Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 9

                                 

           

                             

 

                                             అధ్యాయం - 3
   

   
   
    ఆఫీసుకి బయల్దేరబోతుండగా "ధరణీ! సాయంత్రం సినిమాకి వెళ్దామా?" అని అడిగాడు శ్రీధర్.
   
    ఏ ఆరు నెలలకో తప్ప శ్రీధర్ అడగడు. కాదనాలనిపించలేదు. "ఓ.కే.!" అంది.
   
    "వంట చెయ్యక్కర్లేదు. బైటే తినేసొద్దాం" అన్నాడు.
   
    ధరణి నవ్వుతూ తల ఊపింది.
   
    "నువ్వలా నవ్వుతూ ఉంటే ఎంత బావుంటావు ధరణీ!"
   
    "నేనే కాదు. నవ్వుతూ ఉంటే ఎవరైనా బావుంటారు"
   
    శ్రీధర్ హుషారుగా విజిల్ వేస్తూ స్కూటర్ స్టార్ట్ చేయబోతుండగా, "సార్ .... నమస్తే..." అంటూ యాదగిరి వచ్చాడు.
   
    ధరణి తాళం వేసి వచ్చింది.
   
    "ఆ ...... నమస్తే.. యాదగిరీ.... ఏమిటి ప్రొద్దుటే వచ్చావు?" అన్నాడు శ్రీధర్.
   
    "అడగనీకి సోంచాయిస్తున్న అన్నా!" ఆనాడు ధరణివైపు చూసి ఇబ్బందిగా.
   
    "ఫర్లేదు చెప్పు" వాచ్ వైపు చూసుకుంటూ శ్రీధర్ అన్నాడు.
   
    "ఏంలే.... జరంత బండి కావాల సార్!" తల గోక్కుంటూ అడిగాడు. శ్రీధర్ తటపటాయించాడు.
   
    ధరణి శ్రీధర్వైపు కాస్త కోపంగా చూసింది. యాదగిరి అలా అడిగి స్కూటర్ పట్టుకెళ్ళడం కొత్తకాదు! మామూలుగా అయితే కాదనక పోయేవాడు.
   
    "ఇప్పుడా? కొంచెం ముందు రావల్సింది. టైం అయిపోయిందిగా" నసిగాడు.
   
    "నీకేంది సార్ ఆటోల పోవచ్చు... అవతల నా పోరికి పానం మీదకి వచ్చి దవాఖానాలో పెట్టిండ్రు.... జల్దిన పోవాలి. లేకుంటే అడిగేవాన్ని కాదు!" అన్నాడు కాస్త గట్టిగా యాదగిరి.
   
    "సర్లే...." శ్రీధర్ బండి తాళాలు అతని చేతిలో పెట్టి పక్కకి తప్పుకున్నాడు. "ధరణీ...." అని పక్కకి చూశాడు.
   
    ఆమె లేదు.
   
    శ్రీధర్ బస్ స్టాప్ వైపు గబగబా నైచాడు. ధరణి వేగంగా నడుస్తూ కనిపించింది. శ్రీధర్ కి తెలుసు తనకి ఇలాంటివి నచ్చవని. ఆమెని ప్రసన్నం చేసుకోవడానికి, "ధరణీ ... ఆగు...." అని స్పీడ్ గా నడిచాడు.
   
    ఆమె ఆగి సూటిగా శ్రీధర్ కళ్ళల్లోకి చూసి, "వాడు అడగగానే మీరు స్కూటర్ ఎందుకిచ్చేసారండీ?" అని అడిగింది.
   
    "పాపం .... వాడి కూతురికి ప్రాణం మీదకి వచ్చిందట" అన్నాడు శ్రీధర్.
   
    "మీరు విసుగ్గా "చెప్తుంటే నమ్మాలిగా!" అన్నాడు.
   
    "నేనూ చెప్తాను అమెరికా ప్రెసిడెంట్ నాకు మేనమామ అని! నమ్ముతారా?"
   
    శ్రీధర్ నవ్వుతూ "భలే జోక్స్ వేస్తావు ధరణీ" అన్నాడు.
   
    ధరణి ఆగి "కాదండీ, మీరు నమ్మలేదు. కేవలం లోకల్ గూండాగా వాడికి వున్న పేరు చూసి భయపడి నమ్మినట్లు నటించారు అంతే!" అంది.
   
    శ్రీధర్ కూడా సీరియస్ గా మారాడు. "ఔను! అందుకే ఇచ్చాను. చాలా?' అన్నాడు.
   
    ధరణి ఒక క్షణం ఆగి, నెమ్మదిగా అడిగింది. "రేపు ప్రొద్దుట ఎవడైనా భయపెట్టి నీ భార్యని కొన్నాళ్ళు యివ్వమని అడిగితే యిచ్చేస్తారా?"
   
    "ధరణీ!" శ్రేధర్ దెబ్బతిన్నట్లుగా చూశాడు. అతని ముఖం ఎర్రగా మారిపోయింది. ఆ నిమిషంలో చాచిపెట్టి కొట్టాలన్నంతకోపం వచ్చినా రోడ్డు కాబట్టి ఆపుకున్నాడు.
   
    ఆమె అంది - "భయం అనేది భయంకరమైన వైరస్ అండీ! అతి త్వరగా నరనరాల్లో వ్యాప్తి చెంది, చివరికి మన యింట్లో కూడా మనని హాయిగా, స్వేచ్చగా ఉండనీయదు." నెమ్మదిగా, మంద్రంగా పలికింది ఆమె స్వరం.
   
    "పద.... బస్ వస్తోంది" అన్నాడు శ్రీధర్.
   
    ధరణి మాట్లాడకుండా ఎక్కేసింది. బస్ లో సీటుకోసం వెదుకుతుండగా వెనుక సీట్లో కూర్చున్న స్నేహితురాలు "ధరణీ.... ఇట్రా" అని పిలిచింది.
   
    ధరణి దగ్గరికి వెళ్ళి, ఆమె స్థలం ఇస్తే సర్దుకు కూర్చుంది.
   
    "ఏమిటి అలా ఉన్నావు? పిల్లలమీద బెంగా?" అడిగింది కమల.
   
    'కాదు ఈ వ్యవస్థ ఏమైపోతోందా అని బెంగ!' అందామనుకుంది ధరణి. ఆమె మౌనాన్ని మరోలా అర్ధం చేసుకుని, కమల అంది. "పిల్లలమీద బెంగే అయితే మళ్ళీ శనివారం ఇంతలోకి వస్తుందీ? ఈ రోజు మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజా.... బుధవారం సరస్వతీపూజ. గురువారం బాబాకి ఉపవాసం....శుక్రవారం సంతోషిమాత వ్రతం..... శనివారం వేంకటేశ్వరుడికి దీపారాధనా.....ఇట్టే తిరిగి వస్తున్నాయి రోజులు!" నవ్వింది.
   
    ధరణి కనులవైపు జాలిగా చూసింది. ఎంతో చలాకీగా, వయసు ఉన్న దానికన్నా చిన్నగా, అందంగా కనపడే కమలకి విశ్వనాథంలాంటి ఛాందసుడు భర్తగా దొరికాడు. ప్రతిరోజూ మడీ, పూజా, నైవేద్యం....వీటితోనే గడిపేయమంటాడు. ఓ సినిమాకో, షికారుకొ తీసుకెళ్ళమంటే, 'పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. తప్పు! మనని చూసి చెడిపోతారు!' అంటాడట. పెళ్ళి సంబంధాలు కుదిరేటప్పుడు జాతకాలు సరిపోతాయా అని కాదు చూడాల్సింది.....భావాలు సరిపోతాయా అని!!

    "డాలీని మీ అమ్మ దగ్గర దింపేశావా?" అడిగింది ధరణి.
   
    "ఆ .... మళ్ళీ శనివారమే దాన్ని తీసుకొస్తాను.. అది ఎంతకీ పెద్దయినట్లు కనిపించడం లేదు. రాజేష్ తో ఆపేస్తే పీడా పోయేది!" విసుగ్గా అంది కమల.
   
    "రాజేష్ పెద్దవాడై పోతున్నాడు".
   
    "అదే .... భయంగా ఉంది."
   
    "మగపిల్లవాడు పెద్దవుతుంటే భయం ఎందుకూ?"
   
    "ఆడపిల్లలు ఏ సంగతీ మనసులో పెట్టుకోరు! తల్లితో చెప్పేస్తే కానీ వాళ్ళకి తోచదు! కానీ ఈ మగపిల్లలు అలాకాదు! తండ్రితో చనువు ఉండదు. తల్లితో సిగ్గు! లోలోపల పెట్టుకుని మధన పడిపోతుంటారు" అంది కమల.
   
    అభినవ్ బెడ్ వెట్టింగ్ గుర్తొచ్చింది ధరణికి.
   
    "ఏ పిల్లలైనా సమస్యలు తప్పవు. అసలు పిల్లల్ని కనే తల్లిదండ్రులకి పెళ్ళి అవగానే క్లాసెస్ కండక్ట్ చేసి పిల్లల సైకాలజీ గురించి బోధించాలి!" అంది.
   
    "ఔను!" కమల కూడా ఏకీభవించింది.
   
    .....ధరణి ఆఫీసుకి వెళ్ళేసరికి కాస్త లేటైంది.
   
    "గురుడు మండిపడ్తున్నాడు.... ఏవిటి సంగతి? నిన్న ఏమైనా డోస్ ఇచ్చావా?" గుసగుసగా అడిగింది గీత.
   
    "డోస్ ఏం ఖర్మ? షాకే యిచ్చాను!" తన సీట్ వైపు నడిచింది ధరణి.
   
    ఇంటర్ కమ్ ఫోన్ మ్రోగింది.
   
    "ఓసారి లోపలికి రా!" రావు గొంతు ఖంగుమంది.
   
    "ఎస్ సర్!" ధరణి వినయంగా పలికింది. ఆమెకి తెలుసు తనకి ఉన్న అధికారాలన్నీ ఉపయోగించి ఇప్పుడు తనమీద కాశి తీర్చుకుంటాడని.
   
    "ఎందుకు లేటైందీ? అని నేను అడగను. ఆడవాళ్ళ సమస్యల గురించి నాకు తెలుసు!" అన్నాడు రావు.
   
    ధరణి ముఖం ఎర్రబడింది. 'మీరు అనవసరమైన విషయాల గురించి మాట్లాడ్తున్నారు' అందామానుకుని ఊరుకుంది.
   
    "అన్నింట్లో మా మగవాళ్ళతో సమానమని పోటీపడినా పాపం.....శారీరకమైన అసౌకర్యాలు మీకు ఉంటాయి కదా.... కానీ ఈ ఆఫీసులో ఫ్యూన్ తో కలిపి నలుగురు లేడీస్ ఉన్నారు. ఒక్కొక్కరూ ఇలా నెలకి మూడు రోజులు ఆలస్యంగా వస్తూ ఉంటే.... ఎలా?" రావు ధరణి ముఖంలోని మార్పుల్ని తృప్తిగా గమనిస్తూ అన్నాడు.
   
    "దిసీజ్ టూ మచ్... మీరు ఔట్ ఆఫ్ ది వే వెళ్ళి మాట్లాడ్తున్నారు" కోపంగా అంది ధరణి.
   
    "అయ్యయ్యో.... శ్రీరామా అంటే బూతు మాటైపోయిందే! ఇప్పుడు నేను ఏమన్నాననీ? ఆడపిల్లల కష్టాలు నాకు తెలుసు అన్నాను. తప్పా?" అన్నాడు రావు.
   
    "మీరు మా మీద ఈ విషయంగా ఏ రకమైన సానుభూతీ చూపించనక్కర్లేదు. మిగతా మగస్టాఫ్ కి ఎలాంటి రూల్సు ఉంటాయో మాకూ అవే వర్తిస్తాయి. లేట్ మార్క్ పెట్టండి. అంతకన్నా ఇబ్బందిగా అనిపిస్తే లీవ్ మార్క్ చేస్తే ఇంటికి పోతాను!" అంది.

 Previous Page Next Page