"ధరణీ, నువ్వు అనాలోచితంగా చేసే ఇలాంటి పనులవల్ల ఎంతెంత ప్రమాదాలు జరుగుతాయో నీకు తెలియడంలేదు!" ఆమె ఎదురుగా కూర్చుని సముదాయిస్తున్నట్లుగా అన్నాడు శ్రీధర్.
"ఫస్ట్ కరెక్ట్ యువర్ సెంటెన్స్.... అనాలోచితంగా నేనేం చెయ్యను ఆలోచించే చేశాను. నాలా అందరూ ఆలోచించకపోవడం నా తప్పుకాదు!" అంది.
"అబ్బా! నీ మొండితనం నీదేనా? నేను చెప్పేది అర్ధం చేసుకోవేమిటీ?" అరిచాడు శ్రీధర్.
ధరణి అన్నం తినడం ఆపి సీరియస్ గా అడిగింది. "ఏమిటి మీరనేది? వాదు అలా చెయ్యడం నేను చూసీ చూడనట్లు వదిలెయ్యాలా? వాడి ఖర్మకి వాడే పోతాడులే అనే తాత్విక ధోరణితో వాడ్ని విడిచి పెట్టేయాలా?"
శ్రీధర్ కాస్త హేళనగా, "ఆ! నిన్ను ప్రొద్దుట లేస్తే ఎవరూ తాకకుండానె ఉంటున్నారా? రష్ గా ఉన్న ప్రదేశాల్లో, క్యూలల్లో ఎన్నిసార్లు తాకరూ?" అన్నాడు.
ధరణి ఎడమచెయ్యి బుగ్గన చేర్చుకుంటూ అమాయకంగా ముఖం పెట్టి "అయితే తప్పులేదంటారా?" అని అడిగింది.
"....ఆ! లేదనే చెబుతున్నాను. అంతగా పట్టించుకోకూడదు!" అన్నాడు శ్రీధర్.
"అమ్మయ్యా.... ఇప్పుడు నాకు మనశ్శాంతిగా వుంది! ఇంకెప్పుడూ పట్టించుకోను కనీ, ముందు భోంచెయ్యండి" అంది.
శ్రీధర్ మొహం గర్వంతో వెలిగిపోయింది. భార్య తన మాట విని తన దారికి వచ్చినందుకు అతనికి చాలా సంతోషం వేసింది.
"అధీ....అలా అర్ధం చేసుకోవాలి! అన్నం పెట్టు!" అన్నాడు.
ధరణి అతను అన్నం తింటున్నంతసేపూ మాట్లాడకుండా ఆలోచిస్తున్నట్లుగా వుండిపోయింది.
భోజనాలయ్యాక శ్రీధర్ గదిలోకి వచ్చాడు.
ధరణి వక్కపొడి అందిస్తూ వుండగా ఆమె చేతిని పట్టుకుని అలాగే ముందుకు లాక్కుని "ఇందాక మంచి మూడ్ పాడుచేశాడు ఆ ఇన్ స్పెక్టర్" అన్నాడు.
ధరణి మాట్లాడకుండా అతనివైపు నిస్తేజంగా చూసింది.
"అదేవిటీ అలా అయిపోయావు.... ఒంట్లో బాలేదా?" అనడిగాడు.
"అది కాదండీ..... మీ మంచి మనసు చూస్తుంటే నాలో పశ్చాత్తాపం కలుగుతోంది" అంది బాధగా ధరణి.
"పశ్చాత్తాపమా? ఎందుకూ?" అడిగాడు శ్రీధర్.
"మీ బ్రాండ్ మైండెడ్ నెస్ తెలుసుకోలేక ఇంతకాలం మీ దగ్గరో విషయం దాచిపెట్టినందుకు!"
"ఏవిటది?" ఆతృతగా అడిగాడు.
"అధీ.....చాలా చిన్నప్పుడులెండి. నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు సంగతి. ఓ రోజున మా తెలుగు టీచర్ నన్ను పుస్తకాలు తీసుకుని స్టాఫ్ రూంలోకి రమ్మన్నాడు. వెళ్లాను."
"ఆ .... వెళ్తే ..." టెన్షన్ గా అడిగాడు శ్రీధర్.
"అక్కడ ఆయన ఒక్కడే వున్నాడు."
"ఉంటే?" కంగారుగా అడిగాడు.
"తలుపు వేసేశాడు"
"ఆ ... తర్వాతా?"
"నన్ను పట్టుకుని..." ధరణి ఆగింది.
"చెప్పు.... పట్టుకుని ఏం చేశాడూ?" శ్రీధర్ అరిచాడు.
"గట్టిగా ముద్దు పెట్టుకుని వదిలేశాడు."
"నువ్వేం అనలేదా?" కోపంగా అడిగాడు.
"పెద్దగా ఏడ్చాను. అందుకేగా వదిలేశాడూ!" అంది ధరణి.
"ఇంకేం జరగలేదు కదా!"
"ఆహా ... ఊరికే ముద్దు పెట్టుకున్నాడు. అంతే! అ విషయం అంతగా పట్టించుకోనక్కర్లేదు కదండీ! చిన్నప్పుడు చాలామంది ముద్దు పెట్టుకొంటూ ఉంటారు కదా!" అంది ధరణి.
శ్రీధర్ మాట్లాడలేదు. అతని ముఖం ఎర్రగా మారిపోయింది.
"రండి పడుకుందాం...." పక్కకు జరుగుతూ పిల్చింది ధరణి.
"నువ్వు పడుకో... నాకు ఇప్పుడే నిద్ర రావటంలేదు!" సిగరెట్ ప్యాకెట్టూ, అగ్గిపెట్టే తీఉస్కుని బైటకి వెళ్తూ అన్నాడు.
"గుడ్ నైట్!" అని ధరణి బెడ్ ల్యాంప్ ఆన్ చేసి, పెద్దలైట్ ఆర్పేసి పడుకొంది.
శ్రీధర్ స్థిమితంగా ఉండలేకపోయాడు. అసహనంగా పచార్లు చేస్తున్నాడు. అతని చుట్టూ అతను కాల్చిపారేసిన సిగరెట్ పీకలు పెరిగిపోతున్నాయి. ఆలోచన్లు ఎటో ఎటో సాగుతున్నాయి. 'ఆ తెలుగు టీచర్ ఎవడో, ధరణికి గుర్తుండి ఉంటాడా? ఒట్టి ముద్దే పెట్టుకుని వదిలేసి ఉంటాడా? అయినా పదో తరగతి అంటే పట్టించుకోకూడనంత పసిపిల్లేం కాదే! ధరణి అప్పుడేం చేసి ఉంటుందీ? ఎంజాయ్ చేసి ఉంటుందా? బాధపడి ఉంటుందా? సిగ్గుపడి ఉంటుందా? మరి ఫస్ట్ నైట్ తన దగ్గర అదే ఫస్ట్ టైం అన్నట్టు సిగ్గుపడిందే? ధరణి నటించలేదు. చాలా ఫ్రాంక్ గా ఉంటుంది. ఆలా ఎందుకు చేసిందబ్బా? అప్పుడు ధరణి పెదవులమీద మునుపటిలా ముద్దు పెట్టుకోగలనా? ముద్దు పెట్టుకునేటప్పుడు వాడెవడో గుర్తుకొస్తాడేమో ఖర్మ!' ఇలా రాత్రంతా ఆలోచించేశాడే కానీ....
"ఎప్పుడో వచ్చీరాని వయసులో నన్నెవడో ముద్దు పెట్టుకుంటే ఆ విషయం ఇంతగా పట్టించుకుని నిద్ర మేల్కోవాలా?" అన్న ధరణి గొంతు వినిపించి వెనక్కి తిరిగాడు.
"ఎంతమందో తగుల్తూ ఉంటారు. వాదు పెదవుల మీద తాకాడు.....అంతే! పట్టించుకోవాల్సిన పనిలేదుగా?" అంది నవ్వుతూ ధరణి.
"ఎలా పట్టించుకోకుండా ఉండగలం?" శ్రీధర్ రోషంగా అన్నాడు.
ధరణి వెంటనే క్లాప్స్ కొడ్తూ "ఆ మాట మీ నోట పలికించడానికే ఇంత డ్రామా ఆడాను. మనసుకి బాధ కలిగించే సంఘటనలు? ఎలా పట్టించుకోకుండా ఉండగలం?" అంది.
"డ్రామానా?" శ్రీధర్ ఆనందంగా అడిగాడు.
"ఔను. మా స్కూల్లో అసలు తెలుగుకి మగ టీచరే ఉండేవాడు కాదు. పదండి పడుకుందాం."
"నిజంగానా?" శ్రీధర్ ఆమెను కౌగిలించుకొని, గెడ్డం పట్టుకుని సంతోషంగా అడిగాడు.
"ఊ!" అంది ధరణి.
"నువ్వెప్పుడు నిజం చెప్తావో ఎప్పుడు నాటకాలు ఆడతావో తెలుసుకోవడం చాలా కష్టం! బట్ ఈ రోజు ఐయామ్ వెరీ హేపీ" అన్నాడు.
"హేపీ కదా.... నాకు కావల్సిందీ అదే! పదండి లోపలి" అంది ధరణి.
* * *
ఆమె తల పక్కకి తిప్పిచూసింది.
శ్రీధర్ ఆదమరచి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. బెడ్ లైట్ వెలుతురులో అతని ముఖం మెరుస్తోంది.
ధరణికి నిద్ర పట్టడంలేదు. లేచి కూర్చుని టేబుల్ సొరుగులో నుండి డైరీ తీసింది. ఆ రోజు తనకి ప్రొద్దుట లేచినప్పటి నుంచీ ఎదురైన సంఘటనలు వరుసగా రాయసాగింది.
"తొమ్మిదేళ్ళ నా కూతురికి అప్పుడే సిగ్గు తెలిసింది. అభినవ్ పక్కలో యూరిన్ పాస్ చెయ్యడం ఇంకా మానలేదు. పిల్లలకి ఏవైనా దిగుళ్ళూ, భయాలూ, ఉంటే ఈ హాబిట్ కంటిన్యూ అవుతుందిట, ఎక్కడో చదివాను!
బస్ దగ్గర నీలూ తన కూతురు బుగ్గ ఎవరైనా ముట్టుకుంటే ఏడుస్తోందని చెప్పినప్పుడు 'ఔను తన ఇష్టంలేకుండా అసలు ఎవరైనా ఎందుకు ముట్టుకావాలీ?' అని అడిగాను, ఆఫీసులో రావుగారి చేష్టలవల్ల అదే పరిస్థితి నాకీ ఎదురైంది. ఏడవడానికి నేనేం చిన్న పిల్లని కాదుగా! ఆయనకి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి వచ్చాను. బస్ లో పద్దెనిమిదేళ్ళ అమ్మాయి కళ్ళల్లో కనపడిన సిగ్గూ, భయం నాకు నా చిన్న తనాన్ని గుర్తుచేశాయి. ఆ అమ్మాయి శరీరాన్ని తడిమి ఆనందిస్తున్నవాడికి బుద్ది చెప్పడానికి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాను. శ్రీధర్ 'మనకెందుకూ?' అంటాడు. 'నా శరీరం.... నా ఇష్టం.. నా అనుమతి లేకుండా దాన్ని వాడుకొంటే భరించను' అని మగజాతిని హెచ్చరించడం తప్పా? 'తాకితే పట్టించుకోకూడదు" అన్న శ్రీధర్ మరి నన్ను చిన్నప్పుడు తెలుగు టీచర్ ముద్దుపెట్టుకున్నాడని చెప్పినప్పుడు ఎందుకు పట్టించుకున్నాడూ? పట్టించుకోకూడదు అన్నమాట అతను భయంవల్ల అన్నాడే కానీ మనసులోంచి అనలేదు. అతనంటే నాకు ఉన్న ప్రేమ అతనితో వాదనకి దిగొద్దు అంటోంది! ఏం చెయ్యాలీ? అతనిలో మార్పు ఎలా వస్తుందీ?
తొమ్మిదేళ్ళ నీలూ కూతురు, పద్దెనిమిదేళ్ళ ఇన్ స్పెక్టర్ చెల్లెలూ, ముప్పై ఏళ్ళ నేనూ.....
ఒక విద్యార్ధిని స్కూల్లో, ఒక కాలేజీ అమ్మాయి బస్ లో, ఒక ఉద్యోగి ఆఫీస్ లో ...నిరంతరం వేధింపబడుతోంది. ఎవరికి చెప్పుకోవాలి? ఏం చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలి?
... సిగ్గేస్తోంది!!!"
-- * * * --