Previous Page Next Page 
యుగాంతం పేజి 9

   

     ఆమెకి అతడిమీద జాలేసింది.
   
    "ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా.....!"
   
    అతనో క్షణం ఆగి అన్నాడు. "ప్రతిరోజూ వుండేదే. నాకు డ్రాఫ్టు వ్రాయటం కూడా సరిగ్గా రాదట. అందరిముందూ పట్టుకొని......నాకన్నా ఫ్యూన్ దస్తగిరి నయమట."
   
    "లాగిపెట్టి కొట్టలేకపోయారా?"
   
    "అంత ధైర్యమే వుంటే ఇంతవరకు ఎందుకొచ్చేది?"
   
    ఆమెకి విసుగేసింది. "మరేం చేసేరు? చేతులు కట్టుకొని విన్నారా?"
   
    "అతడు మా హెడ్ క్లర్కు!"
   
    "అయితే నేమండీ! వాదు మెట్రిక్యులేషన్ అయినా పాసవలేదని మీరే అన్నారు. మెరు యల్లెల్ బ్బీ నిజంగా మీరు డ్రాఫ్టు చాలా బాగా వ్రాస్తారు. ఎస్సెల్సీ చదివిన నాకే అది ఎంతో ముచ్చటగా వుంటుంది. అటువంటిది మీ క్లర్క్ కి నచ్చలేదంటే అది వాడి ఓర్వలేనితనాన్ని సూచిస్తుందే తప్ప మిమ్మల్నేమీ కించపరచలేదు. మీరు చెయ్యాల్సిందల్లా వాడ్ని ఎదుర్కోవడమే. ఒక్కసారి తిరగబడండి.....! అప్పుడు చూడండి ఏమవుతుందో....ఆఫీసరు కూడా మీ మాటే అవునంటాడు. మీలో మీరిలా కుంచించుకుపోవడం మొదలు పెడ్తే చివరికి మీ ఫ్యూన్ కూడా మీకు పని చెప్తాడు. కొంచెం బలం తెచ్చుకోండి! మనసు దిటవు పర్చుకోండి. పులి తాలూకు భయం ఎక్కడో లేదండి! మీ మనసులోనే వుంది. అసలే మీ ఆరోగ్యం మంచిదికాదు. దానికి తోడు ఈ పాడు ఆలోచనలు ఒకటి. అన్నీ మర్చిపోండి. ఇలా నా దగ్గరికి రండి. నా వళ్ళో తల పెట్టుకొని పడుకోండి! ఎందుకండీ భయపడ్తారు? మనం బ్రతుకున్నది భయపడటానికి కాదండీ. ఒకమాట చెప్పనా....."
   
    చీకటి నెమ్మదిగా విచ్చుకుంటోంది. దూరంగా ఎక్కడో ఒక కోడి ప్రపంచాన్ని లేపుతోంది.
   
    తూర్పు ఎర్రటి మేలిముసుగు సవరించుకొంటూ సూర్యున్ని ఆహ్వానించటానికి ఆయత్తమవుతూంది.
   
    "మనిషి ఒక్కసారే చచ్చిపోతే ఫర్లేదండీ. కానీ క్షణం క్షణం మానసికంగా చావకూడదు. మనిషి మానసికంగా చావకూడదండీ."
   
                                                                    *    *    *
   
    "మనిషి సాంఘికంగా చావకూడదయ్యా! అట్లా సాంఘికంగా చచ్చిపోనివ్వకుండా వుండటానికే ఈ న్యాయస్థానాలూ, ఈ చట్టాలు! ఎట్లా దీస్కుంటడట నీపొలం? చూద్దాం ఎట్లా దీస్కుంటాడో" అన్నాడు రంగారావు. అతడి అసలు పేరు రంగయ్య. కొద్దికొద్దిగా రాజకీయాల్లో చేరేక పేరు రంగారావుగా మార్చుకున్నాడు. అతనికి మున్సబుకి పడదు. అందువల్ల రాజయ్యకి దగ్గరయ్యేడు.
   
    "కోర్టులో చిన్న దావా పడేద్దాం. వాళ్ళందర్నీ మూడు చెరువుల నీళ్ళు తాగించే బాధ్యత నాది."
   
    "డబ్బున్నోడూ డబ్బున్నోడూ కొట్టుకునేటందుకైతే కోర్టు కావాల బాబూ! డబ్బున్నోడు డబ్బు లేనోడ్ని కొట్టేటంద్కు ఆడి కడుపు సాలు" అన్నాడు చ చేతులు కట్టుకొని రాజయ్య.
   
    అతడు ఇల్లు కాలిన ఆసామిలా వున్నాడు.
   
    "అట్ల వదిలి పెడ్తామంటయ్యా?" అన్నాడు చుట్ట వెలిగించుకుంటూ రంగారావు. "యాభయ్ మందిని పోగెయ్యి, పొలంకాడ నిలబెడదాం. పంట ఎలా తొల్కెల్తడో చూద్దాం."
   
    "పోలీసోళ్ళని తీసుకొస్తడు బాబూ"
   
    "న్యాయమనేది వుంది కదయ్యా."
   
    "పోలీసోళ్ళు ఆ పక్కనేవుంటారు బాబూ!"
   
                                        *    *    *
   
    ప్రొఫెసర్ అయోమయం దగ్గర రమణ చేరి అప్పటికి నెలయింది. అతడి దగ్గర చెయ్యవలసిన పనేమీలేదు. అతడెప్పుడూ ఏవో లెక్కలు కట్టుకొంటూ కూర్చుంటాడు. ఒక ఫ్లాస్కునిండా టీ వుంటే చాలు, యింకేమీ అక్కరలేదు. ఆ నెలరోజుల్లోనూ ఒక్కసారి కూడా అతడు బయటికి రాలేదు.
   
    గదినిండా కాగితాలే. అంకెలు వేసిన కాగితాలు, స్క్వేర్లూ, రూట్లూ, అన్నీ వేల వేల సున్నాలమీదా, టు ది 'పవర్ ఆఫ్' ల మీద ఆధారపడిన అంకెలు. అన్ని సబ్జెక్టులకన్నా ఆస్ట్రానమీ ఎంత ఇంతరెస్టింగు సబ్జెక్టో అంత బోరింగ్ సబ్జెక్టు.
   
    రమణికి అక్కడ నచ్చేది ఒక్కటే, ఎలుకలు. అవి చాలా సురక్షితంగా పెరుగుతున్నాయి అక్కడ. అప్పుడే రమణతో స్నేహం కట్టేసేయి కూడా! ఒక ఎలుక దూరంగా నిలబడి పరామర్సిస్తోంది. ఇంకొకటి మీసాలు వూపుతూ వెక్కిరిస్తోంది. వాటికి అక్కడ మనుష్యులున్నారన్న భయం ఏ మాత్రమూ లేదు. ఒకడు ప్రపంచాన్ని పరిత్యజించిన యోగి, మరొకడు ప్రపంచంమీద విరక్తి పెంచుకుంటూన్న యువకుడు. అందుకే అవి ఆ పెద్ద భవంతిలో - రాజభవనంలో పరిచారికల్లా తిరుగుతూ వుంటాయి.
   
    ఈ ప్రొఫెసర్ ఒక్కోసారి ఎంత తెలివిగా లెక్కలు కడ్తూ వుంటాడో, మరోసారి అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ వుంటాడు. అతడ్ని చూసిన వాళ్ళెవరూ అతడు ఆస్ట్రానమీలో 'ఒకాయామా ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ' నుంచి సర్టిఫికేట్ పొందాడనీ, హార్ట్ లాండ్ మాగ్నెట్ ఫీల్డులో రాయల్ ఆస్ట్రానమర్ గా నాలుగువేల పౌండ్ల జీతాన్ని వదులుకొని వచ్చి, ఆస్థి సర్వస్వం తగలేసుకొని యిలా మారుమూల ఉండిపోయేడని అనుకోరు. అయితే యింత తెలివైనవాడూ ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ వుంటాడో తెలియచెప్పటానికి, రమణికి పాత ఫైళ్ళలో దొరికిన యీ ఉత్తరాలు చాలు.
   
    "ప్రియమైన భారతదేశపు ప్రధాని జగదీష్ చంద్రకి-

    మీరు ఆరోగ్యంగా వున్నారని తలుస్తాను. మీ పాలనలో దేశం సుభిక్షంగా వుందని కూడా భావిస్తున్నాను. ఈ మధ్య యింటినుంచి బయటకు కూడా కదలకపోవటంవల్ల దాని సంగతి అసలు తెలియటం లేదు.
    పోతే ముఖ్యమైన సంగతేమిటంటే నేను ఎల్లుండి ఢిల్లీ వస్తున్నాను. రెండ్రోజులు వుంటాను. వీలు చూచుకుని ఏదో ఒక సమయంలో మిమ్మల్ని కలుసుకొంటాను.
   
    మిగతా విషయాలు సమక్షంలో.

   
                                                                                                        వినమ్రతతో,
                                                                                    ప్రొ. ఆనందమార్గం.
         
   
    పి.యస్ :- నేను అరగంటకంటే ఎక్కువకాలం మీతో గడపలేను. క్షమించగలరు."
   
    - ఈ ఉత్తరం చూసి రమణికి అరగంటవరకూ నవ్వు ఆగలేదు. దీనికి జవాబు రానట్టుంది. మళ్ళీ ఈయన దగ్గర్నుంచే ఇంకో ఉత్తరం కాపీ.
   
    "ప్రియమైన జగదీష్ చంద్రా.....

    నేను ఇంతకుముందో ఉత్తరం వ్రాసేను. అయితే యిప్పుడు కవర్ మీద అడ్రసు వ్రాసేనా అన్న అనుమానం వస్తూంది. ఏది ఏమైనా, మీ ఆఫీసు ముందున్న సెక్యూరిటీ గార్డులు నన్నులోపలి రానివ్వలేదు. ఇక ఆ విషయం అలా పోనివ్వండి. మీరు వూరు వచ్చినప్పుడు నన్ను కలుసుకోండి. అడ్రసు ఈ ఉత్తరం కుడివైపున పైనుంది.
                                                                                           

                                                                                          అభినందనలతో,
                             
                                 ప్రొ ఆ. మార్గం.                                                                
   
    పి. యస్ : "మా ఇంటిముందు సెక్యూరిటీగార్డులు లేరు. అయినా మీరొచ్చే
                       ముందు ఉత్తరం వ్రాయండి. ఎందుకన్నా మంచిది కదా అది."

   
    ప్రధానమంత్రి కార్యాలయంలో ఇలాంటి ఉత్తరాలకి జవాబు యివ్వటం సెకండ్ అసిస్టెంటు పని. ఏ భాషలో వచ్చిన ఉత్తరమైనా అక్కడ తర్జుమా చెయ్యబడుతుంది. దాదాపు ముప్పాతిక వంతులు అక్కన్నుంచే క్లియర్ చెయ్యబడతాయి. మిగతావి ఫస్టు సెక్రటరీకి వెళ్తాయి. ప్రధానమంత్రి సంతకాన్ని డూప్లికేట్ చేసే స్పెషల్ సిగ్నేచర్ మెషిన్ లో మిగతా ఉత్తరాలకి జవాబు యివ్వబడుతుంది. ఈ సంతకం అచ్చు ప్రధానమంత్రి స్వయంగా చేసినట్టూ వుంటుంది. అయితే ప్రొఫెసర్ గారి ఉత్తరం మొదటి లెవెల్ లోనే ఆగిపోయింది.
                                                                                                    ప్రధానమంత్రి సచివాలయం,
                                                                                               న్యూఢిల్లీ

                                                                                                        
   
    "ప్రియమైన అయ్యా,
   
    మీ ఉత్తరం అందింది. ప్రధానమంత్రి మిగతా ముఖ్య విషయాల్లో నిమగ్నులై వుండటం వల్ల మిమ్మల్ని కలుసుకోలేకపోయేరు.
      అభినందనల్తో-

                                                                                                                  ఇట్లు,
                                                                                           గోపాలకృష్ణ ఎగ్బోటే,
                                                                                           ఇన్ఫర్మేషన్ ఎడ్వైజరు."

                                                                                                                   
   
   
                               *    *    *

 Previous Page Next Page