"కంగ్రాచ్యులేషన్స్" అంది అవంతి వైజయంతిని చూడగానే. "ఇప్పుడే నా క్లాస్ మేట్ వనజ కనిపించింది. నేను వస్తుంటే నీ ఉపన్యాసం గురించి చెప్పింది".
"ఏమో అవంతీ! అసలు ప్రిపేరవలేదు. ఏం మాట్లాడానో, యెలా మాట్లాడానో నాకే తెలియదు. ముందుగా అనుకుంటే స్టాటిస్టిక్స్ అన్నీ చూసుకునేదాన్ని కదా అనిపించింది".
"ప్రిపేరవకుండానే చెప్పగలిగావు కాబట్టే అందరూ నిన్ను మెచ్చుకున్నది. చూశావా వైజయంతీ! గెలుపు ఇచ్చిన ఆనందం ఏ వ్యసనమూ ఇవ్వదు. ఇన్నాళ్ళూ నువ్వో పిరికి మొద్దువనుకున్నావు. అసలు నీలో వున్న ధైర్యం గురించి నీకే తెలియదు. ఈ రోజు అవకాశం వచ్చేటప్పటికీ నీలో శక్తి బయటపడింది. నీలో వున్న ఆ పొటెన్షియల్ నువ్వు తెలుసుకోగలిగావు. అదే నిన్ను నువ్వు తెలుసుకోవడమంటే" అంది అవంతి.
తనని తాను తెలుసుకోవటం ఆమెలో ఆ క్షణంనుంచీ మొదలైంది.
3
ఆ రోజు ఆదివారం ఉదయం ఎక్సర్ సైజ్ ముగించుకుని కాఫీ కోసం డైనింగ్ హాల్లోకి వచ్చింది వైజయంతి. అప్పటికే సారధి టీ తీసుకుంటూ పేపరు చదువుకుంటున్నాడు. ఆయన డాక్టరు.
"గుడ్ మార్నింగ్ డాడీ!" సోఫాలో కూర్చుంటూ విష్ చేసింది.
"గుడ్ మార్నింగ్ బేబీ ఎలాగుంది కాలేజీ లైఫ్ అక్కడిలాకాదు యిక్కడ కాంపిటీషన్ ఎక్కువ. బాగా చదవాలి. ఫస్టుర్యాంక్ ని నిలబెట్టుకోవాలి".
"తప్పకుండా డాడీ! నా రాంక్ ఎక్కడికీ పోదు. కాలేజీ మాత్రం చాలా బావుంది. లెక్చరర్లు కూడా అందరూ మంచివాళ్ళు చాలా బాగా చెపుతారు".
"గుడ్ అయితే హెల్దీ కాంపిటీషన్ వుంటుందన్నమాట! అందరూ బాగా చదివేవాళ్ళే వుంటారు. నువ్వింకా కష్టపడాలి. మరి ఈ మధ్య గేమ్స్ కనీ, వ్యాయామం అనీ ఎక్కువ సమయం వృధా చేస్తున్నావు".
అప్పుడే వచ్చిన తల్లి కాఫీ కప్పు వైజయంతి కందిస్తూ "బావుందివరస. అవన్నీ వేస్టని చెపుతున్నారా? దాన్ని యింకా యితర కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాలనుకుంటున్నాను. మీరలా డిస్కరేజ్ చెయ్యకండి. అయినా ఒక డాక్టరుగా మీరు చెప్పాల్సిన విషయం కాదిది" అంది.
తండ్రి నవ్వేడు. "నేను డాక్టరునే కాదు తండ్రిని కూడా జాగింగ్ అంటూ అది చీకట్లో పరుగెత్తడం నీకు భయం కలిగించడం లేదూ? అసలే కొత్త ప్రదేశం".
"నాకు భయం వేయడంలేదు. ఇన్నాళ్ళూ అదింకా చిన్నపిల్లనీ, మన రక్షణ సర్వదా దానిక్కావాలనే ఉద్దేశ్యంతో తప్పుచేశాం. ఈ రోజున తనే ధైర్యం చేస్తోంది. అందుకే నాకు ఆనందంగా వుంది".
"అలా దెబ్బలాడతావేం? నేనేమన్నానని? ఆడపిల్ల....కొత్తప్రదేశం అందుకని జాగ్రత్తపడాలనుకున్నాను అంతే".
"ఆడపిల్ల అనీ, ఒక్కత్తే కూతురనీ మొదటినుంచీ చాలా మంది తల్లిదండ్రులలాగే దానికి మనం పిరికితనం నూరిపోశాం. అబ్బాయి కానీ, అమ్మాయికానీ వాళ్ళ వ్యక్తిత్వం పెంపొందించడం కోసం కష్టపడాలి. ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని యివ్వాలి. నిన్న వాళ్ళ లెక్చరరుట నా దగ్గరకు వచ్చింది. ట్రీట్ మెంట్ కోసం - మాటల సందర్భంలో చెప్పింది వైజూ గురించి వాళ్ళ క్లాసులో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారట. తన బాగోగులు తను చూసుకోగలిగే స్థితికి ఎదిగిందని అప్పుడే అనుకున్నాను. వైజూ! క్లాసులో బాగా మాట్లాడావట కీపిట్ అప్".
"అలాగే మమ్మీ!"
"మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. మా ఫ్రెండ్ కేశవ్ ఇవ్వాళ మనల్ని డిన్నర్ కి పిలిచాడు. వీలవుతుందంటే ఫోన్ చేసి చెప్తానన్నాను. మీ ఇద్దరికీ ఏమైనా పనుందా సాయంత్రం?" అడిగాడు సారధి.
"చాలా టైము వేస్టవుతుంది డాడీ!" అంది వైజయంతి. "నేను చాలా చదువుకోవాల్సింది వుంది".
"కేశవ్ అంటే డాక్టర్ కేశవరావుగారేనా? వెళ్ళాకపోతే బావుండదేమో" అంది రజని.
"ఆ, ఆయనే వాళ్ళమ్మాయి నీకు తెలుసుగా వైజూ! అవంతికదూ ఆ అమ్మాయి పేరు? ఒక్కపూటే గదమ్మా! మధ్యాహ్నం అంతా చదువుకో" అనునయంగా అన్నాడు సారధి.
"అవంతి వాళ్ళింటికా? అయితే నేను రెడీ, వస్తానని చెప్పండి డాడీ" సంతోషంగా అంది వైజయంతి.
అవంతి తండ్రి కేశవరావు సారధికి అసిస్టెంట్ ఆయనకు రింగ్ రోడ్డులో స్వంత ఇల్లుంది.
ఆ సాయంత్రం వైజయంతివాళ్ళు వెళ్ళేసరికి అందరూ ఇంటిముందు లాన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇల్లు చాలా పెద్దగా వుంది. చుట్టూ పెద్ద తోట వుంది.
అందరూ టీ తీసుకున్నారు.
"పద నా రూం చూపిస్తా నీకు" పిలిచింది అవంతి.
ఇల్లు లోపల చాలా ఆధునాతనంగా వుంది. ఖరీదయిన ఫర్నిచర్, శాండిలియర్స్ తో హాలు రాజభవనంలా అనిపిస్తోంది.
వైజయంతి ఆలోచనలో పడింది. అవంతి చాలా సింపుల్ గా వుంటుంది. మెడలో సన్నటి గొలుసు తప్ప వేరే ఆభరణాలు వేసుకోదు. బట్టలు కూడా అంత ఖరీదయినవిగా అనిపించవు. కాలేజీకి బస్సులోనే వస్తుంది. అది చూసి అవంతిది మామూలు మధ్యతరగతి కుటుంబం అనుకుంది. కాని అభిప్రాయం పూర్తిగా మార్చుకోవల్సి వస్తోంది. అవంతి తల్లిదండ్రులిద్దరూ ఖరీదయిన మనుష్యుల్లాగే వున్నారు. మాటల్లో కూడా దర్పం వుట్టిపడుతోంది. తన తండ్రి ఆయనకు బాస్ కాబట్టి మర్యాద యిస్తున్నారేమోగాని లేకపోతే పలకరించేవాళ్ళు కూడా కాదేమో అనుకుంది.
"ఈ పక్కగది అన్నయ్య గది. అన్నయ్య పిలానీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఫైనల్ ఇయర్ సెలవుల్లో వస్తుంటాడు. ఇది నా గది" తలుపు తీసింది.
చాలా పెద్దగది. ఒక పక్క రెండు పుస్తకాల బీరువాలు, పక్కనే టేబిల్ కుర్చీ వున్నాయి. మరో పక్క డబుల్ కాట్, పక్కనే చిన్న డ్రెస్సింగు రూం, బాత్రూం వున్నాయి.
మరోవేపు పెద్ద బాల్కనీ, అందులో స్టాండింగ్ ఉయ్యాలుంది. తొట్టిలో పూలమొక్కలు వరుసగా పేర్చి వున్నాయి.
"ఇదే నా సామ్రాజ్యం వైజయంతీ! ఇక్కడ నన్నెవరూ డిస్టర్బ్ చెయ్యరు".
ఇద్దరూ ఉయ్యాల్లో కూర్చున్నారు.
"చాలా బావుంది అవంతీ మీ యిల్లు ప్రశాంతంగా హోమ్ లీగా వుంది".
"ఊఁ ప్రశాంతంగానే వుంటుంది. నాకు ఏకాంతం అంటే యిష్టం. ఎక్కువగా యిక్కడే గడుపుతాను. ఈ మొక్కలే నా స్నేహితులు. భోజనానికి తప్ప కిందకి వెళ్ళను. ఎందుకంటే నువ్వనే ఆ హోమ్ లీనెస్ ఇక్కడ లేదు కాబట్టి".
"అంటే? నా కర్ధం కాలేదు అవంతీ!"
అవంతి కాస్సేపు మాట్లాడలేదు. ఏదో ఆలోచనలో పడిపోయింది. చాలా సేపయ్యాక "వైజయంతీ, నేనో ప్రశ్న అడగనా?" అంది సాలోచనగానే.
"అడుగు సందేహం దేనికి?"
"మీ మమ్మీ డాడీ యిద్దరూ బాగా పేరున్న డాక్టర్లు ఈ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళిద్దర్నీ స్పెషల్ గా పిలిపించుకున్నారంటేనే అర్ధమవుతోంది వాళ్ళ విలువేమిటో మా యింట్లో డాడీ ఒక్కరే సంపాదిస్తారు. అమ్మ పెద్దగా చదువుకోలేదు. తాతగారు ఆస్తిపరులని అందరితోటి చెపుతారు. కాని నాకు తెలిసినంతవరకూ వాళ్ళకు ఆస్తి నాన్నగారు కొనిపెట్టిందే మీకు లేనంత ఆస్తి మాకు ఎలా వచ్చిందంటావ్?"
వైజయంతికి ఏం చెప్పాలో తోచలేదు.
"అయిన వాళ్ళమీద అభాండాలు వేస్తున్నానుకోకు వైజయంతీ. వున్నా విషయం చెప్తున్నాను. అమ్మా నాన్న నన్ను ప్రేమిస్తారు. ఏదడిగినా కాదనరు పైగా స్టేటస్ అంటూ యింకా ఎక్కువే ఖర్చుపెట్టమంటారు. అన్నయ్యయితే ఎంత ఖర్చుపెడతాడో చెప్పలేను. అమ్మ యింట్లోనే వుంటుంది కదా, ఆప్యాయంగానే చూసుకుంటుంది.
మాకు కాస్త నలతచేస్తే ఆరాటపడిపోతుంది. అయినా ఏమిటో నాకు ఏదో పరాయి యింట్లో వున్నట్లే అనిపిస్తూంటుంది. కారణం ఏమిటో నాకు చాలా రోజులు అర్ధంకాలేదు. కానీ స్టడీచేస్తే తెలిసింది. నాకీ అసంతృప్తి ఎందుకో?"
"ఎందుకు?" అడిగింది వైజయంతి ఆత్రుతగా.
"ఈ కలిమే దానికి కారణం. నాన్నగారు ఇరవై ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నారు. నిజమే కాని ఇరవై ఏళ్ల సర్వీసులో ఫామిలీని ఇంత హైలెవల్ లో మెయిన్ టెయిన్ చేస్తూ యింత ఆస్తి ఎలా సంపాదించగలిగారు? ఊళ్ళో బోలెడు ఆస్తి కొన్నారు. అదంతా అమ్మమ్మ పేరు, తాతగారి పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఈ డబ్బంతా ఆయన న్యాయంగా సంపాదించడం లేదా? నాన్నగార్ని బాగా గమనించాను. మీ డాడీ రాకముందు ఆయనే హాస్పిటల్ కి పెద్ద సర్జన్. ఆయన యింట్లోనే ప్రాక్టీస్ చేస్తారు. కన్సల్టేషన్ ఫీజు వంద రూపాయలు. రోజుకి రెండువేల రూపాయలు వస్తుందన్నమాట. పోనీ ఆయన చాలా గొప్ప డాక్టరని డబ్బున్నవాళ్ళు ఇస్తున్నా ఫరవాలేదు. అతి సామాన్యుడికి కూడా అదే చార్జి. ముందు డబ్బు చేతిలో పడితేకాని హాస్పిటల్ లో ఆపరేషన్ సరిగా జరగదు. ఇంటికి అనధికారికంగా వచ్చే బహుమానాలకు లెక్కలేదు. ఒకపూట బయట భోజనానికి వెళితే మా ఖర్చు రెండు వందలు, కానీ మా ఇంట్లో వంటవాడికి మేమిచ్చేది నెలకు వందరూపాయల జీతం మేము తినే భోజనం అతడు చెయ్యకూడదు. అన్నం పప్పుతో సరిపెట్టుకోవాలి. వంటకాలు పాడయిపోతున్నా ఫరవాలేదు. పనిమనిషికి మాత్రం యివ్వకూడదు. పనిమనిషి నాలుగురోజులు జ్వరం వచ్చి పని మానేస్తే అమ్మ జీతం తెగ్గోసి ఇస్తుంది. ఇంట్లో నౌకరుమీద అన్నీ అనుమానాలే ఎందుకోసం ఇంత సంపాదన? ఎన్ని తరాలకు కావలసింది సంపాదిస్తారు? మా కోసం అంటారు. నాకు నచ్చదు. అంత అన్యాయంగా మాకోసం సంపాదించాల్సిన అవసరం లేదంటాను. అందుకే నేనంటే కోపం వెన్ యు స్టార్ యనలైజింగ్ ఇట్ స్టార్ట్స్ హార్టింగ్ విజూ!"