Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 9

  

      "తర్వాత...?"
   
    "నా ఎక్స్ పెక్టేషన్ కు విరుద్దంగా యుటెరస్ రప్చరయింది."
   
    "ట్రయల్ లేబర్ కోసం ఎన్నిగంటలు వెయిట్ చేసివుంటారు?"
   
    డాక్టర్ మైథిలి కొంచెం ఆలోచించుకుని "రెండు మూడు గంటలు పట్టి వుంటుంది."
   
    "మీరేం అనుకోకండి. అంతసేపు యుటెరస్ ఎప్పుడైతే డైలేట్ కాలేదో, డ్రగ్స్ కి రెస్పాన్స్ రాలేదో ఇమ్మీడియట్ గా సిజేరియస్ చేసి వుంటే పేషెంట్ సర్ వైవ్ అయే అవకాశం వుండేదికదా?"

    "సిజేరియన్ చెయ్యడంలో మాత్రం కాంప్లికేషన్స్ లేవా?" అని డాక్టర్ మైథిలి ఎదురుప్రశ్న వేసింది.
   
    "ఉన్నా... అప్పుడు సిజేరియన్ యిండికేషన్ స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆపరేషన్ బెటర్ ఛాయిస్ అయివుండేదేమో."
   
    "డాక్టర్ మాలతీ! అంతా జరిగాక మీరు వచ్చి మాటాడుతున్నారు కాబట్టి పాజిబిలిటీస్ గురించి చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో సిజేరియన్ కన్నా ట్రయల్ లేబర్ బెటరనిపించింది. మీదంతా యంగర్ జనరేషన్. మీకందరకూ సిజేరియన్, కొంచెం బ్లీడింగ్ అయితే హిస్టరెక్టమీల మేనియా వుంది. ఐయామ్ ఓల్డ్ టైమర్. నా దీర్ఘకాల అనుభవం, ఆలోచనా విదానం ప్రొసీజర్ ను యింకోరకంగా టాకిల్ చెయ్యాలని చూస్తాయి. ప్రొఫెషన్ లో సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ వుంటాయి. ఫెయిల్యూర్ కు అందరికంటే ఎక్కువగా నేనూ బాధపడతాను కాని అది నిర్లక్ష్యంవల్ల వచ్చిందంటే ఒప్పుకోను."
   
    "ఇక్కడ ఆలోచనా విదానం, ఎన్నో సంవత్సరాల అనుభవం వేరు. ఫాక్ట్ ని గమనించగలగటం వేరు. ఫెయిల్యూర్ కి బాధపడినంతమాత్రాన నిర్లక్ష్యం లేదంటే ఒప్పుకోను. అయినా నిర్లక్ష్యానికి నిర్వచనంకూడా...."
   
    కోపంతో డాక్టర్ మైథిలి ముఖం ఎర్రబడింది. "యు ఆర్ గోయింగ్ టూమచ్. నన్ను గురించి విమర్శించగల స్తోమతు మీకులేదు. ఆల్ రైట్! మీరిక వెళ్ళవచ్చు."
   
    "మేడమ్.... యిది చాలా...."
   
    డాక్టర్ మైథిలికి యిహ సహనం నశించి బజర్ నొక్కింది. "నా టైం చాలా విలువయింది" అంటూ బజర్ విని ఓ సిస్టర్ లోపలకు వచ్చింది.
   
    "నెక్స్ట్ పేషెంట్ ని పిలు."
   
    ప్రదీప్, మాలతి యిద్దరూ లేచి నిలబడ్డారు.
   
                                       * * *
   

    కారులో తిరిగివస్తుంటే అంది మాలతి "ప్రదీప్! నువ్వు ఒక్కమాటకూడా మాట్లాడలేదే?"
   
    అతను కారు డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లు పరధ్యానంగా వున్నాడు.
   
    "ఆఁ!"
   
    "నువ్వు... ఏవీ పట్టించుకోనట్లు ఊరుకుండిపోయావేం?"
   
    "ఆమె మాటలు అసమంజసంగా వున్నట్లు నాకేం కనబడలేదు. ఆమె సమర్ధతలో నాకున్న నమ్మకం నశించిపోలేదు. మా ప్రొఫెషనే తీసుకో, చాలా నిజాయితీగా పనిచేస్తాం. సర్వశక్తులు ధారపోసి వాదిస్తాం. అయినా ఒక్కోసారి కేసులో ఓడిపోతాం."
   
    "అదివేరు, యిదివేరు. ఇది ప్రాణాలతో చెలగాటం!"
   
    "ప్రాణాలతో చెలగాటం అనవద్దు. ప్రాణాలతో సంబంధంవున్న వృత్తి అను. అంతమాత్రాన ఆ పరిస్థితిలో వున్న వ్యక్తిని దోషిగా నిర్ణయించటం దుడుకుతనమౌతుంది."
   
    "కాని యిలాంటి సంఘటనలే విదేశాల్లో జరిగితే డాక్టర్ మీద సూట్ ఫైల్ చేస్తారు."
   
    "చేసి?"
   
    "అతనికి శిక్ష విధిస్తారు."
   
    "ఒక మహోన్నతమైన వృత్తిలోవున్న వ్యక్తిని దోషిగా నిర్ణయించి శిక్షవిధించటం కన్నా, అతని నిజాయితీని, ఎదుర్కొన్న సమస్యల్ని అర్ధం చేసుకోవటంలో హుందాగా వుంటుందేమో!"
   
    "హుందా!" మాలతి బాధగా అంది. "ప్రదీప్! యింతటి మానవత్వం నీకెక్కడ్నుంచి వచ్చింది? నీ సర్వస్వమైన తోడుని పోగొట్టుకుని యింత విశాలదృక్పథంతో ఎలా ప్రవర్తించగలుగుతున్నావు?"
   
    ప్రదీప్ విషాదంగా నవ్వాడు. "మన సర్వస్వాన్ని పోగొట్టుకున్నంతమాత్రాన విచక్షణాజ్ఞానం లేకుండా ఇతరులమీద నిందమోపటం మంచిదికాదేమో మాలతీ!"
   
                               * * *
   
    కొన్ని కొన్ని సంఘటనలు జరిగాక... ఎంత బాధ కలిగించినా రాను రానూ కాలగమనంవల్ల ఆ బాధను మరిచిపోవటం జరుగుతూ వుంటుంది. కొన్ని సంఘటనలు....జరిగినప్పుడు ఎంత బాధ కలిగిస్తాయో, కాలం గడిచిన కొద్దీ ఆ బాధ పెరుగుతూ మనిషిని తొలిచేస్తూ వుంటుంది.
   
    శ్వేతబిందు చనిపోగానే ప్రదీప్ కు మొదట ఆ షాక్ తో మెదడంతా మొద్దు బారిపోయినట్లయింది. రానురానూ అతనికి జీవితంపట్ల విరాగం, విరక్తి పెరిగిపోయి ఎక్కడకూ కదలటం మానేశాడు. కోర్టుకు కూడా సరిగ్గా వెళ్ళటం లేదు.
   
    ఇంట్లో పనివాడు రామూనే అన్నీ చూస్తున్నారు. పెందలకడనే వచ్చి అయ్యగారికి కాఫీ కలిపిస్తాడు. అతడు పదిసార్లు హెచ్చరిస్తేగాని ప్రదీప్ స్నానానికి లేవడు.
   
    ప్రదీప్ కు ఒకే ఒక్క జూనియర్ వున్నాడు. లాయర్ ప్రకాష్ అతనికి ప్రదీప్ అంటే ఎంతో గౌరవం, అభిమానం.

    కేసులన్నీ వాయిదాలడగమనటమో, యింకెవరికైనా వప్పగించటమో, లేక ప్రకాష్ ని చెయ్యమనటమో చూసి అతని మనసుకు చాలా బాధకలిగింది.
   
    "సార్!" అన్నాడు భయంగానే.
   
    "ఏం ప్రకాష్!"
   
    "మన దగ్గరకొచ్చే కప్లయింట్స్ మీకోసం వస్తారుగానీ, నాకోసమో, ఇతర లాయర్లగురించో కాదు. కొన్నికేసులు సాక్ష్యాలన్నీ పూర్తయి ఆర్గ్యుమెంట్స్ స్టేజ్ కి వచ్చినవి వున్నాయి. ఈ దశలో ఎడ్ జర్న్ మెంట్స్ అడిగో, కొత్తవాళ్ళకి వప్పజెప్పో క్లయింట్స్ కి యిబ్బంది కలిగించటం మంచిది కాదు సార్."
   
    "మంచిదికాదని నాకు తెలుసు ప్రకాష్! కాని ఎంత ప్రయత్నించినా అంతకంటే ఏమీ చేయలేకుండా వున్నాను."
   
    "మీలో చాలా శక్తివుంది సార్! మీవంటి సమర్ధులు అలా క్రుంగిపోవడం..."

    ప్రదీప్ నవ్వాడు. "సమర్ధతను మించింది యింకొకటి వున్నది ప్రకాష్! గతస్మ్రుతి. అది మనుషుల్ని గొప్పవాళ్ళనైనా చేస్తుంది. లేక ఎందుకూ పనికిరాని బలహీనులనైనా చేస్తుంది."
   
    "మీరు మొదటికోవకే ఎందుకు చేరకూడదు సార్!"
   
    "ఆ కోరిక అంతరించిపోయింది ప్రకాష్!"
   
    ప్రకాష్ ఖిన్నుడై అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
   
    ఆ వంటమనిషి రావటంలేదు. రాముకి అన్నం వండటం చేతకాదు. హోటలునించి క్యారియర్ తీసుకొచ్చేవాడు. పదిసార్లు బ్రతిమిలాడి అన్నం వడ్డించేవాడు. రెండుమూడు ముద్దలు తిన్నాక- ఏదో గుర్తువచ్చి గభాల్న లేచి వెళ్ళిపోయేవాడు.
   
    కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా రాము నిస్సహాయంగా చూస్తూ నిలబడి పోయేవాడు.
   
                              * * *

 Previous Page Next Page