Previous Page Next Page 
యుగాంతం పేజి 8

   

     మానవజాతి మరణించకుండా ఏ శక్తి ఆపగలదు?.....కారు ఎల్ కామి నోరియల్ నుంచి స్కైలైన్ బౌల్ వార్డ్ వైపు సాగిపోతూ వుండగా అతను అనుకొన్నాడు.
   
    ఇంకా తెల్లవారటానికి వ్యవధి వుంది. కొద్దిగా మంచు కురుస్తూంది. థర్డ్ స్ట్రీట్ లో వున్న పెద్ద భవంతి ముందు కాంటెస్సా ఆగింది. విశాలమైన మెట్లు, కొద్దిగా తెరచి వున్న తలుపు. లోపల యూనిఫారంలో ఉన్న గార్డులు.
   
    ఓవర్ కోటు సవరించుకొంటూ మెక్ లోపలి ప్రవేశించాడు.
   
    కారిడార్ లో లైట్లు వెలుగుతున్నాయి. అంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా వుంది. అక్కడక్కడా అసిస్టెంట్లు మౌనంగా తిరుగుతున్నారు. పెద్ద తుఫాను రావడానికి ముందున్న వాతావరణం అక్కడ నెలకొని వుంది. పది అడుగులు ఎత్తున్న చెక్క తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. నాబ్ తిప్పి, నెమ్మదిగా తెరిచాడు.....లోపల లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మధ్యలో ఓవల్ షేప్ లో పెద్ద బల్ల వుంది. చుట్టూ కూర్చొని వున్నవాళ్ళని వరుసగా చూసేడు.
   
    అండర్ సెక్రటరీ టు ది డిఫెన్సు మినిస్టర్ చార్లెస్ మెక్ డొనాల్డ్, ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్లమెంటరీ కమిటి జాన్ నికల్సన్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ రాబర్ట్ ఫిన్స్, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ రోగర్స్.... మెక్ చూపు పక్కకి కదిలి ఆగిపోయింది.
   
    అంత చలిలోనూ నుదుటిమీద చెమట పట్టింది.
   
    చేతులు రెండూ వళ్ళో పెట్టుకుని ముందుకు వంగి కాగితాల్ని పరిశీలిస్తూ ఒక వృద్దుడు అక్కడ కూర్చొని వున్నాడు.
   
    అతడు ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ సెంట్రల్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ సోవియట్ రష్యా- బోరిన్. ఎఫ్. కాస్తినోవా.
   
                               *    *    *
   
    రెండు చేతులూ చెంపల కాన్చుకొని ఆలోచిస్తోంది శైలజ.
   
    ఆమె ముందు ఇంటర్వ్యూ తాలూకు ఫైలూ, అభ్యర్దుల మార్కుల లిస్టూ వుంది.
   
    ఆ రోజు రమణికి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆమె ఏదో పని ఉండి, ఆ రూమ్ లోకి వెళ్ళింది. రమణని చూసి 'ఎక్కడో చూసినట్టు ఉందే' అనుకొంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రాణి ఫోటో చూపించిన సంగతి.
   
    ఆమె బయటకొస్తూంటే అతనన్న మాటలు వినిపించినయ్.
   
    "ఇలాంటి ఇంటర్వ్యూలుండవు. ఎయిర్ కండషన్డ్ రూము లుండవు.....ప్రశ్నలుండవు.... సమాధానాలుండవు."
   
    ఆమెకి నవ్వొచ్చింది.
   
    నిజానికి అతడు అంతకుముందు సమాధానాలన్నీ చక్కగా చెప్పేడు అతడి సబ్జెక్టు కాకపోయినా.
   
    కానీ మానేజిమెంట్ అభ్యర్ధి ఇంకొకథను వున్నాడు. రికమెండేషను కేండేటు. అతడి నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఈ ఇంటర్వ్యూ కేవలం బయటవాళ్ళని సంతృప్తి పరచటానికే.
   
    ఆమె లిస్టు చూసింది.
   
    ఉద్యోగం ఇవ్వాలనుకున్న అభ్యర్దికి నూటికి తొంభై మార్కులిచ్చేరు కమిటీ సభ్యులు. రెండోవాడెవడో రామన్ అట, అతడికి యాభై మార్కులు వచ్చినయ్.
   
    ఆమె రమణ పేరు కెదురుగా చూసింది.
   
    సున్నా వుంది.
   
    ఆమె పేలవంగా నవ్వుకొంది.
   
    నిజానికి అతను చెప్పిన సమాదానాలకి నూటికి నూరు రావాలి. కేవలం అతడికి ఉద్యోగం ఇవ్వటం ఇష్టంలేక అతన్ని రెచ్చగొట్టి, ఆ నెపంమీద సున్నా మార్కులిచ్చేరు.
   
    రికమండెడ్ కాండేట్ క్వాలిఫికేషనువైపు చూసింది.
   
    ఇంటర్మీడియేట్- ఫస్ట్ క్లాస్.
   
    ఆమెకి రమణమీద జాలివేసింది. సర్టిఫికెట్లు సర్దుకొంటూ అతడు నిసాహాయమ్గా చూసిన చూపు ఆమెకింకా జ్ఞాపకం వుంది.
   
    కానీ ఏం చేయగలదు-
   
    -ఫైలు సర్ది లోపలపెట్టి, ఆ రోజు పోస్ట్ తీసింది. ఒక్కో ఉత్తరమే చదవసాగింది.
   
    నాలుగో ఉత్తరం చదువుతూ ఆమె ఉలిక్కిపడింది. ఉద్యోగం వచ్చిన అభ్యర్ధి దగ్గర్నుంచి అది. 'ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చినందువల్ల దీంట్లో చేరలేనందుకు విచారిస్తున్నాను' అని. రికమెండేషను వున్నవాడికి ఇంతకన్నా మంచి ఉద్యోగం రావడంలో ఆశ్చర్యం లేదు.
   
    అయితే ఈ ఉద్యోగం ఇప్పుడెవరికి వస్తుంది?
   
    రామన్ అనే మద్రాసీకి.
   
    అంటే కమిటీ మెంబర్లలో ఎవరికీ రెండో కేండేట్ మీద ఇంట్రెస్టు లేదన్నమాట.
   
    ఆమె మనసులోకి తెరలగా ఒక ఆలోచన వచ్చి సన్నగా వణికింది.
   
    అలా చేస్తే-
   
    ఎవరికైనా తెలిస్తే-
   
    ఎలా తెలుస్తుంది?
   
    అయినా ఎందుకు చెయ్యాలి?
   
    అన్యాయం జరిగిన ఒక యువకుడికి న్యాయం చేకూర్చటం కోసం.
   
    అయినా రిస్కు....
   
    .......
   
    పరస్పర విరుద్ద భావాల్తో ఆమె కొంచెం సేపు కొట్టుమిట్టులాడింది. చివరకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు కలం చేతిలోకి తీసుకొంది. రామన్ అన్న ఇంగ్లీషు పేరుకి చివర 'ఎ' అన్న అక్షరం కలిపింది.
   
    'రమణ' అయింది అది.
   
                                   *    *    *

    ఒక పెద్ద పులి రెండు కాళ్ళతో నడుస్తూ మీద మీదకి వస్తున్నది. మిగిలిన రెండు చేతులూ భయంకరంగా సాచి, గోళ్ళతో చీల్చి చెండాడటానికి ముందుకొస్తున్నది. కేక వేయబోయాడు. నోటి వెంబడి మాటరాలేదు. పరుగెత్తసాగేడు. వెనుకే పులి. ఆగి వెనక్కి చూసి మళ్ళీ పరుగెత్తసాగేడు. ఎంత పరుగెత్తినా అడవి తరగటం లేదు, అంతా అడవే. పులి వెనుకే వస్తున్నది.
   
    చప్పున ఆగిపోయేడు. ఎదురుగా పెద్దవాగు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. వెనుక పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి. చుట్టూ చూసేడు. చుట్టూ ఫైళ్ళు. పెద్ద పెద్ద చెట్లలా బీరువాలు, చెట్లకి ఆకులు లేవు. ఫైళ్ళు వేలాడుతున్నాయి ఆర్దనరీ....అర్జెంటు.....ఇమ్మీడియేట్.....కాగితాలు లేస్తున్నాయి. దుమ్ము, పేపర్ బాస్కెట్ లోంచి సుడిగాలిలా లేస్తున్న కాగితాలు.
   
    అంతా చుట్టూ చేరింది.
   
    వెనుకనుంచి పులి మీదకి దూకింది.
   
    కెవ్వున అరిచేడు.
   
    "ఏవండీ.....ఏవండీ...." అని తట్టి లేపింది జానకి.
   
    ప్రకాశరావు కళ్ళు తెరిచాడు. వళ్ళంతా చెమట పట్టింది. మనిషి వణికిపోతున్నాడు.
   
    "ఏమైందండీ?" అడుగుతూంది.
   
    అతడు కొంచెంసేపు మాట్లాడలేదు. తరువాత బలహీనమైన కంఠంతో "మంచినీళ్ళు" అన్నాడు.
   
    ఆమె లేచివెళ్ళి మంచినీళ్ళు తెచ్చి యిచ్చింది. వణుకుతూన్న చేతుల్లో అందుకొని గబగబతాగేడు.
   
    జానకికి భర్త సంగతి తెలుసు.
   
    "ఏమైందండీ?" అని అడిగింది.
   
    "కల, భయంకరమైన కల" అన్నాడు.
   
    "ఏమిటి?"
   
    కాలని వర్ణించి చెప్పేడు.
   
    "పులి రెండు కాళ్ళమీద నిలబడి వుందా?"
   
    "ఆఁ.....! రెండు కాళ్ళమీద మనిషిలాగే వుంది."
   
    "మొహం పులిలాగే వుందా?"
   
    "ఆ, పులిలాగే.....ఉహూఁ.....కొద్దిగా పులీ- కొద్దిగా మనిషీ- అలా వుంది."
   
    "మనిషి ఎలా వున్నాడు"
   
    "మా హెడ్ క్లర్క్ లా వున్నాడు?"

 Previous Page Next Page