"......"
"కొంతమంది కొన్ని భంగిమల్లోనే బావుంటారు. మీరు స్తబ్దంగా వున్నా సీరియస్ గా వున్నా బావుంటారు. నాదో కోరిక. మీరు నవ్వుతూ వున్నప్పుడు చూడాలని."
ఆతన్ని చాచిపెట్టి చెంపకాయ కొట్టాలనిపించింది. అక్కడ్నుంచి లేచి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. కాని ఎందుకో... ఎక్కడో బలహీనత. ఏమీ చెయ్యలేక అలాగే కూర్చుండిపోయింది.
"కోపమొచ్చిందా?" అన్నాడతను చనువుగా అడుగుతున్నట్లు...
చిన్మయి ముఖం ప్రక్కకి త్రిప్పుకుంటే "కొంతమంది అందాన్ని ఆస్వాదించాలంటే ఎదురుగా వుండే చూడక్కరలేదు. ఇలా సైడ్ నుంచి చూస్తుంటే మీ అందం ఇంకా యినుమడించినట్లుగా కనబడుతోంది."
చిన్మయి లేచి నిలబడి అటువైపు తెరిచివున్న కిటికీ దగ్గరకెళ్ళి పెరట్లోని మొక్కలకేసి చూస్తూ నిలబడింది.
"బ్యూటిఫుల్" అని వినిపించింది.
గుండె పగిలినట్లయింది. తల త్రిప్పకుండా కదలకుండా అలానే నిలబడింది.
"మీరలా నిలబడి వుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఈ చేతులతో తనివి తీరా మిమ్మల్ని అందుకోవాలనిపిస్తోంది" అతని గొంతు చాలా దగ్గర్నుంచి వినబడినట్లయింది. కొంపతీసి తనని.... సర్రున వెనక్కి తిరిగింది.
అదే సమయానికి మంజుభార్గవి ట్రేలో కాఫీకప్పుతో గదిలోకి అడుగుపెట్టింది. చిన్మయి మొహం కందిపోయి వుండటం గమనించింది. బయటకేమీ వ్యాఖ్యానించలేదు.
"తీసుకోండి" అంది దగ్గరకొచ్చి.
చిన్మయికి అక్కడ్నుంచి ఏ క్షణాన పారిపోదామా అనివుంది. కాని అర్ధం లేని సంస్కారమేదో అడ్డువస్తోంది మౌనంగా కప్పు అందుకుంది.
"అలా వున్నారేం చిన్మయిగారూ వంట్లో బాగాలేదా?"
"బాగానే వుంది."
"మా రజనీ ఏమైనా బోర్ వేశాడా? అతను కొంచెం చనువు తీసుకుంటూ వుంటాడులెండి. అరమరికలేమీ వుండవతనికి."
చిన్మయి కాఫీ సగంవరకూ త్రాగి టీపాయ్ మీద పెట్టేసింది.
"ఇంటికెవరో వస్తానన్నారు. గుర్తొచ్చింది" అంటూ ఆమె సమాధానంకోసం ఎదురుచూడకుండా విసురుగా బయటకెళ్ళిపోయింది.
"పాపం యింట్లో ఏమీ తోచక వచ్చినట్లుంది. హఠాత్తుగా వెళ్ళిపోయింది."
"ఏమీ చెయ్యలేదు. ఆమె అందాన్ని పొగిడాను సంతోషిస్తుందని."
"నీ నోరు వూరుకోదని తెలుసులే. ఆమె అందాన్ని పొగిడావా? అంత బాగా నచ్చిందా?"
"కొంత నచ్చబట్టే అనుకో. ఆ అమ్మాయిలో ఏదో ఆకర్షణ వుంది."
"ఏముంది ఆ అమ్మాయిలో? నాలోకన్నా ఆకర్షణలు, అందచందాలూ వున్నాయా?"
"నీ అందాలూ, ఆకర్షణలూ వేరు, ఆమెలో వున్నవి వేరు."
"అంటే అవి నాకంటే గొప్పవనా నీ ఉద్దేశం?"
"ఏవీ?"
"అవే. నువ్వు చెబుతున్నావే ఆ అందాలు."
"వేటి ప్రత్యేకత వాటిది."
"అలాగా?" అంటూ ఆమెమొహం ప్రక్కకి త్రిప్పుకుంది. అతను దగ్గరకెళ్ళి చుబుకాన్ని పట్టుకుని మొహం పైకెత్తాడు.
"నీకు జెలసీ లేదని నాకు తెలుసు. ఊరికినే వాదిస్తున్నావు. అవునా?'
ఒక్కక్షణం, ఆ క్షణంలో మంజుభార్గవి గబగబ ఆలోచించుకుంది. అతను తన సొంతంకాదు. తానూ అతని సొంతంకాదు. అతనికీ భార్యవుంది తనకూ భర్త వున్నాడు. ఒకరిమీద ఒకరికి హక్కులు, అధికారాలూ, జెలసీలు యివన్నీ దేనికి? అవన్నీ పెట్టుకుంటే కుదరదు. సాగినన్నాళ్ళు సాగుతుంది. ఆ తర్వాత ఎవరికెవరో... ఈ సెంటిమెంట్సూ, న్యూసెన్సు యిదంతా దేనికి?
మంజుభార్గవి సెకన్లలో మూడ్సు మార్చుకోవటం, లోలోపల ఏయే మంటలూ, సెగలు వున్నా పైకి తేలిగ్గా నవ్వేయటం అభ్యాసం చేసుకుంది.
అతని రెండుభుజాలమీద చేతులు వేసి నవ్వేసింది.
"ఐ లైక్ యూ రజని."
"మంజూ! యూ ఆర్ సూపర్బ్" ముందుకు వంగి ఆమె పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు.
4
ఆ సాయంత్రం నిఖిలేశ్వర్ యింటికొచ్చేసరికి రజనీకాంత్ యింట్లోనే వున్నాడు.
అతన్ని చూడగానే నిఖిలేశ్వర్ మొహం విప్పారగా "ఎంతసేపయింది వచ్చి?" అనడిగాడు.
"ఓ అరగంటయింది."
"గుడ్! యింకా వెళ్ళిపోయావు కాదు. నేనే కబురుచేసి వుండేవాడ్ని."
"ఏమిటంత విశేషం?"
"ఈ వేళ నీ కంపెనీ కావాలనిపించింది. కాఫీ త్రాగావా?"
"కాఫీ, టిఫినూ అన్నీ పూర్తయినాయి."
"గుడ్! కూర్చో స్నానంచేసి వస్తాను" అంటూ నిఖిలేశ్వర్ లోపలకు వెళ్ళాడు.
మంజుభార్గవి కిచెన్ లో వుంది.
"ఓయ్! ఈవేళ రజనీకాంత్ తో పార్టీ వుంది. చిప్సూ, కాజూలన్నీ రెడీ చేసెయ్యి" అంటూ అటూ ఇటూ చూసి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. మంజుభార్గవి స్వీట్ గా కిస్ రిసీవ్ చేసుకుంది.
రజనీకాంత్, నిఖిలేశ్వర్ కాసేపట్లో పార్టీలో లీనమైపోయారు.
"నేను చాలా ఫ్యామిలీస్ చూశాను. భార్యాభర్తల్లో ఒకరంటే ఒకరికి పడడు. ఎడతెగకుండా మిస్ అండర్ స్టాండింగ్ నాకూ, మంజుభార్గవికి మధ్య అలాంటి పొరలేం లేవు. నేను చాలా అదృష్టవంతుడయిన హజ్బెండ్ ను" అన్నాడు నిఖిలేశ్వర్.