Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 8

 

     గొంతు నుంచి వుబికిన వెక్కిళ్ళు బయటికి వినిపించకూడదని విఫలప్రయత్నమ చేసింది కానీ దాచుకోలేకపోయింది.
    
    అలా ఎంతసేపు ఆమె నిలబడి వుందో గుర్తులేదు. నెమ్మదిగా బయటి గదిలోకి వచ్చింది అలికిడి లేకపోవడంతో...
    
    సోమయాజులు మాష్టారు, ఆయన భార్య వెళ్ళిపోయినట్టున్నారు...
    
    ఓ మూల కూర్చున్న నాన్న తమ్ముడి ఫోటో చూస్తున్నారు తదేకంగా...
    
    ఆమెని మళ్ళీ కళ్ళనీళ్ళు కమ్మేశాయి. స్మశాన స్తబ్దత ఆవరించిన ఆ ఇంటిలో రెండు బ్రతికున్న శవాల్లాంటి వ్యక్తుల మధ్య ఓదార్పు ఎలా సాధ్యమో ఆమెకి తోచడం లేదు.
    
    అయినా శక్తిని కూడగట్టుకుంది.
    
    సమీపంలో కూర్చున్న కూతుర్ని పట్టించుకోకుండా ఇంకా కొడుకు ఫోటోకేసే చూస్తుంటే భుజం మీద చేయి వుంచింది ఆప్యాయంగా... "నాన్న!"
    
    ఆమె పిలుపు ఏమనసు పొరల గాయాల్ని రేపిందో రక్తాశ్రువుల్లా ఆయన కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి. తమాయించుకోలేకపోయారేమో..."నేనెందుకు బ్రతికి వున్నానమ్మా! నూరేళ్ళ భవిష్యత్తుని కాదని వీడెందుకు వెళ్ళిపోయాడు?"
    
    పసిపిల్లాడిలా తల్లడిల్లిపోతుంటే దుఃఖోద్విగ్నంగా తండ్రి చెంపల్ని స్ప్రుశిస్తూ "నా కోసం నాన్నా... నువ్వు నా కోసం బ్రతకాలి" అంది కంపిస్తూ.
    
    "పిచ్చితల్లీ!" నివురు రాలిన నిప్పుల్లా ఆయన నేత్రాలు మండుతున్నాయి. "నేను నిన్నెలా కాపాడగలనే... కాపాడాలీ అంటే నేను బలవంతుడినైనా కావాలి. లేదూ బలహీనుల్ని ధ్వంసం చేయగల బలగమూ, అధికారమూ వున్న మనిషినైనా కావాలి. మామూలు తండ్రినమ్మా, బ్రతుకు రెక్కల కిందైనా బిడ్డల్ని దాచుకోలేని చేవలేని ముసలి పక్షిని...!" నిన్నటి పీడకల నుంచి ఇంకా తేరుకోలేనట్టు కంపించిపోయారాయన. "నీకు తెలీదమ్మా! పసివాడ్ని ఎంత దారుణంగా హింసించారో తెలుసా... ఒళ్ళంతా తూట్లు పడేట్టు కొట్టారు. అప్పటికీ నేను కాళ్ళావేళ్ళా పడ్డాను. అంతకు ముందే కమిషనర్ గారికీ ఫోన్ చేసి చెప్పాను. అప్పుడెప్పుడో నా సన్మానానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చాడు కాబట్టి సవ్యసాచి నా మాట పట్టించుకుంటాడనుకున్నాను. కానీ అబ్బే... అంతా ఒక గూటి పక్షులేనమ్మా... అందుకే నా ఏడుపు అరణ్య రోధనయ్యింది. పైగా వారం రోజుల్లోగా సిటీ వదలి వెళ్ళిపొమ్మని సూర్నారాయణ శాసించాడమ్మా! బిడ్డ అసలే పిరికి సన్యాసి కావడంతో బెదిరిపోయాడు. అయినా నగర బహిష్కరణ ఏమిటమ్మా.... అది సాధ్యమేనా?"
    
    "నాన్నా" తండ్రి కళ్ళు తుడుస్తూ అంది ఆశ్రిత. "వాడు బలవంతుడు, బలగం వున్నవాడు కావచ్చేమోకాని మనల్ని నగరం వదిలిపొమ్మనడానికిదేం వాడి తాత సొత్తు కాదు... పోలీసులు అంతా వాడి తొత్తులూ కారు..."

    "లేదమ్మా" మతి భ్రమిస్తున్నట్టుగా చూశారాయన. "వాడు సామాన్యుడు కాడు. దేనికైనా సిద్దపడగల సమర్ధుడు కాలేజీలో అంతమంది చూసినా ఒక్కడైనా ఎదురు నిఉలబడగలిగాడా... అయిపోయిందమ్మా! మా తరానికి మా నమ్మకాలకీ కాలం చెల్లిపోయిందమ్మా... మా తరానికి మా నమ్మకాలకీ కాలం చెల్లిపోయిందీ. ఈ యాంత్రిక నాగరికతలో మనసు దృఢమైతే చాలదు. భావాలు గాఢమైనవైనా సరిపోదు. అసలు నేను ఈ సమాజానికి ఎంత దూరంలో వున్నానో నిన్నటిదాకా తెలీదే. నా ఆలోచనలు, నమ్మకాలు ఎవ్వరూ తలుపులు తెరవని బీరువాలో బూజుపట్టిన పాత పుస్తకాలనిపించలేదు ఇప్పటిదాకా! తెలిసిపోయింది ఆశ్రితా! నేను ఈ నేలమాళిగలాంటి వర్తమానంలో ఇమడలేను. నేనేకాదు, నువ్వు కూడా అందుకే నాతోరా. ఈ సూర్నారాయణల నుంచి, సవ్యసాచిలనుంచి తప్పించుకుని బ్రతకాలీ అంటే ఎటైనా వెళ్ళిపోదాం నడువ్..."
    
    తనమీద తనకు అదుపుతప్పినట్టు రాజారాంగారు హడావుడిపడుతూ పైకి లేవబోతుంటే ఆశ్రితకి అర్ధమైంది. నాన్న మనో నిబ్బరాన్ని కోల్పోయారు. నేలరాలిన తమ్ముడి జ్ఞాపకాలకీ, నిన్న జరిగిన సంఘటనలకీ మధ్య నలిగిపోతూ బ్రతుకుభయంతో వర్తమానం నుంచి పారిపోవాలని ఆరాటపడుతున్నారు.
    
    "అమ్మా ఆశ్రితా... నాకు భయంగా వుందే"
    
    గభాలున తండ్రిని అక్కున చేర్చుకుంది ఆమె కళ్ళనుంచి నీళ్ళు ధారకడుతుంటే.... పైకి లేవాలని ప్రయత్నిస్తున్న తండ్రిని బలంగా గుండెలకి హత్తుకుంది. అది చాలు నాన్న శారీరకంగానే కాక మానసికంగా సైతం ఎంత గాయపడిందీ తెలుసుకోటానికి.
    
    "భయపడకు నాన్నా భయపడకు" గొణుగుతున్నట్టుగా నిబ్బరంగా ఓదార్చుతుంది ఆశ్రిత. "నిన్ను నేను కాపాడుకుంటాను. మన జీవిత గ్రంథాన్ని ఈ మలుపు తిప్పిన ఆ యుగపురుషుల్ని నీ బిడ్డగా నేను ఎదుర్కొంటాను. ఒక చిన్ని కుటుంబంమీద వాళ్ళు చేసిన సంతకాన్ని పదిలంగా దాచి వాళ్ళ బ్రతుకు కావ్యంలోని అచ్చుతప్పుల్ని వాళ్ళు సైతం సరిదిద్దుకోలేని స్థితిని కలిగిస్తాను...నా మాట నమ్ము నాన్న..." అలా ఎంతసేపు ఎన్ని హామీలిచ్చిందో, ఎంతటి ధైర్యాన్ని నూరిపోసిందో ఆమెకే గుర్తులేదు. స్తన్యమిస్తున్న తల్లిలా గుండెలపై వాలిన తండ్రిని వెనక్కి సర్దుతూ అప్పుడు చూసింది.
    
    నాన్న బ్రతికిలేడు. కాదు.... నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఆమె గొంతు నుంచి ఒక్క ఆక్రందనా వెలువడలేదు.
    
    అంతా నిశ్శబ్దం... దేవుడు రాసిన బ్రతుకు డైరీలోని చివరి పేజీలా చెప్పలేని వేదన రాల్చిన మరణ వాఙ్మూలంలా కనిపిస్తున్న తండ్రిని చూస్తే నిర్వేదంగా గోడకి జారగిలబడింది.
    
    చాలా చిన్న మలుపు అయితేనేం? రెండు జీవాల్ని ఎగరేసుకుపోయింది. జరిగిన సంఘటనలో నేరస్థులెవరయితేనేం జీవితం ఆగకుండా సాగే నదీ ప్రవాహం అని చెప్పిన నాన్నగార్ని కాలం ఓడించింది దారుణంగా.
    
    ఇప్పుడు ఆశ్రిత ఆడపిల్లలా లేదు.
    
    తన స్మృతిపథంలో చెరగని సుఖదుఃఖాల ధూళిలో ఆడుకుంటూ ముందుకు సాగే శిశువులా వుంది.
    
    కూలిన ఓ పొదరింటి నుంచి ప్రాణం దక్కించుకున్న అవశేషమై ఇక అంతా అఖండ సచ్చిదానందమని తెలియచెప్పే అద్వైతంలా వుంది.
    
    ఒక సంఘటన మరిన్ని సంఘటనలకి మూలమై అది జీవితమైతే అందులో హితంకాని చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేని వ్యక్తిత్వం చరిత్రాత్మకమవుతుంది.
    
    సంఘంలో తమకున్న పరపతితో ఏది ఎంతవరకూ సాధించినా కాని ఆ వ్యక్తుల బలాన్ని ఎవరు ఏ మేరకు అంగీకరించినాగాని కొందరు వ్యక్తిలా సమసిపోలేక శక్తిగా విస్తరించి కడతేరిపోవాలనుకుంటారు.
    
    ఆశ్రిత ఆ కోవకి చెందినదే...
    
                                          *    *    *
    
    ఉదయం పది గంటల సమయం.
    
    జైలరు ఆఫీసులో నిలబడి వుంది ఏకాంత. సమీపంలోని ప్రిజన్ సెల్స్ లోని ఆడ ఖైదీలంతా ఆమెను గమనిస్తుంటే ఏభయ్యేళ్ళ వయసున్న జైలు సూపరింటెండెంట్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు.

 Previous Page Next Page