ఈశ్వరరావు కంపార్టుమెంతులోకి వచ్చేసరికి ముసలాయన ఓ ప్రకటనచేస్తున్నాడు- "ఈ బండిలో ఏమీకాళీల్లేవు. నామాట విని వెంటనే దిగిపోకపోతే తర్వాత మరీ ఇబ్బంది పడతారు..." ఇలా అని ఆయన మళ్ళీ కంపార్ట్ మెంటులో రౌండ్ కి వెళ్ళాడు.
"ఇందాకటి భయంకర సన్నివేశం నా కళ్ళలో ఇంకా మెదుల్తూనే వుంది-" అన్నాడు రాజారావు.
"ఏమిటిది?" అన్నాడు ఈశ్వరరావు.
"ఆ మనిషి ముప్పై ఇస్తే ఆయన పదకొండు రూపాయలు మాత్రమే తీసుకున్నాడు-" అన్నాడు రాజారావు బాధగా.
ఆ దృశ్యం ఈశ్వరరావునుకూడా కలవరపరుస్తోంది. అయినా రిజర్వేషన్ ముందుగా చేస్కోకుండా ప్రయాణం చేయడంలో అతనికి చాలాఅనుభవముంది. అతని అనుభవంలో ఇంతవరకూ డబ్బాశలేని రిజర్వేషన్ బోగీ కండక్టరు తగలలేదు. అందుకే అతనికి ఆశగా వుంది.
"మీరేమీ కంగారు పడకండి. ఇలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. ప్రతి కండక్టరుకూ ఏదో బలహీనత వుంటుంది. సరయిన ట్రిక్కు వేసి మాంత్రికుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకుంటే చాలు- పని జరిగిపోతుంది. అదీ కాక మీరు గమనిస్తున్నారోలేదో- ముసలాయన మనకూరికే హెచ్చరిస్తున్నాడు తప్పితే దిగిపొమ్మని బలవంతం చేయడం లేదు. వీటన్నిటికీ తట్టుకుని ఎవరు నిలబడగలిగితే వాళ్ళకు టికెట్ లభిస్తుంది. ఇన్ని హెచ్చరికలు చేశాడు. గుండెజారిపోయి చాలామంది దిగిపోతారు. తక్కువమంది మిగిలితే ఆయన పని సులభమైపోతుంది. వున్నా బెర్తులు మిగిలినవారికిచ్చి- డబ్బులు దండుకుంటాడు. ఈ ఊళ్ళో నిజంగానే ఖాళీల్లేవనుకోండి, దీనికింకా అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి.... అలా బెజవాడవెళ్ళేదాకా కోటాలుంటూనే వుంటాయి. అక్కడ ఏ మాత్రం కాళీలు దొరికినా మనకు వీలవుతుంది. ఇందాకా క్యూలో చూడండి. ఒకతని పేరు వెయిటింగ్ లిస్టులో మొట్టమొదటవుంది. కాళీల్లేవనగానే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను అమాయకుడన్నమాట. బోగీ దగ్గరకు వచ్చి మనలాపట్టుకుంటే తప్పకుండా ఈ పాటికి అతనికి బెర్తు దొరికుండేది. అలాంటివాళ్ళవల్లే మన ఛాన్సులు పెరుగుతూంటాయి..." అన్నాడు ఈశ్వరరావు.
అతని మాటలలో నిజానిజాల గురించి రాజారావు పట్టించుకోలేదు. ప్రస్తుతం అతని గుండె జారిపోయి వుంది. భగవంతునిమీదనే భారం వేసి అతను కూర్చున్నాడు. అతనిలా దిగులుగా వున్నవాళ్ళక్కడ మొత్తం ఆరుగురున్నారు. వీళ్ళ దిగులుతో నిమిత్తం లేకుండా ట్రయిన్ వాల్తేరుస్టేషన్ వదిలిపెట్టింది.
4
ట్రయిన్ కదిలివేగం పుంజుకున్నాక దిగులుగాకూర్చున్న జనమందరూ నెమ్మదిగా తేరుకుని ఈ లోకంలోకి వచ్చి పరిసరాలను పరికించారు. అంతవరకూ కండక్టర్ని తప్ప మరెవ్వర్నీ గమనించలేని వారి కళ్ళు తమ చుట్టూ వున్నా జనాలను గుర్తించడం ప్రారంభమైంది. అప్పుడేవారు అక్కడకూర్చున్న ఆరేడుగురూ ఏకకుటుంబానికి చెందినవారమని గుర్తించారు. అందరూ బొంబాయి చేరుకోవలసినవారే! అందరికీ రిజర్వేషన్ లేదు- ఆ విధంగా ఒకేఒక బెర్తు కాళీ వున్న పక్షంలో వారు పరస్పరం శతృవులు.
రాజారావు, ఈశ్వరరావు ఆఫీసుపనిమీద బరోడా వెడుతున్నారు.
బలంగా పొడుగ్గా అంటకత్తెరలో జీన్సులో వున్నా చౌదరి బొంబాయిలో ఏదో పనిమీద వెడుతున్నాడు.
నాజూగ్గా వున్న ఒకతను పోలీసుడిపార్టుమెంటులో పని చేస్తున్నాడు ఆఫీసరుగా. వివరాలు చెప్పకూడదంటూనే అతను అన్ని వివరాలు చెబుతున్నాడు తన వుద్యోగ వివరాలు నలుగురికీ చెప్పాలని అతనికి సరదాగా వుంది. అతనిపేరు శివరాం అని చెప్పి ఉద్యోగానికి సంబంధించిన అయిడెంటిఫికేషన్ కార్డు కూడా చూపించాడు. బొంబాయి వెళ్ళాలిటగానీ బెర్త్ దొరకని పక్షంలో అతను హైదరాబాద్ లో జర్నీ బ్రేక్ చేస్తాడట.
కొట్టవచ్చేలా కనబడే ఆకుపచ్చరంగు పాంటువేసుకున్నతని పేరు బాలకృష్ణ అతనూ బొంబాయి వెళ్ళాలి. షాహుకారు బిడ్డ. బొంబాయిలో తన బంధువులను చూడ్డానికి వెడుతున్నప్పటికీ అక్కణ్ణించి వచ్చేటప్పుడు వ్యాపార దృష్ట్యా ఏమైనా తీసుకురావాలని అనుకుంటున్నాడు. అతని కళ్ళు అందరితోనూ మాట్లాడుతున్నప్పటికీ- కండక్టరుకోసం వెదుకుతున్నాయి. అందర్నీ మాటలలోపెట్టి తనొక్కడూ ఏదో విధంగా బెర్తు సంపాదించాలన్న భావం మిగతావారికి మించి అతని కళ్ళలో స్పష్టంగా చదవవచ్చు.
వీరందరికీ ఎంతో సామానులేదు. వీరందరికీకలిసి వున్నా సామానుకు రెట్టింపు వుంది రహీంకు. అతని కళ్ళు చాలా తమాషాగా నిర్లిప్తంగా చూస్తున్నాయి. ఇటువంటి ప్రయాణాలు చాలచేసి వుండాలతను "రిజర్వేషన్ దొరుకుతుందో దొరకదో -" అన్నప్పుడు అతని మాటలలోకానీ, కళ్ళలోకానీ ఆదుర్దా ధ్వనించలేదు, కనిపించలేదు. కండక్టర్ వచ్చినా వెళ్ళినా అతనట్టే పట్టించుకోవడంలేదు. విజయనగరం నుంచి వస్తున్నాడట. బొంబాయి వెడతాడట. రిజర్వేషన్ బాధ్యత పూర్తిగా కండక్టరుదేననీ- తను నిమిత్త మాతృడనీ అన్నట్లు చూస్తున్నాడతను.