Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 10

   

     "ఉన్న మాటంటే అంత ఉలుకెందుకు?" అదో రకంగా నవ్వుతూ ఆనాడు రావు.
   
    అతని నవ్వులోని శాడిజానికి ధరణికి ఒళ్ళు మండింది. తనని ఎలా రెచ్చగొట్టాలా అని అతను చూస్తున్నాడని తెలిసి పోయింది. అందుకే మాట్లాడకుండా నిలబడింది.
   
    రావు గోడవైపు చూస్తూ "నిన్ను సైట్ మీదికి పంపించెయ్యమని హెడ్ ఆఫేసు నుంచి కబురు వచ్చినా, నీ మీదున్న స్పెషల్ ఇంట్రస్ట్ వల్ల నేను నిన్ను ఇక్కడే ఉంచుతున్నాను తెలుసా? మీ ఆయనకి ఇక్కడ ఇద్యోగం. పిల్లలా- చిన్నవాళ్ళు....నిన్ను ఏ నీళ్ళు దొరకని ప్రదేశానికో ట్రాన్స్ ఫర్ చేస్తే ఏం చేస్తావు చెప్పు! అందుకనీ... అర్ధం చేసుకో.... తెలివైన దానివే కదా!" అని ఆమెవైపు తిరిగాడు.
   
    అక్కడ ధరణి లేదు.
   
    రావు కోపంగా బెల్ కొట్టి, ఫ్యూన్ రాగానే "ధరణిని పిలు" అన్నాడు.
   
    ఫ్యూన్ వెళ్ళి, వెళ్ళినంత వేగంగానూ వచ్చి "ఆ అమ్మగారు హెడ్ ఆఫీసుకి ఫోన్ చేసి ఎమ్.డీ. గారితో మాట్లాడ్తున్నారట సార్. తర్వాత వస్తానన్నారు" అంది.
   
    రావు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు చూసాడు. 'ఎంత పని చేసిందీ! ఏం మాట్లాడేస్తోందో?' అని కంగారుగా చూశాడు. గ్లాస్ డోర్ లోంచి ధరణి కనిపిస్తోంది. నవ్వుతూ మాట్లాడ్తోంది. అతని నుదురంతా స్వేదంతో తడిసిపోయింది. కళ్ళజోడు ముక్కుమీదకి జారిపోయింది.
   
    ధరణి ఫోన్ పెట్టేసి గదిలోకి వచ్చింది.
   
    "ఎవరితో మాట్లాడావు?" గాభరాగా అడిగాడు రావు.
   
    "ఎం.డీ. గారి ఆఫీసుకి చేశాను....."
   
    "నన్ను అడక్కుండా ఎందుకు చేశావు?"
   
    "పర్సనల్ పని కాబట్టి!"
   
    "ఏవిటది?"
   
    "పర్సనల్ అన్నాగా!"
   
    "ఆయన ఏవన్నారూ?" కోపంతో మండిపోతూ అడిగాడు రావు.
   
    "మీతో మాట్లాడ్తానన్నారు" అంది.
   
    రావుకి బీ.పీ. పెరిగిపోతోంది. ఇది ఏం చెప్పిందో, ఆయనేం మాట్లాడ్తాడో.... చెప్పి చావమంటే చెప్పేరకం కాదు. జగమొండి! తన నోటి దురుసూ, అతివాగుడూ ఎంతపని చేసిందీ? అతనికి ముచ్చెమటలు పోశాయి.
   
    "నే వెళ్ళచ్చా సార్?" అడిగింది.
   
    "ఆ....నిక్షేపంలా" అరిచాడు రావు.
   
    ధరణి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
   
    గీత ధరణి సీటు దగ్గరకొస్తూ "ఏవిటీ ఎం.డీ. గారి ఆఫీసుకి ఫోన్ చేశావుటా?" అంది.
   
    "ఔను"
   
    "ఎం.డీ. గారితో మాట్లాడావా?"
   
    "ఆఁ...."
   
    "ఏవనీ?"
   
    "మా ఆయన సీట్లోకి రాగానే నాకు ఫోన్ చెయ్యమని చెప్పమన్నాను."
   
    "మీ ఆయనా?"
   
    "అవును. నేను మాట్లాడింది మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తో కాదు. మా ఆయన ఆఫీసు తాలూకు ఎమ్. డి తో.... "మా ఆయన వున్నారా" అని అడిగాను."
   
    "అన్నట్టు మీ ఆయన ఎమ్.డి. కి పర్సనల్ సెక్రటరీ కదూ!" అంది గీత.
   
    ".....అవును. ఆ విషయం తెలీక రావుగారు కంగారుపడుతున్నారు. అశ్వత్దామ హతకుంజర - అన్న శ్లోకం వినలేదూ.....?"

    "భలే టోకరా ఇచ్చావే-" నవ్వింది గీత.
   
    "ఇంకా చూస్కో! ఫోన్ వస్తే చాలు లిఫ్ట్ చెయ్యడానికి భయపడి చస్తుంటాడు ఈ రోజంతా!" అని నవ్వింది.
   
    "ఈ రోజుకి తప్పించుకున్నావు సరే! ఇకముందు ఎలా? వీడి గొడవ తప్పదా మనకి? నానా చెత్తా మాట్లాడ్తాడే! చేతలకంటే మాటలు భరించడం మరీ నరకం!" అంది గీత.
   
    "ఫర్ ఎనీ ప్రాబ్లెం దేర్ ఈజ్ ఎ రెమిడీ! ఆలోచిద్దాం" అంది ధరణి.
   
    ఫోన్ రింగ్ అయినప్పుడల్లా రావు ఉలికిపడ్తూ, చెమటలు కక్కుతూ భయం భయంగా లిఫ్ట్ చేయడం ధరణి గమనించి నవ్వుకుంటూనే వుంది.
   
    లంచ్ టైంలో శ్రీధర్ ఫోన్ చేశాడు.

    "ఏమిటీ ఫోన్ చేసావుటా?" అడిగాడు.
   
    "ఎదుటివాడి పిరికితనం మీద ఆడుకోవడం చాలా సులువని, మరోసారి ఫ్రూవ్ అయిందని చెప్దామనుకున్నాను" అంది.
   
    "అది సరేగానీ... సాయంత్రం సినిమాకి వద్దు" అన్నాడు.
   
    "ఏం, జేబులో డబ్బులు కూడా యాదగిరి గుంజుకున్నాడా?" కవ్విస్తున్నట్లుగా అడిగింది.
   
    "రాకాసీ! అదేం కాదు. మేజర్ వర్మగారు ఫోన్ చేశారు. ఆయన బర్త్ డేట! సాయంత్రం అటు వచ్చెయ్యమన్నారు" అన్నాడు.
   
    ధరణి ఉత్సాహంగా "వర్మ అంకులా? తప్పకుండా వెళ్దాం!" అంది.
   
    "సరే.... ఆరింటికి రానా మీ ఆఫీసుకి?" అడిగాడు శ్రీధర్.
   
    "వద్దు.... ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయి వెళ్దాం. మీరు ఇంటికి వచ్చెయ్యండి ఇంటి నుండి కలిసి వెళ్దాం" అంది.
   
    "ఓ.కే!" శ్రీధర్ ఫోన్ పెట్టేశాడు.
   
    మేజర్ వర్మగార్ని తలుచుకాగానే ధరణి మూడ్ లో మార్పు వచ్చింది. మనసంతా ఆనందంగా మారింది. ఒకో మనిషి యిచ్చే కంపెనీ అలాంటిది!
   
                                                                   2
   
    ధరణి బస్ స్టాప్ వైపు అడుగులేస్తూ ఉండగా వెనకనుంచి ఆటో ఒకటి హారన్ కొట్టడం వినిపించింది. తను పేవ్ మెంట్ మీదనేగా నడుస్తున్నదీ, హారన్ కొట్టడం ఎందుకూ! ధరణి విసుగ్గా తలతిప్పి చూసింది.
   
    ఆటోడ్రైవర్ తల బయటికి పెట్టి "పదండి మేడమ్" అన్నాడు. షాక్ తగిలినదాన్లా ధరణి కళ్ళు పెద్దవి చేసి చూసి అంతలోనే "నో! నాకు ఆటో అక్కర్లేదు. నేను బస్ లో వెళ్తాను" అంది.
   
    "అలా అనకండి మేడమ్ బోణీబేరం! వరాలిచ్చే దేవతలా కనిపిస్తున్నారు. మీ పాదంతో నా ఆటో పునీతం చెయ్యండి" సీరియస్ గా ముఖం పెట్టి అన్నాడు.
   
    ధరణి కోపంగా "ఇదెక్కడ గోలయ్యా నేను బస్ లో పోతానంటే వినవేం?" అంది.
   
    "మొదటిసారిగా ఓ ప్యాసెంజర్ ని నోరు తెరిచి అడిగాను. కాదనకండి. ఇది నా సెంటిమెంట్ కి సంబంధించిన విషయం. మీరు ఎక్కువగా సినిమాలు చూడరనుకుంటాను. అందుకే ఈ యమా సెంటిమెంట్ మీకు ఆశ్చర్యం వేస్తోంది" అన్నాడు.
   
    ధరణికి నవ్వొచ్చింది. "సరే ... పోనీ..." అని ఆటోఎక్కి కూర్చుంది.
   
    "ఆటోరాముడు సినిమా చూశారా?" అతను అడిగాడు.
   
    "లేదు."
   
    "అందులో ఇలాగే రోజూ ఉదయం ఒక అమ్మాయి ముఖం చూస్తేకానీ అతను ఆటో నడపడు. గత్యంతరంలేక ఒక రోజున నడుపుతాడు...అమాంతం లారీ క్రిందపడి నజ్జు నజ్జుగా మార్తాడు!" అన్నాడు.
   
    "ఇంక ఆపు.... మా ఇల్లొచ్చేసింది...." అంది ధరణి.
   
    "ఇంకా చాలాదూరం వుంది. మరో రెండు సినిమా కథలు వినచ్చు. అసలు తెలుగు సినిమాలు చూడకపోతే జనరల్ నాలెడ్జి ఉండదండీ! అమ్మాయిలు మన సంప్రదాయాన్ని మర్చిపోయి జీన్సూ, టీ షర్టూ వేసుకుని తిరుగుతూ ఉంటే ఈ తెలుగు సినిమా డైరెక్టర్ మళ్ళీ అమ్మాయిలకి కుచ్చులజడలు.....నల్లపూసలు.....గోరింటాకు, పేడతో గొబ్బిళ్ళూ అన్నీ గుర్తుచేసి మన సంప్రదాయాన్ని పునరుద్దరిస్తున్నారు. ఏవంటారు?" అడిగాడు.
   
    "ఔను వాల్ పోస్టర్ల నిండా గొబ్బిళ్ళే!" అంది.
   
    "గోడమీద గొబ్బిళ్ళు అనే టైటిల్ ఎలా ఉందండీ?" ఉత్సాహంగా అడిగాడు.
   
    "నేను నీ సుత్తి భరించలేకపోతున్నాను. ఇక్కడ ఆ పేయ్ నడిచి పోతాను" అంది చిరాగ్గా.
   
    "అమ్మమ్మా! ఎంతమాట? సినిమా నా ఊపిరి.... నా ఉనికి! అసలు 'ఆటోడ్రైవర్' అనే సినిమాలో నా అభిమాన హీరో నేను వేషం చూశాకే కదండీ నేను ఈ పని ప్రారంభించిందీ!" అన్నాడు బాధ పడిపోతూ.
   
    "మంచిపని చేశావుగానీ ఆటో ఆపు" అంది.

    అతను ఆటో ఆపి "ఇరవై రెండు రూపాయలు" అన్నాడు.
   
    ధరణి ఆటో దిగి "ఎందుకివ్వాలీ? నేనేమైనా నీ ఆటో ఎక్కుతానన్నానా? ఎక్కమని బతిమాలావూ....పాపం కుర్రాడు అడుగుతున్నాడని ఎక్కి కూర్చున్నాను. ఇప్పుడు డబ్బులంటావేమిటి!" అంది.
   
    "అమ్మా తల్లీ, నువ్వు దేవతవి కాదు రాకాసివి! ఎరక్కపోయి ఎక్కించుకున్నాను. ఛ.... బోణీ బేరం..." అతను కోపంగా అన్నాడు.
   
    "ఎందుకంత బాధపడిపోతావు? పోన్లే సగం ఇస్తాను...." అంది.

 Previous Page Next Page