Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 10


    రెండు నిమిషాల్లో తలుపు తీసేసింది. తల్లి ఆమె ముఖంలోకి పరీక్షగా చూసింది ఆమె ఎప్పటి దేవీప్రియలాగానే వుంది.
    
    "హాల్లో కూచుని చదువుకో నేను వంటింట్లో పని చూసుకుంటాను."
    
    "అలాగేనమ్మా."
    
    తల్లి లోపలికెళ్ళిపోయింది.
    
    దేవీప్రియ సోఫాలో కూర్చుని పుస్తకం చేతిలోకి తీసుకుంది. ఆమెకు పాఠాలు చదవడం అంతే మహా తలనొప్పి కాలేజీకి వెళ్ళటమంటే సరదానే కాని, చదువంటే మహావిసుగు.
    
    టేబిల్ మీది ఫోన్ మోగింది. దేవీప్రియ లేచి వెళ్ళి రిసీవర్ చేతిలోకి తీసుకుంది.
    
    "హలో" అంది.
    
    "మీరేనా" అని వినిపించింది. అవతల నుంచి ఓ పురుష కంఠం. ఆ గొంతు ఎందుకో చాలా హాయిగా ఉన్నట్లనిపించింది.
    
    "మీరేనా అంటే?" అంది తడబడుతూ.
    
    "దేవీప్రియేనా?"
    
    "అవును మీరెవరు?"
    
    "మీరంటే ఎంతో ఇష్టపడే ఆరాధకుడిని."
    
    ఆమె శరీరం పులకరించింది. 'తనంటే ఎంతో ఇష్టం ఉన్న ఆరాధకుడు!
    
    "మీరెవరో చెప్పండి."
    
    "చెప్పానుగా! మీ..."
    
    "అదికాదు. పేరు."
    
    "తెలుసుకోవాలని ఉందా?"
    
    "ఉండదా?"
    
    "చెబుతాను సమయమొచ్చినప్పుడు."
    
    "సరే! నన్నెందు కిష్టపడుతున్నారు?"
    
    'మీ అపురూపమైన అందం కళ్ళు చెదరగొట్టే అందాలు."
    
    "అదేమిటి? అందం, అందాలు అని రెండుసార్లు ఉపయోగించారు."
    
    "రెండింటికీ తేడా ఉంది. అందం వేరు, అందాలు వేరు."
    
    "ఏమిటా తేడా?"
    
    "మీరే చెప్పండి."
    
    "ఏమో మరి నాకు తెలీటంలేదు."
    
    అవతల నుంచి నువ్వు "నేనే చెపుతానులెండి. సమయ మొచ్చినప్పుడు."
    
    "ముఖ్యమైనవన్నీ మీరు సమయమొచ్చినప్పుడే చెబుతూంటారా?"
    
    "మీరు బాగా మాట్లాడతారు."
    
    "అవునా!"
    
    "మీ గొంతు కూడా చాలా తియ్యగా ఉంటుంది."
    
    "నిజం?"
    
    "ఒకటి గుర్తు పెట్టుకోండి. మీ గురించి ఏం చెప్పినా నిజమే అనుకోండి."
    
    "ఎందుకని?"
    
    "మీ గురించి అబద్దాలు చెప్పడానికి ఏమీ లేవు కాబట్టి."
    
    "మీరు చాలా బాగా మాట్లాడతహరు."
    
    "అవును."
    
    "మీలాగే నేనూ అబద్దం చెప్పను."
    
    వంటింట్లో అలికిడయింది. "అమ్మో! అమ్మ వస్తున్నట్లుంది. ఉంటానేం" అనికంగారుగా రిసీవర్ పెట్టేసింది.
    
    "ఎవరే?" అంది తల్లి హాల్లోకి వచ్చి.
    
    "నాన్నగారి కోసమమ్మా లేరని చెప్పాను."
    
    "పేరు కనుక్కోకపోయావా?"
    
    "అడిగే లోపల పెట్టేశారమ్మా."
    
    "ఈ ఫోన్ చేసేవాళ్ళంతే సరిగ్గా జవాబు చెప్పరు" అని జోగాంబగారు మళ్ళీ లోపలికెళ్ళిపోయింది.
    
    దేవీప్రియ మళ్ళీ సోఫాలోకి వెళ్ళి కూర్చుని చేతిలోకి పుస్తకం తీసుకుంది. మనసంతా గిలిగింతలుగా, పులకింతలుగా రంగురంగుల ఊహల్లోకి తేలిపోతోంది.
    
                                           * * *


    రాత్రి  పది గంటలవేళ, రాజాచంద్ర  అతని ప్రెండ్ జగదీష్ ఇంట్లో పార్టీ  తీసుకుంటున్నాడు. సాధారణంగా అతనేప్పుడోగాని  డ్రింక్ చెయ్యడు. చేసినా ఒకటి, రెండు  పెగ్గులకంటే ఎక్కువ తీసుకోడు.

 

    రాజాచంద్ర, జగదీష్ ఇద్దరే ఉన్నారు రూమ్ లో.

 

    విశాలమైన టీపాయ్ మీద డ్రింక్స్ ఉన్న గ్లసులతోబాటు, ఐస్ క్యూబ్స్  ఉన్న  జగ్, కాజూ, చిప్స్ వగైరాలన్నీ ఉన్నాయి.
    
    జగదీష్ అప్పటికి నాలుగో పెగ్గులో ఉన్నాడు. అతనికీ ఇంచుమించు రాజాచంద్ర వయసే ఉంటుంది.
    
    రాజాచంద్ర వాల్ క్లాక్ వంక చూసి "అమ్మో! అన్నాడు.
    
    "ఏమిటి?"
    
    "చాలా రాత్రయింది."
    
    "అయితే ఏమిటి?"
    
    "ఇంట్లో నా వైఫ్ వెయిట్ చేస్తూ  ఉంటుంది నిద్రపోకుండా."
    
    "భోజనం చెయ్యకుండా కూడానా?"
    
    "నేను ఆలస్యంగా వస్తానని చెప్పకపోతే భోజనం కూడా చెయ్యదు."
    
    "అలా ఉంటే నీకు ఇబ్బందిగా ఉండదూ?"
    
    "ఇబ్బందా? దేనికి?"
    
    "నువ్వు చేసే ప్రతి పనికీ ఒక వ్యక్తికి సంజాయిషీ ఇచ్చుకుంటూ పోవాలంటే- నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఏం తింటున్నావో, ఎవరెవరితో మాట్లాడుతున్నావో- అన్నీ విడమరిచి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలంటే, ఆమె అక్కడ ఎదురుచూస్తూ ఉంటుందని నువ్విక్కడ ఆరాటపడిపోతూ ఉంటే, యమచరలో ఉన్నట్లు అనిపించటం లేదా?"

 Previous Page Next Page