Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 9

 

      "అవంతీ!" పిలిచింది వైజయంతి.
   
    "ఏమిటి?" వెనక్కు తిరిగింది.
   
    "నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా వుంది. అయామ్ రియల్లీ హేపీ".
   
    అవంతి నవ్వుతూ ఆమె చేతిని నొక్కివెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ఇంటికి వెళుతూ దారిలో డైరీ కొనుక్కొని వెళ్ళింది వైజయంతి.
   
    "జీవితంలో చదువు, ఉద్యోగం, పెళ్ళిలాంటివే ముఖ్యమయిన మలుపులనునేదాన్ని ఇన్నాళ్ళు. కాని ఒక మంచి స్నేహితురాలి పరిచయం కూడా జీవిత విధానాన్నే మార్చేస్తుందని తెలుసుకోగలిగాను. ఆలోచిస్తుంటే ఎంత జీవితాన్ని వ్యర్ధంగా గడిపానా అని దిగులేస్తోంది. హైదరాబాద్ జీవితం అంతా సాఫీగా గడిచింది. ఢిల్లీ జీవితం ఓ చాలెంజ్ లా అనిపిస్తోంది. నేనేమిటి, నేనేం కాదల్చుకున్నానులాంటి ప్రశ్నలు మొలకెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు స్థిరమైన జవాబు ఇవ్వగలిగే స్థితిలోకి త్వరలోనే చేరుకోవాలి.
   
    మొదటిరోజే డైరీలో రాసుకుంది. అదే విషయాన్ని స్నేహబృందానికి ఉత్తరం రాసేసింది ఆ రాత్రే.
   
    అనూరాధ దగ్గర్నుంచి వెంటనే జవాబు వచ్చింది తనకు. అవంతి లాంటి స్నేహితురాలు దొరికినందుకు సంతోషంగా వుందని, ఆ స్నేహాన్ని నిలుపుకోమని రాసింది. భార్గవి గుంటూరులో చదువుతోందని కూడా రాసింది. విశాల జవాబే యివ్వలేదు.
   
    నాల్గుదారుల్లో ఒక లింక్ తెగిపోయింది అప్పుడే.
   
    అవంతిని నాలుగు రోజులదాకా కలవలేదు. తను సాధించాల్సినవన్నీ అయ్యాకే కలవాలని నిర్ణయించుకుంది. డబ్బుకి కొదవలేదు. ఆమెకే ఒక ఎకౌంటుంది బ్యాంకులో వారంరోజులు తిరిగేసరికి తన గదిలో పుస్తకాల లైబ్రరీ ఏర్పాటు చేసుకుంది.
   
    ఏం చదవాలి మొదట? చిన్న చిన్న కథలతో, నవలలతో పఠనా వ్యాసంగం మొదలు పెడితే మంచిదనిపించింది. ముందుగా టాగోర్ నవలలు తీసుకుంది. ఆమె చదివిన మొదటి నవల "గోరా".
   
    పార్సీ కుంటుంబంలో పుట్టి, ఆ విషయంతెలియక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగి అతి ఛాందసుడిగా తయారయిన వ్యక్తి కథ అది. సనాతన ధర్మాలను, ఆచార వ్యవహారాలను నిష్టగా పాటించాలనే నమ్మకం కలిగిన వ్యక్తి చివరిలో తెలిసినప్పుడు ఎంత మధనపడతాడో, ఆ వేదానని వర్ణించాడు టాగోర్.
   
    ఆ నవల-ఆమెకు చాలా నచ్చింది. "జన్మతః మనిషి కులం నిర్ణయింపబడదు. అతడి పెరుగుదల, స్వశక్తే అతడి కులాన్ని తెలుపుతాయి" అనుకుంది. ఆ విషయమే డైరీలో రాసుకుంది.
   
    ఆమె చదివిన రెండో నవల చతురంగ అదీ టాగోర్ దే. అయితే ఆ నవల ఆమెలో ఆలోచనల్ని రేకెత్తించింది మరో విధంగా.
   
    తన క్లాసు వెతుక్కుంటూ వచ్చిన వైజయంతిని సంతోషంగా పలకరించింది అవంతి.
   
    "మధ్యాహ్నం లంచ్ కలిసి తీసుకుందాం క్యాంటిన్ కు వస్తావా?" అడిగింది వైజయంతి.
   
    "తప్పకుండా ఏమిటి విశేషం?"
   
    "ఏం లేదు నేను చదివిన ఒక నవల గురించి నీతో డిస్కస్ చేయాలని".
   
    "చాలా సంతోషం వైజయంతీ! ఇంత కొద్ది కాలంలోనే నువ్వు పుస్తకాలు చదవడం, వాటి గురించి చర్చించాలనుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. ఈ శుభసమయంలో నేను పార్టీ యిచ్చేస్తాను మధ్యాహ్నం" నవ్వుతూ అంది అవంతి.
   
    "నాలో ఈ మార్పుకి కారణం నువ్వు. నీకే నేను పార్టీ ఇవ్వాలి కాదనకు" ఎందుకో తెలీదుకానీ - వైజయంతి కళ్ళలో తడి కనిపించింది. ఒక్కోసారి చాలా చిన్న చిన్న కారణాలే-మనసుని ఉద్వేగపరుస్తాయి. వీటిల్లో కృతజ్ఞత మొదటిస్థానం.
   
    "సర్లే ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందాం. క్యాంటిన్ లో కలుస్తాను" తన క్లాసుకి తిరిగి వచ్చింది వైజయంతి.
   
    అవంతి కెన్నో విషయాలు చెప్పాలనుకుంది. తను జాగింగ్ డ్రెస్ కొనుక్కుని ఉదయం కాలనీ గార్డెన్ లోకి పరుగెడుతుంటే తల్లిదంద్రులకి ఎంత ఆశ్చర్యంగా వుందో చెప్పాలనుకుంది. టేబుల్ టెన్నిస్ ఏ క్లబ్బులో వుందో తెలుసుకోవడానికి తనుపడ్డ రెండురోజల అవస్థ కూడా చెప్పాలనుకుంది. తను రాస్తున్న డైరీ చూపించాలనుకుంది. కాని చిన్నపిల్లలాగా ఆవేశపడి పోతున్నాననిపిస్తూందేమోనని ఊరుకుంది.
   
    క్లాసులో కూడా ఆమెకు మంచి పేరొచ్చింది. ఆమె చాలా తెలివి గలదని, క్లాసు అంతటిలో ఫస్టుమార్కు కొట్టెయ్యగలదని అర్ధమయిపోయిందందరికీ.
   
    ఆ రోజు క్లాసులో ఒక పీరియడ్ డిబేట్ కి కేటాయించారు. అది వైజయంతి కాలేజిలో చేరకముందే నిర్ణయించబడింది. అందుకే ఆమెకా విషయం తెలియదు. ఇచ్చిన టాపిక్... "మానవజాతి పురోభివృద్దికి అంతరిక్ష పరిశోధనలు అవసరమా లేదా" అని పేర్లు ఇచ్చినవాళ్ళు బాగా ప్రిపేరయి వచ్చారు.
   
    ప్రపంచమంతా దారిద్ర్యం తాండవిస్తున్న ఈ రోజుల్లో అమెరికా, రష్యాలాంటి సంపన్న దేశాలు అంతరిక్షయాత్రలనీ, పరిశోధనలనీ కోట్ల కొద్దీ రూపాయలు ఖర్చుపెట్టడం అమానుషం అనీ, వాళ్ళు మానవాతా దృక్పథంతో ఆలోచించి లేనివాళ్ళకు సహాయం చేసే కార్యక్రమాలని చేపట్టాలని, అంత ఖర్చు పెట్టినా ఫలితం ఏముంటుందో చెప్పలేం కదాని కొందరు వాదించారు.
   
    మరికొందరు మానవాభ్యుదయానికీ, ప్రగతికీ, అంతరిక్ష పరిశోధనలు అత్యవసరమని మానవుని మేధకి అదో పరీక్ష అనీ వాదించారు. డిబేట్ పీరియడ్ కింకా టైం మిగలడంతో ఎవరో వైజయంతి పేరుని సూచించారు.
   
    ఒక్కనిమిషం బాగా గాభరాపడింది వైజయంతి. కాళ్ళు వణికాయి తనకు ముందు తెలీదనీ, ప్రిపేరయి రాలేదనీ తప్పించుకోబోయింది. కాని లెక్చరర్ వదలలేదు. కొద్దిసేపయినా మాట్లాడాలని అడిగింది. వైజయంతికి ఇలాంటి అలవాటు లేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని లేచి నిలబడింది.
   
    ఆమె మనోగవాక్షం అప్పుడప్పుడే విచ్చుకోవటం ప్రారంభించింది. భావవిహంగాలు నెమ్మదిగా రెక్కలుసాచి ఎగుర్తాయి.
   
    మొదలు పెట్టింది. "ఆరునెలల పసిపాపని వెన్నెల్లో పడుకోబెడితే కాళ్ళు చేతులూ కొట్టుకొంటూ ఆ చంద్రుణ్ణి, నక్షత్రాల్నీ అందుకోవడానికి ఆరాటపడుతుంది. ఇక పెద్దయ్యేకొద్దీ ఖగోళశాస్త్రం చదువుతుంటే చిన్నప్పుడు విన్న కాకమ్మ కథలన్నీ కట్టుకథలని తెలిశాక అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది".
   
    క్లాసులో సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దం. ఆమెలో ధైర్యం పెరిగింది.
   
    "ఆదినుంచీ మానవుడిలో పరిశోధనాత్మకమైన దృక్పథం వుంది. కాబట్టి మనం ఈరోజు ఇలా చదువుకోగలుగుతున్నాం. లేకపోతే ఏ చెట్టుకొమ్మల్లోనో, చెట్ల ఆకులు శరీరానికి చుట్టుకుని కాలం గడుపుతూ వుండే వాళ్ళం.
   
    పుక్కిటి పురాణాలు ఎన్ని ప్రచారంలో వున్నా మన పూర్వీకుల్లో కూడా అంతరిక్షాన్ని శోధించాలన్న కోర్కె వున్నట్లు ఆర్యభట్ట, భాస్కరుడులాంటి ఖగోళ శాస్త్రజ్ఞులద్వారా తెలుస్తుంది. అంతరిక్షాన్ని జయించటం మానవుడికి కేవలం ఆనందం కోసం కాదు. అదొక ఛాలెంజ్. అందుకే కొద్ది సంవత్సరాల క్రితం యూరిగగారిన్ మనదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఆబాలగోపాలం హృదయ పూర్వకంగా ఆహ్వానించారు. రేపు వాలెంటినా వచ్చినా మన స్త్రీలందరం ఎగబడి ఆమెకు ధన్యవాదాలర్పిస్తాం. కారణం ఆ ఛాలెంజ్ ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోబట్టే.
   
    మానవుడి ఈ నిరంతర అన్వేషణలోనే ఈనాడు ఒకరి గురించి ఒకరం తెలుసుకోగలిగాం. కొలంబస్ అమెరికాను కనిపెట్టకపోతే ఏం జరిగేది? వాస్కోడిగామా ఇండియా రాకపోతే ఏం జరిగేది? ఈ విశాల విశ్వంలో మన భూమి ఒక చిన్న భాగం మాత్రమే అని తెలుసుకున్నాం. ఇక ఇతర గ్రహాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.
   
    మరొక్క విషయం అమెరికాలాంటి సంపన్న దేశాలు కోట్లకొద్దీ డబ్బు ఖర్చుపెట్టక మనలాంటి బీదదేశాలకు సహాయంచేస్తే బాగుంటుందని కొందరు సూచించారు.
   
    ఒక్క విషయం అడుగుతాను జవాబు చెప్పండి. మనందరం ఆర్ధికంగా మంచి స్థాయిలో వున్నాం. గుడిసెలో నివసించే పేదవారికి, అపరిచితులకు మనంతట మనం వెళ్ళి సహాయపడుతున్నామా ఎప్పుడైనా? ఇంటికి అడుక్కుతినడానికి వచ్చిన ముష్టివాడికి ఒక ముద్ద పడేసి మన బాధ్యత తీరిపోయిందని సంతోషిస్తాం. మనం సినిమాకు పెట్టే ఖర్చు ఒక పేదకుటుంబానికి ఒకపూట అన్నం పెడుతుందని, సినిమా మానేసి ఎవరికయినా సహాయం చెయ్యగలుగుతున్నామా? మన దేశంలో ధనవంతులంతా తమ అవసరానికి వుంచుకుని మిగిలింది లేనివాడికి ధర్మంచేస్తే మరొకదేశం సహాయం లేకుండానే సగం బీదరికాన్ని తగ్గించవచ్చు. ఆదర్శాలు వల్లించడం సులభం, ఆచరణలో పెట్టడం కష్టం. మనం చేయలేనిది మరొకరు చేయడంలేదని విమర్శించడం సంస్కారం కాదు.
   
    అంతరిక్ష పరిశోధన మనిషి మేధకు, ధైర్యానికి ఒక పరీక్ష, ఒక ఛాలెంజ్ దాన్ని ఎదుర్కొనే ధైర్యం గాని, అవకాశంగాని మనకు లేవు. అవి వున్నవాళ్ళను ప్రోత్సహించడం మన కనీస కర్తవ్యం. అదే నా అభిప్రాయం" ముగించింది వైజయంతి.
   
    క్లాస్ రూం చప్పట్లతో మారుమోగింది తన సీట్లోకి వచ్చి కూర్చుంది వైజయంతి. ఆమె మొహం అఛీవ్ మెంట్ తో వెలిగిపోయింది.
   
    పదిమందిలో నిలబడి మాట్లాడాలంటే భయం తనకు. క్లాసులో టీచరడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి కూడా సంకోచించేది. ఆ రోజుల్లో భార్గవి ఎప్పుడూ వెక్కిరిస్తుండేది. 'టిమిడ్ జీనియస్'....అలాంటిది తనేనా యింత ధైర్యంగా ప్రిపేరవకుండా లెక్చర్ యిచ్చింది? మధ్య మధ్యలో పాయింట్స్ వరస కుదరకపోవడం తెలుస్తూనే వుంది అయినా తడబడలేదు. ఈ ధైర్యం ఎలా వచ్చింది? అవంతితో పరిచయమా?

 Previous Page Next Page