Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 9

   

     "ఈ రోజు నువ్వు విడుదలవుతున్నావు మిస్ ఏకాంతా....ఇకనుంచైనా నేరాలకి దూరంగా వుంటూ జన జీవన స్రవంతిలో కలిసి మామూలుగా బ్రతకటానికి నువ్వు గట్టిగా కృషిచేయాలి. ఎందుకంటే మనిషి జీవితం అనుభవాల దొంతర లాంటిది కొన్ని మనకి సంతృప్తినిస్తే మరికొన్ని బాధని కలిగిస్తాయి. అలా గతాన్ని మరచి కొత్తజీవితంలోకి అడుగుపెట్టి..."
    
    "సర్..." అర్దోక్తిగా అడిగింది ఆమె "కొత్త జీవితమూ అంటే ఏమిటో చెబుతారా."
    
    తొట్రుపడ్డాడు జైలు సూపరింటెండెంట్ ఇంతకుముందు కూడా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి కంగారుపెట్టిన ఏకాంత వెళ్ళేటప్పుడైనా నిశ్శబ్దంగా వుంటుందీ అనుకుంటే ఇక్కడా యథారీతిని తనను ఎద్ద్దేవా చేయాలని ప్రయత్నిస్తుంది. పక్కనున్న జైలరు ముందు ఇన్సల్టు కావడం ఇష్టంలేనట్టుగా అన్నాడు సూపరింటెండెంట్ "కొత్త జీవితమూ అంటే పాత జీవితాన్ని మరిచిపోవడం"
    
    నవ్వింది ఆమె.
    
    చిరాకనిపించిందేమో "ఎందుకు నవ్వుతున్నావు" అన్నాడు సూపరింటెండెంట్ ఉక్రోషంగా.
    
    "మీరు కరప్టిన్ అని విన్నాను"
    
    ఆమె స్టేట్ మెంట్ కి అంతెత్తున లేచాడాయన "పిచ్చిపిచ్చిగా వాగకు. లంచగొండితనమన్నది మా ఇంటావంటా లేదు. అలాంటివాడ్నే అయితే నేను ఈపాటికి ఓ పది బిల్డింగులు కట్టేవాడ్ని!"
    
    "ఒకవేళ మీరు కరప్టిన్ ఆఫీసరని.... అదే ఏ పాపమూ తెలియని మిమ్మల్ని కరప్టిన్ గా భావించి ప్రభుత్వం డిస్మిస్ చేసిందనుకోండి....ఏం చేస్తారు?"
    
    "కోర్టుకి వెళతాను" టక్కున అన్నాడాయన.
    
    "కోర్టు కూడా ప్రభుత్వ వాదాన్ని సమర్దించి మిమ్మల్ని లంచగొండి అందనుకోండి"
    
    జవాబు చెప్పలేకపోయాడు.
    
    ఆమె అంది మళ్ళీ "ఉద్యోగం పోయిన మీరు గతాన్ని మరిచి కొత్తజీవితంలో ఇమిడిపోగలరా?"
    
    నిశ్శబ్దంగా చూశాడు.
    
    "ఇమడలేరు సర్.... నా జీవితమూ అంతే..." ఆమె గొంతులో బాధ లేదు. "నేను వేశ్యని కాదు వేశ్యనన్నారు. హంతకురాల్ని కాను.... హత్య చేశానన్నారు. నా జీవితాన్ని జైలుపాలుచేసి నాకంటూ వున్న భవిష్యత్తుని నాశనంచేసి వదిలిపెట్టారు. చెప్పండి.... నేను గతాన్ని మరిచి కొత్త జీవితంలో అడుగు పెట్టగలనా... ఎవరన్నా నా గురించి తెలిసీ నన్ను అంగీకరించగలరా" క్షణం ఆగి అంది "మీ దగ్గర జవాబు లేదు సర్... వుండదు. ఎందుకంటే మీరు మాట్లాడేది థియరీ అని మీకూ తెలుసు కాబట్టి ఎక్స్ ట్రీమ్లీ ఇఫ్ ఐ హర్ట్ యూ"
    
    సంతకాలు చేసి తన వస్తువుల్ని తీసుకున్న ఏకాంత చివరగా ద్వారం దగ్గర నిలబడి అనసూయని చూసింది.

    అనసూయ కళ్ళలోని నీళ్ళని చూస్తూ "ఛఛ ఎందుకలా బాధపడతావ్.....నీకన్నా శక్తివంతురాలినై అవసరమైతే తిరిగి రమ్మని ఆశీస్సులందించాలి కాని నేనేదో ఉరికంబానికి వెళుతున్నట్టు ఆ కన్నీళ్ళేమిటి..." అంది మృదువుగా నవ్వుతూ.

    "అదికాదు ఏకాంతా." మళ్ళీ చెప్పే అవకాశం రానట్టుగా చేతులు పట్టుకుంది అనసూయ. "అందమూ, తెలివీ వున్న నువ్వు సుఖంగా పిల్లాపాపల్తో బ్రతికితే చూడాలనుంది".
    
    ఫకాల్న నవ్వింది ఏకాంత. కళ్ళలో నీళ్ళు తిరిగేదాకా నవ్వింది. పిచ్చెక్కిందేమో అని జైలు స్టాఫ్ కంగారుపడేట్టు నవ్వింది.
    
    "ఓ.కె! నువ్వలా జరగాలని దేవుడ్ని ప్రార్ధించు... చూద్దాం... బై."
    
    జైలు గోడలుదాటి బయటి ప్రపంచంలో అడుగుపెట్టింది ఏకాంత మూడేళ్ళ సుదీర్ఘకాలం తర్వాత.
    
                                           *    *    *
    

    నేల వక్షస్థలంపై మెరిసే కాంతిమంజీరాల్లా సూర్యకిరణాలు ఊపిరి పోసుకుంటున్న ఉదయం ఏడు గంటల సమయంలో...
    
    ఉషస్సుని పిండుకుని తాగాలని ఆరాటపడే చీకటి శిశువులా ట్రైను వహ్చి అనకాపల్లిలో ఆగింది.
    
    బడలికగా దిగిన ఏకాంత చుట్టూ ఓమారు కలియచూసింది. రాత్రి అంతా నిద్రలేకపోవడంతో కళ్ళు మండుతున్నాయి. ఆలోచనల రాపిడికి ఆమె మొహం కాంతిని కోల్పోయినా భస్మమయిన ఆశల్లో నుంచి మొలకెత్తాలని తలంచే కలుపుమొక్కలా వుందామె.
    
    ఫ్లాట్ ఫారంమీద చాలామంది ప్రయాణీకులున్నా ఏకాంత కోసం ఎవరూ లేరు... ఎవరో వస్తారన్న ఆశ ఆమెకి లేదు. ఉన్న అమ్మ చనిపోయి నెలలు గడిచింది. తను చరిత్ర విసిరేసిన గ్రీష్మ శిథిలమై మూడేళ్ళు గడిచింది. నిజమే... ఈ మూడేళ్ళ శిక్షను తను అనుభవించి వుండకపోతే ప్రేమించిన వ్యక్తికి తను దగ్గర కాలేకపోయినా కనీసం పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసేది. అమ్మకి తను ఆసరా అయి ఏ ఉద్యోగమో చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతుండేది.
    
    ఎన్ని స్వప్నాలు ఒకనాడు....

    ఏమైందీనాడు! ఓ బలవంతుడి పథకంలో తను చిక్కుకుంది. బలిపశువుగా మారి ప్రేమించినవాడ్ని దూరం చేసుకోవడమే కాక చేయని హత్యకు హంతకురాలై శిక్షించబడింది. కలగనడం చేతనైన అందమైన స్థితినుంచి జారిపడి వెలగడం చేతగాని మిణుగురుగా మారింది.
    
    "రిక్షా కావాలా అమ్మా!"

    నడుస్తున్న ఏకాంత ఆగింది... తులసితీర్ధం గుటకేస్తున్న ముసలిశవంలా వున్నాడు రిక్షావాలా.
    
    "రండమ్మా" మిగిలిన జీవితం గురించి తను ఆడపిల్లగా పడుతున్న ఆందోళనకన్నా బేరం రాకపోతే ఈ రోజెలా అన్న మీమాంసే కనిపించింది ఆ వృద్దుడి కళ్ళల్లో...
    
    "తుంపాల వెళ్ళాలి."

    బేరం ఆడకుండా రిక్షా ఎక్కింది.
    
    జైలులో పనిచేసి సంపాదించిన డబ్బులు టిక్కెట్టు పోనూ రెండు వందలదాకా వున్నాయి. ఫర్వాలేదు అతడు నిరాశపడకుండా కిరాయి ఇవ్వొచ్చు.
    
    ఆమె పెదవులపై అదోలాంటి నవ్వు.
    
    మృత్యువు ముసుగేసుకుని కబళించే ప్రయత్నం చేస్తున్నా వెర్రి ధైర్యాన్ని ప్రదర్శిస్తూంది తను.
    
    అసలు తను తుంపాల ఎందుకు వెళ్తూంది?
    
    తను పుట్టిన పల్లె అన్న ఆలోచనతోనా? లేక అమ్మ సమాధినైనా చూసి తను స్ఫూర్తి పొందాలనా?
    
    ఇతమిత్ధంగా ఆమెకీ తెలీదు.
    
    కాని చివరగా తాను తిరుగాడిన నేలను చూడాలని మాత్రం అనుకుంది. నిన్నగాక మొన్నెప్పుడో కన్న కలలు యవ్వనాన్ని హారతికర్పూరంలా అంటించినాగాని, బ్రతుకు ముంగిట సింగారించాల్సిన ఆలోచనల మామిడాకు తోరణాలు వడి రాలినాగాని, సంజె వెలుగులకోసం నిరీక్షిస్తున్న జీవితం కోరని మనుషులకు ఆహారమై విప్ర ఖలిత ఖడ్గ ప్రవాహాలకు దారుణంగా గాయపడ్డాగాని ఒకనాటి బాల్యాన్ని గడిపిన పల్లెకు వెళ్ళాలని మనసెంత ఉవ్విళ్ళూరిందని...

 Previous Page Next Page