డాక్టర్ మాలతి ఫోన్ చేసింది.
"ప్రదీప్!"
"మా కజిన్ ఒకతను వచ్చాడు డాక్టర్ రమేష్ అని....గల్ఫ్ కంట్రీస్ లో వుండి వచ్చాడు. అతని గౌరవార్ధం అన్నయ్య ఓ గెట్ టు గెదర్ లా ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు తప్పకుండా రావాలి."
"ఇన్విటేషన్ వచ్చింది. ప్రతాపరావుగారుకూడా ఫోన్ చేసి చెప్పారు.
"నువ్వు తప్పకుండా రా."
"......."
"ఏమిటి?"
"చూస్తాను."
"చూడటంకాదు. తప్పకుండా రా."
"అలాగే."
ఆ సాయంత్రం ప్రదీప్ గెట్ టు గెదర్ కి వెళ్ళాడు. ఆ ఫంక్షన్ ప్రతాపరావు గారి ఇంట్లో ఏర్పాటు చెయ్యలేదు. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఎరేంజ్ చేశారు. గేటు మొదట్లోనే మాలతి నిలబడి అతన్ని రిసీవ్ చేసుకుంది లోపలకు వెళ్ళాక ప్రతాపరావుగారు కనపడి ఆప్యాయంగా పలకరించారు.
కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించాక ప్రదీప్ కొంచెం యిబ్బందిగా ఫీలయ్యాడు. ఎదురుగా తెలిసినవాళ్ళెవరూ కనబడలేదు. నూటయాభయి, రెండు వందల మంది దాకా బఫేడిన్నరు తీసుకుంటూ ప్లేట్లు చేతుల్లో పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నారు. వాళ్ళమధ్యలో ఓ యువకుడు చలాకీగా అటూఇటూ తిరుగుతూ అందర్నీ పలకరిస్తున్నాడు. పొడవుగా, సన్నగావున్న విగ్రహం, హిప్పీ క్రాఫ్ కాకపోయినా పొడవుగా, వొత్తుగా వున్న హెయిర్ స్టయిల్, సఫారీ సూట్ లో వున్నాడు.
మాలతి వెనకనుండి ఎప్పుడు వచ్చిందోగాని ప్రదీప్ ను అతని దగ్గరకు తీసుకెళ్ళి "మా కజిన్, డాక్టర్ రమేష్!.... నా ఫ్రెండ్ ప్రదీప్" అని పరిచయం చేసింది.
"హౌడూయూడూ!" అని డాక్టర్ రమేష్ కరచాలనం చేశాడు.
"ఎన్నాళ్ళయింది మీరు ఇండియా వచ్చి?" అడిగాడు ప్రదీప్ సభ్యతగా.
"వారం దాటలేదింకా. మీరు చాలా సమర్ధులయిన లాయరు అని మాలతి చెప్పింది" అన్నాడు డాక్టర్ రమేష్.
ప్రదీప్ నవ్వి వూరుకున్నాడు.
"మీ గురించి.... మీకు వచ్చిన కష్టాన్నిగురించి కూడా మాలతి చెప్పింది."
ఆ సంభాషణ పొడిగించటం ప్రదీప్ కు రుచించదని మాలతికి తెలుసుగనుక "రమేష్! ఎవరో వచ్చారు చూడు. వెళ్ళి రిసీవ్ చేసుకో" అని అతన్ని అక్కడ్నుంచి పంపించేసింది.
"ప్రదీప్!" అంది మాలతి. "నీకు అందర్నీ పరిచయం చేస్తాను. అందరితో కలసి మూవ్ అవు. అలా క్రమంగా సొసైటీలోకిరా గతాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నించు."
అతను ఏదో జవాబు చెప్పబోయాడు. ఇంతలో ఎవరో వచ్చి ఆమెను పిలిస్తే "ఇప్పుడే వస్తాను" అనిచెప్పి వెళ్ళిపోయింది.
రానురానూ పార్టీ కోలాహలంగా మారింది. డాక్టర్ రమేష్ కొన్ని సంవత్సరాలపాటు విదేశాల్లో గడిపి వచ్చినా అతనికి ఇక్కడ చాలామంది స్నేహితులున్నట్లున్నారు. వాళ్ళంతా చాలా ఖరీదైన దుస్తుల్లో, అరిస్టోక్రేటిక్ గా కూడా వున్నారు. వాళ్ళ ప్రవర్తనకూడా చాలా డాషింగ్ గా వుంది.
ఓ అరగంట గడిచింది.
మాలతి మధ్యమధ్య వచ్చి అతన్ని పలకరిస్తూ ఇంతలో ఎవరో వచ్చి పిలిస్తే వెళ్ళిపోతూ బిజీగా వుంది.
భుజంమీద చెయ్యిపడితే తలత్రిప్పి చూశాడు ప్రదీప్.
నోట్లో సిగార్ తో వున్న ఓ యువకుడు నిలబడి వున్నాడు.
"మిమ్మల్ని డాక్టర్ రమేష్ పిల్చుకు రమ్మంటున్నారు."
"ఎక్కడికి?"
"రూంలోకి."
ప్రదీప్ ఒకక్షణం తటపటాయించి అతనివెంట నడిచాడు.
హాల్లోంచి బయటకొచ్చి మెత్తని తివాచీ పరిచివున్న త్రోవమీద కొద్దిదూరం నడిచి, ఓ డీలక్స్ రూంలోకి వెళ్ళాడు. ఓ ప్రక్కన టి.వి., యింకోప్రక్కన ఫ్రిజ్, ఖరీదైన సోఫాసెట్టు....ఆ గదిలో పదిమందిదాకా కూర్చుని వున్నారు.
"రండి మిస్టర్ ప్రదీప్!" అని డాక్టర్ రమేష్ సాదరంగా ఆహ్వానించాడు.
అప్పుడు గమనించాడు ప్రదీప్. అందరి చేతుల్లోనూ గ్లాసులున్నాయి. టీపాయ్ ల మీద రాయల్ సెల్యూట్ విస్కీబాటిల్, బిస్లరీ సోడాలు, కాజూ, చికెన్ ఫ్రై పీసెస్, ప్రాన్స్ ఇంకా రకరకాల తినుబండారాలున్నాయి.
"కమాన్ మిస్టర్ ప్రదీప్! హావ్ వన్ పెగ్!" అన్నాడు రమేష్ అతనికో గ్లాసు అందిస్తూ.
ప్రదీప్ కొంచెం తడబడి "సారీ! నాకలవాటు లేదు" అన్నాడు.
రమేష్ నవ్వాడు. "అలవాటు లేదా? అలవాటున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని మీ అభిప్రాయమా?"
ప్రదీప్ ముఖం కొంచెం ఎర్రబడింది. "నాకు అలవాటులేదు, అది వున్న యితరులు చెడ్డవాళ్ళని నేను చెప్పలేదే" అన్నాడు.
"మీరేమీ అనుకోకండి. మీకింతవరకూ డ్రింక్ అలవాటు లేకపోవటానికి కారణం?" అని ఒకతను అడిగాడు.
ప్రదీప్ ఎదురుప్రశ్న వేశాడు. "మీరు అలవాటు చేసుకోడానికి కారణం?"
"జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని?"
"డ్రింక్ చెయ్యటంతో వస్తుందా?"
"త్రాగటంతో వస్తుంది అనటంకన్నా....త్రాగకపోతే కొంత ఎంజాయ్ మెంట్ కోల్పోతామన్న మాట నిజం."
అంతా గొల్లుమని నవ్వారు.
"నిజంగా కోల్పోయింది వస్తుందా?" అని ప్రదీప్ నిగ్గదీసి అడిగినట్లు అడిగాడు.
"వస్తుందో లేదో ట్రై చేసి చూస్తే తెలుస్తుంది."
"ఆల్ రైట్ ఐ విల్ ట్రై" అని ప్రదీప్ గ్లాసు నోటిదగ్గర పెట్టుకుని గడగడ త్రాగేశాడు.
"డ్రింక్ అలా తాగకూడదు. మంచినీళ్ళు త్రాగినట్లు."
"....మరి...ఎలా త్రాగాలి?"
"కొంచెం.... కొంచెం సిప్ చేస్తూ...."
రెండో పెగ్గు...."
"ఎలా వుంది?"
"తెలీటంలేదు."
"కోల్పోయింది దగ్గరకు వస్తున్నట్లుగా వుందా?"
కళ్ళముందు శ్వేతబిందు రూపం.
"బిందూ! బిందూ!"
"మిస్టర్ ప్రదీప్!" డాక్టర్ రమేష్ అతడి భుజంమీద చెయ్యివేసి అడిగాడు.
"ఊ"
"ఎలా వుంది?"
"బాగుంది."
"ఐ నో యువర్ ఎగనీ కమాన్.... హావ్ మోర్!"
ప్రపంచం గిర్రున తిరుగుతుంది.
అందరూ తాగుతున్నారు, తింటున్నారు, కేరింతలు కొడుతున్నారు. రకరకాల టాపిక్స్ మాట్లాడుతున్నారు.
"రమేష్! ఇప్పుడేం చెయ్యాలని నీ ప్లాన్" అనడిగాడు మధ్యలో ఓ స్నేహితుడు.
"అదే ఆలోచిస్తున్నాను హాస్పిటల్ పెడదామా? లేకపోతే పెద్ద యిండస్ట్రీ స్టార్టు చేద్దామా అని."