ఆ కొలతలకి వజ్ర భస్మాన్ని పూతగా వేశాడు.
తను అనుకున్న రూపం వచ్చినందుకు ఆనందించాడు బ్రహ్మ.
ఆ అద్బుత ఆకారాన్ని చూసి సరస్వతి చాలా సంతోషించింది. ఎట్టకేలకు ఆ బొమ్మకి ప్రాణం పోశాడు బ్రాహ్మ.
ఈ సంఘటన జరిగి బ్రహ్మకాలం ప్రకారం ఇరవై ఏండ్లయింది.
* * *
ఏలూరు సి.ఆర్. రెడ్డి కాలేజీ ఆవరణ.
రంగు రంగుల దీపాలతో అలంకరించిన బృందావన్ గార్డెన్ లా వుంది.
వింత వింత పూలతో తీర్చిదిద్దిన పెళ్లిపందిరిలా వుంది.
ఎటు చూస్తే అటు విద్యార్ధుల కోలాహలం.... జోకులు... నవ్వులు..... పిచ్చి పిచ్చి చేష్టలు..... పులకరింతలు..... కలవరింతలు..... వెక్కిరింతలు..... హాయ్..... హాయ్ పలకరింపులు.
సరిగ్గా ఆ సమయంలో ఆగింది ఎస్కార్ట్ ఫోర్డ్ కారు.
ఆటోమేటిగ్గా డ్రైవింగ్ సీట్ డోర్ తెరుచుకుంది.
అందరూ నిశ్చేష్టులై ఆ కారు వైపే చూస్తున్నారు. దీనిక్కారణం ఆ కారులోని అమ్మాయే!
ఆ అమ్మాయి వెన్నెలతో చేసిన సన్నజాతి తీగలా వుంది.
గంధపు పరిమళాలు, చందనం, కుంకుమ పువ్వుల సోయగాలు, వజ్రభస్మపు వింత దేహకాంతి.....
పగటిపూట మెరుస్తున్న తటిల్లతలా వుందా అమ్మాయి.
లేత నీలిరంగు కుర్తా, పైజామాలో రోషనారిలో వుంది ఆ అమ్మాయి.
గాగుల్స్ సర్దుకుని, ముఖంమీద పడుతున్న జుట్టుని సుతారంగా వెనక్కి తోసుకుని నలువైపులా చూసింది స్టయిల్ గా.
"ఐ యామ్ ఫస్ట్..... ఐయామ్ ఫస్ట్" అంటూ కుర్రాళ్ళ గుంపులోంచి ఒకడు ముందుకెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు- తనని తాను పరిచయం చేసుకోడానికి.
"ఆ కారు- ఆ గేరు, ఆ ఠీవీ- ఆ టోటల్ స్ట్రక్చరు, వగైరాలన్నీ చూశావా? అట్లాస్ సైకిల్, మారుతీ కారు వ్యవహారం కూడా కాదు..... మెజాయిక్ వ్యవహారం కూడా కాదు...... మెజాయిక్ వ్యవహారం కూడా కాదు..... గోల్డెన్ బిల్డింగ్ లో పుట్టిన ప్లాటినమ్ స్పూన్..... కోటీశ్వరుల బేబీని, కోటీశ్వరుల కొడుకులకే వదిలేద్దాం.... మనబోటిగాళ్ళకు ఆర్ట్ సినిమాల్లోని అర్చనా, షబానా అజ్మీలు చాల్లే!" ఒక కుర్రాడు పెదవి విరుస్తూ అన్నాడు.
"ట్రై అండ్ ట్రై అండ్ ట్రై..... అన్నారు. సాధనం, సాహసం వుంటేనే బిల్ క్లింటన్ కూతురైనా, బిర్లా కూతురైనా ప్రేమలో పడుతుంది" ఇంకొకడు లాజిగ్గా అన్నాడు.
"ఆ సుష్మాఫ్రాంక్లిన్, నికితా కేడియా, స్నేహాటిక్కూ వీళ్ళందరినీ చూశావుగా? బిట్విన్ హ్యూమన్ బీయింగ్ అండ్ లవ్.....దేర్ మస్ట్ బీ..... మనీ డీలింగ్..... మనీ మేక్స్ హనీ థింగ్స్..... యూనో....." ఇంకొకడు అన్నాడు.
సరిగ్గా అదే సమయంలో సర్రుమని సైకిల్ మీద అక్కడకొచ్చిన మధు చేతులు ఆటోమేటిగ్గా బ్రేకుల మీద పడ్డాయి.
చెప్పా చెయ్యకుండా ఇంద్రధనుస్సు భూమ్మీదకు దిగిపోయి రంగుల్ని అద్దుకుంటున్నట్లు కనిపించిన....
ఆ అమ్మాయి వైపు దిగ్భ్రాంతిగా చూడసాగాడు.
ఆ అమ్మాయి గబుక్కున ముందుకొచ్చి-
"ఐ యామ్ అన్విత!" అని మధు కళ్ళవంక సూటిగా చూసింది. ఆ కనుచూపుల తాకిడి, గ్రాఫిక్ వర్క్ లా సర్రుమని ముందుకు సాగి మెరుపులా ఢీకొంది మధుకిరణ్ ను.
"ఐ..... ఐయామ్....." ఏదో చెప్పబోయాడు మధుకిరణ్.
అప్పటికే పక్కగుంపు దగ్గరకు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయి-
"హౌ ఆర్యూ మై ఫ్రెండ్స్.....క్లాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదా? ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెండ్ దెన్ బీటింగ్ అండ్ చిట్ ఛాటింగ్" అంటూ అందర్నీ విష్ చేసుకుంటూ ముందుకు వయ్యారంగా వెళ్లిపోయింది అన్విత.
ఒక మలయమారుతం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్లనిపించింది అక్కడున్న అందరికీ.
"టింగ్.... టింగ్- ఆమె నడకను అభినయిస్తూ "వాటే బ్యూటీ!" నోరు వెళ్ళబెట్టాడు వృద్ధునిలా కనబడే రమణ.
ఇరవై నిముషాలు గడిచాయి.
మధు, గుండుబాబు, షాజహాన్ మరికొందరు మిత్రులు తపస్సు చేసుకొంటున్న మునుల్లా అదే చెట్లకింద మాట్లాడుకుంటున్నారు.
గుండుబాబు నిన్నరాత్రి జరిగిన మేడమీద మందుపార్టీ గురించీ, జోకుల గురించీ చెపుతున్నాడు.
షాజహాన్ మాధురీదీక్షిత్ కొత్త సినిమాలో పాట గురించీ, నటన గురించీ ఏమ్. ఎఫ్.హుస్సేన్ లా ఆదరగొట్టేస్తున్నాడు.
మధు అన్విత గురించి ఆలోచిస్తున్నాడు.
ఆమె అందం గురించి ఆశ్చర్యపోతున్నాడు. అందానికే అందంగా అందమయిన అర్థం చెప్పే అన్విత సొగసునీ, సోయగాన్నీ తలుచుకుంటూ దిగ్భ్రాంతికి లోనవుతున్నాడు మధు. తనెన్నో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూశాడు. ఏ సినిమాలోనూ, ఏ హీరోయిన్ ఇంత అందంగా అనిపించలేదు. అన్వితను చూసీ చూడగానే తనలో ఏదో భావ ప్రకంపన చోటు చేసుకుంది.
ఇప్పటివరకూ అతనికి ప్రేమ గురించి స్థిరమైన అభిప్రాయం లేదు. అప్పుడప్పుడు చిన్నప్పటి ఫ్రెండ్ ప్రేమ- చిన్న లంగా, వోణీలతో కనుల ముందు సాక్షాత్కరించినపుడు 'నేను ఆరోజుల్లో ప్రేమను ప్రేమించానా? చిన్నప్పటి ప్రేమలకు విలువెంత?' అని ఆలోచించేవాడు. ఆ తర్వాత ఒక దశాబ్దం తర్వాత తిరిగి ఇప్పుడు ప్రేమకు సంబంధించిన ఆలోచనలు తనలో చోటు చేసుకున్నాయి. ఎందుకిలా జరిగింది? తాన్ చిన్ననాటి స్నేహితురాలు ప్రేమ మళ్ళీ తనకు కన్పిస్తుందా? కనిపిస్తే ఇప్పుడా భావాన్ని తను వ్యక్తం చేయగలడా? ప్రేమకు పెళ్ళయిపోయిందేమో? పిల్లలూ, భర్తతో ఏ డెహ్రాడూన్ లోనే , ఊటీలోనో వుందేమో? ఈ మధ్య ఎందుకో ప్రేమ పదే పదే గుర్తుకు వస్తోంది.
ఎవ్వరూ పోస్ట్ చెయ్యని ఉత్తరం లాంటిది ప్రేమ.
ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది మధుకిరణ్ కి.
"ఏంట్రా..... అంత పరధ్యానం?" షాజహాన్ వచ్చీరాణి తెలుగులో అడిగాడు.
"ప్రేమ గురించి" యధాలాపంగా చెప్పాడు మధు.
"ప్యార్ మొహబ్బత్.....! మొహబ్బత్ లో పడకు రోయ్. పడితే ఫుల్ బాల్లో కాలు మడతపడి కిందపడినట్టే లెఖ్ఖ. తేరుకోలేవు -తేల్చుకోలేవు. కొట్టుకుపోతావ్" అన్నాడతను ఎగతాళిగా.
"అసలు ప్రేమంటే ఎందుకురా నీకు చిన్నచూపు?" అడిగాడు గుండుబాబు అనే బుచ్చిబాబు.
"ఈ ఆడాళ్ళను నమ్మకూడదురా. నేటికాలపు అమ్మాయిల్ని అసలు నమ్మకూడదు. అసలు మన వలలో పడరు. పడినా టోకరా ఇచ్చేస్తారు" అన్నాడు షాజహాన్.
"ఎందుకు టోకరా ఇస్తారు?" ప్రశ్నించాడు మధు.
"నేటి అమ్మాయిల హృదయాల్ని నువ్వు డబ్బుతో కొనాలి తప్ప మనసుతో కొనగలవా?" సీరియస్ గా ప్రశ్నించాడు షాజహాన్.
"అందరూ అలాంటివారే అనుకోవడం. వాళ్ళకి హృదయం లేదని అనుకోవటం పెద్ద పొరపాటు" మరింత సీరియస్ గా అన్నాడు మధుకిరణ్.
"బోడి హృదయం ఎవడికి కావాల్రా! పైసా హై ప్యార్...... ఫర్ ఎగ్జాంపుల్...... ఎస్కార్ట్ ఫోర్టు కారుమీద కొత్తగా కాలేజీకొచ్చిన అన్వితను చూడు. అన్విత బేసిక్ క్యారెక్టర్ ఎలాంటిదై వుంటుంది చెప్పగలవా?" అన్నాడు ధీమాగా బుచ్చిబాబు.
"పెద్ద సైకాలజిస్టు బయలుదేరాడ్రా..... రెండు నిముషాల్లో ఒక ఆడపిల్ల మనస్తత్వం చెప్పెయ్యటానికి. ఆడపిల్ల మనసులో ఏముందో చెప్పడానికి ఆమెను సృష్టించిన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు" వెక్కిరిస్తూ అన్నాడు షాజహాన్.ల్
సరిగ్గా అదే సమయంలో అక్కడకు యింకో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు షాజహాన్ చెప్పడం ప్రారంభించాడు.
"అందాన్ని, అందం ప్రేమిస్తోంది.......
కారుని కారు ప్రేమిస్తుంది....
సింపుల్...... అన్విత నడక దగ్గర నుంచీ చిరునవ్వు వరకూ నువ్వు అన్నింటినీ డబ్బుతోనే కొనాలి. నిన్ను పలకరించాలంటే ఏదో ఒక ఖరీదైన బహుమతి ఇవ్వాలి. నీతో షికారుకి రావాలంటే, నీకో ఒపెల్ అస్ట్రా కారుండాలి.
నీ ఎడం చేతికి రాడో వాచీ వుండాలి. కుడిచేతికి బ్రేస్ లెట్ వుండాలి. మెడలో స్టార్ కేబుల్ మందంలో బంగారపు గొలుసుండాలి. కళ్ళకి రేబాన్ గ్లాసెస్ వుండాలి. నడుంకి ఆస్ట్రేలియన్ లెదర్ బెల్టు వుండాలి. కళ్ళకి కనీసం ఉడ్ ల్యాండ్ షూస్ వుండాలి. కుడిచేతిలో టాటా సెల్యులర్ వుండాలి. ఎడంచేత్తో కోక్ టిన్ పట్టుకోవాలి. బ్యాక్ పాకెట్ లో వుండే లెదర్ వాలెట్ లో ఐదువందల రూపాయాల నోట్లు వుండాలి. క ఎక్కడ తిరిగినా, ఎవరితో తిరిగినా, ఎన్నింటికొచ్చినా. నిలదీసే తల్లిదండ్రులు వుండకూడదు. ఈరోజుల్లో ఇప్పటి ప్రేమను ఈ క్షణంలోనే అనుభించేసెయ్యాలి.
షికారుగా హైద్రాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గరికి తీసుకెళ్తానంటే కుదరదు. ఏ ఊటీకో..... కొడైకెనాల్ కో, ఫ్లెయిట్ లోనో తప్ప రారు.
ఇప్పటి ఆడపిల్లలంతే..... అర్థం చేసుకోవాలి మరి."
కొత్తగా వచ్చిన కుర్రాళ్ళిద్దరూ చప్పట్లు కొట్టారు "వన్స్ మోర్.... వన్స్ మోర్" అంటూ.
అంతకు ముందే అక్కడికి వచ్చిన మధుకిరణ్, ఆ మాటలన్నీ విన్నాడు నిజంగా ప్రపంచం అంతగా మారిపోయిందా....! సూపర్ కంప్యూటర్స్, అణ్వస్త్రాలైనా అర్థమవుతాయేమోగాని, మానవ జీవిత పరిణామ క్రమం అసలు అర్థం కాదు.
అయినా అన్విత అలాంటి మనిషి కాదు. మామూలు ఆడపిల్ల కూడా కాదు. ఆ అందం స్వచ్ఛమైన గులాబీ పరిమళం లాంటిది. ఆ పరిమళం వెనక హృదయం ఇంకా తేటతెల్లనైన లాంటిది. మనసులోనే అనుకున్నాడు మధు.
ఆ విషయం గురించి ఆ క్షణాన్నే బహాటంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలని అతనికి అనిపించింది.
కానీ చెప్పలేకపోతున్నాడు. సంకోచం..... బిడియం..... భయం....... అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా చెప్పలేని పిరికితనం లాంటి సంకోచం.
"వెన్నెల తిరిగొచ్చేస్తోంది....... తిరిగొచ్చేస్తోంది" సర్రున హీరో హోండా మీద అక్కడ కొస్తూ అరిచాడు రవి.
"నువ్వింతసేపూ ఎక్కడికెళ్ళావురా?" అడిగాడు రమణ.
"కామాక్షిని కలుద్దామని క్యాంటీన్ లోకి వెళితే, లాంగ్ షాట్ లో ఈ కొత్తపిల్ల కనబడుగానే, సదరు క్యాండిట్ ను ఫాలో అయి, ప్రిన్సిపాల్ రూమ్ దాకా వెళ్ళి ఫ్యూన్ తో ఇంటర్వ్యూ చేసొచ్చానోచ్" అన్నాడతను- ఆనందోద్వేగంతో.
"ఫ్యూన్ తో ఇంటర్వ్యూ దేనికిరా జెమినీకి?" అడిగాడు షాజహాన్.
"ఒరేయ్! కుర్రకుంకలూ..... కొత్తగా ఒక బిల్డింగ్ ను చూసినప్పుడు రావుగోపాలరావు టైపులో, దాని ఎతైంత, లోతెంత అనే వగయిరాలు ఎంత అవసరమో, కొత్తగా కాలేజీకొచ్చే పాప విషయంలో కూడా వివరాలు, అడ్రస్ లూ అంతే అవసరం. అన్నీ పట్టేశా" హుషారుగా చెప్పాడు.
"ఎవరి జిల్లా...... ఏ తాలూకా!" ఆసక్తిగా అడిగాడు రమణ.
"తల్లీదండ్రీ ఢీల్లీలో వుంటారు. ఇక్కడ నానమ్మ దగ్గరికి చదువుకోవటానికి వచ్చిందట. నాన్నమ్మ ఈ మనవరాలిని వదిలివుండలేదుట. సదరు నానమ్మకు దూరపు చుట్టమట- మన ప్రిన్సిపాల్. వెంటనే సీటిచ్చేశాడు. మన క్లాసే" గబగబా చెప్పాడు రవి ఆయాసాన్ని అణుచుకుంటూ.
"ఇక్కడ ఎక్కడ వుంటుందో" ఆసక్తిగా అడిగాడు షాజహాన్.
"రేపు పోస్టాఫీసులో కనుక్కుందాం" రమణ అలా అనగానే అందరూ పెద్ద పెట్టున నవ్వారు.
సరిగ్గా అదే సమయానికి గాలికి నుదురు మీద నాట్యం చేస్తున్న ముంగురుల్ని అలవోకగా పక్కకి నెట్టుకుంటూ అక్కడికి వచ్చింది అన్విత. మండు వేసవిలో మంచు వర్షం కురిసినట్లనిపించింది అక్కడున్న అందరికీ. ఆమెని చూస్తూనే అందరూ ట్యాంక్ బండ్ విగ్రహాల్లా నిలబడిపోయారే తప్ప, ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా ఇవ్వలేకపోయారు.