Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 10


    "అవునవును మంజుభార్గవిలాంటి భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం. ఒక్కోసారి అందుకే నిన్ను చూస్తే నాకసూయగా వుంటుంది."
    
    "ప్లేట్స్ లో చిప్సు, కాజూ అయిపోయినాయి. లోపలికి వెళ్ళి తీసుకొస్తాను" అంటూ నిఖిలేశ్వర్ లేవబోయాడు.
    
    "నో నో! నువ్వు కూర్చో నేను తీసుకొస్తాను" నాటో రజనీకంత్ ఖాళీ ప్లేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు.
    
    "రజనీకాంత్ ది చాలా బ్రాడ్ మైండ్. ఇది తన ఇల్లుకాదనీ, ముడుచుకు కూర్చోవాలనీ, యిలాంటి పిచ్చి పిచ్చి వూహలు లేవు" అనుకున్నాడు నిఖిలేశ్వర్ అతన్ని గురించి ప్రేమగా.
    
    కిచెన్ లో మంజుభార్గవి గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడి పెనంమీద ఆమ్లెట్లు వేస్తోంది. రజనీకాంత్ ఖాళీప్లేట్ తో లోపలకు రాగానే అతనివంక తలత్రిప్పి చూసి నవ్వింది.
    
    ప్లేటు స్టవ్ ప్రక్కన వున్న పొడవాటి పాలిష్ డ్ స్టోన్ మీద పెట్టి, చెయ్యి ఆమె తలమీదికి పోనిచ్చి దగ్గరకు లాక్కుని పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు.
    
    "నిఖిలేశ్వర్ చాలా మంచివాడు. నిన్ను చాలా మెచ్చుకుంటున్నాడు" అన్నాడు.
    
    "ఆయనకి నామీద పిచ్చి పిచ్చి అనుమానాలేమీ లేవు. అందుకే ఆయన్ని చూస్తే నాకు చాలా ప్రేమ" అంది మంజుభార్గవి.
    
                                            5
    
    చిన్మయికి రాత్రి నిద్రపట్టడం లేదు. వళ్ళంతా కంపరంగా వుంది. మంజుభార్గవి యింటినుండి వచ్చాక రెండుసార్లు స్నానం చేసింది. ఆ సాయంత్రం భర్త ఆఫీసునుంచి వచ్చాక తలెత్తి మొహంలోకి చూడలేకపోయింది. ఏదో తప్పు చేసినట్లు ఫీలయిపోతోంది. మళ్ళీ అంతలోనే ఆత్మవిమర్శ చేసుకుంటుంది. తానేమి తప్పు చేసిందని, ఏమి మలినపడిందని మధన పడాలి? మళ్ళీ  అంతలోనే యింకో ఆలోచన వచ్చింది. ఒక స్త్రీ తప్పు చెయ్యకపోవచ్చు. కాని జరిగింది జరిగినట్లు ప్రతి సంఘటనా భార్తఃకు చెప్పటంవల్ల ప్రయోజనంకన్నా అనర్ధాలే ఎక్కువ వస్తాయి. రోడ్డుమీద నడుస్తోంటే ఎవరో కావాలని రాసుకుంటూ నడుస్తారు. పొరపాటున జరిగినట్లు వెయ్యరానిచోట్ల చెయ్యి వేస్తాడు. ఆడది కంటికి నదరుగా కనబడితే వెకిలి కళలేవో చేస్తాడు. కన్ను కొడతాడు. ఏదో తుంటరిమాట అంటాడు. ఇవన్నీ భర్తలకు చెప్పుకుంటూ పోతే ప్రతిరోజూ ఏదో ఒకటి చెప్పాల్సి వస్తూ వుంటుంది. దీనివల్ల మొగవాళ్ళ మనసులు అనవసరంగా బాధపడటం కన్నా సాధించేదేమీ వుండదు. పైపెచ్చు భార్యలమీద లేనిపోని అనుమానాలు మొదలవుతాయి. ఒక మొగవాడి శరీరం తమవంటికి తగిలితే, వాడిచూపులు వికటంగా తమ అవయవాలమీద ప్రసరించబడితే, తమని చూసి యికిలిస్తూ వెధవమాట ఏదో అంటే దులిపేసుకుంటే పోతుంది. అంత మాత్రాన ఆడది అమంగళమైపోయినట్లు కాదు, ఇవన్నీ చిన్న సంఘటనలు సహజమైనవిగా భావించాలి. లేకపోతే ఆడది అడుగు ముందుకు వెయ్యలేదు.
    
    చిన్మయి అప్రయత్నంగా తనలో ఎదగసాగింది.
    
    రాజీవ్ కు ఓ రాత్రివేళ మెలకువ వచ్చి ఆమెవైపు చూశాడు.
    
    "చిన్మయీ! నిద్రపోవటంలేదా?" అనడిగాడు.
    
    "ఇప్పుడే మెలకువ వచ్చిందండి" అని అబద్దం చెప్పింది.
    
    ఆమెవైపు పూర్తిగా తిరిగి దగ్గరకు లాక్కున్నాడు.
    
    ఆ తరువాత వరుసగా జరుగుతున్న అనేక సంఘటనలు చిన్మయిని కలవర పరచసాగాయి. భవానీపతిరావు పెద్దమ్మాయి ఎవరితోనో తిరుగు తున్నట్లు తండ్రికి తెలిసింది. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ, జరదా కిళ్ళీలు నములుతూ పూలరంగడిలా కనిపించే భవానీపతిరావు రౌద్రరూపం దాల్చాడు. కూతుర్ని పట్టుకుని చావచితకకొట్టాడు. రెండు మూడురోజులు గదిలో పెట్టి తాళం వేశాడు. నాలుగోరోజు ఎలా తప్పించుకుందో - ఇంట్లోంచి బయటపడి ఆ ప్రేమించిన అబ్బాయితో లేచిపోయింది. భవానీపతిరావు అయిదారు రోజుల దాకా తలెత్తుకుని తిరగలేనట్లు ఇంట్లోనే తలకి గుడ్డకట్టుకొని పడుకుని ఆ తరువాత యధాప్రకారం తన రొటీన్ ప్రకారం తిరగసాగాడు. "ఇప్పటికైనా కళ్ళు తెరవబడి, రెండోదానికైనా వెంటనే సంబంధం చూసి పెళ్ళి చెయ్యండ"ని భార్య మొత్తుకుంది. "నోర్ముయ్! నాకు తెలుసా? నీకు తెలుసా? నాకు చెప్పేటంత దానివయ్యావా? ఏదెలా జరగాలో అదలా జరుగుతుంది. లేచిపోవాలని దానిఖర్మలో రాసివుంటే లేచిపొమ్మను. పీడా విరగడయిపోతుంది" అని అరిచి బయటకు వెళ్ళిపోయి ఆ రాత్రి యింకా ఆలస్యంగా వచ్చాడు.
    
    ప్రక్కవీధిలో భుజంగరావుగారి పదహారేళ్ళ కూతురు ఉన్నట్లుండి కిరసనాయిల్ తో అంటించుకుని చచ్చిపోయింది. ఇరుగు పొరుగు ఆ చావు గురించి రకరకాలుగా చెప్పుకున్నారు. ఎవరినో ప్రేమించిందనీ, ఆ ప్రేమను యింట్లో తల్లిదండ్రులు ఇష్టపడలేదనీ, ఆమె అతనితో తిరగటం శృతిమించి రాగాన పడిందని, సంగతి తల్లిదండ్రులకు తెలిస్తే చంపేస్తారని ఆత్మహత్య చేసుకున్నదని...
    
    ఇటుప్రక్క వీధిలో కొడుకు చచ్చిపోతే తండ్రి కోడలితో సంబంధం పెట్టుకున్నాడని...
    
    చిన్మయి చెవులు హోరెత్తిపోతున్నాయి.
    
    ఎంతో పవిత్రంగా, ఆదర్శంతో జీవించాలనుకుంటున్న ఆమె హృదయంలో యిలాంటి వార్తలు విని రోజు రోజుకు అలజడి పెరిగిపోతోంది.
    
    "ఒక స్త్రీ ఎందుకు తప్పు చేస్తుంది?" అనడిగింది భర్తను ఒకరోజు.
    
    "ప్రస్తుతం నడుస్తున్న సమాజం పోకడను బట్టి."
    
    "అంటే? సమాజం యింత క్రూరంగా వుండటం కొత్తేమీ కాదు. కాని మితిమీరిన స్వేచ్చాప్రియత్వం, జీవితాన్ని ఈజీగా తీసుకోవడం, సెంటిమెంట్సంటే అవహేళన, ఒకరి జీవితాల్లోకి యింకొకరం ఏదో హక్కున్నట్లు ఎన్ క్రోచ్ మెంట్, అన్నింటికన్నా ముఖ్యం పరిస్థితుల ప్రాబల్యం."
    
    "పరిస్థితుల ప్రాబల్యం అంటే?"
    
    "ఎక్కువగా పరిస్థితుల ఒత్తిడికి లొంగిపోయే స్త్రీ తప్పుచేస్తూ వుంటుంది. వయసు వచ్చినా, వయసు మీరిపోతున్నా తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చెయ్యలేకపోవటం, ఇతరుల పై పై మెరుగులు చూసి అప్రయత్నంగా ప్రలోభంలో పడిపోవటం, ఆర్ధిక పరిస్థితులు..."
    
    "ఆర్ధిక పరిస్థితులు స్త్రీతో అంతపని చేయిస్తాయా?"
    
    "తప్పకుండా స్త్రీ తప్పు చేయడానికి కారణం ఎక్కువగా ఆర్ధిక పరిస్థిధులే హఠాత్తుగా భర్త చనిపోతాడు. బంధువులెవరూ ఆమెను ఆదుకునేస్థితిలో వుండరు. చాలీచాలని జీతంతో ఏ చిన్న ఉద్యోగమో చేయవలసి వస్తుంది. అక్కడినుంచి తోటి ఉద్యోగులో, పై ఆఫీసరో చొరవ తీసుకుంటారు. ఇందాక చెప్పిన ఎన్ క్రోచ్ మెంట్ మొదలవుతుంది. ఏ స్త్రీకూడా మొదట యిష్టంతో లొంగిపోదు. ప్రతిఘటించడానికే ప్రయత్నిస్తుంది. ఎంతకాలం ప్రతిఘటిస్తుంది? ఏదో ఓ క్షణాన బెదిరింపులకు లొంగిపోయో, ఉద్యోగం పోతుందని భయంవేసో, క్రమంగా పెరిగిన బలహీనత వల్లో, విసుగెత్తో, ఏంచేయాలో తెలియక, చివరకు తనను తానే అర్పించుకుంటుంది. ఆ అర్పణ మొదట బాధ కలిగిస్తుంది. తరువాత అలవాటుగా మారిపోతుంది."

 Previous Page Next Page