Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 8


     ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క జట్టుగా విడిపోతున్నారు.
    
    'హాయ్, 'యురేకా,' అబ్బోసి', 'ఐసీ', 'యునో అని పదేపదే ప్రతిధ్వనించే పదాలు.
    
    అయినదానికీ కానిదానికీ గట్టిగా నవ్వటం, ప్రతిదీ జోక్ అనుకుని నవ్వులతో రెచ్చిపోవటం, నీరసంగా కళ్ళుపెట్టి పక్కవాళ్ళకు వినిపించీ వినిపించనట్లు మాట్లాడటం.
    
    పక్కవాళ్ళు వినిపించినా, వినిపించనట్లు మొహాలుపెట్టి 'ఊ? మళ్ళీ చెప్పు' అని చూడటం.... ఇలా ముసురుకుంటూన్న మేనరిజమ్స్.
    
    గవాస్కర్ హుందాతనం.
    
    ఇమ్రాన్ ఖాన్ మగసిరి.
    
    మాథ్యూస్ వెకిలివేషాలూ,
    
    బోథమ్ మత్తుమందుల సేవింపూ,
    
    రవిశాస్త్రిలోని ఫైటింగ్ క్రికెట్, అమృతాసింగ్ తో అతని ప్రణయలీలలూ,
    
    బోరిస్ బెకర్ టెన్నిస్ ఆటలోని పనితనం, గ్రాస్ కోర్టులమీద విజ్రుంభణా.
    
    క్లే కోర్టులమీద తప్ప గ్రాస్ కోర్టులమీద రాణించలేని విలాండర్ అసమర్ధతా.
    
    రెండు రకాల కోర్టులలోకూడా స్టడీగా నింపాదిగా, పట్టుదలగా ఆడి ఆల్ అమెరికన్, ఆల్ ఫ్రెంచ్ ఛాంపియన్ షిప్స్ వరుసగా గెల్చుకుంటూ వింబుల్దన్ లో మాత్రం దారుణంగా ఓడిపోతున్న లెండిల్ దురదృష్టం.
    
    ఫుట్ బాల్ వీరుడు మార్టోణా కాళ్ళలోని బలమూ, పి.టి. ఉష పాదాలలోని చురుకుతనం, మాండలిన్ శ్రీనివాస్ వాయిద్యంలోని అద్భుతం, షణ్ముఖ శ్రీనివాస్ ఆల్ రౌండ్ గ్రేట్ నెస్ లోని గ్రేస్, డింపుల్ కపాడియాలోని సెక్స్, శ్రీదేవిలోని యౌవనపు మెరుపులూ, జయప్రదలోని తిరుగులేని బ్యూటీ, అమితాబ్ బచన్ లోని మాస్క్యులెన్ నెస్, కమల్ హాసన్ లోని ఆర్టిస్టిక్ టాలెంట్, బాలసుబ్రహ్మణ్యం గొంతులోని పులకింతలూ, జేసుదాసు గళంలోని విషాదాలూ, నాగార్జున బావుంటాడా, వెంకటేష్ బావుంటాడా, కళ్యాణచక్రవర్తి బావుంటాడా?
    
    యండమూరి సూపర్ రైటరా, మల్లాది సూపర్ రైటరా? ఈ చర్చలూ...
    
    ప్రీతి కిషోర్ ని లవ్ చేస్తోంది తెలుసా? మధుప్రియ ఇంట్లో తెలీకుండా కళాధర్ ని పెళ్ళి చేసుకుని తరువాత ఇంటికొచ్చి డిక్లేర్ చేసింది వినలేదా?
    
    లక్ష్మీప్రియ శోభరాజ్ ని ప్రేమించి కొన్నాళ్ళు వాడితో క్లోజ్ గా మూవ్ అయిందా? ఏం షాక్ తిందో ఏమో... చివరకు పండరినాథ్ ని పెళ్ళి చేసుకుని గొప్పగా కాపురం వెలిగించేస్తోంది 'పతివ్రతలా.'
    
    నవ్వులు.
    
    ఆ నాథ్ కి, అంటే నాథుడికి అంతా తెలిసే చేసుకుంటున్నాడటలే పాపం 'చవటాయ అభ్యుదయ చక్రవర్తి.'
    
    నవ్వులు.
    
    'అన్నట్లు (చాలా మెల్లగా) సుకుమారి హాస్పటల్లో ఎందుకు అడ్మిట్ అయిందో తెలుసా? (ఇంకా మెల్లగా) ఎబార్షన్ చేయించుకుందంట.'
    
    'ఎన్నోది?'
    
    నవ్వులు.
    
    "ఇది విన్నావా? ఉన్నట్లుండి స్రవంతికి దేవుడిమీద  భక్తిపుట్టి  గోపురాలు  తెగ  చుట్టేస్తుందిట."

    "మై  గాడ్! స్రవంతికి భక్తా? అందరూ ముక్తిలోంచి  భక్తిలోకి  వెడితే ఇది భక్తిలోంచి ముక్తిలోకి  వెడుతుందేమో."

    నవ్వులు.

    "ఈ దేవుడిమీద భక్తి జనానికి ఎప్పుడుపోతుందోగాని అప్పుడు అంటే ఆరోజు దేవుడికి ఓ కొబ్బరికాయ కొడతాను..."
    
    నవ్వులు.
    
    "ఆరోజు రావాలంటే కొన్ని యుగాలు వెయిట్ చెయ్యాలి."
    
    "అప్పటికి ప్రపంచమంతా ఆస్తికులుగా అయినా మారతారు. లేకపోతే నాస్తికులుగా అయినా మారతారు."
    
    వినూత్న లేచి నిలబడింది.
    
    "ఏమిటీ? అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఇంకా ఐస్ క్రీం, ఫుడ్డింగ్..."
    
    'వెళ్ళటం లేదు' అని వినూత్న బాల్కనీలోకి వచ్చి నిలబడింది.
    
    చల్లటి గాలి ముఖంమీదకు తియ్యగా సోకింది. బయటి చీకట్లోకి చూస్తూ నిలబడింది.
    
    ఆమె అలా రావటానికి కారణముంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ధర్మేంద్ర ఆమెతో ఒంటరిగా మాట్లాడాలన్నట్లు కనుసైగచేశాడు.
    
    అయిదు నిమిషాల తరువాత ధర్మేంద్ర బాల్కనీలోకి వచ్చాడు.
    
    "దేనికి రమ్మన్నావు?"
    
    "ఒక గమ్మత్తు చెయ్యటానికి."
    
    "గమ్మత్తా? ఏమిటది?"
    
    "ఈవేళ చాలా బాగా ఎంజాయ్ చేశాం కదూ?"
    
    "చాలా గమ్మత్ విషయం చెప్పు."
    
    "చెబుతున్నా" క్రింద అంటూ దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
    
    "క్రింద చీకటిగా ఉందా?"
    
    "ఉంది."
    
    "ఆ చీకట్లో మధ్యమధ్య దీపాల వెలుగుందా?"
    
    "ఉంది."
    
    "పైన ఆకాశముందా?"
    
    "ఉంది."
    
    "ఆకాశంలో నక్షత్రాలున్నాయా?"
    
    "ఉన్నాయి.
    
    "మెరుస్తున్నాయి కదూ?"
    
    "అవును."
    
    "వాటివంక అలాగే చూస్తూ ఉండు."

 Previous Page Next Page