"ఏంటీ..... అందరూ అలా అయిపోయారు? కొత్తగా ఆడపిల్ల కనపడగానే, అలా బిగుసుకుపోకూడదు. చూడండి ఫ్రెండ్స్.....మనమందరం క్లాస్ మేట్స్ మే గదా......! అందుచేత బీ ఫ్రీ......" నవ్వుతూ అంది అన్విత.
"అలాగే తల్లీ! బీ ఫ్రీ..... ఒరేయ్..... ఫ్రీరా...." అన్నాడు రమణ పొంగిపోతూ.
"మీకు బాగా మిమిక్రీ వచ్చే..... ఐ లైక్ మిమిక్రీ" అంది నవ్వుతూ అన్విత.
అన్విత నవ్వు బాగుంటుందని మనసులోనే అనుకున్నాడు మధుకిరణ్. అందమైన మనసులేనివాళ్ళు అందంగా నవ్వలేరు.
"చూడండి ఫ్రెండ్స్...... ఆడవాళ్ళ ముందు మగాళ్ళు, మగాళ్ళ ముందు ఆడవాళ్ళు బిడియంగా వుండటం పాత పద్ధతి. ఢిల్లీలో మేం అలా వుండేవాళ్ళం కాదు. సోషల్ మూవింగ్ వుండాలి. నేను మీతో కొన్నాళ్ళపాటు చదువుతాను కాబట్టి, మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా వుండాలి" అంది అన్విత.
"మేం కాదన్నామా? ర్యాగింగ్ చేశామా? కామెంట్స్ చేశామా? ఫ్యామిలీయే..... ఉయార్ ఫ్యామిలీ మెంబర్స్..." అన్నాడు రమణ మహదానందంగా.
"దట్స్ గుడ్! మరి మా ఇంటికి ఎప్పుడొస్తారు?" అడిగిందామె.
"ఎందుకూ?" అడిగాడు షాజహాన్ బిత్తరపోతూ.
"నేను కొత్తగా కాలేజ్ లో చేరానుగా- ఈ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోడానికి" నవ్వుతూ అంది అన్విత.
"పార్టీయా! టీ పార్టీయా! ఇంకో పార్టీయా?" భుజాలెగరేస్తూ అడిగాడు రవి సంతోషంగా.
"ఏ పార్టీ అయితే ఆ పార్టీయే. హాట్ పార్టీని కూడా ఆఫర్ చెయ్యడానికి నేను రెడీ. ఢిల్లీలో, ఇది కామన్. రేపు సండే వస్తారా....." అందరివేపు చూస్తూ అడిగింది అన్విత.
"సండే ఒకేనా?" షాజహాన్ అందరివేపూ చూశాడు.
"రెడీయే....." హుషారుగా అన్నాడు రమణ.
"కాల్వ దగ్గర మేజర్ బిల్డింగ్...... ఎవర్నడిగినా చెప్తారు. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే!" అంటూ హైహీల్స్ చెప్పులు చప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళి కారుడోర్ తెరిచి, డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారుని స్టార్ట్ చేసింది.
మరికొద్ది క్షణాల్లో ఆ కారు సర్రుమని వెనక్కి తిరిగివచ్చి మెయిన్ గేట్లోంచి బైటకు దూసుకుపోయింది.
"రెయిన్ బో డిసప్పియర్డ్" అన్నాడు షాజహాన్ నీరసంగా.
"చూశావా...... ఫాస్ట్ నెస్...." అన్నాడు రవి ఎక్సయిట్ అవుతూ.
"ఏంట్రా..... నువ్విలా...... బుద్ధుని బొమ్మలాగా ఉలక్కుండా, పల్కకుండా ఉండిపోయావ్?" మధును అడిగాడు షాజహాన్.
"ఏం లేదు-" అన్నాడు మధుకిరణ్ ఎక్కడో ఆలోచిస్తూ.
అతని మనసులో ఏదో తనకే తెలియని భావచైతన్యం. సముద్రపు అలలు ఒకదానిని ఇంకొకటి ఢీ కొంటున్న నిశ్శబ్దలయ. అన్విత ఆకారం, మాట, నవ్వు, నడక, ఆ ఠీవీ అన్నీ నచ్చేశాయి మధుకి. తనలో రేగిన భావ చైతన్యానికి ఏ పేరు పెట్టాలి?
'ప్రేమా? ఆకర్షణా?' ప్రేమే అనుకుంటే అది తెలియజేయటం ఎలా?
ప్రేమించడం వేరు- దాని సదరు వ్యక్తి దగ్గర వ్యక్తం చేయడం వేరు. ప్రేమను వ్యక్తం చేస్తే అవతలి వారు కాదంటారేమో అని భయం. తల్లిదండ్రుల్ని ఒప్పించలేమన్న సందేహం- కెరియర్ పాడైపోతుందా? అనే సందిగ్ధత. మధు ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు.
"పదండి...... కాస్సేపు క్యాంటీన్ లో కూర్చుని, మధ్యాహ్నం మ్యాట్నీ షోకి వెళదాం. దిల్ తో పాగల్ హై...." అన్నాడు షాజహాన్.
వాళ్లందరి వెనక నడిచాడు మధు అన్యమనస్కంగా.
* * *
క్యాంటీన్ సర్వరూ, ఒనరూ ఒకటే అయిన డుంబు గాడున్నాడు. ఐరన్ లెగ్ ఆకారంలో వుంటాడు కాబట్టి వాళ్ళందరూ డుంబుగాడని ముద్దు పేరెట్టి పిలుస్తారు.
"ఒరేయ్ డుంబూ, ఆరు చాయ్ గరమ్- గరమ్-" చెప్పాడు రమణ.
వాళ్ళందరి మధ్యలో కూర్చున్నా, తన ఆలోచనల్లో తనున్నాడు మధుకిరణ్.
ప్రేమకు కావాల్సింది 'ధైర్యం-నమ్మకం.'
ఈ రెండూ వుంటే ప్రేమికులు సగం విజయం సాధించినట్లే- అని ఎక్కడో చదివిన విషయం గుర్తుకొచ్చింది మధుకి.
"ఒరేయ్! ఇప్పుడు చెప్పరా- అన్విత మీద నీ ఒపినీయన్ ఏంటో" అడిగాడు రవి, రమణని.
"ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తేనేగానీ చెప్పలేను" అన్నాడు రమణ.
"పోనీ నువ్వు చెప్పగూడదూ-" అడిగాడు బుచ్చిబాబు.
"ఈజీగా లైన్లో పడిపోతుంది. చాలా సింపుల్. రెండు నిముషాల్లో మాటల్తో మనల్ని బోల్తా కొట్టించేసిందంటే ఢిల్లీలో కుర్రాళ్ళను ఎలా తన చుట్టూ తిప్పుకుందో గదా-" ఆలోచిస్తూ అన్నాడు రవి.
ఆ మాట అంటున్న రవివేపు చూసి, అతని ముఖంలో వ్యక్తమవుతున్న భావాలను పసికడుతున్నాడు మధు.
"అదికాదురా రవీ! అన్విత ఒప్పుకుంటే నేను సిన్సియర్ గా లవ్ చేస్తాను" సీరియస్ గా అన్నాడు రమణ.
దానికి పెద్దపెట్టున నవ్వాడు రవి. పొరలు, పొరలుగా పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వాడు.
"ఒరేయ్! పిచ్చి మొఖమా- వెనకటికి నీలాంటి ఒకడు - అమ్మాయ్ నువ్వొప్పుకుంటే నిన్ను రేప్ చేస్తానన్నాట్ట- అన్విత లాంటి ఫాస్ట్ గాళ్స్ కి లవ్ మీద ఇంట్రెస్ట్ వుండదు. ఓన్లీ సెక్స్ - నెల రోజులు పందెం- ఆ అన్వితతో నేను సెక్సువల్ గా గడుపుతాను. ఏమంటారు?" అందరి ముఖల్లోకి చూస్తూ అన్నాడతను.
"అన్విత అలాంటి వాళ్ళని ప్రేమించి, భార్యగా పొందాలేగానీ, సెక్స్ కోసం ఆరాట పడగూడదు. అయినా అన్విత అలాంటిదంటే నాకు నమ్మబుద్ది కావడంలేదు. ఫ్రీగా వున్నంత మాత్రాన, నలుగురితో కలిసి సోషల్‌గా మూవ్ అయినంత మాత్రాన సెక్స్ కోసం వెంపర్లాడి పోతుందను కోవడం అవివేకమే అవుతుంది. అయినా నీ విషయానికే వస్తున్నాను. నెలరోజులు అన్నావుగా- ఈనెల రోజుల్లోనే అన్వితను నీవేపు తిప్పుకోవడానికీ, ప్రేమించడానికి ట్రై చేయి. ప్రేమించడం తప్పుకాదు-" అన్నాడు రమణ.
"ఈ బెట్ ఏదో బావుందే. ఒరేయ్, ఇంకెవరికైనా అన్విత మీద ఒపీనియన్స్ వుంటే - ఇప్పుడే చెప్పేయండి. ఏరా మధూ- వాటెబౌట్ యూ" అడిగాడు బుచ్చిబాబు.
"నన్నొదిలెయ్యండి-" నెమ్మదిగా అన్నాడు మధు.
"వీడికీ, లవ్ కీ, చుక్కెదురులే- చూడండి భయ్యాలూ- మనం కాలేజీకి, శుభ్రంగా చదువుకోవడానికి వచ్చాం. ఇలా లవ్వులూ, గివ్వులూ అని తిరిగడానికి కాదు" అన్నాడు షాజహాన్ సీరియన్ గా.
"నువ్వు నోర్ముయ్. పతివ్రత కబుర్లాడకు. ఆ సుష్మకి లైనేస్తున్నావ్ నువ్వు. అది పడిపోద్దని నీ భ్రమ-" అన్నాడు బుచ్చిబాబు వెటకారంగా.
"ఒరేయ్- బుచ్చి! మగాడు కత్తెరలాంటోడైతే, ఆడది క్లాత్ లాంటిది. ఎక్కడ నుంచి కట్ చేస్తే, ఏ షేప్ వస్తుందో తెలుసుకోవడం ఒక ఆర్ట్. లవ్ కూడా అలాంటిదే. నిజానికి లవ్ మీద నాక్కూడా నమ్మకం లేదు. నేనూ రావిగాడి టైపే. కానీ వాడికి డేరింగూ, డేషింగూ, డబ్బూ వున్నాయి. ఎంతమంది అమ్మాయిలనైనా, వాడు బతిమాలో, బెదిరించో తన దారికి తెచ్చుకోగలడు, ఈ బెట్ బావుంది కానీ- ఉత్తినే బెట్ కడితే మజా లేదురా- నెలరోజుల గడుపు- అన్వితను రవిగాడు- తన బెడ్ మీదకు తెచ్చుకుంటాడు. రమణగాడు సీరియస్ గా ప్రేమిస్తాడు. మీరిద్దరూ అలా చెయ్యలేని పక్షంలో-"
"ఒరేయ్ షాజహాన్...... నువ్వలా రెచ్చగొట్టకు. ఈ రవిగాడు తల్చుకుంటే 'డూ' తప్ప 'డోంట్స్' ఉండవు. నా బెడ్ మీదకు అన్విత రాకపోతే..... అన్విత మరెవరికీ దక్కకూడదు. దక్కదు" ఒక్కసారి రవి ముఖంలో క్రోధం కనిపించింది. ఆడపిల్లల విషయంలో ఆ క్రోధం ఎలాంటిదో, ఆ ముఖమే చెప్తోంది.
ఆ ముఖం చూసి భయపడ్డాడు షాజహాన్.
"గెలిచినా, ఓడినా మంచి డ్రింక్ పార్టీ ఇస్తాన్రా" జోవియల్ గా మామూలుగా అన్నాడు రమణ.
"గుడ్! అదీ స్పిరిటంటే" మెచ్చుకున్నాడు షాజహాన్.
కుర్రాళ్ళందరూ క్యాంటిన్లోంచి బయటికొచ్చి, ఎవరి వెహికల్స్ వాళ్ళెక్కుతున్నారు.
"ఒరేయ్ మధూ! రేపు సాయంత్రం నువ్వు ఐదుగంటలకి నా రూమ్ కొచ్చేయ్. మనం అక్కడ నుంచి అన్విత ఇంటికి వెళ్దాం. ఓ.కె." అన్నాడు రమణ.
మౌనంగా సైకిల్ ఎక్కాడు మధుకిరణ్.
మిగతావాళ్ళ హీరోహోండాలు, బైకుల్ని చూసి తను సైకిల్ వదిలెయ్యాలని ఎప్పుడో అనుకున్నాడు మధు.
తండ్రి వెహికిల్ కి డబ్బిస్తాడా? ఆలోచిస్తూ సైకిల్ తొక్కుతున్నాడు మధుకిరణ్. తన తండ్రి బొచ్చెడు సంపాదించాడు. పొలాలు, బంగారం, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, షేర్స్, ఇళ్ళ స్థలాలు, దొడ్లు.... తన తండ్రికి తనొక్కడే.
అయినా, తనింతకాలం సైకిల్ మీదనే తిరగడం తనకే అసహ్యంగా వుంది. ఎంతో కొంత ధైర్యం చెయ్యకపొతే అన్నింట్లోనూ తను వెనకబడిపోవడం ఖాయం మనసులోనే అనుకున్నాడు మధు.
* * *
మధుకిరణ్, లెక్చరర్ మైదానం నారాయణ ఇంటికొచ్చేసరికి, ఆయన ఎవరో ఇద్దరు వ్యక్తులకు సీరియస్ గా భద్రత గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు వాళ్ళిద్దరూ పల్లెటూరి వ్యక్తుల్లా వున్నారు.
సరిగ్గా అదే సమయంలో లోనికి ఎంటరయ్యాడు మధుకిరణ్.
"మా పాల వాళ్ళులే.... వాళ్ళ ఆవులకు పక్కింటి గేదెలు లైన్లు వేస్తున్నాయని అంటే, చిట్కాలు చెపుతున్నానంతే! ఎప్పుడో కాలేజీ వదిలేశారు...... నీ కోసం లైబ్రరీ, లేబరేటరీ అన్నీ చూసి వస్తున్నాను. భద్రత గురించి నీకేమాత్రం తెల్సుకోవాలని ఉండదోయ్......క్యాంటిన్ లో కూడా వెతికాను. కాలేజీ అంతా చూశాను. నువ్వు కనిపిస్తేనా? ఎక్కడకెళ్ళావ్ ఏంటీ?" అడిగాడు నారాయణ.
చెప్పాడు మధు.
"అప్పుడే తిరుగుళ్ళు మొదలెట్టావా? నేటి కాలంలో ఆడది తిరగాలి. మగాడు ఐదుగంటలకే ఇంటికొచ్చేయాలి అదే రూలు. శుభ్రంగా తిను, శుభ్రంగా చదువుకో, శుభ్రంగా పడుకో. భద్రత చాలా ముఖ్యమయ్యా. మనుషులకే కాదు దేశానికి కూడా భద్రతా లేకుండాపోయింది. మన రాజకీయ నాయకులకు బుద్ధి లేదయ్యా చైనా కొంత, పాకిస్తాన్ కొంత మనదేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటే చవట దద్దమ్మల్లా చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు మరలా పాకిస్థానోడు ఆక్రమించుకోడానికి వస్తుంటే మన రక్షణ మంత్రిగారు వేదాలు వల్లిస్తున్నారు. దేశభక్తిలేని వెధవలు ఎక్కువైపోయారు దేశంలో. అందుకే నేనంటాను - దేనికైనా, ఎవరికైనా భద్రత ముఖ్యమని."
సీరియస్ గా అన్నాడు మైదానం నారాయణ.
"వచ్చావా మధూ! రా కళ్ళు కడుక్కో..... భోంచేద్దూగానీ" అంది మైదానం నారాయణ భార్య లోపల్నుంచి వచ్చి...... భార్య వైపు కోపంగా చూశాడు నారాయణ.
"భర్తని తప్ప, ఇతర మగవాళ్ళని పేరుపెట్టి పిలవకూడదు..... తమ్ముడూ అని పిలువు. నాక్కొంచెం ఆనందంగా వుంటుంది" అనుమానంగా భార్యకేసి చూస్తూ అన్నాడు మైదానం నారాయణ.
"భర్తనే కదండీ పేరు పెట్టి పిలవకూడదు! మిగతావాళ్ళని ఎలాగైనా పిలవొచ్చుకదండీ" అమాయకంగా అందామె.
"చూడు సున్నితాంగీ! పెళ్ళయిన వాళ్ళెవరైనా పిలవచ్చు. నువ్వు పిలవకూడదు. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. చూసు మధూ! నీకు కొన్ని బాధలు, కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి కదా- నా బాధను అర్థం చేసుకో! ఆవిడ పలికినా, పలక్కపోయినా, అక్క అనో, వదిన అనో పిలువు. పిలుస్తావు కదూ?" మైదానం నారాయణ అనుమానవు మనస్తత్వం అర్థమైపోయింది మధుకి.