Previous Page Next Page 
యుగాంతం పేజి 10

   

     ఈ విధంగా వుంటుంది ప్రొఫెసర్ అయోమయంగారి ఎక్ స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ.
   
    రమణ చేరిన మొదటి నాలుగు రోజులూ ఈ ఉత్తరాలు, మిగతా పేపర్లూ చదువుతూ కాలం గడిపేడు.
   
    ఈ ఉత్తరం కొంచెం అర్ధమై నవ్వు తెప్పించేవి కానీ, మిగతా రాతలు అర్ధంలేనట్టు పిచ్చిగా వుండేవి.
   
    అతడికి అన్నిటికన్నా నచ్చింది ఈ వృద్దుడి అమాయకత్వం. అతడెంత తెలివైనవాడో అతడి మాటలు అంత అమాయకంగా ఉండేవి. అంత అమాయకుడు కాబట్టే లక్షల ఆస్థిని ఇనుప సామానుగా మార్చుకొని తన భావనాలోకపు ప్రపంచంలో పెట్టుకున్నాడు.
   
    అతడి చేతుల్లో చురుకూ, కళ్ళల్లో తేజస్సూ, మాటల్లో మంచితనం రమణని కట్టిపడేసేవి.
   
    అయినా ఈ ప్రొఫెసర్ గొడవలోపడి రమణ తన ఉద్యోగం సంగతి మర్చిపోలేదు. కనబడినచోటల్లా అప్లయ్ చేస్తూనే వస్తున్నాడు. అతడు ప్రొఫెసర్ దగ్గర చేరిన యిరవై రోజులకి ఓ సాయంత్రం పత్రికా ఆఫీసునుంచి, ఉద్యోగంలో వచ్చి చేరమని పోస్టులో ఆహ్వానం వచ్చింది.
   
    ఇల్లంతా ఆనందం వెల్లివిరిసింది. ముసలయన దగ్గుతూనే, ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి, పైన ఏమయినా దొరుకుతుందో లేదో అని ఎంక్వయిరీ చేసేడు. అన్నిటికీ ముక్తసరిగా సమాధానం యిచ్చేడు రమణ. తండ్రితో ఎక్కువగా మాట్లాడడు రమణ. తండ్రి చరిత్ర అంతా అతనికి తెలుసు. ఎన్నాళ్ళక్రితం అయితే సిఫిలిస్ అతన్ని పట్టుకుందో తెలియదు. ఈ దగ్గుకి కారణం కూడా అదేనేమో! అతడు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి ఎంక్వయిరీ చెయ్యలేదు. అతడి దృష్టిలో అతడి తండ్రి నైతికంగా ఎప్పుడో చచ్చిపోయేడు.
   
    ఆ మరుసటిరోజు అతడు తన ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళి పత్రికాఫీసులో ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పేడు.
   
    ఆ తర్వాత మాలతి ఇంటికి వెళ్ళాడు.
   
    "అయితే ఉద్యోగం వచ్చిందన్నమాట" అన్నాడు మాలతి తండ్రి పైపు చివర నుసిని చిటికెన వేలితో దులుపుతూ.
   
    రమణ మాట్లాడలేదు.
   
    "....ఎంత జీతం....."
   
    దీనికీ సమాధానం చెప్పలేదు అతడు. అదంతా పెద్ద సంఖ్య కాదు.
   
    మాలతి తండ్రే కుర్చీలోంచి లేస్తూ అన్నాడు-
   
    "రెండొందలు-మూడొందలు కాకపోతే అయిదొందలు. అంతేగా, అది మా  వంటవాడి జీతం."
   
    రమణ మొహం ఎర్రబడింది.
   
    "ఇంకెప్పుడూ యిటువైపు రాకు" అన్నాడాయన. "మాలతి సబంధాలు చూస్తున్నాం. నీ వల్ల దానికేదయినా అపకారం జరిగిందంటే, నీ రక్తం కళ్ళచూడాల్సి వస్తుంది. చాలా మామూలుగా సామాన్యంగా అన్నాడు.
   
    అంత వ్యవధిలోనూ రమణకి నవ్వొచ్చింది. వెళ్ళబోతూ అన్నాడు-"అపకారం చెయ్యాలన్న ఆలోచన నాకెప్పుడూ లేదండీ. అదే వుంటే మళ్ళీ యిలా మీముందు నిలబడే అవసరమే వచ్చేదికాదు. మాలతికి మైనారిటీ తీరిపోయిందని నాకు తెలుసు. మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలనుకుంటే మీ డబ్బుగానీ, మీ వెనకున్న గూండాలు గాని దాన్ని ఆపుచేయలేరు. అయితే ఈ వివాహం జరగకుండా ఆపుతున్నది-మనిషి నైతిక విలువలకి నేనిస్తున్న గౌరవం. అంతే...."
   
    అతడు కదిలి బయటకొచ్చేడు.
   
    పోర్టికోలో మాలతి నిలబడి అతడి గురించే ఆతృతగా చూస్తూంది. ఆమె కళ్ళలో ఏదో చెప్పాలన్న తపన. అతడు ఆగేడు. ఆమె అతడివైపు చూసింది ఇద్దరి కళ్ళూ క్షణం సేపు కలుసుకున్నాయి.
   
    జీవితం క్షణికం అయితే కావొచ్చుగానీ, క్షణం అస్తిత్వం లేనిది కాదు.
   
    అతడు తలవంచుకొని ముందుకు నడిచేడు.
   
    మనసంతా వికలమైంది.
   
    చేతులు రెండూ ఫ్యాంటు జేబుల్లో పెట్టుకొని నడవటం సాగించేడు.
   
    ప్రొఫెసర్ తో కొంచెంసేపు గడపటమే అతడికి ఈ మధ్య సంతోషాన్నిస్తూంది.
   
    ఇంటి ఆవరణలో ప్రవేశించలేదు.
   
    గ్రీన్ విచ్- ఉదయం 6-30
   
    గడియారం పన్నెండు కొట్టింది. కాళ్ళు చాపి, వెనక్కి వాలి కూర్చున్నాడు ప్రొఫెసర్. అతడి మొహం వాడిపోయి వుంది.
   
    "అయితే వెళ్ళిపోక తప్పదా గ్రాడ్యుయేటూ?" అన్నాడు.
   
    రమణ మాట్లాడలేదు.
   
    "అవున్లే- అక్కడ జీతం వస్తుందిగా అయితే ఇంతకీ ఎప్పుడు వెళుతున్నావు?"
   
    "ఎల్లుండి చేరదామనుకుంటున్నాను."
   
    "నా దగ్గర పని చేసినట్టు సర్టిఫికెట్టు ఇవ్వమంటావా?"
   
    రమణ నవ్వాపుకొని "వద్దు" అన్నాడు.
   
    ప్రొఫెసర్ లోపల్నుంచి ఓ చెక్కు పట్టుకొచ్చేడు. "ఇంతకన్నా ఏమీ ఇవ్వలేను. ఉంచుకో" అన్నాడు. రమణ ఆ చెక్కుని చూశాడు. "సైన్సు టు డే" వాళ్ళు పంపిన చెక్కు అది. ఈ మతిలేని ఫ్రొఫెసర్ కుదురుగా కూర్చొని ఒక రాత్రంతా వ్రాసి సంపాదించిన డబ్బు తనకోసం.....
   
    అతడికి కళ్ళవెంట నీరొచ్చింది. ఆ క్షణం అన్నీ వదిలేసుకుని ఇక్కడే వుండిపోదామా అనుకున్నాడు. కానీ జీవితం సెంటిమెంట్ల కథ కాదు. ఇంట్లో పరిస్థితి వెన్నుతట్టి లేపుతోంది. మౌనంగా చెక్కు అందుకున్నాడు.
   
    అతడి మనస్సు శూన్యమైంది.
   
                                   *    *    *
   
    శూన్యమైన విశ్వంలో ఇన్ని కోట్ల కోట్ల గ్రహాలూ, నక్షత్రాలూ ఎలా ఏర్పడ్డాయి? అన్న ప్రశ్నకి చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల థియరీలు చెప్పారు. ఏదీ సంతృప్తికరంగా లేదు. ప్రకృతి శోధించటానికి మనిషి మేధస్సు సరిపోవడం లేదు. మనం చూసేది ఒక సూర్యుడ్ని విశ్వంలో మనకి కనబడని సూర్యుళ్ళు కోట్లు.
   
    మనం 'ఆకాశగంగ' అని పిలిచే నక్షత్రాల సముదాయం కొన్ని లక్షల నక్షత్రాల గుంపు. అందులో దాదాపు రెండు వందల మిలియన్ ల నక్షత్రాలున్నాయని అంచనా.
   
    ఇన్ని కోట్ల నక్షత్రాలూ ఒక బిందువు చుట్టూ పరిభ్రమిస్తున్నయ్. భూమి తన చుట్టూ తిరగటానికి ఒకరోజు పట్టినట్టే. ఇవి ఒకసారి తిరగటానికి రెండు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది.
   
                                     *    *    *
   
    రమణకి ఆ ఆవరణలో నచ్చేది అన్నిటికన్నా ఒకటుంది. అది టెలిస్కోప్. చిన్నపిల్లవాడు ఆటవస్తువుతో ఆడుకొన్నట్టూ అతడు తరచు దాన్లోకి చూస్తూ వుండటం అలవాటు చేసుకున్నాడు. ముఖ్యమైన నక్షత్రాలనీ, చంద్రుడిలోని లెయాబ్ నిట్జ్ కొండనీ గుర్తించటం నేర్చుకున్నాడు.
   
    ఆ రోజు మంగళవారం.
   
    ప్రొఫెసర్ తన మామూలు ధోరణిలో లెక్కలు వేసుకుంటూ కూర్చొన్నాడు. రమణ స్కోప్ లో చూస్తూ వుంటే ఒక బంతిలాంటి ఆకారం దక్షిణ దిశలో కనబడింది. నారింజపండు ప్రమాణంలో వుందది. చాలా వేగంగా భూమికి ఉత్తరదిశగా సాగిపోతోంది. మామూలు కంటికి కనిపించటం లేదు.
   
    కనిపించిన ప్రతిదాని గురించీ మొదట్లో అతడు ప్రొఫెసర్ ని అడిగి తెలుసుకొనేవాడు. ప్రొఫెసర్ కి ఈ విషయాల్లో జ్ఞాపక శక్తి ఎక్కువ. ప్రతి నక్షత్రపు పేరునీ, గ్రహాల పేర్లనీ చెప్పేవాడు. కానీ తన ఈ కుతూహలం ప్రొఫెసర్ పనిని మాటిమాటికీ చెడగొడుతూందని గ్రహించి అడగటం మానుకున్నాడు. ఆ భావంతోనే నారింజపండు ఆకారపు బంతి గురించి అతడు అడగలేదు.
   
    కానీ మళ్ళీ మరుసటిరోజు అదే సమయానికి అది కనబడింది. ఈసారి అది ఫుట్ బాల్ సైజులో వుంది. కానీ టెలిస్కోప్ నుంచి కాకుండా మామూలుగా కనపడటం లేదు. మరింత వేగంతో అది ఉత్తరదిశగా సాగిపోతోంది. ఈసారి ఇక అతడు కుతూహలం ఆపుకోలేక ప్రొఫెసర్ ని పిల్చి చూపించేడు.
   
    ప్రొఫెసర్ చాలాసేపు దాన్ని గమనిస్తూ వుండిపోయేడు. అరగంటలో అది ఉత్తరదిశలో అదృశ్యమైపోయింది.
   
    "ఎన్నాళ్ళనుంచి దీన్ని చూస్తున్నావు?" టెలిస్కోపు ఆవరణలో నుంచి బయటకు వస్తూ అడిగేడు ప్రొఫెసర్. అతడి మొహంలో ఏ భావమూ లేదు.

 Previous Page Next Page