"ఉండొచ్చు కూడా! నేను మీతోఏకీభవించలేను. కానీ, ఏదోవిధంగా మిగతా ఇద్దరూ కూడా శిక్షపోంది తీరాలి!" అన్నాడు దృఢంగా.
"అవును! నేనూ ఎదురుచూస్తున్నాను!" జ్ఞాపిక కళ్ళలో ఎర్రజీరలు.
"వాళ్ళను గుర్తుపట్టగలవా?" రేవంత్ అడిగాడు.
"స్పష్టంగా...!" జ్ఞాపిక చెప్పింది.
"స్ఫూర్తికి విషయం తెలియచేయడమే మంచిది!" రేవంత్.
"అవును. టైమ్ కోసం ఎదురుచూస్తున్నాను! తనింకా కోలుకోవాలి" కామిని.
ఇంతలోకి స్ఫూర్తి, రేవతి వచ్చారు.
"హాయ్ఁ...! ఏంటీ సీరియస్ టాపిక్? ఎక్కడయినా బాంబేసే ప్లాన్ చేస్తున్నారా? చెప్పండి... మేమిద్దరం చిటికెలో అరేంజ్ చేసివస్తాం దీపావళి బాంబ్!" అంది స్ఫూర్తి.
స్ఫూర్తి అలా గలగలా నవ్వుతుంటే తననే చూస్తుండిపోయారు అలా సీరియస్ గా ఉంటున్నారు? భయపడుతున్నారా? ఏవీ అక్కర్లేదు! ఈసారి దొంగలొస్తే నన్ను తలుచుకోండి- అమాంతం ప్రత్యక్షమయ్యి కరాటే షాట్స్ ఇస్తాను.... ఓ.కే.! మిస్టర్ రేవంత్- ఆడపిల్లలంటే వాళ్ళను వాళ్ళు రక్షించుకోగలరు. నువ్వే జాగ్రత్త! నీకు భయం వేస్తే నన్ను తలుచుకో! అని టీషర్టు చేతులు మడిచి గలగలా నవ్వింది స్ఫూర్తి. రేవతి జోడీ కలిపింది.
"యా...య్యా! మమ్మల్ని మేం రక్షించుకోగలం! కాస్త మగవాళ్ళే జాగ్రత్త!" అంది రేవతి, అయినా వాళ్ళెవరూ నవ్వలా.
"ఏంటీ... మీ నవ్వంతా మాకు కాంట్రాక్ట్ ఇచ్చారా? మేమెంత నవ్వినా మీరు నవ్వరూ?!" మళ్లీ అడిగింది స్ఫూర్తి. బలవంతంగా నవ్వారు.
"ఏంలేదు స్ఫూర్తీ... సబ్జెక్ట్ డిస్ కషన్! సడన్ గా నువ్వు జోకేస్తే నవ్వెలా వస్తుందీ!" అంది జ్ఞాపిక.
రేవంత్ టాపిక్ మార్చాడు. ఈరోజు క్లాసులో జరిగిన ప్రాజెక్ట్ వర్క్ గురించీ ఎగ్జామ్ లో దాని ఇంపార్టెన్స్ గురించీ, మార్క్స్ స్కోరింగ్ గురించీ మాట్లాడుకున్నారు.మధ్యలో క్రాంత్ ఈష్ జాయినయ్యారు.
ఈష్ మధ్యమధ్యలో స్ఫూర్తిని ప్రత్యేకంగా చూడటం గమనించాడు రేవంత్ సబ్జెక్ట్ ఎక్స్ ప్లనేషన్ లో కూడా స్ఫూర్తికి వచ్చిన డౌట్ ను ఎంతో పిగ్గా క్లియర్ చేశాడు ఈష్. ఈష్ స్ఫూర్తితో మాట్లేడేటపుడు అతని కళ్ళలో వెలుగు అందరి దృష్టిలోనూ పడింది. స్ఫూర్తి మామూలుగానే ఉంది. సడన్ గా ఈష్ స్ఫూర్తి నడిగాడు-
"సబ్జెక్ట్ బుక్స్ కాక నీకు ఇంకేం బుక్స్ ఇష్టం?" అని.
"ఎందుకు... నా బర్త్ డేకి గిప్టిస్తావా? నిజం చెప్పనా? బాంక్ చెక్ బుక్ ఇష్టం!"
అందరూ చిన్నగా నవ్వారు.
"అమ్మయ్యా.... నవ్వారు" అంది.
ఇంతలో- ఇస్ క్రీమ్ అతనొచ్చి వీళ్ళదగ్గరాగాడు. గర్ల్స్ందరూ-
"య్యా! ఐస్ క్రీమ్!!" అన్నారొక్కసారి.
"అవునూఁ....గర్ల్స్ కు ఐస్ క్రీమ్ ను చూస్తే అంత ఆనందమెందుకు?" క్రాంత్ అడిగాడు.
"వాళ్ళవి ఎంతెదిగినా చిన్నపిల్లల బుద్దులు కాబట్టి!" జోక్ ప్లే చేశాడు రేవంత్.
"కాదు... కాదు! ప్రతి చిన్న విషయానికీ ఆనందపడే మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి!" జోక్ కట్ చేసింది జ్ఞాపిక.
"మరి- అబ్బాయిలకు ఏం చూస్తే ఆనందం?" స్ఫూర్తికి డౌట్ వచ్చింది.
"అమ్మాయిల ఆనందం చూస్తే..!" ఈష్ ఫిలప్ చేశాడు స్ఫూర్తి వైపు చూస్తూ.
అమ్మాయిలందరూ "థాంక్యూ... థాంక్యూ!" అన్నారు కోరస్ గా.
"మీరంత ఆనందపడిపోతే మేము ఆనందం తట్టుకోలేక పడిపోవాల్సోస్తుంది! కాస్త ఆనందం డోస్ తగ్గిస్తే మంచిది! ఎందుకంటే... మీరు మమ్మల్ని మోసుకెళ్లలేరు" రివర్స్ జోక్ ప్లే చేశాడు.
అందరూ టెన్షన్ సీరియస్ నెస్ రిలీఫ్ కు 'ఐస్ క్రీమ్ తినాల్సిందే' నని తలా ఒకటి అందుకున్నారు. రేవతి గబగబా తినేసి అటూ ఇటూ కంగారుగా తిరిగసాగింది.
"హేయ్ఁ రేవతీ! ఏవయింది నీకు?" కామినికి అనుమానం వచ్చింది.
"ఇంకాస్త టెన్షన్ పడితే ఇంకోటి ఆఫర్ చేస్తారని టెన్షన్ గా తిరుగుతున్నా! డోంట్ డిస్టర్బ్ మీ!" అంది సీరియస్ గా తిరుగుతూనే!
ఈసారి నవ్వకుండా ఉండడం ఎవరివల్లా కాలా!
నిజంగా స్టూడెంట్ లైఫ్ లోనే నవ్వినా, ఏడ్చినా, ఏంచేసినా! ఎంత అద్భుతమైన అనుభవం! జీవితానికంతటికీ శక్తి నిచ్చేది, మళ్లీమళ్లీ తలుచుకోగానే ఆనందాన్నీ, గుండె బరువునూ ఇచ్చేది... స్టూడెంట్ లైఫే సుమా! నన్నేవరయినా 'స్వర్గప్రవేశం కావాలా? స్టూడెంట్ గా లైఫ్ లోకి డిఫ్టేఫన్ కావాలా?' అంటే రెండోదే కావాలంటాను. స్వర్గాన్ని మించింది అది.
ఏది సాధించినా, ఏది పోగొట్టుకున్నా అక్కడే! సాధనకు పునాది, వేదనకూ నీడలూ, గురుతులుగా నిలిచిపోయేదీ అక్కడే! జీవితాంతం ఏదో ఒక కోర్సుకు స్టూడెంట్ గా ఉండిపోవాలనిపిస్తుంది.... నిజమైన స్టూడెంట్స్ కు; నిజమైన జిజ్ఞాసికి; నిజమైన పిపాసికి!
స్టూడెంట్ లైఫ్ గుర్తొచ్చినపుడు పెద్దయినవాళ్ళంతా మాక్సిమ్ గోర్కీలా తమ జీవితాలను తలుచుకుని, "ఆగండి! ఇది జీవితం కాదు- వెర్రితనం..." అనుకుంటారేమో.... ఆశయాలు, సిద్దాంతాలు, ఇజాలు, నిజాలు, ఆనందాలూ కలగలిపి పోగొట్టుకున్న జనకర్మాగారపు రైల్వేస్టేషన్లో మధ్య హొరులో, ఒంటరితనంలో!
6
లైబ్రరీ నుండి యూనివర్సిటీ క్యాంపస్ లోనే క్లాస్ రూమ్స్ వైపు నడుస్తున్నారు- రేవంత్, జ్ఞాపిక. జ్ఞాపిక మౌనంగా తన పాదాలను రిథమటిక్ గా వేస్తూ, వాటినే నడుస్తోంది.
"జ్ఞాపికా!నిన్ను జ్ఞాపీ అని పిలవొచ్చా?"
"ఎందుకు?"
"ఎందుకో అలా పిలుస్తుంటే ఆ పేరు నాకే సొంతమయినట్టు, ఆ పేరున్న నువ్వు నాదనివే అయినట్టు క్లోజ్ గా అనిపిస్తుంది."
"దానికి పర్మిషన్ అడగాలా? నీకెలా ఇష్టమైతే అలా పిలువు!"
"నీకు అభ్యంతరం ఉండకూడదుగా!"
"నీ విషయాల్లో నాకే అభ్యంతరాలు లేవు."
"థాంక్యూ! థాంక్యూ వెరీమచ్!"
"ఇదే అభ్యంతరం!"
"ఏది..?"
"థాంక్యూ అనడం!"
హాయిగా నవ్వాడు. పిల్లతెమ్మర కమ్మినట్లయింది జ్ఞాపికకు! తనూ నవ్వింది పులకరింతగా.
"జ్ఞాపీ..."
"ఊఁ..."
"ఏంటంత మౌనంగా ఉన్నావు?"
"ఊరికెనే! ఉండాలనిపించింది....ఉన్నా! సరేకానీ, నువ్వు 'రోమియో' అని నాకెందుకు చెప్పలా?"
"చెప్తే థ్రిల్లేముంటుంది..?"
"ఇప్పుడు నీకు దొరికిన థ్రిల్లేంటి?"
"నేనెవరో తెలీకుండా, ఏం చేస్తుంటానో తెలీకుండా, ఎలా ఉంటానో తెలీకుండా, కేవలం నా గొంతు, నా వ్యవహారం, నా ప్రవర్తన ఇన్ డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసి 'ఐ లవ్ యు' అన్నవేఁ....అదెంత థ్రిల్లో తెలుసా? నువ్వు నన్ను ఎవీకాని నన్నుగా ప్రేమించడం!"
"రేవంత్ గానే నువ్వు నా ప్రేమను అడగొచ్చుగా!"
"రేవంత్ గా నేను నీ ఫ్రెండ్ మాత్రమే! ఫ్రెండ్ షిప్ ప్రేమకు చాలాదూరం! అసలోక ఫ్రెండ్ గా ఉండడం ఇష్టమా, ప్రేమికుడిగా ఉండడం ఇష్టమా.... అంటే రెండింట్లో ఒక్కటే ఛాయస్సి స్తే నేను ఫ్ర్రెండ్ లానే ఉండిపోతా! ప్రేమికుడి కంటే ఫ్రెండ్ షిప్ ఉన్నతస్థాయి నా దృష్టిలో! ఏ స్వార్థమూ లేనిది. ప్రేమలో 'నువ్వు నా సొంతం కావా'లనే స్వార్థం ఉంటుంది. నాకు మాత్రమే చెందాలనే తపన ఉంటుంది! ఈ ఇరుకు మనస్తత్వం స్నేహితుడిలో ఉండదు. అందుకే ప్రేమికుడి కంటే స్నేహితుడు గొప్పవాడు. నిన్నోప్పుకోమనడం లేదూ! కానీ, 'ఐ లవ్ యు' అని నీ అంతట నువ్వు అనాలి! అందుకే రోమియోగా...." నవ్వాడు మెత్తగా.
"ధిత్..!" అని బుక్ తో తలమీద కొట్టింది. "నువ్వు టీజ్ చేసినపుడల్లా నాకెంత ఉడుకుమోతుతనం వచ్చేదో తెలుసా? మళ్లీ నువ్వు రాకపోతే అంత దిగులేసేది! నిన్ను పట్టుకోవాలని ఎంత ట్రై చేశానో!" కాలి పక్కన రాలిన పువ్వును చేతిలోకి తీసుకుని రెక్కలు సవరదీస్తూ!
"నేనంటే అంత ఇష్టమా...?" రేవంత్ గొంతులో మధురిమ.
"ఊఁ చాలా! ఎంతంటే! మా డాడీ అంత! జీవితంలో నేనూ, మా డాడీనే అల్లుకుని ఉన్నాం! ఇపుడు నువ్వు ఆ అల్లికను నీవైపు తిప్పేసుకున్నావు. ఇన్నాళ్ల ఆనందం, దుఃఖం, ఉద్వేగం అన్నీ డాడీతోనే పంచుకునేదాన్ని! ఇప్పుడు నువ్వు గుర్తొస్తున్నావు. అన్నీ పంచుకోవడానికి నువ్వు. నువ్వంటే 'రోమియో!" నొక్కి పలికింది.
హైహీల్ స్లిప్ అయి పడబోయిన జ్ఞాపికను చటుక్కున పట్టుకుని-
"ఐ లవ్ యు అన్నావు.... నువ్వే ముందు! మరి, నాతో జీవితాంతం కలిసి ఉంటావా?"
"ఐ లవ్ యు అనిపించుకున్నావు నువ్వే ముందు! నన్ను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉంటావా ఇలాగే!" కళ్ళల్లోకి చూసింది.
పట్టుకున్న నడుం మెల్లగా వదిలి, "జ్ఞాపిక లేని రేవంత్ లేడు... సరేనా!" అన్నాడు.
"ఊహూఁ....రేవంత్ లేని జ్ఞాపిక లేదు!" అంది మొండిగా.
"సరే! ఇద్దరూ లేందే ఇద్దరూ లేరు" ఒక్కసారే అని నవ్వుకున్నారు.
ఎంత ఆహ్లాదం ప్రేమను వ్యక్తం చేస్తున్నపుడు! ప్రాణం కళ్ళల్లోకి వచ్చేస్తుంది! చూపు ద్వారా ఆ కళ్ళలోంచి గుండెల్లోకి చేరుతుంది! గుండె స్పందించి నరనరాన్నీ కదుపుతుంది! నరాలన్నీ క్షణాల్ని ఉత్తేజపరుస్తాయి.... సర్వాంగ సంచలనం! మనోవాక్కాయ కర్మల సమ్మేళనం! నిజంగా ప్రేమ అనుభూతించడం ఒక వరం! అందరూ ప్రేమిస్తారు కానీ, అందరూ అనుభూతించలేరు! అనుభూతుల కొకసారి అతీతమయి పోతుంది కూడా ఈ ప్రేమ! అప్పుడేమైమరుపు కలుగుతుంది! ఇప్పుడిద్దరూ ఆ స్థితిలోనే! కొన్ని క్షణాలే! ఆ అనుభూతి ఆనందోద్వేగం కూడా ఎక్కువసేపు తట్టుకోలేమేమొ! అందుకే అదీ కొన్ని క్షణాలే ఉండి మాయమవుతుంది. మాయమయింది- మళ్లీ జరగాలని ఎంత ప్రయత్నించినా జరగదు.మళ్లీ దానంతట అది జరగాల్సిందే!
"ఎందుకు దొరికిపోయావ్ రోమియో! నేనే పట్టుకునేదాన్నిగా! నాకూ థ్రిల్ దక్కేది!"
"ఆ ఇన్సిడెంట్ జరక్కపోతే నేనూ దొరికేవాడ్ని కాదు. అప్పటి నీ డిప్రెషన్ నన్ను బయటపడేలా చేసింది!" అన్నాడు.
జ్ఞాపిక మొహం నల్లబడింది. దిగులు ఆవరించింది!
అది చూసి రేవంత్ నొచ్చుకున్నాడు.
"నీకో గుడ్ న్యూస్ చెప్పనా?"
"మీ మమ్మా దగ్గరికి నన్ను తీస్కెళ్తావా?"
"అదెలాగూ చేస్తాను! కానీ ఇంకోటీ!"
"ఏంటీ...?!" యాంగ్జయిటీ.
"ఈష్ కు స్ఫూర్తి అంటే ప్రాణం! తను స్ఫూర్తిని ప్రేమిస్తున్నాడు! ఫైనలియర్ లో చేప్తాడట!~ నిన్ననే నాతో అన్నాడు!"
"వ్వాట్! ఈష్ కు ఈ విషయం తెలుసా?"
"ముందు స్ఫూర్తికి తెలిశాక ఈష్ కు చెప్పాలి! ముందు స్ఫూర్తిని మెంటల్లీ ప్రిపేర్ చేయండి! అందులోనూ స్టడీస్ దెబ్బతినకుండా!" అనేలోపు-
కామినీ, ఈష్, క్రాంత్, స్ఫూర్తి కలిశారు. "హాయ్ఁ..." అంటూ కబుర్లలో పడిపోయారు. ఆరోజు క్లాసెస్ గురించి, రేపటి సెమిస్టర్ గురించీ గందరగోళంగా మాట్లాడేసుకుంటున్నారు. నిజంగా యమ్.సి.ఏ. వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కు- వీళ్ళకు ఫారిన్ జాబ్స్ చేసే ఎనర్జీ ఇక్కడే వచ్చేస్తుందేమో... కోర్సులోనే అనిపిస్తుంది! ఇంచుమించు పిచ్చాళ్ళులాగా అయిపోతారు సెమిస్టర్స్ కి ముందు! భోజనం, డ్రెస్సింగ్, నిద్ర ఏవీ పట్టవు! సెమిస్టర్ అయ్యేసరికి పేషెంట్స్ లాగా అయిపోతారు! అదయ్యాక కొద్దిరోజులు కొంచెం స్టడీస్ టెన్షన్ తగ్గుతుంది! మళ్లీ సెమిస్టర్ కు ప్రిపరేషన్! ఇక వేరే విషయాలను సీరియస్ గా తీసుకుందామన్నా తీరికెక్కడిది? వాళ్ళకు వాళ్ళే ప్రొఫెసర్స్! వాళ్ళే స్టూడెంట్స్! చూసేవాళ్ళకు ఎప్పుడో ఏదో ఆలోచిస్తూ వేరే ప్రపంచపు మనుషుల్లా రోబోట్స్ లా అనిపిస్తారు. ఆ రొటీన్ లోంచి వాళ్ళను సడన్ గా కొన్ని సందర్భాలు బయటకు లాక్కోస్తాయి! ఈ సెమిస్టర్ అయ్యాక జ్ఞాపిక, కామినీ, రేవతీ, స్ఫూర్తి కాస్త ఊపిరి పీల్చుకోగానేవచ్చిపడింది.... మరో సందర్భం! అయితే- అది దిమ్మదిరిగే సందర్భం!!
కామిని ఏదో బుక్ వర్క్ చేసుకుంటోంది!
రేవతి వాక్ మన్ లో పాటలు వింటూ ఏదో రాసుకుంటోంది!
స్ఫూర్తి బోర్లాపడుకుని ఏదో డ్రా చేసుకుంటుంది. జ్ఞాపిక రెఫరెన్స్ తీసుకుంటూంది! స్ఫూర్తి లేచి-
"ఏయ్ఁ....నేను డాక్టర్ దగ్గరికెళ్లాలి!" మళ్లీ కొంచెం నడుం నొప్పి! అంది.
కామినీ, జ్ఞాపిక తలెత్తి చూశారు!
రేవతి వాక్ మన్ వింటూ ఉండటాన సరిగా వినిపించలా! వాక్ మన్ తీసి-
"ఏంటీ...?" అంది.
"నాకు నడుంనొప్పిగా ఉంది! పైగా - నేను పడింతర్వాత ఇంతవరకూ పీరియడ్ రాలా! త్రీ డేట్స్ వెళ్ళిపోయాయి. దెబ్బ తగిలినపుడు యుట్రస్ కేదయినా అయిందేమో!" అంది తేలిగ్గా.
"నీ మొహంఁ...! నడుముకు దెబ్బతగిలితే యుట్రస్ కేవవుతుంది? అయినా- పీరియడ్స్ రాకపోతే ఏంటట? పీడా వదిలిందని హాయిగా ఉండక!" రేవతి ఐడియా ఇచ్చింది.
"హాయిగానే ఉంది పీరియడ్స్ రాకపోతే.... వెధవ సంత! కానీ, నడుము నొప్పి చూపించుకోవాలి" అంది బోర్లాపడుకునే.
"టీషర్ట్ తీసెయ్ఁ.... మసాజ్ చేస్తా! మళ్లీ లైఫ్ లో రాదు నడుంనొప్పి" అంది రేవతి లేస్తూ.
"నువ్వు మసాజ్ చేస్తే లైఫ్ లో నడుము నొప్పి రాకపోవడం కాదు...., లైఫే లేకుండా పోతుంది! నువ్వు పాటలు వినమ్మా! వీలైతే డాన్స్ కూడా చేసుకో.... ఆఫ్రికన్ స్టైల్లో!" అంది స్ఫూర్తి!
వీళ్ళిలా వాగుతూనే ఉన్నారు.
అప్పటికే కామినీ, జ్ఞ్పిక బయటకు వెళ్లడానికి రెడీ అయ్యారు.