"చూస్తున్నాను."
అలా జరుగుతుందని ఆమె ఊహించలేదు. చప్పున ముందుకు వంగి ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె బుగ్గమీద అతని చల్లని పెదవులు ఉలిక్కిపడి దూరంగా జరిగింది.
"కోపమొచ్చిందా?" అడిగాడు ధర్మేంద్ర మెల్లిగా.
"లేదులే!" "ఊఁ..."
"లోపలికి వెళదాం" అంటూ వినూత్న అతని జవాబుకోసం ఎదురు చూడకుండా మూసి ఉన్న బాల్కనీ తలుపు తెరుచుకుని హాల్లోకి వెళ్ళిపోయింది.
* * *
రాజాచంద్ర రిక్షాలో ఇంటికి రావడం చూసి "కారేమయింది" అని అడిగింది విశారద.
"ఓ ఫ్రెండు అర్జెంటుపని ఉందని చెప్పి తీసుకెళ్ళాడు పాపం!"
"ఫ్రెండుకి కారిచ్చి మీరు రిక్షాలో వచ్చారన్న మాట ఏమిటిట ఆ అర్జంటు పని?"
"అదే! ఏదో చెప్పాడు. కొడుకు పెళ్ళిచూపులకో ఎక్కడికో వెళ్లాలని."
విశారద చివాట్లు పెడుతుందని ముందే తెలిసినట్లు, తప్పు చేసినట్లుగా సోఫాలో మెదలకుండా కూర్చున్నాడు.
ఆమె లోపలి నుంచి కాఫీ తీసుకొచ్చి అందించింది.
"మీరు మరీ అంత మెతకయితే ఎలాగండీ! మనసులో ఇష్టం లేకపోయినా, ఎదుటివాళ్ళు అబద్దం చెబుతున్నారని తెలిసినా, మోసం చేస్తున్నారని తెలిసినా వారి మాటలకూ లొంగిపోతుంతారు మీ అలుసు కనిపెట్టి ఆపద వచ్చిందని చెప్పి మీ దగ్గర ఎంతోమంది డబ్బులు 'గుంజుతూ ఉంటారు. వాళ్ళలో ఒక్కరయినా తిరిగి ఇచ్చారా? కనీసం వాళ్ళని మీరెప్పుడయినా అడగనన్నా అడిగేరా?"
రాజాచంద్ర ఏమీ మాట్లాడలేదు. జరుగుతున్న వాటికి అతనూ బాధపడుతూ ఉంటాడు. బాధపడకుండా ఉండలేడు. బాధపడుతూనే, వద్దనుకుంటూనే చివరకు చేసేస్తూ ఉంటాడు.
"పిల్లలు కూడా మీకిష్టంలేని పనులనేకం చేస్తూ ఉంటే మనసులో బాధ పడుతూ, కుమిలిపోతూ ఉంటారు కానీ బయటకు మాత్రం ఏమీ అనరు. మీ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా మీరెప్పుడూ నడుచుకుని ఉండరు. ఇంకో స్మగాతి చెప్పనా? మీకు నేను కష్టం కలగజేస్తూ ఉంది ఉండవచ్చు. అయినా మీరు నన్నెప్పుడూ కోప్పడలేదు."
"నువ్వు నాకెప్పుడూ కష్టం కలుగజెయ్యలేదు."
"అలా అనకండి. మీలో ఉన్న మంచితనం కొద్దీ అలా అంటున్నారు."
"లేదు నిజంగా నీ వల్ల నాకు నొప్పి కలిగిన సందర్భం ఒక్కటి కూడా లేదు.
"నిజంగానా?"
"నా జీవితంలో నేను గర్వపడే నిజం."
"ఒకవేళ నేను మీకు బాధ కలిగించే పనేదయినా చేస్తే ఏం చేస్తారు?"
"నువ్వు చెయ్యలేవు."
"ఒకవేళ చేస్తే?"
"నువ్వు చెయ్యలేవు"
"ఒక స్త్రీ మీద అంత నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదేమో! మాలో అనేక బలహీనతలు, వ్యామోహాలు ఉంటాయి."
అతను కాఫీ కప్పు కింద పెట్టి ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి దగ్గరకు లాక్కుని అన్నాడు. "నువ్వు స్త్రీవి కావు. దేవతవు. అందుకని నువ్వు చెప్పిన బలహీనతలు, వ్యామోహాలు నీలో ఉండవు."
* * *
అర్ధనారీశ్వరరావు రెండో కూతురు దేవీప్రియ అద్దంముందు నిలబడి అందం.... పోనీ తన అందాలు చూసుకుంటుంది ఆమెకు అందంగా అలంకరించుకోవటమన్నా మిగతా స్టూడెంట్స్ లాగా నవ్వుతూ, కేరుతూ మాట్లాడాలన్నా ఎంతో ఇష్టం కానీ తండ్రి చంపేస్తాడన్న భయంకొద్దీ ఆ కోరికలన్నీ అణచుకుంటోంది. వినూత్న స్టయిలన్నా, ఆమె మాటలన్నా దేవీప్రియకెంతో ఇష్టం. కానీ ఆ అమ్మాయితో మాట్లాడటం తన తండ్రికి అసలు ఇష్టం ఉండదు. ఒకసారి ఆ అమ్మాయే పలకరిస్తే తాను జవాబు చెప్పింది. అది తండ్రి కళ్ళబడింది. 'ఇంకోసారి ఎప్పుడయినా ఆ అమ్మాయితో మాట్లాడినట్లు తెలిసిందంటే చంపేస్తా"నని వార్నింగిచ్చాడు.
ఆమె జీవితంలోని కోరికలు ఉప్పొంగుతున్నాయి. వినూత్నలాగా మేక్సీలు వేసుకుని స్టయిలుగా నడవాలి. బాయ్ ఫ్రెండ్స్ తో తిరగాలి. పిక్ నిక్ లకూ, షికార్లకూ వెళ్ళాలి.
తనలో గొప్ప అందముందని ఆమె నమ్మకం. ఆ అందాన్ని ఇతరులు మెచ్చుకోవాలని ఆరాటం. ఆమె ఫ్రెండ్స్ కి తరచూ ఎక్కడెక్కడి నుంచో ప్రేమలేఖలు వస్తుంటాయి. అలా, తనకు కూడా ప్రేమలేఖలు వచ్చి జీవితం ధన్యం కావాలన్న తపన.
ఎవరో బయటనుంచి తలుపు కొట్టారు. దేవీప్రియ గుండె గబగబా కొట్టుకుంది.
"ఎవరూ?" అంది వణికే గొంతుకతో.
"తలుపులు గడియ పెట్టుకుని ఏం చేస్తున్నావే" బయటినుంచి తల్లి అడుగుతోంది.
"పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కదూ! డిస్ట్రబెన్సు ఉండకూడదని తలుపు లేసుకొని చదువుకుంటున్నానమ్మా!"
తల్లితో మాట్లాడుతూనే గబాగబా ఇంతవరకూ చేసుకొన్న అలంకరణ తీసేస్తోంది.
"అయితే మాత్రం? అలా తలుపులేసుకొని లోపల ఒక్కరే ఉండటం నాన్నగారికి ఇష్టం ఉండదు."
"నాన్నగారు"- పదం వింటేనే గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. తల్లిగాని, అన్నయ్యలుగాని ఆ అడుగులచప్పుడు వింటేనే హడలిపోతూ ఉంటారు.
"వచ్చేస్తున్నానమ్మా ఈ పేజీ... అంటూనే గబాగబా బట్టలు మార్చేసుకుంటుంది.