రాధ మాట్లాడకుండా వినసాగింది.
"నేను ఎక్కువగా చదువుకోలేదు ఎక్కువ నవలలు కూడా చదవలేదు. కాని కొన్ని రోజుల క్రితం యిటువంటి ఇతివృత్తమేగల ఒక నవల చదవటం తటస్థించింది. విషయం వచ్చింది గనుక చెపుతున్నాను. ఒక స్త్రీ చాలా అమాయకురాలిగా అయోమయంగా వున్న స్థితిలో బలవంతంగా వొక పురుషుడి వాళ్ళ తన శీలాన్ని కోల్పోతుంది. తరువాత ఎప్పటికో ఈ విషయం బయటపడి తనని తర్వాత పెళ్ళి చేసుకుని భర్తవల్ల శిక్ష అనుభవిస్తుంది. కాని రచయిత ఏమంటాడో తెలుసా? 'లోకం ఆమెను పతిత అంటుంది కాని ఆమె మాత్రం నిర్మలమైంది' అని ఇది నిజంగా ఒక సవాలు అంటాను నేను."
రాధ శద్ధ్రగా విని అతను చెప్పింది మననం చేసుకుంటూ "నువ్వు చెప్పింది బాగానేవుంది అన్నాయ్. కాని ఇందులోకూడా రచయిత తేల్చి చెప్పింది కూడా యేమీ లేదు. ఆ మొగాడెవరో ఆమెను అనుమానించి చేయవలసింది చేశాక రచయిత ఏమని సవాలుచేస్తే యేం లాభం? అంటే ఆ రచయిత ఆ పాత్రలలో తనూ ఒక పాత్రగా చిత్రంచుకోక కేవలం ఒక ప్రేక్షకుడిగా నిలబడ్డాడన్నమాట. ఇది ఏమంత లాభమైన విషయం?" అని కొంచెం ఆగి "ఇది వ్యక్తులకూ, వ్యక్తిత్వాలకూ సంబంధించిన ప్రశ్న అన్నావు! నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. నువ్వే ఆ స్థితిలో వుంటే యేం చేస్తావు?" అనడిగింది.
ఎదురుచూడని ఈ ప్రశ్నకు నారాయణ విస్తుపోయాడు. కాని అది తేలికగా తీసుకొని, నవ్వుతూ "చిక్కుప్రశ్న కాకపోతేనే నువ్వు అదే వేశావాయె" అన్నాడు.
"కాదన్నయ్యా, చెప్పాల్సిందే" అని రాధ కొంచెం మారాం చేసింది.
అయితే యీసారి నారాయణ నవ్వకుండా "నాకుగా నేను సమాధానం చెప్పటం చాలా కష్టమైనా సంగతి రాధా. నా దగ్గర్నుంచి నిజంగా రాబట్టాలంటే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్న యెవరికైనా సరిగ్గా ఆలోచిస్తే జవాబు లభిస్తుంది. ఏం, నేను చెప్పింది నిజంకాదు?" అని చెల్లెలి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు.
అన్నగారి తెలివితేటలకు లోలోపలే మెచ్చుకొని "కాని నిన్ను అర్థం చేసుకునే మనిషి యింకా రాలేదు కదా అన్నాయ్" అంది.
నారాయణ ఖంగారుపడుతూ "నువ్వు హాస్యానికన్నా నిజం మాట్లాడలేదు. నన్నర్థం చేసుకునే మనుషులు ఇదివరకే వున్నారని నాకు తెలుసు" అన్నాడు.
"ఎవరన్నయ్యా?" అని రాధ కుతూహలంగా ప్రశ్నించింది.
"స్వవిషయాలు ఎక్కువగా చెప్పుకోవటం అంత మంచిపని కాదని నీకు తెలుసుగా అమ్మా!"
రాధ తల ఊపింది.
"అయితే ఇహ నువ్వు ఆ ప్రశ్న అడగకూడదు."
నారాయణ ఈమాట అనకపోయినా ఆ ప్రస్తావన అంతటితో ఆగిపోయేది. ఇప్పుడు యెలాగూ ఆగిపోయింది. తరువాత పాత రాధ అక్కడ్నుంచి వచ్చేసింది. అన్నగారితో మాట్లాడక ఆమె మనస్సుకు కొంత ప్రశాంతత ఏర్పడిన మాట నిజమేకాని పూర్తిగా కాదు. సాయంత్రం ఆమె అరయ్యేసరికి అరుగుమీద వచ్చి నిల్చుంది. తల్లి తిరిగి వంటింట్లో పనిలోవుంది. నారాయణ ఇంతకుముందే బయటకు వెళ్ళిపోయాడు. తండ్రికి సాయంత్రం అయితే యింట్లో కూర్చునే అలవాటు లేదు. యెక్కడికో వెళ్ళాడు. ఇంట్లో తనూ, అమ్మా తప్ప యెవరూ లేరు.
ఇట్లా తలత్రిప్పి చూసేసరికి కృష్ణుడు దొంగచూపులు చూసుకుంటూ లోపలకు వస్తున్నాడు వాడిని చూడగానే ఆమె వళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. దగ్గరగా వచ్చి "వదినా" అన్నాడు.
"ఏమిటిరా?" అంది బిగబట్టుకుంటూ.
వాడు ఒకసారి అటూఇటూ చూసి యెవరూ లేరని నిశ్చయం చేసుకున్నాక "నామీద కోపం వచ్చిందా? అని అడిగాడు.
"నీ మీద నాకేం కోపం?"
"నేనో విషయం చెప్పనా?"
"చెప్పొద్దని ఎవరన్నారు?"
వాడు జవాబు చెప్పకుండానే తడబడుతూ, జేబులోంచి ఒక చిన్న కాగితం తీసి. ఆమె చేతిలో బలవంతంగా పెట్టేసి ఇహ అక్కడ వుండకుండా వెళ్ళిపోయాడు. "ఈ పిల్లాడు వెర్రివాడని ఎవరంటారు?"
రాధ ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. శరీరమంతా విద్యుద్ఘాతం తగిలినట్లుగా ఒక్కసారిగా చలించింది.
ఏం జరుగుతుందీ ఆమెకు తెలియటం లేదు. వేగంగా కొట్టుకొంటూన్న గుండెతో ఆ చీటీ చదివాక కసితీరా ముక్కలుగా చించేసి ఇహ అక్కడ వుండకుండా లోపలకు వచ్చేసింది. నారాయణ గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుని, అతను వ్రాసుకునే డ్రాయరుమీద మోచేతులు ఆన్చి ఆ రెండు చేతులతో ముఖాన్ని ఆచ్ఛాదనం చేసుకుంది. ఏం జరుగుతోంది? లోకమంతా ఒక్కసారిగా కట్టకట్టి బాధపడింది. లోకంలో ఏది మంచిది? సహనంతో ప్రతిదాన్నీ హర్షిస్తూ వూరుకోవటం వుత్తమమా? ధిక్కరిచంటం ఉత్తమమా? రెంటిలో ఏది చేసినా ఫలితం ఒకటేనా? ఆకూ, ముల్లూ సామెత. ఒక విధమైన అసహ్యంతో ఆమె మనసంతా నిండిపోయింది. కోపంతో శరీరమంతా కన్పిస్తూండగా లేచి నిలబడింది. చెప్పవలసిన వాళ్ళతో చెప్పి ఈ దుర్మార్గాన్ని ఎందుకు అరికట్టకూడదు? ఆ క్షణంలో తల్లివద్ద వాలి జరిగిన సమస్తం నివేదించాలనుకుంది.
కాని వెళ్ళలేదు.
ఏదో అనుకుని మళ్ళీ కూర్చుంది. చాలాసేపు ఆలోచనా తరంగాల్లో తేలి తేలి అలసిపోయాక ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆలోచనల ఉధృతం తట్టుకోలేక ఆవేశాల పరిధుల్ని దాటిపోయినప్పుడు చేసుకునే నిశ్చయమది.
* * *
రాత్రి పదిగంటలయింది. రాధ తన గదిలో కళ్ళు మూసుకుని పడుకుని వుంది. ప్రక్కగదిలోంచి తల్లిగాని, తండ్రిగాని యెవరూ మాట్లాడుతున్నట్లు లేదు. బహ్సుహా నిద్రపోయి వుంటారు.
ఒక అరగంట మెదలకుండా పడుకొని తర్వాత మెల్లగా లేచింది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తలుపులు తీసికొని బయటకు వచ్చింది. చీకట్లో ఖాళీ ప్రదేశమంతా భయంకరంగా కనిపిస్తోంది. మున్నాళ్ళ ముచ్చటగా తయారయిన వాసుగాడి బ్యాడ్ మింటన్ కోర్టు చరిత్ర ఆ ప్రదేశాన్ని ఏమీ శుభ్రం చేయలేకపోయింది.
రాధ ధైర్యంగా అలాగే నిలబడి వుంది. చీకటిని చూసి భయపడే స్వభావం ఆమెకు చిన్నతనం నుంచీ లేదు.
కొంతసేపు గడిచాక బయటగేటు దగ్గిర అలికిడి వినపడేసరికి కొంచెం త్రుళ్ళిపడి అటు చూసింది. చీకటి తెరలలో కలుసుకుపోతూ అక్కడో మనిషి తచ్చాడుతున్నాడు. రాధ ఒక నిమిషం మాత్రం తటస్థంగా నిలబడి, మెట్లుదిగి అటుకేసి నడిచింది. ఆమెకు అభిముఖంగా వ్యక్తి నడిచి వస్తున్నాడు.
"రాధా" అన్నాడతను కంపిత స్వరంతో.
ఆమె కొద్దిసేపు తటపటాయించి, చివరికి ధైర్యంగానే "నా పేరు పెట్టి పిలిచే అధికారం ఎవరిచ్చారు మీకు?" అంది రూక్షస్వరంతో.
అతను కొంచెం కంగారుపడినట్లు కనపడేసరికి "మీకు నేను మర్యాద ఇచ్చి మాట్లాడతాను, మీరూ అలాగే మాట్లాడండి" అంది.
"నేను నీకు మర్యాద ఇవ్వలేదని ఎందుకనుకొంటావు?"
రాధ కటువుగా "ఒక పరాయి ఆడదానికి ఇలా వుత్తరాలు రాసి పంపటం మర్యాదని యెవరంటారు?" అంది.
ఆనందరావు ఈసారి కొంచెం చనువు తీసుకుంటూ "నువ్వు చాలా పొరపాటులో వున్నావు. నా ఉద్దేశాన్ని అవగాహన చేసుకోవటంలో తప్పుదారి తొక్కావని నిశ్చయంగా చెప్పగలను" అన్నాడు.
రాధ తన ధోరణి మార్చకుండా "మీ ఉద్దేశాలు తెలుసుకొందామని నేను రాలేదు. ఇలా ఇంకెప్పుడూ చేయకుండా చెబుదామని వచ్చాను" అంది.
అతను తెల్లబోయి మాట్లాడకపోయేసరికి తనే---
"ఏం చూసుకుని మీరింత సాహసం చేశారు? ఒక అమాయకుడయిన కుర్రవాడికిచ్చి ఉత్తరం పంపించారే! అది ఇంకెవరి చేతుల్లోనయినా పడితే పర్యవసానం ఎలా వుండేదో ఆలోచించారా? ఏమనుకుంటారో కాస్త చెప్పండి" అని అడిగింది.
"నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటంలేదు."
"అర్థం చేసుకోవడం, చేసుకోకపోవటం అలా ఉంచండి. ఇదే సన్నివేశం ఇప్పుడు మావాళ్ళు ఎవళ్ళయినా చూస్తే ఏమనుకొంటారు? నా గతి ఎల్లావుంటుంది? సమాధానం సూటిగా చెప్పండి!!
ఆనందరావు కొంచెంసేపు వూరుకొని "నేను చెప్పేది పూర్తిగా వినకుండా నన్నేదో ప్రశ్నలువేసి సమాధానం చెప్పమంటే ఆ మాటకు అర్థం లేదు. నిన్ను నేను మళ్ళీ ధైర్యం చేసి 'రాధా' అని పిలుస్తున్నాను. రాధా, మన ఇద్దరి మధ్యా ఇప్పుడు నడుస్తున్న సంభాషణ ఒక విచిత్రమైన సంగతి. ఒక విపరీత పరిస్థితిలో మనం కలుసుకొని మాట్లాడుతున్నాం. కేవలం ఆవేశంతో నీకు కాగితం ముక్క పంపించి పరుగెత్తుకు రాలేదు. ఈ నిశ్చయానికి ముందు ఎన్నో రోజులు బాధపడ్డాను. కడసారిగా చేసుకొన్న నిశ్చయంతో నీ దగ్గరకు వచ్చాను" అని మళ్ళీ రాధ ఏదో అనబోయే లోపలే "ప్రేమ అనేదాన్ని నేనెప్పుడూ ఒక బూటకం అని అనుకునేవాడిని. కాని ఇప్పుడొక భావన తెలియకుండానే కరిగి కరిగి హరించిపోయింది. నెనుఇ చెప్పేది నిజం" అన్నాడు.
రాధ నిశ్శబ్దం వింది. అతని మాటలకు ఆమెకు ఎటువంటి జవాబు చెప్పాలో తెలియలేదు. 'హఠాత్తుగా ఒక విపరీత పరిస్థితిలోకి తీసుకుపోబడతాను' అని ఆమె ముందుగా ఎన్నటికీ వూహించుకోలేదు.
తిరిగి అన్నాడతనే "నాకు తెలుసు, నేనంటే నీకిప్పుడు అసహ్యముగా ఉంది. అదంతా నేను చేసుకున్నాను. కొంతమందిలాగ గంభీరంగా ప్రవర్తించటం నాకు చేతకాదు. లేకపోతే మన ఇద్దరిమధ్యా జరిగిన సంభాషణ కొంచమే అయినా, నువ్వు మాట్లాడింది చాలా స్వల్పమే అయినా ఒక నూతన సత్యాన్ని కనుగొన్నాను."
"ఏమిటి" అని రాధ ప్రశ్నించకపోయినా అతనే చెప్పాడు.
"ప్రేమ అనే వస్తువుకు అదియెవరి మనసుల్లో వాళ్ళు దాచుకున్నప్పుడే విలువ. అప్పుడది చాలా ఉదాత్తమైనదిగా పరిగణించబడుతుంది. దానికి ఓ పర్యవసానం అంటూ లేదు. ఎవరైనా మనసులో వుంచుకోలేక 'నిన్ను నేను ప్రేమించాను. అని చెబితే చాలా హాస్యాస్పదంగా కనబడుతుంది. లోకం అతన్ని గేలిచేస్తుంది. ఇదివరకు అతన్ని గౌరవంగా చూసిన వ్యక్తులే ఇప్పుడు తేలికగా చూడనారంభిస్తారు.
ఈ అద్భుత పరిస్థితులలోంచి ఎంత త్వరగా తప్పుకుపోదామా అని వుంది రాధకి. అందులోనూ అతను చెప్పే విషయాలు ఆమె మనసుని కలతపెడుతున్నాయి. "మన ఇద్దరిమధ్యా ఇది బావుండలేదు. మంచిగా చెబుతున్నాను, వెళ్ళండి" అంది అతని మాటలకు కత్తెరవేస్తూ.
ఆనందరావు ఈసారి తెల్లబోలేదు. గిరుక్కున వెనక్కీ తిరిగి "ఎలాగూ వెళ్ళిపోతున్నాను. ఇవ్వాళ్ళ జరిగినదానివల్ల నాకు మనశ్శాంతీ లేదు" అని ఇంకో రెండడుగులు వేసి "కాని రాధా- నీకు నేను కష్టం కలిగించినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. అందుకు నన్ను క్షమించు" అని. ఇంక అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు.
రాధ కొంచెంసేపు అక్కడే మ్రాన్పడిపోయి నిలబడింది. తర్వాత తెలివి తెచ్చుకుని, ఈ లోకంలోపడి కల్లోల మైన మనస్సుతో ఇంట్లోకి వచ్చింది.
పడుకున్నా ఆమెకు చాలాసేపటిదాకా నిద్రరాలేదు. "ఇదంతా ఎవరైనా చూశారా?" అని కొంతసేపు వేదనపడింది.
హఠాత్తుగా ఆమెలో ఒక ప్రశ్న ఉదయించింది.
"ఏం జరిగింది? ఏం జరిగింది?"
ఈ ప్రశ్న చిన్నదే. జవాబు మాత్రం ఎంతయినా వుంది. అందుచేతనా జవాబు చెప్పుకోవడానికి కూడా ఆమె భయపడి వూరుకుంది.
"ఇవాళ చాలా విచిత్రమైన రోజు" అనుకొంది నిద్రపోయేముందు ఒకసారి.