Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 8

    "ఇద్దరు బెర్తులు కాన్సిల్ చేసుకున్నారుగా-వెయిటింగ్ లిస్టులో వాళ్ళేవ్వరూరాలేదా?" అనడిగేడు ముసలాయన అతన్ని. ఈశ్వరరావు కౌంటరులోవ్యక్తిని ఆకర్షించేలా గట్టిగా దగ్గి తనచేతిలో డబ్బు అతని కళ్ళబడేలా చేశాడు.  
    "రాలేదు. ఓ రెండు టికెట్లు ఇష్యూచేయొచ్చు..." అన్నాడు కౌంటరులో వ్యక్తి. అతను ఈశ్వరరావు చేతిలోని డబ్బువంక చూడడంలేదు. పుణికింతాలవ్యక్తి ముందుకువచ్చి "మావిరెండేనండి...." అన్నాడు.  
    ఈశ్వరరావు గుండెజారిపోయింది. ఇంతమోసం జరిగిపోతుందని అతననుకోలేదు. కౌంటరులో వ్యక్తి తనకు తప్పక సహాయపడగలడని అతననుకున్నాడు. అయితే తను లేని సమయంలో పుణికింతాల వ్యక్తి అతగాన్ని వలలో వేసుకుంటాడని అతనూహించలేదు. బంగారు అవకాశంపోయిందే అని అతను బాధపడ్డాడు. అతను బాధపడుతూ చూస్తూండగానే పుణికింతాల వ్యక్తిని తీసుకుని ముసలాయన వెళ్ళిపోయాడు. ఈశ్వర్రావు కౌంటర్ వ్యక్తిని తగులుకున్నాడు.   
    "డబ్బిస్తూంటే మాకు చేదుటండీ ఏం చేసేది? ఈ రోజు చాలా రష్ గా వుంది. ఏమీ కాళీల్లేవు!" అన్నాడు కౌంటర్ వ్యక్తి.   
    "అలా నాకు చెప్పి ఇంకొకళ్ళకి రెండుటికెట్లిప్పించారు!" అన్నాడు నిష్టూరంగా ఈశ్వరరావు.   
    "ఏం చేసేదండీ- వాళ్ళు చాలాపెద్ద రికమండేషన్ మీద వచ్చారు. ఆ ముసలాయన చాలా బాధస్తుడు. ముక్కుకు సూటిగా పోయే మనిషి. రికమండేషన్ వున్నా వాళ్ళకు పని జరక్కపోయింది. వెయిటింగు లిస్టులో పేరులేకపోతే ఇవ్వనని కూర్చున్నాడు. వెయిటింగులిస్టు వారెవ్వరూలేరని నచ్చజెప్పాను. అయినా కాసేపు బోగీ దగ్గరకు వెళ్ళి నిలబడి తన కోసం ఎవరైనా వస్తారేమోనని చూశాడు. ఎవరూరాకపోయేసరికి- స్టేషన్ మాష్టారి రికమండేషన్ ని దృష్టిలో వుంచుకుని ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చేడు. ఏంచేయమంటారు? తెలిసినవాళ్ళకే సాయంచేయడం కష్టంగా వుంది..."   
    "ఏం చేయమంటారో మీరు చెప్పండి..."   
    "ఇప్పుడింకా హైదరాబాద్ బోగీల్లో కూడా కాళీలేదు. మీకు సామాను బాగా వుందా?"
    "లేదు. ఇద్దరిదీ చెరో బ్యాగూనూ..."   
    "అయితే బొంబాయిబోగీలో ఎక్కి కూర్చోండి. ఆ ముసలాయన్నుక్షణంకూడావదలకండి, అవసరమైతే ఎక్కడో అక్కడ దిగిపోవాలని మాత్రం గ్రహించండీ అందుకు సిద్దపడి బోగీ ఎక్కండి!"
    అది బోడి సలహా అని తెలిసినప్పటికీ, యధాలాపంగా ఇచ్చినదని గ్రహించినప్పటికీ ఈశ్వరరావు డానికి అర్ధాల నాపాదించుకుని వెళ్ళి బోగీ ఎక్కేశాడు. అతను వెళ్లేసరికి కంపార్టుమెంటులో రాజారావుకాక మరో అయిదారుగురు మాత్రమే వున్నారు- బెర్తు దొరుకుతుందని ఇంకా ఆశగా వున్నవారు. ముసలాయన తన సిటులో కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రక్కనే వినమ్రుడై ఒకాయన నిలబడి వున్నాడు. ముసలాయన రసీదురాస్తున్నాడు. మధ్యలో ఆయన తలెత్తి చూడగానే వినమ్రుడు వినయంగా- "మావాళ్ళిద్దర్నీ మీరు చెప్పిన నంబర్లలో కూర్చోపెట్టెనండి-" అని ఆయన పని తను చేసినంత ఘనంగా చెప్పాడు.   
    "మంచిది!" అని ఆయన రసీదు రాయడం పూర్తి చేశాడు.   
    వినమ్రుడిని పుణికింతాల వ్యక్తిగా గుర్తించాడు ఈశ్వరావు. అతను జేబులోంచి మూడు పదులుతీసి ముసలాయన కందించాడు. ముసలాయన తాపీగా అందుకుని ఆ నోట్లు ఒకసారి లెక్కపెట్టాడు. రెండోసారి లెక్కపెట్టాడు. ముఖం చిట్లించుకుని ఓ పదిరూపాయలనోటు పుణికింతాలవ్యక్తికి తిరిగిచ్చేసి- "మీదగ్గరో రూపాయుందా?" అనడిగేడు.   
    పుణికింతాలవ్యక్తి వెంటనే రూపాయినోటొకటి భక్తిశ్రద్ధలను ప్రకటిస్తూ అందజేశాడు. వెంటనే ముసలాయన ఆ వ్యక్తిరెండో పదిరూపాయలనోటునూ, రసీదునూ అందించి "రెండు బెర్తులకు పదకొండురూపాయలే అవుతుంది-" అని చెప్పి ఆ సీటులోంచి లేచి వెళ్ళిపోయాడు.   
    పుణికింతాల వ్యక్తి తనవాళ్ళనుపిలిచి రసీదు అందజేసి-" మరి జాగ్రత్తగా వెళ్ళండి- నేను వస్తాను...." అని బయల్దేరాడు. వాళ్ళకు బెర్తులు సంపాదించడమే అతని డ్యూటీ కాబోలు-అతను మరి రైలు కదిలేదాకా ఆగలేదు.   
    ఈ పరిస్తితులలో బెర్తులు సాధించిన ఆ వ్యక్తి ఈశ్వరరావుకు సామాన్యుడుగా తోచలేదు. వెంటనే బోగీ దిగి అతని వెంటబడి- "మాకూ రెండు టికెట్సున్నాయండీ. బొంబాయిదాటి బరోడావెళ్ళాల్సినవాళ్ళం. ఏదైనా ఉపాయం తెలిస్తే చెప్పండి...." అన్నాడు.   
    ఆ మనిషి హుందాగా, గర్వంగా ఈశ్వరరావు వంక చూసి- "పని జరిగేదాక వదిలిపెట్టకండి. మెడపట్టుకుగెంటేస్తే చువ్వపట్టుకు వేళ్ళాడండి. కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోండి. తల్లి, తండ్రి, దైవం- సర్వస్వం ఆయనే అనుకుని ఆ ముసలాయన నాశ్రయించండి...." వగైరా ఉపన్యాసం ఒకటి దంచేసి ఈశ్వర్రావు మారుమాటడేలోగా వెళ్ళిపోయాడు. రైలు ప్రయాణాలలో బెర్తు సాధించినవాడు సాధించలేనివాడిపట్ల జాలిపడడం అసాధ్యం! తన విజయం కలిగించిన మత్తులోంచి అతను తేరుకోవడానికి చాలాసేపు పడుతుంది. ఆ మత్తు అలాంటిది మరి!

 Previous Page Next Page