జీన్స్, షర్టూ వేసుకున్న అమ్మాయి తన పక్కనుంచే నడవటం గమనించి ధైర్యంగా అడిగేసింది. "ఎక్స్ క్యూజ్ మీ! బి.ఏ. ఫస్టియర్ క్లాసెస్ ఎక్కడో చెప్తారా?" అని.
చిన్నగా నవ్విందామె. తనకన్నా రెండు మూడేళ్ళు పెద్దది ఆమె. కానీ వయసుకి మించినదేదో వుంది ఆమెలో.
"చూపిస్తాను... కమ్...." తెలుగు ఇంగ్లీషు కలిపి అంది.
"మీరు?" ఆశ్చర్యంగా అంది వైజయంతి.
"నేను అవంతిని చాలా సేపటినుంచీ మిమ్మల్నే గమనిస్తున్నాను. ధైర్యంచేసి వస్తారా, లేదా అని"
వైజయంతి బిత్తరపోయింది ఒక్కక్షణం అంతలోనే నవ్వేసింది.
"ఇదేం జోకు అని నవ్వుకుంటున్నావా? చెప్తాను నిన్న మా నాన్నగారు చెప్పారు. నువ్వు ఈ ఊరికి కొత్తని, కాలేజీకి కొత్త అని భయపడుతున్నావని కాస్త ధైర్యం చెప్పమన్నారు. నిజం చెప్పాలంటే పిరికివాళ్ళను చూస్తే నాకు మంట. ఎంత కొత్త ప్రదేశమయినా మూడేళ్ళు చదవాల్సిన కాలేజి కదా! భయపడ్డం దేనికీ అనిపించింది. నువ్వు క్లాసు ఫస్టు అనికూడా చెప్పారు సరే, నేను పలకరించకపోతే క్లాసు కెళ్ళకుండా యింటికి తిరిగి వెళ్ళిపోతావా అని చూశాను. నాన్నగారు చెప్పడం నిజంగా నువ్వంత పిరికిదానివని!! అందుకే అలా చేశాను. ఏమీ అనుకోకేం".
"అనుకునేదేముంది? మీరు మంచిపని చేశారు. పిరికితనం మంచి లక్షణం కాదుగదా!"
"ఎగ్జాట్లి! అదే నేను అనేది ఒక్కసారి ఆలోచించు. కొత్త కాలేజీకి వచ్చినప్పుడు ఎవరికీ నువ్వు భయపడాలి? లెక్చరర్లకీ, ప్రిన్సిపాల్ కీ కాదు, తోటి స్టూడెంట్స్ కి? కాస్త రాగ్ చేస్తారేమో అని, అదీ సరదాగా తీసేసుకోవచ్చు మర్నాటినుంచీ వాళ్ళే స్నేహితులవుతారు. నేను నిన్ను చిన్నబుచ్చాలని అనడం లేదు. మొదటి పరిచయంలోనే యిలా మాట్లాడుతున్నానని అనుకోకు. ఆలోచించు, నేనన్నదాంట్లో తప్పేమయినా వుందేమో సరే అదే, ఆ కుడివైపుదే నీ క్లాసు, నేను వెళ్తానిక ఒంటిగంటకు లంచ్ టైమవుతుంది. అప్పుడొస్తాను. కాంటీన్ కెళ్ళి భోంచేద్దాం".
"అలాగే! నేను యిక్కడే వెయిట్ చేస్తాను".
అవంతి నవ్వేసి వెళ్ళిపోయింది.
కొత్త అమ్మాయిని చూడగానే నలుగురు అమ్మాయిలు ముందుకు వచ్చారు. వైజయంతి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఒక్కదాన్ని చేసి ఏడ్పించేస్తారేమోనని.
"నా పేరు శీతల్. శీతల్ గుప్తా క్లాసు లీడర్ని" పరిచయం చేసుకుందో అమ్మాయి.
"నా పేరు వైజయంతి. హైదరాబాద్ నుంచి వచ్చాను" సమాధానం చెప్పింది.
వెంట తీసుకెళ్ళింది శీతల్. క్లాసులో అరవైమంది స్టూడెంట్సున్నారు. క్లాసు చాలా పెద్దది. అందరికీ పాఠాలు వినిపించడానికి మైకూ నాలుగుపక్కలా సౌండ్ బాక్సులూ వున్నాయి. గదిలో నాలుగు ఫ్యానులు ఫిక్స్ చేసున్నాయి.
అసలా కాలేజీలో రాగింగ్ లాంటివి జరగవని, చాలా డిసిప్లీన్డ్ గా వుంటారని అప్పుడు తెలిసింది. అందుకే కాబోలు అవంతి అలా అంది.
లెక్చరర్సు కూడా పాఠాలు బాగా చెప్పారు. సెకండ్ పీరియడ్ అవగానే పది నిముషాలు రిసెస్ యిచ్చారు. అప్పుడు ఆలోచనలో పడింది వైజయంతి.
అవంతి చాలా ఫ్రాంక్ గ మాట్లాడే అమ్మాయిలా అనిపించింది. ఆమె అన్నదంతా కరక్టేనని తనకూ తెలుసు. ఎందుకో తనలో యింత భయం. అవంతి కూడా ఈ కాలేజీలో లేకపోతే ఏం చేసేది? అమ్మానాన్నను వెంటబెట్టుకుని కాలేజీకి రాదుగా ఆ మాత్రం ఎందుకు ఆలోచించలేకపోయింది తను?
లేదు తనింకా మారాలి. అవంతి లాంటి వాళ్ళనుంచి తనెంతో నేర్చుకోవాలి. లంచ్ టైంలో అవంతి రాకపోయినా కాంటీన్ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాలి. అవంతి దృష్టిలో తను పిరికిపందలా సృష్టించబడకూడదు.
పెరుగుదలకి సంఘర్షణ పునాది! ఆలోచన కట్టడం!! వ్యక్తిత్వం భవంతి!!!
లంచ్ బెల్ అయిన రెండు నిముశాలకే వచ్చేసింది అవంతి అప్పటికే ఒకరిద్దరు లంచ్ కి ఆహ్వానించారు. తన స్నేహితురాలు వస్తుందని చెప్పింది.
"ఇక్కడంతా సెల్ఫ్ సర్వీసు చెప్పు ఏం తీసుకుంటావు? ఊతప్పం, ఇడ్లీ దొరుకుతాయి. వెజిటబుల్ బిర్యానీ, బోలే, బతూరా వుంటాయి".
"బోలే తీసుకుందాం ఇద్దరం తీసుకుందాం" అంది వైజయంతి.
"గుడ్! అలా వుండాలి రా" తీసుకెళ్ళింది ఇద్దరూ టోకెన్లు తీసుకుని టిఫిన్ ప్లేట్లతో టేబుల్ దగ్గర కూర్చున్నారు.
"ఇప్పుడు చెప్పు, నీ హాబీలు ఏమిటి?" అడిగింది అవంతి.
"హాబీలంటూ స్పెషల్ గా ఏమీలేవు. ఎప్పుడయినా పుస్తకాలు చదువుతాను తెలుగు, ఇంగ్లీషు నవలలు అంతే".
"అంటే నీకు టైమెలా గడుస్తుంది మరి?" అడిగింది అవంతి ఆశ్చర్యంగా.
"కాసేపు రేడియో వింటాను. క్లాసు పుస్తకాలు చదవాలిగా ఎక్కువగా చదువుతూంటాను సినిమాలు చూస్తూంటానప్పుడప్పుడూ".
"నాన్నగారు చెప్పారు. నువ్వు చాలా తెలివిగలదానివని. మీ కాలేజీకి ఫస్టు వచ్చావని, అంటే నీలో తెలివితేటలు బాగా వున్నాయన్న మాట. ఆలాంటప్పుడు రోజుకో రెండు గంటలు క్లాసు పుస్తకాలు చదివితే చాలదూ?"
"నిజమేననుకోండి కాని చేయడానికి వేరే పనిలేక మళ్ళీ మళ్ళీ చదువుతుంటాను. ఇంకోటి... క్లాసులో ఫస్టు రాకపోతే నాకు చాలా బాధగా వుంటుంది. ఎప్పుడూ మనసులో అదే భయంగా వుంటుంది".
"బావుంది, అదో అబ్సెషన్ చూడు వైజయంతీ! ఏ రోజుపాఠాలు ఆ రోజు చదువుకునేప్పుడు రోజుకో రెండు గంటలు చదువుకి కేటాయిస్తే చాలు మరికాస్త సమయం నీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చుగా".
"నిజమేననుకో! కాని ఆ కథలు అవి చదవడం టైంవేస్టనిపిస్తుంది".
"మంచి పుస్తకం మంచి స్నేహితుడి వంటిది ఫిక్షన్ గానీ నాన్ ఫిక్షన్ గానీ చదివినప్పుడు నీలో ఆలోచన కలిగించేది మంచి పుస్తకం చలం నుంచి వివేకానంద బోధనల వరకుగానీ గాంధీ, నెహ్రూ, లింకన్, టాగోర్ ల జీవిత చరిత్రలు గానీ మనలో చైతన్యాన్ని కలిగిస్తాయి. శరత్, టాల్ స్టాయిల కథలు చదువు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. అందరి అభిప్రాయాలు మనకు నచ్చాలనేం లేదు. మనలోనే ఏదో విధమైన రియాక్షన్ రావాలి. అప్పుడే ప్రతి విషయాన్ని విశ్లేషించే అలవాటు కలుగుతుంది".
"నిజమేనేమో! నేనెప్పుడూ ప్రయత్నించలేదు" ఒప్పుకుంది వైజయంతి.
"నేనేదో ఉపన్యాసాలిస్తున్నాననుకోకు వైజయంతీ! కేవలం క్లాసులో ఫస్టు రావడమొక్కటే మనం సాధించే అభివృద్ధి కాకూడదు. అప్పుడు మన తెలివి క్లాసు పుస్తకాల వరకే పరిమితం అయిపోతుంది. మనం ఈ వయసు నించే ప్రాధాన్యత యివ్వాల్సిన విషయాలు రెండు ఒకటి శారీరక వ్యాయామం, రెండోది మానసిక వ్యాయామం అన్ని యాక్టివిటీస్ లో పాల్గొనగలిగినప్పుడే మనం నిజమైన అభివృద్దిని సాధించగలం. ఎన్.సి.సి.లో చేరావా ఎప్పుడైనా?"
"స్కూల్లో వున్నప్పుడు కొంతకాలం చేరాను. కాని క్యాంపుల కెళ్ళాలంటే భయం వేసేది. అమ్మ పంపేది గూడా కాదు. అందుకే వదిలేశాను".
"నీ కిష్టమైతే మళ్ళీ చేరు. నేను తీసుకెళతాను. అసలు రోజూ ఉదయం వ్యాయామం చేయడం చాలా అవసరం మనకు".
"నిజమే, అవంతీ! ఇన్నాళ్ళూ నేనిలా ఆలోచించలేదు. ఇప్పుడు తెలుస్తోంది నేను నేర్చుకోవలసింది చాలా వుందని-ఇన్నాళ్ళూ చాలా టైం వేస్టు చేశానని ఈ రోజునుంచే మొదలుపెడతాను పుస్తకాలు చదవడం".
"ఇంకో విషయం చెప్పనా, జరిగిపోయిందాని గురించి పదే పదే విచారించకు ఎన్నింటికి లేస్తావు?"
"రాత్రి పదిన్నరా, పదకొండవుతుంది పడుకోడానికి ఉదయం ఆరింటికి లేస్తాను".
"అయిదున్నరకే లేవడం అలవాటు చేసుకో ఒక గంటసేపు జాగింగ్ చెయ్యి ఒక గంట చదువుకి వినియోగించుకో సాయంత్రం ఏదైనా గేమ్ ఆడు నీ శరీరానికి వ్యాయామం కలిగించే ఏ గేమైనా సరే".
"నాకు టేబిల్ టెన్నిస్ యిష్టం. డాడీని అడుగుతాను. దగ్గర్లో క్లబ్బేమయినా వుందేమో కనుక్కోమని".
"అదిగో మళ్ళీ అదే వద్దు. ప్రతి విషయానికి తల్లిదండ్రుల మీదో మరొకరి మీదో ఆధారపడకు. అమ్మా నాన్నకు టైం లేకపోతే నీ కార్యక్రమాలన్నీ మానేసుకోవు గదా. మొదటి పరిచయంలోనే ఇలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నావా? రెండు కారణాలు. ఒకటి రేపు నీతో ఇంతసేపు మాట్లాడే అవకాశం నాకు లేకపోవచ్చు. రెండోది టైం వేస్టు చేయటం అనేది నాకు నచ్చని విషయం. ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ గడపడం నాకు అస్సలు గిట్టదు. ణ ఆభిప్రాయాలు ఈ రోజే నీకు చెప్పాను కాబట్టి నీకు యిష్టం అయితే మన స్నేహం పెరుగుతుంది. లేకపోతే అందరిలా హలో అంటే హలో అని పలకరించుకునే వరకే వుంటుంది".
వైజయంతి నవ్వింది ఆమె నిర్మొహమాటానికి.
"నువ్వన్నది అక్షరాలానిజం. స్నేహం బాగా పెరుగుతుందనే నా నమ్మకం".
వాళ్ళు టీ తాగుతుండగా బెల్ మ్రోగింది. బయటపడ్డారిద్దరూ.
"సరే నాకిక క్లాసు తెలిసిందిగా, వెళతాను త్వరలోనే కలుద్దాం".
అవంతి నాలుగడుగులు వేసింది గేటువైపు.