ఆమె అతనివంక నడిచి వస్తుంటే సభ్యతకోసం లేచి నిలుచున్నాడు.
"శ్వేతబిందుగారి హజ్బెండ్ మీరేకదూ?"
ఆ గొంతులో ఏదో భావంవుంది. మౌనంగా తల ఊపాడు.
"ఆమెకు అనుకోని కాంప్లికేషన్స్ వచ్చాయి. యుటెరస్ రప్చరయింది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి."
విద్యుద్ఘాతం తగిలినట్టు వొణికాడు. "ఆపరేషనా?"
అవునన్నట్లు తల ఊపింది.
"చెయ్యకపోతే ఏమవుతుంది?"
"....కొలాప్స్ అయిపోతుంది."
"చేస్తే?"
"తల్లిని సేవ్ చెయ్యటానికి కొద్దిగా అవకాశం వుంటుంది. యుటెరస్ రప్చరయింది కాబట్టి ఫీటస్ ఎప్పుడో చనిపోయి వుంటుంది."
ఒక్కక్షణం.
అతను నరాలన్నీ కూడగట్టుకుని ధైర్యం తెచ్చుకున్నాడు.
"చెయ్యండి."
"ఈ కాగితంమీద, పుస్తకంలో సంతకం చెయ్యండి."
వొణికే వ్రేళ్ళతో యాంత్రికంగా చేసేశాడు.
* * *
శ్వేతబిందు స్ట్రెచర్ మీద ఆపరేషన్ థియేటర్ లోకి తరలించబడింది.
ఆమెకళ్ళు తెరిచే వున్నాయి. కాని ఏమి జరుగుతుందో తెలీటంలేదు.
"ప్రదీప్! ప్రదీప్!"
అతన్నొక్కసారి చూడాలి. అడగాలని వుంది. కోరిక వెల్లడి చెయ్యాలని వుంది కాని మాట బయటకు రావటంలేదు.
"ప్రదీప్ ఎక్కడున్నావు నువ్వు! వీళ్ళంతా నన్ను ఏదో చేస్తుంటే రావేం?"
"రావేం.... ప్రదీప్?"
చుట్టూ డాక్టర్లు, సిస్టర్స్ మాస్క్ లు వేసుకుని మసక మసగ్గా కనిపిస్తున్నారు.
అంతకన్నా ఏమీ తెలీటంలేదు.
ఎనస్థటిస్ట్ యింట్రావీనస్ వెన్ టథాల్ సోడియం యిచ్చారు. ఆమె పూర్తిగా తెలివి తప్పిపోయింది.
ఎండోట్రెఖియల్ ట్యూబ్ ద్వారా బాయిల్స్ ఆపరేషన్ కు కనెక్టు చెయ్యబడింది.
కృత్రిమ శ్వాస మొదలయింది.
"యస్ మేడమ్, ప్రొసీడ్."
ముఫ్ఫయి సంవత్సరాల అనుభవంలో, కొన్నివేల ఆపరేషన్లు నిర్వహించిన వ్రేళ్ళు చాలా విశ్వాసంతో, చురుగ్గా కదిలాయి.
పేరా మీడియన్ యిన్ సిషన్.
ఎబ్డోమిన్ ఓపెన్ చెయ్యబడింది.
పెరిటోనియల్ కేవిటీలో ... రప్చర్ యుటెరస్ కారణంగా ఏర్పడిన నెత్తురు మడుగులో శిశువు, ప్లేనెంటాతో సహా మునిగివుంది.
క్షణాలమీద శిశువు, ప్లేనెంటా రిమూవ్ చేసెయ్యబడ్డాయి.
యుటెరస్ ఆర్టరీస్ తెగిపోయి వాటినుంచి దారుణంగా నెత్తురు ప్రవహిస్తున్నది.
వాటిని క్లాంప్ చెయ్యాలి.
ఆ నెత్తుటి ముద్దలో వాటిని వెతికి పట్టుకుని ఆర్టరీ ఫోర్ సెప్స్ తో....
"మేడమ్!" ఎనస్థటిస్ట్ గొంతు కంగారుగా వినిపించింది.
ఆమె తొణకలేదు. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఆ గొంతులు ఎన్నోసార్లు అలా ధ్వనించటం ఆమెకు తెలుసు.
"వాట్ హేపెన్డ్?"
"మేడమ్...."
"యస్...."
"....షి యీజ్ డెడ్."
యుటెరస్ ఆర్టరీస్ క్లాంప్ చెయ్యబోతున్న ఆమెవ్రేళ్ళు ఉలికిపాటుతో ఆగిపోయాయి.
5
ప్రదీప్ కిటికీదగ్గర నిలబడి నీలాకాశంలోకి, ఆ వెనగ్గా విశాలంగా పరుచుకున్న శూన్యంలోకి చూస్తున్నాడు.
శూన్యం!
మనిషిమీద ఒక్కొక్కరి ప్రభావం ఎంత బలంగా విస్తరించి వుంటుంది!
ఆ వ్యక్తి లేకపోతే ఏర్పడే శూన్యం ఎంత దారుణంగా వుంటుంది! ఈ ప్రపంచమే నశించిపోయినట్లు, రుచి హరించుకుపోయి, ఎందుకు బ్రతుకుతున్నామో తెలీనంత నిర్లిప్తంగా, నిరాసక్తంగా....
"ప్రదీప్!"
తల త్రిప్పి చూశాడు. డాక్టర్ మాలతి అతనిదగ్గరగా నడిచి వచ్చింది.
"ఇలా...ఎన్నాళ్ళు?"
"ఎన్నాళ్ళయితే మాత్రం....ఏం మాలతీ?"
"కాని...."
"ఇలా ఎందుకు జరిగింది మాలతీ?"
అతనివంక ప్రశ్నార్ధకంగా చూసింది.
"ఆమెను.. ఎందుకు కాపాడుకోలేకపోయాను?"
"నీ తప్పేం వుంది? ఒక భర్తగా నువ్వు చెయ్యవలసిన ధర్మం పూర్తిగా నిర్వహించావు"
"మరి...?"
మాలతికూడా ఎంతో వేదనగా వుంది. వేదనతోపాటు ఆమెలో కొన్ని అనుమానాలున్నాయి.
"ప్రదీప్!"
"ఊ"
"ఒకసారి శ్రీలక్ష్మి హాస్పిటల్ కి వెళ్ళివద్దాం వస్తావా?"
"దేనికి?"
"డాక్టర్ మైథిలితో మాట్లాడి వద్దాం."
"దేనిగురించి?"
"నాకు కొంత తెలుసుకోవాలని వుంది...."
"తెలుసుకుని....?"
"చెబుతాగా, రా" అతని చెయ్యిపట్టుకుని మృదువుగా లాగింది.
* * *
డాక్టర్ మైథిలి తన ఎ.సి. కన్సల్టింగ్ రూంలో కూర్చునివుంది.
ఎదురుగా ప్రదీప్, మాలతి.
అంతకుముందే డాక్టర్ మాలతి తనని తాను పరిచయం చేసుకుంది.
"మీకభ్యంతరం లేకపోతే శ్వేతబిందు మరణాన్ని గురించి కొన్ని ప్రశ్నలడుగుదామని వచ్చాను" అంది మాలతి.
డాక్టరు మైథిలి కనుబొమలు ముడివడినాయి. "అందులో ప్రశ్నలడగటానికి ఏముంది? డాక్టరుగా మీకు తెలుసు. మనం ఎంత ప్రయత్నించినా సమ్ టైమ్స్ యిట్ హేపెన్స్."
"అవుననుకోండి. కాని ఏం జరిగిందో తెలుసుకుందామని..."
డాక్టర్ మైథిలి కొంచెం అసహనంగా తన రివాల్వింగ్ చైర్ లో అటూయిటూ కదిలింది. ఈ అసహనం అవతలివాళ్ళు ఏదో ప్రశ్నలు వేస్తారన్న భయంవల్ల వచ్చింది కాదు, తన సమర్ధతను యింకొకరు సవాలు చేస్తున్నారన్న చికాకువల్ల వచ్చింది.
"ఇందులో తెలుసుకోడానికేముంది? మొదట ఎల్.ఓ.పీ. పొజిషన్ లో వుంది. తర్వాత ఆర్.ఓ.పి. పొజిషన్ లోకి వచ్చింది. పేషెంట్ కు బి.పి. వగైరా లేవీ లేవు. జనరల్ హెల్త్ బాగానే వుంది. హైట్ కూడా మీడియం హైట్ కన్నా కొంచెం ఎక్కువే. యుటెరస్ డైలటేషన్ మొదట బాగానేవుంది. ఈ పరిస్థితుల్లో నార్మల్ డెలివరీకి అవకాశం వుంటుందనుకున్నాను"అన్నది తన అసహనాన్ని సాధ్యమైనంత కప్పిపుచ్చుకుంటూ.