రామారావుగారన్నారు "ఆవిడ చనిపోయి ఎనిమిదేళ్ళయింది. అప్పట్నుంచి నేనే దాన్ని పెంచుకొస్తున్నాను. శకుంతల అంటే నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. మళ్ళీ పెళ్ళికూడా చేసుకోలేదు. ఆవిడ పోతూ మరో పెళ్ళి చేసుకోమని ప్రాధేయపడి చేతిలో చేయి వేయించుకుంది. ఏం చెయ్యను? అప్పుడు ఒప్పుకోకపోతే ఆమెకు ఆత్మ సంతృప్తి కలగదు. ఈ వొట్టులను, వాగ్ధానాలను తన కోరికలను తీర్చుకోవటానికి పరికరాలుగా ఉపయోగించుకోవటం కన్నా, పరిస్థితులకు అనుగుణంగా ఉండటం కోసం ఉపయోగించటం మంచిదంటాను. శకుంతల ఇప్పుడు పెద్దదయింది. ఇంటర్ దాకా చదువుకొంది. ఇప్పుడు పెళ్ళి చేయాల్సిన సమయం కూడా వచ్చింది. దాని పెళ్ళి విషయంలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఎప్పుడూ నేను ఇవ్వలేదు. అలా అని ఇవ్వకుండానూ లేను. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా తెలివిగా గ్రహించగలుగుతారు. కొన్ని విషయాల్లో అయిదేళ్ళ కుర్రాడు గ్రహించగలిగినపాటి గ్రహించలేకపోతారు. అందుకనే ......."
శకుంతల రావడంతో ఆ ప్రసంగం ఆగిపోయింది.
"ఎప్పుడొచ్చారు నాన్నా?" శకుంతల డాబా మీద నుంచి దిగి వచ్చిందే తడువుగా అడిగింది.
ఆ సమయంలో ఆమె స్వరూపం చూసి విస్మయం కలిగింది ప్రకాశరావుకు. ఆమె విశాల విప్పారిత నేత్రాలు, నునుపైన చెంపలు, నల్లని కురులూ, ఎంత అందంగా కన్పించాయో. అంత సూతనంగా, భావస్పోరకంగా కనిపించాయి అతనికి. ఆ కళ్ళల్లో కన్పిస్తున్న నవ్యత్వానికి కారణం పైన కూర్చుని ఆలోచించటమే అనుకున్నాడు.
"ఒక అరగంటయింది. భోజనం కూడా చేసేశాను - - - "రామారావు చెప్పటం ఇంకా పూర్తికాకముందే.
"నన్ను ఏకాంతానికి భంగం కలుగచేయడం ఇష్టంలేక పిలువలేదు."
"నేనేమీ మహాపనులు చేయడం లేదుగా. ఊరికినే పైన నిల్చుని వున్నాను" అంది శకుంతల.
* * *
మరునాడు ఉదయం ప్రకాశరావు తన మకాం తిరిగి గదిలోకి మార్చుకున్నాడు. మూడు నాలుగు రోజుల్నుంచీ ఆ గది మొహం ఎవరూ చూసిన పాపాన పోకపోవటం వల్ల గదంతా ధూళీ దుమ్మూ అంతా చేరి అసహ్యంగా వుంది. పనిమనిషి పొద్దున్నే వచ్చి అంతా శుభ్రం చేసి వెళ్ళింది.
ఏడయ్యేసరికల్లా ప్రయివేటు చెప్పించుకొనే కుర్రాళ్ళు ముగ్గురూ వచ్చారు. ఈ ముగ్గురూ ధనవంతుల కొడుకులే. వీళ్ళకు ప్రయివేట్లు చెప్పడం అనేది లేకపోతే ప్రకాశరావుకు ఈ నికృష్టంతో కూడిన పట్టణవాసం కూడా గగన కుసమం అయివుండేది.
తెలివిగల కుర్రవాళ్ళు అసలు ఎప్పుడూ ట్యూషనులు చెప్పించుకోరు. శంకరమూనూ, రెండో కుర్రాడు కాస్త చెబితే అర్థంచేసుకొనేపాటి తెలివితేటలుగల కుర్రవాళ్ళు. లావుగా. పొట్టిగా, వుండే ఆ మూడో అబ్బాయి కాస్త బండరాముడు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రకాశరావు తలప్రాణం తోకకు వచ్చేది.
ఆ ముగ్గురూ వెళ్ళిపోయేసరికి తొమ్మిదయింది. ప్రకాశం అదృష్టవశాత్తు ఇవాళ, ఆ లావుపాటి కుర్రాడు జీతం ఇచ్చి మరీ వెళ్ళాడు. ఇవాళ గూడా స్నానం చేయవద్దని డాక్టరుగారు చెప్పి వెళ్ళినందువల్ల ప్రకాశం లోపలకుపోయి సబ్బుతో ముఖం రుద్దుకొని వచ్చాడు. అతను బయలుదేరబోతుండేసరికి శకుంతల వచ్చింది. కొంచెం దూరంగా నిలబడి "అయితే ఇవాళ వెళుతున్నారన్న మాటేగా!"
"ఆఁ"
"మీ ఇష్టం వెళ్ళవచ్చు. కాని కాస్త జాగ్రత్తగా వుండండి."
ప్రకాశం ఆగి, ఆమెవంక సాభిప్రాయంగా చూస్తూ "నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞుడ్ని. కాని మీరు ప్రతి విషయంలోనూ ఇంత శ్రద్ధ తీసుకొంటుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను" అన్నాడు.
"మీరు చాలా సుకుమారులు. మీ ఆరోగ్యం విషయం మీకు తెలీదు. ఇంట్లో ఒక్క ఆడదాన్ని వుండి ఆ మాత్రం అజమాయిషీ చేయకపోతే మీరు యెలా బాగుపడతారు" అని గంభీరంగానే అడిగింది శకుంతల.
"సరే మీ ఇష్టం" అని ఇవతలకు వచ్చి, గది తలుపులు దగ్గరకు వేసి, "వెళుతున్నానండీ" అని గుమ్మందాకా వచ్చి, మళ్ళీ ఏదో గుర్తుకురాగా ఆగిపోయాడు. అతని చర్యల్ని శకుంతల ఆశ్చర్యంగా పరికిస్తోంది. అతను ఆమె కు అభిముఖంగా నడిచి, బాగా దగ్గరకు వచ్చి ముఖంలోకి చూస్తూ "మీకు కోపం వచ్చిందా?" అని అడిగాడు.
"ఎందుకు-" శకుంతల ఆశ్చర్యంతో ప్రశ్నించింది.
"అయితే మీకు కోపం లేదన్నమాట" అని ప్రకాశరావు ఇహ అక్కడ ఆగకుండా వేగంగా, బయటకు వెళ్ళిపోయాడు.
శకుంతల రద్దీగా వున్న రోడ్డువంక చూస్తూ అలాగే నిలబడింది. క్రమక్రమంగా ఆమె మనసులో ఏవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. ముఖంలో ఏవో వినూత్న భావాలు ద్యోతకమవ్వసాగాయి.
"అమ్మగారూ?"
ఈ పిలుపు విని యెదురుగా చూసింది. ఎవరో, చేతిలో ఏవో బట్టలు పట్టుకొని నిలబడి వున్నాడు.
"ఎవరు?" అనడిగింది.
"నేను, లాండ్రీవాడ్నండి ప్రకాశరావుగారున్నారా?"
"లేరు, ఎందుకు?"
"వారు బట్టలు ఇస్త్రీకి వేసి చాలా రోజులయింది. ఎన్నాళ్ళకూ రాకపోతే నేను పట్టుకొచ్చాను?"
చేత్తో బల్లవంక చూపిస్తూ "సరే, అక్కడ పేట్టి వెళ్ళు" అంది శకుంతల.
అలాగే చేసి, ఏదో సంశయిస్తూ నిలబడ్డాను వాడు.
"ఏమిటి?" అనడిగింది.
"డబ్బులండీ!"
"సరే, ఆయన లేరుగా, సాయంత్రం రా."
వాడు బిక్కమొహం వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కాని ఏమనుకుందో శకుంతల వాడ్ని కేకవేసింది.
"ఎందుకండీ" అంటూ వాడు తిరిగి వచ్చాడు.
"ఎంతివ్వాలి?"
వాడు చెప్పాడు.
"ఉండు" అని ఆమె గబాగబా లోపలికిపోయి డబ్బు తెచ్చి వాడి చేతిలో పెట్టింది వాడు నమస్కారం పేట్టి పోతుండగా ఆగమని "ఆయనిలాగే తరచు బాకీ పడుతుంటారా!" అంది.
"అవునండీ"
"ఎందుచేత?"
"వాడు ఇరకాటంలో పడినట్లు మొహం పెట్టి "ఆయన యెక్కువ డబ్బుగల వారు కాదనుకుంటానండీ"
"సరే, నువ్వుపో!"
వాడు వెళ్ళిపోయాడు. శకుంతల ఆలోచనలో పడింది. ప్రకాశరావు అందరి దగ్గరా అప్పులు చేస్తున్నాడా? మళ్ళీ అవన్నీ ఎలా తీరుస్తాడు?".
ప్రకాశరావుని గురించి ఆమె చాలా తక్కువసార్లు ఆలోచించింది. అతని స్వవిషయాలేమీ ఆమెకు తెలియవు. అతనెప్పుడూ ఆమెతో చెప్పలేదు కూడా. అధవా యెప్పుడయినా అతన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నించినా అతని ప్రవర్తన గురించే గాని; అతని పరిస్థితి గురించి కాదు. బిడియంగా మాట్లాడే అతని స్వభావం; లేనిపోనివి ఊహించుకొని బాధపడే అతని వింత ప్రకృతి వీటిని గురించే ఆమె తలుచుకొని అప్పుడప్పుడూ నవ్వుకొనేది. కాని ఇదేమిటి? ఇవాళ ఈ విషయం విన్న దగ్గర్నుంచీ ఆమె మనసంతా దిగులుతో నిండిపోయింది! తను ఇన్నిసార్లు అతన్తో మాట్లాడినా నిజ పరిస్థితి స్వంత తెలివితేటలతో గ్రహించుకోలేకపోయింది. ఈ క్షణంలో తన ప్రవర్తనకి తనను దూషించుకుంది కూడా. అతను ఇందాక అన్నమాట తమాషాకే అన్నా, అది నిజమే. తనకు తెలియకుండా అతని దగ్గిర చాలా రహస్యాలు వున్నాయి.
ఒకసారి గదిలోకి పోయి అతని వస్తువులన్నీ చూడాలనే వాంఛ ఆమె కెందుకో కలిగింది. లోపలికి పోదామని గదివైపు రెండు మూడు అడుగులు వేసింది కూడా. కాని మళ్ళీ ఏదో గుర్తుకురాగా ఆగిపోయింది. పరాయివాళ్ళ గదికో, ఇంటికో వాళ్ళు లేకుండా వెళ్ళటం ఏమంత సబబయిన పని?
ఆమె వెళ్ళలేక గిరుక్కున తిరిగి ఇంట్లికి వెళ్ళిపోయింది/
8
నాలుగు రోడ్లు కలిసే ప్రదేశానికి కొంచెం ఇవతలగా వున్న ఈ పెద్ద ఇంట్లో వరుసా వాయీ లేకుండా చిన్న చిన్న గదులు చాలా వున్నాయి. పూర్వ పద్ధతిలో కట్టబడిన గృహం అవటంచేత ఒకతీరూ, తెన్నూ లేకుండా ఏ గదికా గది విడివిడిగా వున్నట్టుంటుంది. అవయినా చాలా శిధిలావస్థలో వున్నాయి. చిదంబరం ప్రస్తుత పరిస్థితి ఎట్లావున్నా పూర్వీకులు బాగా ఆర్జించిపోయినవారు కావటంచేత ఇల్లు లేకుండా తమ వంశం వాళ్ళు బాధ పడటానికి ఇష్టం లేకపోయిందా అన్నట్లు రెండు మూడు పెద్ద పెద్ద కుటుంబాలు జీవించే పరిమాణంగల బ్రహ్మాండమైన కొంప నొకదాన్ని అమర్చి వెళ్ళారు. ఆ ఇంటి స్థితిగతులు యిప్పుడెలా వున్నాయీ అంటే అది వేరే సంగతి.
ఆ పెద్ద ఇంట్లో వున్న చాలా గదుల్లో ఏ ఒక్కటీకూడా యిప్పుడు ఆరోగ్యకరమైన పరిస్థితిలో లేదు. అప్పుడప్పుడూ దుమ్మూ ధూళీ క్రింద రాలుతుండటం కద్దు. ముందున్న గదుల్లో చిదంబరం పేకాట కోసం ఒకటి ప్రత్యేకించబడింది. పిల్లల చదువుకోసం యివతలి మరొకటి. నారాయణకు ఒక గది. మధ్యలో అందంలేని ఒక విశాలమైన హాలు. మిగతా గదులు ఎవరికోసమూ ప్రత్యేకించబడకపోయినా అవి ఏ మాత్రం ఖాళీగాలేవు. అవసరంలేని సామానూ, అవసరమున్న సామానూ అవన్నీ వాటిల్లో స్థానం ఆక్రమించుకొని కూర్చున్నాయి.
పేకాట గదిలో ఆవేళ మధ్యాహ్నం మూడు గంటలవేళ ఆటజోరుగా సాగిపోతూంది. ఇద్దరు ముగ్గురు కొత్త మిత్రులు కూడా ఈ రోజు వేంచేశారు. వాళ్ళ రాకతో తన గృహం పావనమైనట్లుగా తలపోశాడు చిదంబరం.
మొదట చప్పుడు ప్రారంభమైనా ఆట క్రమ క్రమంగా మహా ఉధృతంగా సాగిపోయి పసందులో పడి. మళ్ళీ చప్పగా వచ్చేసరికి అందరికి కొంత విశ్రాంతి కావాలనిపించింది. ఆట ఆపి మౌనంగా కూర్చున్నారు.
"ఇహ మేము వెడతామండీ" అంటూ ఆ క్రొత్త మిత్రులు లేచారు.
చిదంబరం ఆశ్చర్యంగా "అప్పుడేనా? సాయంత్రం దాకా కూర్చోరా?" అనడిగాడు.
"ఊహు ! క్షమించండి పనులున్నాయి"
చిదంబరం చేసేదిలేక "సరే మీ యిష్టం. రేపు వస్తారా?"
"అలాగే" అని వాళ్ళు దగ్గర కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చినవాళ్ళు రామ్మూర్తిగారికి దగ్గర బంధువులు కావటం వల్ల ఆయనకూడా లేచి వాళ్ళతో వెళ్ళవల్సి వచ్చింది.
"ఇహ మనం ముగ్గురం మిగిలాం" అన్నాడు అవధాన్లుగారు.
"నే నివాళ అయిదాయినాసరే కదలను" అన్నాడు గంగాధరంగారు.
"అదీ మాట" యీమాట చిదంబరం అన్నాడు.
ఈ ముగ్గురితో పేకాట అయిదు గంటలదాకా నిరాటంకంగా గడిచింది. అప్పుడు "అబ్బాయి వస్తాడు. స్టేషన్ దాకా వెళ్ళాలి" అని అవధానులుగారు హడావుడిపడిపోతూ వెళ్ళిపోయాడు.
"ఎట్లా అయితేనేం యివాళ బాగా గడిచింది"
గంగాధరంగారు ఊఁ కొట్టాడు. తర్వాత "మీరు వేసుకుని రండి, కొంత దూరం అట్లా షికారు పోయివద్దాం" అన్నాడు. చిదంబరం లోపలికిపోయి ఆదరా బాదరా చొక్కా వేసుకుని, కాళ్ళకు చెప్పులయినా లేకుండా గబగబా బయటకు వచ్చేశాడు. ఇద్దరూ బయలుదేరారు. దార్లో ఓ దుకాణం దగ్గర ఆగి చుట్టలు ముట్టించుకున్నారు.