Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 8


    
    "ఆమె అలా రాక్షసిలా ప్రవర్తించటానికి కారణమేమై వుంటుంది?"    

    "ఇతరుల్ని బాధపెట్టి దానితాలూకు దుష్ఫలితాలు అనుభవించకపోతే కొంతమందికి తోచదేమో!"
    
    "నాకు అతన్ని చూస్తే జాలేస్తోంది" అంది చిన్మయి.
    
    రాజీవ్ ఏమీ మాట్లాడేలేదు. మౌనంగా ఆలోచిస్తున్నట్లు వూరుకున్నాడు.
    
    "అసలు ఆమె అలా రాక్షసిలా ప్రవర్తించవలసిన అవసరమేమొచ్చింది? కొంచెమో గొప్పో భర్తలో లోపాలున్నా సర్దుకుపోవాలి. అంతేకాని..."
    
    అతను ఆమెవైపు తిరిగాడు. బెడ్ లైట్ వెలుగులో కొద్దిగా తడిసిన ఆమె కళ్ళు మిలమిలలాడుతూ కనిపించాయి.
    
    "ఒకవేళ నాలో అలాంటి లోపాలేమైనా వుంటే నువ్వు సర్దుకుపోతావా?"
    
    "మీలో అలాంటి లోపాలు ఎన్నటికీ వుండవు."
    
    "ఒకవేళ వుంటే?"
    
    "ఆ! సర్దుకుపోతాను."
    
    "చిన్మయీ! నువ్వు నన్ను ఎక్కువగా నమ్ముతున్నావనిపిస్తుంది. ప్రొద్దున ఆఫీసుకు వెళ్ళాక సాయంత్రం తిరిగివచ్చేవరకూ నేనేం చేస్తానో ఎక్కడెక్కడ తిరుగుతుంటానో నీకు తెలియదు. ఒక మనిషి ఇంకో మనిషిమీద అంత నమ్మకం వుంచడం మంచిది కాదేమో."
    
    "నమ్మకం వుంచకపోతే ఆనంద కాపురంలాగానే వుంటుంది. చూడండి! మనిషికీ మనిషికీ మధ్య వున్న సంబంధం పూర్తిగా నమ్మకంమీదే ఆధారపడి వుంది. ఆ నమ్మకమే లేకపోతే జీవితం ఒక్క అడుగుకూడా ముందుకు కదలదు. చూడండీ నన్ను కాదని తప్పుచేసే శక్తి మీలోలేదు. ఎందుకంటే నా ప్రేమతో మిమ్మల్ని అటూ ఇటూ కదల్లేనంతగా బంధించాను కాబట్టి."
    
    ఆమె కళ్ళలోని నిశ్చలత్వం, నిజాయితీ, నమ్మకం అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి.
    
    "చిన్మయీ!" అంటూ ఆమెను తమకంగా దగ్గరకు తీసుకున్నాడు.
    
                                                              * * *
    
    మంజుభార్గవి చిన్మయిని వాళ్ళింటికి ఎప్పుడూ రమ్మని బలవంతం చేస్తూ వుండేది. ఏవేవో సాకులు చెప్పి చిన్మయి వాయిదాలు వేస్తూ వుండేది. ఓ మధ్యాహ్నం చిన్మయికి యింట్లో ఏమీ తోచలేదు. భర్త అనురాగమెంత వున్నా ఇంట్లో కాలక్షేపానికి అనేక సౌకర్యాలు వున్నా ఆమె అప్పుడప్పుడూ ఈ వంటరితనం ఫీలవుతూనే వుండేది. ఈ వంటరితనం ఎందుకు వెంటపడి తరుముతున్నదో ఆమెకర్ధమయ్యేదికాదు. తనకన్నీ వున్నాయి. ప్రేమించే, తనంటే ప్రాణంపెట్టే భర్త వున్నాడు. అతనికి తగిన ఆదాయముంది. సుఖబెట్టటానికి ఏమైనా ఇచ్చే ఔదార్యముంది. అయినా అప్పుడప్పుడు ఈ అసంతృప్తి ఎందుకు వేధిస్తున్నదో అర్ధమయ్యేదికాదు. ఆరోజూ ఎంత నిద్ర పెంచుకుందామన్నా ఇంట్లో వుండటం దుస్సహంగా అనిపించింది. ఇహ ఇంట్లో వుండలేక మంజుభార్గవి ఇంటికి వెళ్ళింది.
    
    తలుపులు లోన గడియ వేసి వున్నాయి. బజర్ నొక్కింది.
    
    ఒక్క నిముషం లోపల్నుంచి ఏ విధమైన రెస్పాన్సు రాలేదు.
    
    నిద్రపోయి వున్నదేమో డిస్టర్బ్ చేస్తున్నట్లుగా వుంటుందేమో అని క్షణంపాటు సంకోచించింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనుకుంటూ ఇంకోసారి ప్రయత్నిద్దామని అనుకుని బజర్ నొక్కింది.
    
    ఒక్కక్షణం గడిచాక లోపల అలికిడి వినిపించింది. బహుశా నిద్రపోతూ వుండి, లేచి వస్తోంది అనుకుంది.    
    
    తలుపులు తెరవబడ్డాయి.
    
    మంజుభార్గవి అవతల నిలబడి వుంది. "మీరా?" అంది.
    
    చిన్మయి ఆమెమొహంలోకి చూసింది. నిద్రపోయినట్లు లేదు కాని కళ్ళలో ఓ రకం మత్తు వుంది. జుట్టురేగివుంది. చెంపలూ, పెదిమలూ నలిగినట్టు కనిపించాయి. అప్రయత్నంగా ఆమెదృష్టి క్రిందకు మళ్ళింది. పమిట ప్రక్కకు తొలగివుంది. జాకెట్ హుక్స్ వూడివున్నాయి.
    
    ఏమిటోగా అనిపించి "వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా" అనుకుంది.
    
    మంజుభార్గవి తొట్రుపాటు పడలేదు. చిన్మయివంక నవ్వుతూ చూచి "రండి" అన్నది చాలా ఆప్యాయంగా.
    
    చిన్మయి సంకోచంగానే లోపలికడుగు పెట్టింది. గదిలోకి వెడుతూనే వాతావరణమదో మాదిరిగా వున్నట్లనిపించింది.
    
    "కూచోండి" అంది మంజుభార్గవి జాకెట్ హుక్స్ పెట్టుకుంటూ. పైటమాత్రం ప్రక్కకే తొలగివుంది. ఆమెకెప్పుడోగాని పైట వుండవలసిన స్థానంలో వుండదు. వారపోయిన వాది లేచినట్లు ప్రక్కకే తొలగివుంటుంది.
    
    చిన్మయి సోఫాలో కూచుంటూ ప్రక్కకి చూసింది. బెడ్ రూం తలుపులు తీసే వున్నాయి. లోపల మంచంమీద ఎవరో పురుషుడు పడుకుని వున్నట్లు కనిపించాడు.
    
    "అయ్యో! మీవారు ఇంట్లోనే వున్నట్లున్నారు. వెడతాను" అని చిన్మయి లేవబోయింది.
    
    "మావారు కాదండీ, రజనీకాంత్. ఆయన మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. మా ఇంట్లో ఒక మెంబర్ లాగా వుంటారు. పైన షర్ట్ లేదు."
    
    "చిన్మయిగారా? బావున్నారా?" అంటూ ఆమెకెదురుగా కూర్చున్నాడు. అతని వాలకం చూస్తోంటే ఎక్కడా భయపడుతున్నట్లు కాని గిల్టీగా ఫీలవుతున్నట్లు గాని అనిపించటంలేదు.
    
    చిన్మయికి ముళ్ళమీద కూచున్నట్లుగా వుంది. భర్త యింట్లో లేనప్పుడు పరపురుషుడు వచ్చి మంచంమీద పడుకుని వుండటం...తలుపు తీసినప్పుడున్న మంజుభార్గవి ముఖం గుర్తొచ్చింది.
    
    మౌనంగా కూర్చుంది.
    
    "కాఫీ తీసుకొస్తాను" అంటూ మంజుభార్గవి లోపలికెళ్ళింది.
    
    "చెప్పండి" అన్నాడు రజనీకాంత్.
    
    "ఏమిటి?" అన్నట్లు చూసింది.
    
    "మీరు అంత అందంగా ఎందుకుంటారు?"
    
    అలా మాట్లాడతాడని ఊహించలేదు. వళ్ళు గగుర్పొడిచినట్లయింది.
    
    "ఊ?"
    
    అలాగే వుండిపోయింది.
    
    "మీకో గమ్మత్తు చెప్పనా?"

 Previous Page Next Page