7
ప్రకాశరావు నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు. అతడు మెత్తటి పరుపుమీద పడుకుని వున్నాడు. చాలా హాయిగా వుంది. మూడు రోజుల్నుంచి ఇలానే ఇక్కడే పడుకొని వున్నాడు. నిన్న సాయంత్రం నిద్రపోయాక ఇదే లేవటం. ఎంతసేపు పడుకున్నాడో తెలిసేసరికి అతనికే ఆశ్చర్యం వేసింది.
కొంచెం నీరసం మినహాయించి ఇప్పుడతనికి ఏ బాధాలేదు. బాగా స్వస్థత చిక్కింది. ఒక ప్రక్కకు ఒత్తిగిలి శకుంతల కోసం చూశాడు.
శకుంతల కిటికీలోంచి వెలుతురు వచ్చి ఆమె ముఖంమీదకు పడుతూండడం వల్ల చాలా స్పష్టంగా ఆమె వదనాన్ని చూడగలుగుతున్నాడు. ఎంతో అమాయకంగా, నిర్మలంగా కనపడుతున్న ఆమెను చూసి క్షణంసేపు ముగ్ధుడయ్యాడు ప్రకాశరావు.
మెల్లిగా దగ్గాడు, దగ్గువస్తే.
శకుంతల తలత్రిప్పి అతనివంక చూసింది. కళ్ళుతెరిచి ఉండడం కనిపెట్టి దగ్గరకు వచ్చి "లేచారా? "అనడిగింది.
ఏం మాట్లాడాలో తెలియని ప్రకాశరావు- మాట్లాడలేదు.
"ఏమయినా కావాలా?" అనడిగింది.
ఏం మాట్లాడాలో తెలియని ప్రకాశరావు-మాట్లాడలేదు.
"ఏమయినా కావాలా?" అనడిగింది మళ్ళీ.
ఆమె ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఆమె కళ్ళలోకి చూస్తూ "మిమ్మల్నో విషయం అడిగేదా? అనడిగాడు బలహీనంగా.
ఆమె నవ్వుతూ "మీరు రోజుకు ఎన్ని విషయాలు అడుగుతారేమిటి?"
ఆమె చెప్పింది వినకుండా ప్రకాశరావు తన ధోరణిలో "నేను మీకు చాలా శ్రమ కలిగించను కదూ?" అన్నాడు.
"ఆఁ చాలా?"
"నిజానికి ఇన్ని సపర్యలు చేయవల్సిన అవసరం ఏముంది చెప్పండి? నాకు ఏమీ డబ్బులేదు. బీదవాణ్ణి. చదువుకొనటంకోసం ఈ వూరొచ్చి మీ ఇంట్లో ఒక గదిలో వుంటున్నాను. నావల్ల మీకు ఇబ్బంది కలిగించానేగాని ఇంతవరకూ సహాయ పడింది లేదు" ప్రకాశరావు ఉద్రేకంగా చెప్పుకుపోసాగాడు.
"మీరు నిజాన్ని చెబుతున్నారు" అంది శకుంతల అతని నుంచి దృష్టిని తప్పిస్తూ.
"నాకు ఈ వూళ్ళో ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తెలీదు. ఏ కొద్దిపాటి గౌరవమూ నాకు లేదు. మరి మీరు ఇంత సపర్య ఎందుకు చేస్తున్నారో నా కర్థం అవటంలేదు."
ఈసారి ముఖం కోపంతో కొంచెం యెర్రబడింది. అయినా మామూలుగానే మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ "మీరు చీటికి మాటికీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకర్థం కావటంలేదు. ఒక మనిషికి గౌరవ మర్యాదలు వుంటేనేనా ఎవరైనా సహాయం చేసేది?" అంది.
తన మాటలకి ఆమె ఇలా అర్థం తీసేసరికి ప్రకాశం చింతపడుతూ "నేను తెలివి తక్కువ వాడిని. ఏదో ఒక మాట ముందూ వెనకా చూచుకోకుండా మాట్లాడేస్తూ వుంటాను" అన్నాడు.
ఇందులో జవాబు చెప్పేందుకు శకుంతలకేమీ లేదు.
"కాలేజీ మూడు రోజుల్నుంచీ పోతోంది" అన్నాడు ప్రకాశం విచారంగా
"వంట్లో బాగాలేనప్పుడు పోక ఏం చేస్తుంది? అయినా ఒక నాలుగయిదు రోజులు పోయినంత మాత్రాన పెద్ద ప్రమాదమేమీ వుండదనుకొంటాను."
"ప్రమాదం వున్నా, లేకపోయినా ఎప్పుడూ కాలేజీ ఎగవేయటం అలవాటు లేనివారు హఠాత్తుగా కొన్ని రోజులపాటు మానివేయవలసి వస్తే ప్రాణాలు పోయినట్లుగా బాధపడేమాట అబద్ధంకాదు!"
ఈ ప్రసంగం మార్చాలని శంకుతల "మీరు ముఖం కడుక్కోరా?" అని ప్రశ్నించింది.
"ఎందుకు కడుక్కోను? నా అంతట నేను లేచి నిలబడే ఓపిక నాకు వుంది. మీ హనుమంతుడిలాంటి పనివాణ్ని పిలవవలసిన అవసరం లేదు లెండి" అని ఆమె వంక చూసి నవ్వాడు.
జవాబుగా ఆమెకూడా నవ్వుతూ "అయితే సరే! కాని కళ్ళు తిరిగి మళ్ళీ పడిపోయేందుకు సిద్ధపడితే ఇక్కడెవరూ పట్టుకుని కాపాడేందుకు సిద్ధంగా లేరు?" అంది.
మూడురోజుల క్రితం రాత్రి జరిగిన సంఘటన గుర్తువచ్చి ప్రకాశరావు సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి ఇప్పటికి కూడా సరిగ్గా తెలీదు. మరునాడు ఉదయం మెలకువ వచ్చేసరికి ఇదే మంచంమీద తనని డాక్టరు పరీక్ష చేస్తుండగా పడుకుని వున్నాడు. అప్పట్నుంచీ యిక్కడే వున్నాడు.
"పోండి! పొరపాటనేది ఎప్పుడు వస్తుందా?" అని లేచాడు లోపలి పోయి ముఖాన్ని వేడినీళ్ళతో కడుకున్నివచ్చాక, మళ్ళీ వచ్చి కూర్చుని తువ్వాలుతో తుడుచుకొంటూ "ఇవ్వాళ్ళ లేచి తిరగగలననుకొంటా" అన్నాడు.
శకుంతల అతనికి కాఫీ అందిస్తూ, "డాక్టరుగారు చెప్పింది అతిక్రమించాలని వుంటే, అలాగే లేచి తిరగవచ్చు" అంది.
అంతలో రామారావుగారు లోపలికివస్తూ "ఎలా వుందండీ ఇవేళ?" అని ప్రశ్నిస్తూ మర్యాద కోసం ప్రకాశం లేవబోతుంటే వద్దని వారించారు.
"బాగానే వుందండీ"
"ఇవ్వాళ్ళకూడా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారా అమ్మాయీ!" అని కూతురివంక తిరిగి ఆయన అడిగారు.
"ఏమోనండీ, డాక్టరుగారింకా రాలేదు"
రామరావుగారు రిస్టువాచీ చూచుకొని లేచి నిలబడి "బాగా విశ్రాంతి తీసుకోండి" అని ప్రకాశరావుకి ఓ సలహా యిచ్చి, "సరే, నాకు ఆఫీసు టైము అయిపొయిందమ్మాయి, వెళుతున్నాను." అని చెప్పి, టక్ టక్ మని చప్పుడు చేసుకొంటూ బయటకు వెళ్ళిపోయాడు.
తర్వాత డాక్టరుగారు వచ్చేదాకా ఎవరి గొడవలో వాళ్ళుండిపోయారు. డాక్టరుగారు వచ్చి పరీక్షచేసి వెళ్ళిపోతూ "ఇవాళ పత్యం పెట్టవచ్చు"నని చెప్పాడు.
"మీకు భోజనం హొటల్ నుంచి తెప్పించమంటారా?" అనడిగింది శకుంతల.
శకుంతల ఇట్లా హొటల్ నుంచి అడుగుతోందో అతనికి తెలుసు. ఈ ప్రశ్న ఆమె నోటినుంచి రావటం అతనికి బాధ కలిగించింది, ఇది వరకు యిదే విషయంలో తమ ఇద్దరిమధ్యా ప్రస్తావన రావటం. అది తన హృదయాన్ని గాయపరచటం - అదంతా స్మృతిపథంలో మెరిసింది. కాని అతను ఈ విషయంలో చేయగలిగింది ఏమీలేదు. హొటల్ గూడా భోజనం చేయలేక, లాయర్స్ క్లబ్బులో యేర్పాటు చేసుకుని ఆచార వ్యవహారాలకు లోటులేకుండా చేసుకుంటున్నాడు.
ఆ రోజు అతను భోజనం చేస్తుండగా శకుంతల గది దగ్గిరకే వచ్చి యివతల నుంచే "మీకేదో ఉత్తరం వచ్చింది" అంది.
"ఇలా ఇవ్వండి."
శకుంతల గదిలోపలకి రాకుండానే యవతలనుంచే ఒక కార్డు లోపలికి త్రోసి వెళ్ళిపోబోయింది.
"ఫర్వాలేదు. ఎదురుగా రావచ్చు" అన్నాడు ప్రకాశం బాధగా.
ఆమె ప్రయత్నం మీద నవ్వుతూ "ఎట్లా, మీరు అన్నం తింటున్నారు?" అంది.
"నేను అన్నం తింటున్నప్పుడు ఎదురుగా రావద్దని మీతో రావద్దని మీతో చెప్పానా?"
ఇలాగే వుంటే సంభాషణ యింకా పొడిగించబడుతుందని "సరేలెండి. తరువాత మాట్లాడవచ్చు" అని శకుంతల ఆ ప్రదేశంనుంచి నిష్క్రమించింది.
ఒక అరగంట గడిచాక ప్రకాశం తన గదిలో కూర్చుని వున్నాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఈలోగా శకుంతల నిశ్శబ్దంగా వెనుకనుంచి వచ్చి అతని ఆలోచన్లను భంగపరుస్తూ "ఉత్తరం ఎవరు రాశారు?" అనడిగింది.
"అన్నయ్య".
చప్పున ఆమెకు ఏదో తోచి, ఆలోచనగా అతని ముఖంలోకిచూస్తూ "యిక్కడ మీ ఆరోగ్యం విషయం వాళ్ళకు తెలీదా?" అని ప్రశ్నించింది.
ప్రకాశం నిశ్చింతగా నవ్వుతూ "ఏమని తెలియపరిచేది? వాళ్ళను కూడా అనవసరంగా బాధ పెట్టాలనా?" అన్నాడు.
హఠాత్తుగా శకుంతల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాళ్ళింట్లో గదిలో వుండి చదువుకూంటున్న ఈ బీదవాళ్ళ అబ్బాయి విషయం ఆమెకు తెలియనిదికాదు. కొన్ని నెలలనుంచీ అతని పరిస్థితి గమనిస్తూనే వుంది/ చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనిస్తూ ప్రవర్తించటంలో మొగవాళ్ళంత అశ్రద్ధగా ఆడవాళ్ళుండరు. వీళ్ళేమో ఏమీ తెలియకపోయినా అవన్నీ తెలిసినట్లు నటిస్తారు. మరి-- వాళ్ళు అన్నీ తెలుసుకొని గూడా ఏమీ తెలియనట్లు కనిపిస్తారు.
ఆ మధ్యాహ్నం శంకరం అనే పన్నెండేళ్ళ కుర్రవాడు ప్రకాశరావుగారిని చూసిపోదామని వచ్చాడు. అతనూ. యింకాసమవయస్కులైన యిద్దరు కుర్రాళ్ళూ ఈయనగారి దగ్గర ప్రయివేటు నేర్చుకుంటూ వుంటారు. వీళ్ళు ఉదయం ఏడింటికి వచ్చి తొమ్మిదింటిదాకా వుండి, వెళ్ళిపోతారు. తర్వాత భోజనం చేసి ప్రకాశంరావు కాలేజీకి పోవటం రివాజు.
"ఎలావుంది మాష్టారూ?" అని వాడు పరామర్శ చేశాడు. ఈ ప్రయివేటు మాష్టారంటే వాడికి చాలా భక్తి గౌరవాలున్నాయి.
"కూర్చోవోయి" అని ప్రకాశం వాడిని కూర్చోబెట్టి మాట్లాడసాగాడు. వాడు కుర్రవాడే అయినా కుర్రాడితో మాట్లాడినట్లుగా వాడితో మాట్లాడటం ప్రకాశానికి అలవాటులేదు. అంతేగాక ఒకోసారి మరీ ఆవేదన కలిగినప్పుడు వాడిని స్నేహితునిగా భావించి తన మనసులోని భావాలన్నీ వివరించి చెబుతూండటం అతనికి అలవాటు.
కొంచెంసేపు లోకాభిరామాయణం మాట్లాడాక "రేపు ప్రొద్దున్న నుంచీ మళ్ళీ రండి" అని చెప్పాడు ప్రకాశరావు. నమస్కారం పెట్టి వాడు వెళ్ళిపోయాడు.
"నమస్కారం మేష్టారు?"
శిష్యుడు వెళ్ళి ఒకడు రెండు నిమిషాలన్నా గడవక ముందే యీ కంఠస్వరం వినబడింది. ప్రకాశరావు ఉలిక్కిపడి చూశాడు. గుమ్మందగ్గిరే చేతులు జోడించి శకుంతల చిరునవ్వు ముఖంతో నిలబడి వుంది.
"రండి" అన్నాడు ప్రకాశరావు.
ఆమె వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుని "మేష్టారుగారికి యింత ఓపిక ఎలా వుందో అర్థం కావటంలేదు. తెల్లవారుఝామునే లేస్తారు. తొమ్మిదిదాకా ప్రయివేట్లు చెబుతారు. మళ్ళీ కాలేజి. సాయంత్రమంతా చెప్పడమో, ఇంకా షికారు వెళ్ళడమో ఇవన్నీ చేస్తారు."
"మీకు అంతే తెలుసు. మీకు తెలియకుండా నేనింకా చాలా శ్రమ పడుతూంటాను."
"అయితే, అదికూడా చెప్పాల్సిందే."
ప్రకాశరావు తల అడ్డంగా తిప్పుతూ "ఊహు, ఎందుకు చెప్పాలి? మీ రహస్యాలన్నీ మాకు చెబుతున్నారు గనుకనా?" అన్నాడు.
శకుంతల మ్లానవదనంతో "నా దగ్గర రహస్యాలు ఏముంటాయి. చెప్పేందుకు?" అంది.
ఆమె ముఖంవంక తదేక ధ్యానంతో చూస్తున్న ప్రకాశరావు "చాలా చిత్రంగా వుంది. ఆడవాళ్ళు క్షణక్షణానికి ఒక రకంగా కనిపిస్తారెందుచేత? ఇందాక వున్న విధంగా మీరిప్పుడు లేరు. ఇంకో క్షణానికి ఇంకో విధంగా కనిపించవచ్చు" అనేశాడు చప్పున.
శకుంతల ఇతని మాటలకు తెల్లబోయి జవాబు చెప్పలేక ఊరుకుంది.
* * *
రాత్రి రామరావుగారు ఇంటికి వచ్చేసరికి ప్రకాశరావు రోమన్ లా చదువుకుంటూ కూర్చున్నాడు. ఆయనకు ఇంట్లో శకుంతల కనిపించలేదు. ఆమె డాబా మీద వెన్నెల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది.
"డాబా మీద వుందనుకుంటానండి" అన్నాడు చేతిలో పుస్తకాన్ని మూస్తూ.
రామారావు మొదట కూతుర్ని పిలుడ్డామనుకున్నాడు. కాని మళ్ళీ ఏదో తోచి ఆ ప్రయత్నాన్ని మానుకొని వంటమనిషి వడ్డిస్తే భోజనం చేసి, తిరిగి ప్రకాశరావు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
వాళ్ళిద్దరూ కొంతసేపూ చాలా విషయాలమీద సంభాషించుకొన్నారు. తర్వాత సంభాషణ అటు తిరిగి, యిటు తిరిగి శకుంతల వివాహం మీదకు వెళ్ళింది.