన్నిహిత్యంగా వుండడానికి ప్రయత్నిస్తుందో భార్యగా అతనికి ఎప్పుడు ఏం కావాలో అవి అమరుస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, చాలామంది కోరుకున్నట్టు మనసెరిగి ప్రవర్తిస్తుంది.
ఇప్పుడు అయన హడావుడిగా ఎక్కడికో బయల్దేరుతున్నాడని తెలుస్తూనే అన్నీట్ని సమకూరుస్తోంది.
అతను స్నానం చేసి వచ్చేటప్పటికి టిఫిన్ రెడీగా వుంది. టిఫిన్ అయ్యాక బట్టలు వేసుకున్నాడు.
తల దువ్వుకుంటూ భార్యను పిలిచాడా..."శశీ- శశీ"
అమె వచ్చింది.
"ఎలా వున్నాను. ఈ డ్రెస్ లో. జోడియాక్ షర్ట్. పీటర్ ఇంగ్లండ్ ప్యాంట్- ఈ ఊర్లోనే ఏమిటి మొత్తం మా కాంట్రాక్టర్లలో కూడా మన లాగా డ్రెస్ లు వేసుకునేవాడు లేడు. ఏమంటావ్? ఈ పల్లెటూర్లో కాస్ట్ లీ డ్రెస్ లు వేసుకునేది మనమే కదా" అంటూ మరోమారు తృప్తిగా తనను అద్దంలో చూసుకున్నాడు నరేంద్ర
అంతా విన్నాక "ఎస్ .డి" అని నవ్వుతోంది.
అతను చిరుకోపంతో అమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని అమె దొరక్కుండా మంచం అవతలి వైపుకు వెళ్ళి నిలబడింది.
ఎస్.డి. అంటే సెల్ఫ్ డబ్బా. నరేంద్ర ఎప్పుడైనా గొప్పలు చెప్పుకుంటుంటే శశిరేఖ అతన్ని ఎస్.డి. అంటూ ఏడిపిస్తూ వుంటుంది.
పెళ్ళయ్యాక అలా గొప్పలు చెప్పుకోవడం తగ్గించుకున్నాడు. కాని అంతకుముందైతే ఆ గుణం వివరీతంగా వుండేది. అసలు ఆ గుణం వుండటంవల్లే అతను ఆ స్ధాయికి ఎదిగాడు. అతని దృష్టిలో అదో పెద్ద విజయగాథ. అది నిజమే. అతనికి సంబంధించినంతవరకు అది విజయగాథే.