Previous Page Next Page 
సుహాసిని పేజి 8


    "ఆడదాన్ని నా జీవితంలోకి ఆహ్వానించదల్చుకోలేదు. ఆడది మగాడిలో స్వార్ధాన్ని ప్రేరేపించి వాడ్ని నీచుడిగా మారుస్తుంది."

    ఆ యువకుడి వంక అనుమానంగా చూసి, "మీరు హోమోసెక్సువల్ కాదు కదా!" అన్నాడు.

    ఊహించని ఈ ప్రశ్నకు గౌతమ్ తెల్లబోయాడు.

    "నా స్నేహితుడొకడు నాకులాగే బ్లడ్ క్యాన్సరని ఇంకో ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడికిలాంటివి అభ్యంతరముండవు. కావాలంటే వాడికి చెబుతాను. మీరిద్దరూ కాపురం చేయొచ్చు."

    "షటప్!" అన్నాడు గౌతమ్.

    "ఒక్క పైసా యివ్వకుండా నా సమయం వృధా చేశారు. పైగా షటప్పంటారేమిటి?"

    "గెటౌట్!" అన్నాడు గౌతమ్ ఆవేశంగా.

    ఆ గొంతులోని తీవ్రతకు భయపడి తనలో తానే ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడా యువకుడు.

    గౌతమ్ ఆవేశమింకా చల్లారలేదు. అతను పది మైళ్ళు పరుగెత్తిన వాడిలా రొప్పుతున్నాడు.



                               9


     అప్పటికింకా కాలేజీ వదల్లేదు.

    గేటు మూసి వుంది. వెనుక దర్వాన్ కూర్చున్నాడో బల్లమీద. అతడి ముఖానికి మీసాల్లేకపోయినా ఉన్నంత గంభీరంగా వుంది.

    గేటుకివతల నిలబడున్నాడు దేవేంద్ర. పాతసినిమాల్లో దేవానంద్ లా చేయి అదోరకంగా పెట్టి తనలో తానే నవ్వుకుంటూ "కాలేజీ ఎన్నింటికొదుల్తారు?" అన్నాడు.

    దర్వాన్ గంభీరంగా "ఇంకా గంట టైముంది?" అన్నాడు.

    "గేటు ఎన్నింటికి తీస్తారు?" అన్నాడు దేవేంద్ర.

    "ఇంకా అరగంట టైముంది...." ఇంకా గంభీరంగా అన్నాడు దర్వాన్.

    "నేను లోపలకు వెళ్ళాలంటే ఎలా?"

    "మార్గం లేదు."

    "అబ్బ, ఆ చెప్పేదేమిటో నవ్వుతూ చెప్పొచ్చుగా...."

    "ఇది రాణీగంభీరా కాలేజీ. ఇక్కడ నవ్వులు నిషిద్దం" చాలా గంభీరంగా అన్నాడు దర్వాన్.

    "నన్ను చూడు. నా ముఖంలోకి చూడు. నీకు జాలిపుడితే ఒక్కసారి గేటు తీసి నన్ను లోపలకు పంపించు" అన్నాడు దేవేంద్ర.

    దర్వాన్ అతడి వంక చూశాడు.

    దేవేంద్ర జాలిగా నవ్వుకున్నాడు. అతడి చేతిలో పదిరూపాయల నోటు తళతళలాడుతోంది.

    దర్వాన్ చటుక్కున గేటు తాళం తీసి బయటకొచ్చాడు.

    "థాంక్యూ!" అంటూ దేవేంద్ర లోపల జొరబడబోతే దర్వాన్ అతడి నాపి గల గలా నవ్వసాగాడు.

    "ఎందుకయ్యా నవ్వుతావు?" అన్నాడు దేవేంద్ర విసుగ్గా.

    "నువ్వు చూడమనే దాకా నిన్ను సరిగ్గా చూడలేదు చూడగానే నవ్వాపుకోవడం కష్టమయింది. కాలేజీలో గేటుకివతల నవ్వకూడదని శాసనం. అందుకే గేటు తీసుకొచ్చి ఇక్కడ నవ్వుతున్నాను. నా నవ్వయ్యేదాకా నన్ను డిస్టర్బ్ చేయకు" అంటూ ఇంకాసేపు నవ్వేసి గేటు లోపలికి వెళ్ళి తాళం వేసి బల్లమీద కూర్చుని, "ముందే చెబుతున్నాను మళ్ళీ నీకేసి చూడమనకు. అస్తమానూ గేటు తాళం తీసి వేయడం నా వల్ల కాదు" అన్నాడు దర్వాన్.


                       *    *    *    *


    సరిగ్గా అరగంటకు కాలేజీ గేటు తెరిచాడు దర్వాన్.

    అప్పుడు దేవేంద్ర లోపల అడుగుపెట్టాడు. దర్వాన్ అతడ్ని ఆపలేదు.

    దేవేంద్ర తమాషాగా నడుస్తూ, చేతులదోలా పెట్టి మధ్య మధ్య తనలో తనే నవ్వుకుంటూ దేవానంద్ ఆ ప్రాంగణంలో అడుగుపెట్టాడా అన్నట్లు ముందడుగువేస్తున్నాడు.

    అలా కొంత దూరం వెళ్ళాడో లేదో ఓ మనిషి అతడ్ని ఆపి, "నాతో పద!" అన్నాడు.

    దేవేంద్ర అతడి వంక చూశాడు.

    ఎత్తుగా, బలంగా, బుర్ర మీసాలతో పెద్ద వస్తాదులా వున్నాడతడు.

    "ఎవరునువ్వు?" అన్నాడు దేవేంద్ర.

    "ఆ ప్రశ్న నేను నిన్నడగాలి."

    "ఎందుకని?"
   
    "నేనెవరో తెలియని వాళ్ళీ కాలేజీ ఆవరణలో అడుగుపెట్టరు."

    "ఎవరునువ్వు?"

    "తెలుసుకోవాలంటే రాణి గంభీరాదేవి నడుగు."

    "ఆవిడెవరు?"

    "ఈ కాలేజీ ప్రిన్సిపాల్...."


                         *    *    *    *


    విశాలమైన గది. గదిలో నెహ్రూతరం దాకా దేశనాయకుల పటాలు గోడలకి వ్రేళాడుతున్నాయి.

    సత్యమేవ జయతే, అహింసా పరమోధర్మః ఆరోగ్యమే మహా భాగ్యము....వగైరా వాక్యాలు కూడా గోడలకు రాసి వున్నాయి.

    గదిలో ఒక పెద్ద బల్ల. బల్ల మీద ఫైళ్ళ దొంతర. బల్లముందు నాలుగు కుర్చీలు. బల్ల వెనుక ఓ కుర్చీ....

    ఆ కుర్చీలో కూర్చుని వుంది రాణి గంభీరాదేవి.

    తలుపు తెరుచుకుని దేవేంద్ర లోపలకి ప్రవేశించగానే, "ఇలా వచ్చి కూర్చోండి" అందామె.

    దేవేంద్ర ఎదురుగా వున్న కుర్చీలో వెళ్ళి కూర్చున్నాడు. అతడు తన గురించి ఏదో చెప్పబోతూండగా "ముందా నవ్వాపండి" అందామె.

    "నేను నవ్వడం లేదు నా ముఖమే అంత!" అన్నాడు దేవేంద్ర ఇంకా అలాగే చిరునవ్వులు చిందిస్తూ.

    "అయితే మీరు మా కాలేజీ ఆవరణలో అడుగు పెట్టడానికి వీల్లేదు"

    "ఎందుకని?"

    "ఈ ఆవరణలో నవ్వు నిషిద్దం."

    "ఎందుకని?"
   
    రాణి గంభీరాదేవి, "అటు చూడండి" అంది. దేవేంద్ర అటుగా చూస్తే, "నవ్వు నాలుగు విధాల చేటు" అని గోడమీద వ్రాసి వుంది.

    "నా అనుభవంలో నవ్వు నలభై విధాల లాభం చేసింది."

    "కొందరు నవ్వి లాభం పొందుతారు. వాళ్ళను మోసగాళ్ళంటారు__ కొందరు లాభం పొంది నవ్వుతారు. వాళ్ళను వేటగాళ్ళంటారు.... ఈ ప్రపంచం మోసగాళ్ళతో, వేటగాళ్ళతో నిండి వుంది. ఈ కాలేజీ ఆవరణలో వాళ్ళకి స్థానం లేదు. అలాంటి వాళ్ళే ఇక్కడ చేరినప్పటికీ ఈ ఆవరణలో వున్నంతసేపూ నవ్వునీ__దాంతోపాటే మోసాన్నీ, వేటనీ మరిచిపోవాలి. అదిక్కడి నియమం" గంభీరంగా అంది రాణి గంభీరాదేవి.

    "మీరు నవ్వుకి వ్యతిరేకా?"

    "కాదు...."

    "పోనీ, ఎప్పుడూ నవ్వలేదా?"

    "ఈ ఆవరణలో ఎప్పుడూ నవ్వలేదు."

    "అసలు నవ్వంటే మీకెందుకు కోపం?"

    "ఈ ఆవరణలో నవ్వుతూ మాట్లాడేవాళ్ళ ప్రశ్నలకు జవాబులివ్వను."

    దేవేంద్ర ఆమెను పరీక్షగా చూశాడు.

    ఆమె వయసు నలభైకీ, యాభైకీ మధ్య ఉండవచ్చు. ఆమె యిప్పటికీ అందగత్తెకిందే వస్తుంది. చూడ్డానికి హుందాగా, ఠీవిగా, మహారాణిలా వుంది.

    "మీకు తోచిన రూల్స్ పెట్టి నడపటానికిది ప్రజారాజ్యం. విద్యార్ధుల తరపున దీన్ని నేను ప్రతిఘటిస్తాను" అన్నాడు దేవేంద్ర.   

    "ఇది పూర్తిగా నా డబ్బుతో నడపబడుతున్న కాలేజీ....! దీనికి ప్రభుత్వం గ్రాంట్సేమీ లేవు. మా నియామాలిష్టం. లేనివారిక్కడ చేరరు. యిక్కడ విద్యార్ధులు సంతోషంగా వుంటున్నారు. మా కాలేజీలో సీట్లకోసం తల్లిదండ్రు లెగబడుతున్నారు. ఇంత వరకూ ఈ కాలేజీ స్టూడెంట్స్ ఫెయిల్యూర్ ఎరుగరు. క్రమశిక్షణకు మా కాలేజీ పెట్టింది పేరు. ఏ స్టూడెంటు నయినా బయటకు వెళ్ళి అడగండి. రాణి గంభీరా కాలేజీలో చదువుతున్నానని గర్వంగా చెబుతాడు."

    "ఇంతకీ నన్నిక్కడి కెందుకు పిలిపించారు?"

    "కాలేజీ ఆవరణలో అపరిచితులకు స్థానం లేదు. అపరిచితులను బయటకు పంపడానికి వస్తాదు రామస్వామి వున్నాడు. వాళ్ళలో నవ్వుతూ కనబడ్డ వాళ్ళను మందలించడానికి నేనున్నాను."

    "నేను అపరిచితుణ్నని ఎందుకనుకున్నారు? నేను కూడా కాలేజ్ విద్యార్ధినై వుండొచ్చుగా...."

    "మా కాలేజీ స్టూడెంట్స్ క్లాసులయ్యేటప్పుడు క్లాసుల్లో వుంటారు. లంచ్ టైమ్ లో డైనింగ్ హాల్ లో వుంటారు. తీరిక వేళల్లో లైబ్రరీలోనో, ప్లే గ్రౌండ్స్ లోనో, ఎంటర్టయిన్ మెంట్ హాల్లోనో వుంటారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బైట తిరగరు. బైట తిరిగినవారు అపరిచితులే అవుతారు."

    "నేను మళ్ళీ నవ్వుతూ ఈ కాలేజీ ఆవరణలో అడుగు పెడితే ఏమవుతుంది?"

    "ఇప్పుడు నవ్వు నాలుగు విధాల చేటని విన్నారు.... అదెలాగో అప్పుడు తెలుసుకుంటారు వస్తాను. రామస్వామిని చూశారుగా.... అతడు తల్చుకుంటే మీరు కాలేజీ ఆవరణలోనే కాదు.... జీవితంలోనే మళ్ళీ నవ్వలేరు...."

    ఆ మాట హెచ్చరికలా లేదు భవిష్యద్వాణిలాగుంది.

    "అపరిచితులు కాలేజీలో అడుగు పెట్టకూడదనుకున్నప్పుడు మీరు దర్వాను కావిషయం చెప్పాల్సింది. అతడే నన్నాపి వుంటే...."

 Previous Page Next Page