తిరిగి ఆ పల్లెకు మళ్ళీ రాదామె!
రేపటి తరానికి చెందిన కొత్తబాటలో నిబ్బరంగా నడిచి వెళ్ళొచ్చు. లేదూ గతుకులతో, అతుకులతో, కల్మషం నిండిన గుంతలతో తనే బాటగా మారి ఎవరికీ వినిపించని అంత్యగీతంలా కుంచించుకుపోవచ్చు. అయితేనేమి... గమ్యం కోసం చేసే పోరాటంలో సంతృప్తి వుంటుంది. తన రక్తంతో థానే బ్రతుకు అధ్యాయాల్ని రాయడంలో ఎనలేని ఆనందం ఉంటుంది. ఇలా ఆలోచించడం తప్పు కాదు! ఇలా ఆలోచించలేకపోవడం బిడ్డకివ్వాల్సిన చనుబాలుని ఆ తల్లే పిండుకుని తాగటం లాంటిది!
రిక్షా గూండాల వీధి దాటింది.
కొత్తగా ఇళ్ళు వెలిసినట్టుంది. మరో మూడు కిలోమీటర్ల దూరం వెళితే తుంపాల అయినా ఈ ప్రదేశాలన్నీ ఆమెకు సుపరిచితమే. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తుంపాల నుంచి సైకిల్ మీద ఈ రూట్ లోనే వచ్చేది.
స్నేహితురాళ్ళతో ఆకతాయిగా ఎంత అల్లరి చేసిందని...! వకుళ, శాంత, ఆదిలక్ష్మి, నారాయణమ్మ... వీళ్ళంతా ఏం చేస్తున్నారు? బహుశా పెళ్ళిళ్ళయిపోయి వుండొచ్చు. ఏ ఒక్కరైనా కనిపిస్తే తనను పలకరిస్తారా? లేకపోతే చెడిపోయి జైలుకెళ్ళిందాన్నని తల తిప్పుకుంటారా?
పెదనాన్న రామునాయుడు బహుశా తనను చూడగానే కంటతడి పెట్టుకుంటాడు. నిజమే... తమ్ముడు కూతురైన ఏకాంత చదువులో చూపే శ్రద్ద చూసి తన పిల్లలకేగాక ఊరి ఆడపిల్లలందరితోనూ "అమ్మాయి అంటే ఏకాంతె" అని చాలా గర్వంగా చెప్పేవాడు. ఏకాంతని పొలం గట్లవెంట చెరువు ఒడ్డున తోడుగా నడిపించుకుంటూ వెళ్ళి చాలా చాలా మాట్లాడేవాడు. లంకంత కొంపలో ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళతో పెదనాన్న ఇల్లు ఎంత సందడిగా వుండేదీ ఆమెకు ఇప్పటికీ గుర్తే... ఇప్పుడు అమ్మ కూడా లేని తనను చూసి తోడుగా ఇంట్లోనే వుండమంటాడేమో! అసలు వుండమని బలవంతం చేస్తే మాత్రం తనెలా వుండగలదని! తన ఆలోచనలు వేరు...
గూండాల వీధి దాటి మామిడితోపు ప్రాంతాలకు రిక్షా వస్తుంటే ఓ మూలనున్న ఆదెమ్మ టీ కొట్టు రేడియోలోనుంచి పాట వినిపిస్తూంది.
"తుమ్ భయే సరోవర్... మై బనీ మఛియా
తుమ్ భయే చందా మై బనీ చకోరా
తుమ్ భయే తరూవర్ మై బనీ ఫఖియా"
తన సర్వస్వమయిన గిరిధర గోపాలుని కోసం మీరా తపించిపోతూ ఆలపించిన దివ్యగానం...
ఎందుకో ఆ వాక్యాలు వింటుంటే ఏకాంత మనసు కలవరపాటుతో బాధగా మూలిగింది. గడిచిన మూడేళ్ళ ఏకాంతవాసం కాదు... ఒకనాడు కోరుకున్న ప్రియుడితో గడిపిన మధురక్షణాలు కళ్ళముందు కదిలాయి.
"నీవనే సరస్సులో చేపవై నేను సంచరిస్తాను. నీవనే చంద్రుడికై తపించే చకోరాన్నై జీవిస్తాను. నీవనే చెట్టుపై నేను పక్షినై మనుగడ సాగిస్తాను...."
"జో తుమ్ తో డోపియా మై నహీతో డేరే
తోధి ప్రీత్ తోడో కృష్ణ కౌన్ సంగ్ డోజో"
పాట క్రమంగా ఏ అదృశ్య గానంలాగో దూరమౌతున్నా మీరా గొంతులోని ఆర్తి ఆమె గుండెలోతుల్లో ప్రతిధ్వనిస్తుంటే అలసటగా కళ్ళు మూసుకుంది. "నీకు దూరమై నేను జీవించలేను. నిన్ను వదిలి నేను మరెవరినీ ఆశ్రయించలేను. మన చిరకాల బంధాన్ని నీవు త్రెంచుకున్నా కృష్ణా నేను నిన్ను విడిచిపెట్టను".
ఎంతటి ప్రత్యేకత మీరాబాయిలో.... అజ్ఞాన అహంకారాలతో కరడుగట్టిన మానవ హృదయ ఎడారిలో ప్రత్యక్షమై అలసిన మానవ జీవితానికి ప్రేమామృతాన్ని అందించి, శాంతిని ప్రసాదించడానికి వెలసిన ఒయాసిస్సు! అది భక్తి కానీ రక్తికానీ నిస్వార్ధపూరితమైన ప్రేమ ఆమెది, మరితను?
శరీరంలాగే మనసూ అపవిత్రమైన తనకీ, మీరాబాయీకీ పోలికలెక్కడ....
"ఎవరింటికమ్మా?"
రిక్షా తాత పరామర్శతో తేరుకుందామె.
తనకీ ఇల్లుంది. కాని ఆ క్షణంలో తల్లిలేదు. నాన్న బ్రతికివున్నా చెప్పేదేమో!
"రామునాయుడిగారింటికి"
అలా చెప్పింది తను ఎవరన్నదీ తెలియకూడదనే ఒకవేళ అమ్మ పేరు చెప్పినా ఆ రిక్షా తాత తనెవరో గుర్తుపట్టొచ్చు. కథలు కథలుగా చెప్పుకున్న తన పాత్ర గురించి గుర్తుచేయడం ఆమెకి ఇష్టంలేదు.
"మీకు బంధువా తల్లీ?"
రిక్షా తాత వదిలిపెట్టేట్టు లేడు. "అవును....దూరపు బంధువు" తన పెదనాన్న అని చెప్పలేకపోయింది.
"ఏ ఊరి నుంచి వస్తున్నారు?"
"జైలు నుంచి" అనబోయి తమాయించుకుందామె.
ఊరిని సమీపిస్తున్న టెన్షన్ లో ఆమె ప్రశాంతంగా మాట్లాడలేకపోతోంది.
అప్పుడు చూసిందామె రోడ్డుకి మధ్యగా అమర్చబడిన ఆర్చిని.
మధ్యలో రాసి వుంది పెద్ద అక్షరాలతో-
"రాష్ట్ర హోం శాఖామాత్యులు శ్రీ సూర్నారాయణగారికి తుంపాల పంచాయతీ ఆహ్వానం."
ఆమె భృకుటి ముడిపడింది.
నిర్మానుష్యంగా వుండాల్సిన రోడ్డుపై తిరుగుతున్న కార్లనీ, జీపుల్నీ చూస్తూ "ఈ రోజు ఇక్కడికి మంత్రిగారొస్తున్నారా?" అందామె టాపిక్ ని మళ్ళిస్తూ.
"ఉదయాన్నే వచ్చారమ్మా! తుంపాల పంచదార ఫ్యాక్టరీలో ఏదో మీటింగుందట. మహా సందడిగా వుంది. ఎప్పుడూ దుమ్మూ, ధూళితో, చెత్త కుప్పలతో నిండివున్న రోడ్లకీ మాంచి కళొచ్చింది తల్లీ!"
తన పరిధిలో పరిపాలనా వ్యవస్థ గురించి సెటైరికల్ గా చెబుతున్నాడు తాత.
"మీదే ఊరు తాతా?" అడిగింది ఏకాంత.
"తుంపాలకి దగ్గర్లో వుండే సీతానగరం తల్లీ!"
"నీకు అరవయ్యేళ్ళ వయసుంటుంది కదూ?"
"అరవై అయిదమ్మా"
ఆమె గుండె కలుక్కుమంది. జవసత్వాలుడిగిన వయసులో జీవితంతో పోరాటం సాగిస్తున్నాడు. "పిల్లల్లేరా?" వుండి వుంటే వాళ్ళ ఆసరాతో ప్రశాంతంగా గడపాల్సిన వయసన్నది ఆమె ఉద్దేశ్యం.
"ఉన్నారమ్మా" అలసటగా అన్నాడు. రిక్షా పల్లంలోకి వెళుతుంటే సీటు మీద కూర్చుంటూ "ఆరుగురు కొడుకులు..."
"చిన్న పిల్లలా?" సంపాదించే వయసుంటే ఏ తండ్రినీ కొడుకులు ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టరు.
"నేను ఆరుగురు కొడుకులకి తండ్రిని మాత్రమే కాదమ్మా! నలుగురు మనవళ్ళకి తాతయ్యని కూడా... ఆరుగురిలో ముగ్గురు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా ముగ్గురూ చిన్న షాపులు పెట్టుకుని మా ఊళ్ళోనే వుంటున్నారు. అందరికీ పెళ్ళిళ్ళు చేశానమ్మా! పేరుకి పిల్లలే గాని మా సంగతి ఇప్పుడెవరికీ అవసరంలేదమ్మా....! న అస్నాగాతి వదిలెయ్, ఒంట్లో సత్తువ లేకపోయినా మా ముసల్ది కూడా కూలో నాలో చేసి సంపాదిస్తుంటాది. ఏం చేయగలం తల్లీ...! చచ్చేదాకా ఇద్దరం బతకాలగదమ్మా!"