Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 10

    అందరూ ఏవోకబుర్లాడుతున్నారుగానీ అవి పొడిపొడి ఉన్నాయి కంపార్టుమెంటులో ఎవ్వరూ స్థిరపడలేదు. మాట్లాడుతూనే బెర్తులగురించి ఆలోచిస్తున్నారు. ప్రయాణం గురించి బెంగపడుతున్నారు. వీటన్నింటికీ అతీతులై అప్పుడప్పుడు మరుగుదొడ్లను సందర్శించి వెడుతున్న ఇతర ప్రయాణికుల వారిపై అసూయనిండిన చూపులు ప్రసరిస్తున్నారు.   
    కండక్టరు వచ్చాడు. ఈస్వర్రావీ పర్యాయం ఆయన పేరు చూశాడు. నాగరాజు అని వుంది. ఈసారి ఆయన్ను డేరుతోనే పలకరించాలని అతనానుకున్నాడు. ఆయన రాగానే లేచిపోయి నిలబడి- "నమస్కారమండీ-" అన్నాడు నెమ్మదిగారాజారావుతో "-నాగరాజుగారు వచ్చేరు-" అన్నాడు కండక్టరుక్కూడా వినబడేలా.   
    నాగరాజెవరో రాజారావు అర్ధంకాక అటూ ఇటూ చూశాడు.   
    ఈశ్వరరావువంక అదోలా చూశాడు కండక్టరు అనకాపల్లి వచ్చేస్తోంది. అక్కడేమైనా కాళీలుంటాయోమో తెలీదు. ఏదిఏమైనా మీలో వెయిటింగులిస్టులో పేర్లున్న వాళ్ళుంటే నాకు చెప్పండి. సాయపడగలను. మీ ఎవరికీ వెయిటింగులిస్టులో పేర్లు లేకపోతే- అనకాపల్లిలో ఎవరైనా వెయిటింగులిస్టు వాళ్ళుంటే వాళ్ళకివ్వాల్సి వుంటుంది..."   
    కొద్దిగా బెర్తులు కాళీ వున్నాయని ఈశ్వరరావు కర్ధమైపోయింది. అనకాపల్లి వెయిటింగులిస్టు వాళ్ళకి వచ్చే ఛాన్సు ఆ ఊళ్ళో కాన్సిలేషన్స్ ని బట్టి అక్కడే తేలిపోతుంది. అక్కడివాల్లకివ్వాలంటే ఇందులో కొన్ని కాళీలున్నాయన్న మాట. తమపేర్లు వెయిటింగులిస్టులోనైనా వేయించనందుకు తన స్నేహితున్ని నిందించుకున్నాడతను.   
    నాగరాజుగారిమాట విని ఈ ఆరుగురూ- వెయిటింగు లిస్టులో తమ పేర్లు లేవనీ- అయినా ఎలాగో అలా కరుణించాలనీ వేడుకున్నారు. "లాభంలేదు- మీరు అనకాపల్లిలో దిగిపోవాలి..." అన్నాడాయన.   
    ఈలోగా అవతలపక్క బెర్తుమీదనుంచి దిగి ఓ కొత్త మనిషి వచ్చి-"నాది వెయిటింగులిస్టులో ఎనిమిదో పేరండీ..." అన్నాడు.   
    ముసలాయన వివరాలు వెరిఫైచేసి అప్పటికప్పుడు అలాట్ చేసి రసీదిచ్చి ఖచ్చితంగా అయిదురూపాయల యాభై పైసలు మాత్రమే తీసుకున్నాడు. రాజారావుకి అదృశ్యం మళ్ళా భయకరంగా కనిపించినది. ఒకసారి ఈశ్వరరావు వంక చూశాడు. అతని ముఖం చూస్తే - కొంచెం దిగులుపడుతున్నట్లు గ్రహించవచ్చు.   
    ట్రయిన్ అనకాపల్లిలో ఆగింది. ప్లాట్ ఫారంవంకనే ఆశగా చూస్తూన్నారు రాజారావూ, ఈశ్వర్రావూ అక్కడ కోటా పుల్లయిందనీ- అదృష్టవశాత్తూ వెయిటింగులిస్టులో ఎవరు లేరనీ తెలుసుకున్నారు.   
    "అనకాపల్లిలో కొత్త కాళీలు రాలేదు..." అన్నాడు నిరుత్సాహంగా రాజారావు.   
    అనకాపల్లిలో ఎక్కినవాళ్ళకు బెర్తులూ అవీ చూపించేక ముసలాయన వీళ్ళ దగ్గరకు మళ్ళీ వచ్చాడు.   
    వీళ్ళు ఎంట్రెన్స్ దగ్గరే వున్నారు. అక్కడ పై బెర్తు కాళీగా వుంది. రాత్రి తెల్లవార్లూ తనకు నిద్రలేదనీ, నిద్రముంచుకొస్తోందనీ, తనసామాను కాస్త జాగ్రత్తగా చూస్తూండమనీ చెప్పి రహీం- ఆపై బెర్త్ ఎక్కి నిద్రకుపడ్డాడు.   
    "వాడి నిశ్చింత చూడండి..." అన్నాడు చౌదరి.   
    రాజారావు మాత్రం మనసులో సంతోషించాడు- బెర్తుల విషయంలో అతను తమకు పోటీగా రావడంలేదు కదా అని? తామందరకు దొరకితేనే రహీంకువస్తుంది.   
    "బాబూ! మీరు అనకాపల్లిలోకూడా దిగలేదు. మీకు బెర్తులు దొరకడం అసాధ్యం. నేను చేయగల సాయమల్లా ఒక్కటే వుంది-" అన్నాడు ముసలాయన.   
    రాజారావాయనవంక ఆశగా చూశాడు. ఈశ్వరరావు మాత్రం- "ఏఉపాయమైనా ఈబోగీలోనే మేము బొంబాయి చేరేమార్గం మీరే చెప్పాలి నాగరాజుగారూ-" అన్నాడు.   
    ముసలాయన కళ్ళలో వెలుగు కనబడింది- "చూడండి బాబూ- నా చేతులలో వున్నది నేను చేయగలనుకానీ అంతకంటే ఎక్కువ చేయలేనుగదా. నా చేతిలో వున్న బెర్తులు బహుకొద్ది అవీ కోటాలలో వున్నాయి. ప్రస్తుతానికి మీకు నేను మీకు చేయగలిగిందేమిటంటే- విజయవాడదాకా ఇందులో సీటివ్వగలను. ఆ తర్వాత మీ అదృష్టం మీరు చూసుకోవాలి..."   
    అక్కడున్నవారంతా ఆయననుంచి ఇంకా పెద్ద సాయం పొందాలని చూశారుకానీ ఆయన- "బాబూ-చేయలేని వాగ్దానాలు ఇవ్వడానికి రాజకీయ నాయకున్ని కాదు...." అన్నాడు. ఆ జోక్ కి ఈశ్వర్రావు కడుపు పగిలేలా నవ్వాడు. అతన్ని చూసి రాజారావు నవ్వాడు. ఎందుకైనా మంచిదని మిగతావాళ్ళుకూడా నవ్వారు. బెర్తుమీద నిద్రపోతున్న రహీంకానవ్వుకు మెలకువ వచ్చినట్లుంది. అతని నవ్వుకూడా వినిపించింది.   
    ఇంతమందీ అంతలా నవ్వినా ముసలాయన వీళ్ళందరికీ బెజవాడదాకా సీట్లుమాత్రమే ఇచ్చాడు. వారిలో బాలకృష్ణ ఒక్కడే తననవ్వుకు ఫలితందక్కలేదని బాధపడ్డాడు ఎంతైనా షావుకారు బిడ్డకదా!

 Previous Page Next Page