Previous Page Next Page 
సుహాసిని పేజి 9


    "కాలేజీ గేటు ముందో బోర్డుంది. కళ్ళున్న వాళ్ళు, చదువుకున్నవాళ్ళు అది చదివి అసలు విషయం తెలుసుకోవచ్చు" అంది రాణి గంభీరాదేవి.


                       *    *    *    *


    "ప్రవేశానికి ముందు ఈ కాలేజీ విద్యార్ధులు తప్ప యితరులు ప్రత్యేకానుమతి తీసుకోవాలి."

    బోర్డు చదివి నిట్టూర్చాడు దేవేంద్ర. తరువాత దర్వాన్ వేపు తిరిగి- "ఇంకా కాలేజీ విడిచిపెట్టడానికెంత టైముంది?" అన్నాడు.

    "కాలేజీ వదిలి పది నిముషాలయింది" అన్నాడు దర్వాన్.

    "మరి ఒక్కరూ కనిపించరేం?"

    "ఎవరూ - స్టూడెంట్సా? వాళ్ళెందుక్కనిపిస్తారు? ఇలా కాలేజీ వదలగానే అలా మాయమైపోతారు. కొందరు సినిమాలకి, కొందరు హోటళ్ళకి, కొందరు పార్కులకి...." అని ఆగి, "నిన్ను చూస్తే నవ్వొస్తోందని చూడ్డం లేదు. కానీ నిన్ను చూడకపోయినా జాలేస్తోంది. నీకో మంచి కబురు చెబుతాను. ఇందాక చూపించావే ఆ నోటిస్తావా?" అన్నాడు దర్వాన్.


                            *    *    *    *


    చల్లని నీరెండలో, గుబాళించే పూలమొక్కల మధ్య పూలబాలల్లా కూర్చుని పూల వికాసాన్ని మించిన హాస్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఆరుగురు అమ్మాయిలు.

    వారి మధ్య వనదేవతలా ఠీవిగా కూర్చున్న ఏడో అమ్మాయి హాస!

    "మా ఇంటికో అంకులొస్తుంటారు. ఎప్పుడొచ్చినా నన్ను పిలిచి దువ్వెన అడుగుతూంటారు. దువ్వెన యివ్వగానే అద్దం ముందుకు వెళ్ళి గంటసేపు తల దువ్వేస్తారు.... అదేమిటంటే తల దువ్వుకోకపోతే చిరాకంటారు" అంది హాస.

    "అయితే?" అంది ప్రతిభ. 

    "ఆయనది బట్టతల...."

    అందరూ నవ్వేశారు. అందరికీ ముందు నవ్వాపిన మాలతి, "నాకు తెలిసిన ఓ బట్టతల అంకుల్ జేబులో ఎప్పుడూ దువ్వెన వుంచుకుంటారు" అంది.

    అంతా ఘొల్లుమన్నారు.

    "మీ అంకుల్ జేబులో దువ్వెన ఉండదా మరి....?" అంది ప్రతిభ హాసతో.

    "మొదట్లో ఉండేదిట! కానీ దారినపోయే బట్టతల వాళ్ళంతా తన్ను దువ్వెన కావాలని అడుగుతూంటే చిరాకేసి మానేశారుట"

    "హాసా! నువ్వాయన్నొదిలిపెట్టావా?" అంది లలిత.

    "ఓసారేమయిందో చెప్పనా?" అంది హాస.

    "ఊఁ" అన్నారందరూ కుతూహలంగా.

    "ఓ రోజున అంకుల్ మా యింటికొచ్చి దువ్వెన అడగలేదు.... ఆశ్చర్యపోయి అంకుల్! ఈ రోజు దువ్వెన అడగలేదేం అన్నాను. ఆయన కాస్త కోపంగా, కనబడ్డంలేదూ! తిరుపతి తిరుపతి వెళ్ళి గుండు చేయించుకు వచ్చాను అన్నాడు. అయ్యో తిరుపతి వెళ్ళారా? నేను చూసి మీరింకా క్షౌరం చేయించుకు వచ్చారనుకున్నాను అన్నాను" అంది హాస.

    అంతా ఘొల్లుమన్నారు.

    "హాసా! నీకు హేట్సాఫ్" అన్నారాడపిల్ల లందరూ ఏక కంఠంతో.

    "మా అంకులూ అదే అన్నాడు. నేనాయనతో మీరు హేట్సాఫ్ లో కంటే హేట్సాన్ లోనే బాగుంటారన్నాను."

    అమ్మాయిలందరూ ఘొల్లుమన్నారు.

    "హాసా! ఇంత హాస్యం ఎక్కడ్నుంచి పుట్టుకొస్తుందే నీలో!"

    హాస నవ్వి, "హాస్యం నాలోంచి పుట్టుకురావడం లేదు. అది మన చుట్టూ వుంది. దాంట్లోంచే నేను హాస్యాన్నేరుకుంటానంతే!" అంది.

    "మన చుట్టూ హాస్యమా? ఎక్కడే?" అంది కమల.

    "జీవితం క్షణభంగురమని అందరికీ తెలుసు కానీ దానికోసం అంతా ఎంత తాపత్రయపడతారు? అది హాస్యం కాదా? కాలే కడుపుతో మనింటి ముందు నిలబడ్డ బిచ్చగాడ్ని కసిరికొట్టి పంపించి దేశం కోసం నాయకులేం చేయడం లేదని వాపోతూంటాం మనం. అది హాస్యం కాదా? ప్రాణం లేని బొమ్మను దేవుడిగా మార్చి ఆ దైవ భక్తి పేరుతో ప్రాణమున్న బొమ్మలు అంటే మనుషుల్ని చంపుకుంటాం. అది హాస్యం కాదా?" ఆగింది హాస.

    "ఇదేమిటే బాబూ! హాస్యం గురించడిగితే వేదాంతం మాట్లాడుతున్నావు?"

    "బలవంతాన వంటికి చక్కిలిగింతలు పెట్టి తెప్పించే నవ్వు నవ్వు కాదు. వేదాంతపు లోతుల్లోంచి వచ్చిందే అసలయిన హాస్యం. అది హృదయానికి గిలిగింతలు పెడుతుంది"

    "ఏడో ఒకటి కాసేపు నవ్వుకోడానికి"

    "అలా కాదే! హాస్యం వల్ల ప్రయోజనముండాలి."

    "అయితే నువ్వు ప్రతి మాటా ప్రయోజనం గురించే ఆలోచిస్తావా?"

    "అఫ్ కోర్స్! ఉదాహరణకు మా యింట్లో సంగతే తీసుకో. మా తాతగారున్నారు. ఆయన మెట్ట వేదాంతం చెబుతారు తెలివిగా మాట్లాడతారు. ప్రతిదాంట్లో తర్కముండాలంటారు. కానీ ఆయనకు వృద్దవారీ పతివ్రతా అన్న సామెత వర్తిస్తుంది వయసు. శక్తి, అధికారం వున్న రోజుల్లో తర్కం గురించి పట్టించుకోకుండా నిరంకుశంగా ప్రవర్తించే వారాయన. ఆయన్ను నేనెలా వదులుతాను? మా బామ్ముంది దైవభక్తి, ఆచారం, సంప్రదాయం అంటూ కబుర్లు చెబుతుంది. నన్ను చూస్తే మాత్రం ఆవిడకు శృంగారం గుర్తుకొస్తుంది. నా దగ్గర పెళ్ళి గురించి తప్ప మరోటి మాట్లాడదు. మొగుడి దగ్గరెలా మసలాలో లక్ష విధాల చెబుతుంది. ఆవిణ్నీ నేనొదలలేను. నాన్నగారున్నారు. ఇంట్లో ఎవ్వరు తప్పు చేసినా ఖండించరాయన.

    తను తప్పుచేస్తే ఆ మాట చెప్పడానిక్కూడా వీల్లేదు. చిన్నవాళ్ళు చెపితే క్రమశిక్షణకు భంగం. పెద్దవాళ్ళు చెబితే కాలానుగుణంగా పద్ధతులు మారతాయంటారు. అలాగే అమ్ముంది. ఇంటెడు చాకిరీ చేస్తుంది. ఎప్పుడూ గొణుక్కుంటూనే వుంటుంది. ఎవరయినా సాయానికి వెడితే వాళ్ళ పనులు ఆవిడకి నచ్చవు. సాయం చేయకపోతే చేయలేదని విసుగు. వద్దంటే పని మానదు. వద్దనడం లేదని కోపం.  

    గుర్తింపు కోసం పని చేయడం లేదంటుంది. గుర్తింపు లేదని బాధ. ఆవిణ్సీ నేను వదలను. ఒకరి లక్షణాలింకొకరి దగ్గర యధాకధంగా ప్రవర్తించాననుకోండి.... అదే హాస్యం.... మా ఇంటి పద్ధతుల్లో మా ఇంట్లో వాళ్ళ ప్రవర్తనల్లో నావల్ల చాలా మార్పులు వచ్చాయి...."

    అమ్మాయిలందరూ ఆమెవంక మెచ్చుకోలుగా చూసి- "నువ్వు సామాన్యురాలివి కాదు...." అన్నారు.

    "అందరి గురించీ చెప్పావు. మీ తమ్ముడి గురించి చెప్పలేదేం?" అంది మాలతి.

    "ఈ రోజుల్లో మగపిల్లల గురించి చెప్పడానికేముంది? ఏమీ తెలియక పోయినా అన్నీ తెలుసుననుకుంటారు. వాడి గురించేం చెప్పను? మగపిల్లల్నేడిపించడమొక తేలికయిన పని మరోటి లేదని వాడ్ని చూసే నేను తెలుసుకున్నాను...."

    "అయితే సరదాగా ఓ కుర్రాణ్నేడిపిద్దామా?" అంది ప్రతిభ.

    హాస ఏదో అనబోయేలోగా దేవేంద్ర వారి ముందు ప్రత్యక్ష్యం అయ్యాడు.

    ఆడపిల్లలతన్ని చూసి కంగారుపడ్డారు.

    "ఎవర్నువు?" అంది హాస.

    "మీరెవరు? దేవకాంతలా?" అన్నాడతను.

    "ముందు నువ్వెవరో చెప్పు...." అంది హాస.

    "నా పేరు దేవేంద్ర...."

    హాస కిసుకున నవ్వి, "పేరేమోగానీ నువ్వు సినిమాల్లో వేయాలంటే దేవేంద్రుడి వేషానికి పనికిరావు...." అంది.

    "నాకు సినిమాల్లో వేషాలొద్దు. మీతో కాసేపు మాట్లాడితే అదే నా అదృష్టం...."

    "ఎవరు నువ్వు?" అంది మాలతి.

    "నేను దుష్టుణ్ణీ, తుంటరినీ కాదు. చాలా మంచివాణ్ని. ఇంకా చెప్పాలంటే అమాయకుణ్ని. నెలకు నాలుగువేల రూపాయల ఉద్యోగం చేస్తూ పైసా కట్నం లేకుండా పెళ్ళి చేసుకోవాలని అమ్మాయిలకోసం వెతుకుతున్నవాణ్ని" అన్నాడు దేవేంద్ర.

    "అలా కూర్చూ" అంది హాస.

    దేవేంద్ర వారికి దూరంగా కూర్చున్నాడు.

    "నువ్వు నిజమే చెబుతున్నావా?" అంది హాస.

    "నేను చెబుతున్నది అబద్ధమని అనుమానముంటే ఎవరయినా మా యింటికొచ్చి నేరుగా మా నాన్నతో మాట్లాడొచ్చు...."

    "ఎక్కడ మీ యిల్లు?" అంది హాస.

    "గోవిందరావు స్ట్రీట్ లో, కల్పనా హోటల్ పక్కనున్న పచ్చ మేడ మాది"

    "వెరీగుడ్! మాలో ఎవరయినా నచ్చారా నీకు?"

    "నువ్వే నాకు నచ్చావు...." అన్నాడు దేవేంద్ర చటుక్కున.

    "అయామ్ సారీ! నువ్వు నాకు నచ్చలేదు. ఇంకెవరయినా నచ్చితే చెప్పు...."

    అమ్మాయిలందరూ ఘోల్లున నవ్వారు.

    దేవేంద్ర తడబడ్డాడు. హాస అంత స్పష్టంగా తన్ను నిరోధిస్తుందని అతడనుకోలేదు. నెమ్మదిగా "నువ్వు నన్ను హార్టు చేసేలా మాట్లాడుతున్నావు...." అన్నాడు.

    "నిజం తెలుసుకుంటే హార్టున్న వాడెవడూ హర్టవడు........" అని నవ్వింది హాస.

    "వరకట్నం సమస్యగా మారిన యీ రోజుల్లో నావంటి యువకులు నడుము కట్టుకుని ముందుకొస్తే ఆడపిల్లలిలా మాట్లాడటం స్త్రీ జాతికే అనర్ధాన్ని కలిగిస్తుంది...." అన్నాడతను.

    "వరకట్నం మాకు సమస్య కాదు. పెళ్ళిళ్ళ బజార్లో నాకు లక్ష రూపాయల కన్యాశుల్కం పలికింది. ఇక్కడున్నవారిలో మినిమమ్ కన్యాశుల్కం నలభయ్ ఐదు వేలు. అంతివ్వగలిగితే వెళ్ళి మీ నాన్నకు చెప్పు. ఆయనకు నచ్చితే వెళ్ళి ఆయా పెద్దల్ని కలవమను" అంది హాస.

 Previous Page Next Page