Previous Page Next Page 
సుహాసిని పేజి 10


    "నలభై ఐదువేలా? నేనివ్వాలా?" అన్నాడతను.

    "నువ్విక్కడ నుంచి వెళ్ళిపోతానంటే మేమే నీకు వెంటనే పదిరూపాయలిస్తాం...." అంది హాస.

    "పదిరూపాయలా? ఎందుకు?"

    "మా కాలేజీ ద్వారా నాకు నువ్విచ్చిన డబ్బులు వెనక్కు తీసుకోవూ?"

    దేవేంద్ర ఆశ్చర్యంగా_ "వాడికి నేను డబ్బిచ్చినట్లు మీకెలా తెల్సు?" అన్నాడు.

    "ఏ రోజున మేమెక్కడ కబుర్లాడుకుంటామో వాడికొక్కడికే తెలుస్తుంది. రోడ్డుసైడ్ రోమియోలతో కాసేపు సరదాగా వినోదించడానికి వాడూ-మేమూ చేసుకున్న యేర్పాటిది" అంది హాస.

    దేవేంద్ర తెల్లబోయాడు.

    హాస లేచి నిలబడి- "ఈ రోజుకీ వినోదం చాలు" అంది.

    ఆడపిల్లలంతా అక్కడినించి వెళ్ళిపోయారు. దేవేంద్ర మాత్రం అక్కడే చతికిలబడిపోయాడు నీరసంగా.


                       *    *    *    *


    కాసేపటికి నీరెండ చీకటిగా మారింది.

    దేవేంద్ర యింకా అక్కడే వున్నాడు.

    తన ప్రయత్నం పూర్తిగా విఫలమవుతుందని అతడూహించలేదు.

    అమ్మాయిల తెలివి తనను మించిపోయింది. వయసు పొగరులో కన్నూ-మిన్నూ కానకుండా వున్నారు వాళ్ళు.

    తనిప్పుడేం చేయాలి?

    ఆలోచిస్తున్నాడు దేవేంద్ర.

    అతడి బుర్ర శూన్యం!

    ఆ సమయంలో ఎవరో అతన్ని నెమ్మదిగా, "మిష్టర్ఫ్ దేవేంద్రా!" అని పిలిచారు.

    దేవేంద్ర ఉలిక్కిపడి తలెత్తాడు.

    ఎదురుగా ఓ అమ్మాయి.

    సన్నగా, నాజూగ్గా, పచ్చని చాయలో, వయసు మెరుపులో అసామాన్యంగా కాకపోయినా సామాన్యంగా కనిపించిన ఆ అమ్మాయిని దేవేంద్ర కాసేపటి క్రితం హాసతోపాటు గుంపులో చూశాడు.

    అప్పుడతడి దృష్టి పూర్తిగా హాసపై కేంద్రీకరింపబడి ఉంది. ఇప్పుడతడికి ఆమెను చూస్తుంటే హాసకంటే అందమయినదా అనిపించింది.

    పార్కులో ఎలక్ట్రిక్ దీపం కాంతి సరిగ్గా ఆమె ముఖంపై ప్రసరిస్తోంది. అందువల్ల ఆమె ముఖంలో తేజస్సు వచ్చింది.

    "నా పేరు ప్రతిభ" అందామె.

    "కూర్చో" అన్నాడతను.

    ఆమె కూర్చుని_ "ఇందాక మావాళ్ళు నిన్ను ఎద్దేవా చేస్తుంటే వాళ్ళతోపాటు నేనూ నవ్వాను. నన్ను మన్నించు" అంది.

    దేవేంద్ర నిట్టూర్చి వూరుకున్నాడు.

    "నువ్వు చాలా మంచివాడివి. గొప్పవాడివి. నిన్ను మేమంతా గౌరవించాలి" అంది ప్రతిభ నెమ్మదిగా.

    "థాంక్స్" అన్నాడతను.

    "నేను పుట్టాక మా అమ్మ చనిపోతే మా నాన్న రెండో పెళ్ళి చేసుకున్నాడు. నేనూ రెండో పెళ్ళివాణ్నే చేసుకోవాలనిప్ పిన్ని మనసులో కోరిక. అందుకు వరకట్న సమస్యను వంకగా ఉపయోగించుకుంటోంది. నువ్వు నా సమస్యను పరిష్కరించగలవు" జాలిగా, దీనంగా అంది ప్రతిభ.

    "మా యింటికొస్తావా, నిన్ను మా నాన్నకు చూపిస్తాను" అన్నాడు దేవేంద్ర.

    "అప్పుడే కాదు. మనం కొన్నాళ్ళపాటు ఇక్కడే కలుసుకుని ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాక.... అప్పుడు...." అంది ప్రతిభ.

    దేవేంద్ర మరోసారి ఆమెవంక చూశాడు.

    ఎర చుట్టూ తిరుగుతున్న చేపలా కనిపడిందామె.

    "నా ప్రయత్నం వృధా పోలేదు" అనుకున్నాడతను.

   
                                                                 10


    కార్మిక నాయుడుకు కనకారావు, ప్రముఖ రాజకీయవేత్త రాజారావు స్టేజీమీద కూర్చున్నారు. వారి ముందు నేలమీద కార్మికజనం కూర్చున్నారు. వాళ్ళు సుమారు వెయ్యిమంది దాకా వుంటారు.

    రాజారావు కార్మికులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలన్నీ వివరించి వాటినెలా ప్రతిఘటించాలో ఆవేశంగా చెబుతున్నాడు. ఆయన చెప్పే ప్రతి మాటకూ జనం చప్పట్లు కొడుతున్నారు. ఆయన ఉపన్యాసమయ్యేక కనకారావు రాజారావును మెచ్చుకుని, "వచ్చే ఎన్నికల్లో మనం ఈయనకే ఓటివ్వాలి. అప్పుడే మన బ్రతుకులు బాగుపడతాయి" అంటూ ఆవేశంతో రాజారావుకు అనుకూలంగానూ, ప్రభుత్వానికి ప్రతికూలంగానూ కొన్ని నినాదాలు చెప్పి వాళ్ళచేత అనిపించాడు.

    నినాదాలు మార్మోగుతున్న సమయంలో గౌతమ్ అక్కడికొచ్చి సంగతేమిటో తెలుసుకున్నాడు.

    అప్పుడతడిక్కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు.

    నెల్లాళ్ళక్రితం వరకూ రాజారావు ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు కార్మికులకు జరిగిన అన్యాలన్నీ అతడి హయాంలో జరిగినవే. ఆ తర్వాత ముఖ్యమంత్రితో పేచీ వచ్చి పార్టీలోంచి బయటకొచ్చేశాడు.

    గౌతమ్ ఆవేశంగా వేదికను సమీపించాడు.

    అప్పటికి రాజారావు, కనకారావు వేదిక దిగుతున్నారు.

    గౌతమ్ వాళ్ళను సమీపించి, "అయ్యా! నాదో చిన్న అనుమానం వింటారా?" అన్నాడు.

    రాజారావు ఆగి, "ఊ" అన్నాడు.

    గౌతమ్ అతడికి తన సందేహం చెప్పాడు.

    రాజారావు చిన్నగా నవ్వి, "మన దేశంలో ఎన్ని పార్టీలైతే వున్నాయో అందరే మనుషులున్నారు. వాళ్ళే దేశాన్నేలుతున్నారు...." అన్నాడు.

    "నా కర్ధం కాలేదు" అన్నాడు గౌతమ్.

    "మన దేశంలో ఒక జాతీయపార్టీ వుంది. ఆ పార్టీలో ఎందరు నాయకులున్నా మనిషి ఒక్కడే. ఆయనే మన ప్రధానమంత్రి. అలాగే కొన్ని ప్రాంతీయ పార్టీలున్నాయి. వాటిలోనూ ఎందరున్నా మనుషులు మాత్రం పార్టీకొక్కరే. వాళ్ళే ముఖ్యమంత్రులు. నేను కార్మిక మంత్రిగా ఏదో చేశానని నువ్వంటున్నావు. ఏమీ చేయడానికి వీల్లేకుండా ఉందని కదా నేను పార్టీలోంచి బయటకొచ్చేశాను. నేను కార్మిక మంత్రిగా ఉండగా ఏ కాగితాల మీద సంతకాలు పెట్టానో పార్టీలోంచి బయటకొచ్చాకే తెలుసుకుంటున్నాను" అన్నాడు రాజారావు.

    "ఇలాంటి మనిషి ఇంకో పార్టీలో చేరితే మాత్రం...."

    రాజారావు నవ్వి, "నేను నాకు ఓటు వేయమంటున్నానా, మా పార్టీకి వేయమంటున్నాను" అన్నాడు.


                   *    *    *    *



    అట్టడుగు మనిషికి మరో విధంగా సాయపడాలని తోచింది గౌతమ్ కి.

    అతడు దోపిడీకి గురవుతున్న కార్మిక వర్గంలో చైతన్యం కల్పించాలనుకున్నాడు. అందుకోసం తనకు తెలిసిన కార్మికులు కొందరిని ప్రోత్సహించాడు.

    "మా నాయకుణ్ణడిగి చెబుతాం" అన్నారు వాళ్ళు. ఆ తర్వాత పదిరోజులక్కనిపించి, "మీరు చెప్పింది అన్యాయం కాదుట. మా నాయకులు చెప్పారు" అన్నారు వాళ్ళు.

    "కంటిక్కనిపించే అన్యాయాన్ని అన్యాయం కాదనే వాళ్ళేం నాయకులు!" అన్నాడు గౌతమ్ ఆవేశంగా.

    "ఏమో, వాళ్ళు న్యాయమన్నదే మేమూ న్యాయమనాలి. వాళ్ళు అన్యాయం కాదన్నది మేమూ కాదనాలి. లేదంటే మా బ్రతుకు లన్యాయమై పోతాయి." 

    గౌతమ్ చిరాగ్గా "ముందు మీ నాయకుల్ని సరిదిద్దండి. లేకుంటే మీది ఎప్పటికీ బానిస బ్రతుకైపోతుంది" అన్నాడు.

    "ఒకప్పుడు యాజమాన్యాన్నెదిరించాలని త్రేజ్ యూనియన్స్ స్థాపించాం. అందువల్ల మామూలు కార్మికుడికి యజమానులిద్దరయ్యారు. యాజమాన్యంతోపాటు ట్రేజ్ యూనియన్ నాయకులు కూడా మిమ్మల్ని శాసిస్తున్నారు" అన్నాడో కార్మికుడు.

    "దీన్ని మీరెదిరిస్తానంటే నేను మీకు సాయపడలేను...." అన్నాడు గౌతమ్ ఆవేశంగా.

    "వద్దు ఇప్పటికే యిద్దరు యజమానులయ్యారు. మూడో యాజమాన్యాన్ని భరించలేం" అన్నాడా కార్మికుడు.


                        *    *    *    *


    సామాన్యుడు అంతులేని దోపిడీకి గురవుతున్నాడని గౌతమ్ కి అర్ధమయింది కానీ ఈ దోపిడీ నాపేదెలా?"

    వెంకట్రత్నంతో మాట్లాడితే "అసలీ సామాన్యుడెవరు నాయనా? వాడెక్కడుంటాడో చెప్పు" అన్నాడు.

    "సామాన్యుడంటే....ఉదాహరణకి రిక్షావాణ్ణి తీసుకుందాం"

    "రిక్షావాడా? మొన్న ఓ పెళ్ళికి వెడితే అర్జంటుగా రిక్షా కావలసొచ్చింది. ఒక్కటంటే ఒక్కటే రిక్షా ఉంది. రెండ్రుపాయల దూరానికి ఇరవై అడిగాడు. తప్పుతుందా, అవసరం! ఇచ్చుకున్నాం...."

    "అయితే ఏమంటారు?"

    "ఈ ప్రపంచంలో సామాన్యుడు, అసామాన్యుడు అంటూ ఎవరూ లేరు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కడూ దోపిడీదారుడే!"

    గౌతమ్ ఏదో అనబోయి ఊరుకున్నాడు. లోతుగా ఆలోచించినకొద్దీ వెంకట్రత్నం మాటల్లో నిజముందని పించసాగిందతడికి.


                        *    *    *    *


    అసంతృప్తి, అసహనం గౌతమ్ కి వేధిస్తున్నాయి.

    అతడికి తెలుసు-తనలో స్వార్ధం తక్కువని!

    అతడికి తెలుసు-తనలో చిత్తశుద్ధి ఉన్నదని!

 Previous Page Next Page