Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 10

    "ఎక్కడికే ఉన్నట్టుండి? మీ మూడ్స్ అసలు నిలకడగా ఉండవేం..?! కాసేపయినా ఏ పనీ కంటిన్యూగా చెయ్యరేం?" విసుక్కుంది స్ఫూర్తి వాళ్ళిద్దర్నీ ముద్దుగా.
    "స్ఫూర్తి... ఇప్పుడే ఇస్తాం! నువ్వేక్కడికీ  వెళ్లకు! వార్డెన్ కు కూడా నడుము నొప్పి అని కంప్లయింట్ ఇవ్వకు!" అంది జ్ఞాపిక.
    "ఎందుకు.... మీరే మెడిసన్స్ తెస్తారా? ఓ.కే.! నాకో ఫైవ్ స్టార్, దానికో మిల్క్ బార్ పట్రండి!" రేవతి అంది.
    "ఆఁ... బబుల్ గమ్ కూడా తెస్తాం! నోర్మూసుకుని పాటలు విను!" కామిని తిట్టింది.
    "ఛ....! ఈరోజు అందరూ నన్నే తిడుతున్నారు" అని పాటలు వినడంలో మునిగిపోయింది. పది నిముషాల్లో తిరిగోచ్చారు కామినీ, జ్ఞాపిక! వస్తూ-
    "మనం భయపడిందే అవుతుందంటావా?" కామిని అడిగింది.
    "కాకపోతే బావుండు! కాదు.... కానేకాదు!" జ్ఞాపిక హిప్నటైజ్ చేసుకుంది.
    వాళ్ళొచ్చేవరకూ అలాగే పడుకుని చదూకుంటుంది స్ఫూర్తి.
    "స్ఫూర్తీ...లే! డాక్టర్ నీ యూరిన్ టెస్ట్ కు తెమ్మన్నారు! ఇదుగో బాటిల్.... ఫిల్లిట్!" అంది కామిని౦ ఇంజక్షన్ బాటిల్ చేతికిస్తూ.
    "నన్ను చూడకుండా ఎలా చెప్పాడే?!"
    "మేం చెప్పింది చేస్తావా, చెయ్యవా?!" గద్దించింది జ్ఞాపిక.
    'ఖర్మ...! వీళ్ళ  ఫ్రెండయ్యే బదులు హిట్లర్ పెళ్ళాన్నయినా బావుండేది!' అనుకుంటూ బాత్ రూమ్ లో కెళ్లింది.
    "ఎందుకిలా టెన్షన్ గా ఉన్నారు! మాకు చాక్ లెట్స్ తీలా?" రేవతి అడిగింది.
    ఇద్దరూ మాట్లాడలా!
    "వీళ్ళంతా! వెధవ సీరియస్ నెస్సు.... దొంగలు పడ్డప్పటి నుంచీ! వెధవదొంగలు.... చైన్ ఎత్తుకుపోకుండా వీళ్ళ అల్లరెత్తుకుపోయారు!" గట్టిగా దొంగల్ని తిట్టుకుంది.
    అయినా.... ఇద్దరూ మాట్లాడలా!
    "వీళ్ళేదో ముత్యాలు కడుపునిండా ఉన్నాయని ఫీలవుతున్నట్టున్నారు. మాట్లాడితే అవి రాలిపోతాయని, ఎదుటివాళ్ళు ఏరుకుని ధనవంతులైపోతారనీ...వెధవ జెలస్ కావచ్చు!" గొణుక్కుని సీరియస్ గా  పాటలు వినసాగింది!
    స్ఫూర్తి బాటిల్ తెచ్చి, "నేనూ వస్తా... పదండి!" అంది.
    "అక్కర్లేదు! నిన్నెక్కువ  నడవద్దన్నారు డాక్టర్!" కామిని అంది.
    "ఆహాఁ.... నవ్వోద్దనీ, చదుకోవద్దనీ ఐస్ క్రీమ్ తినొద్దనీ అన్లేదూ వెర్రిడాక్టర్!" వెక్కిరించింది. స్ఫూర్తి తలమీద ఒకటి కొట్టి బాటిల్ తీసుకుని బయటకు నడిచారు  ఇద్దరూ!
    వార్డెన్ ఎదురొచ్చారు.
    "ఎక్కడికి? ఇందాకోసారి బయటికెళ్లారు! మళ్లీ ఎక్కడికి?" అడిగారావిడ.
    "లోపల అనీజీగా ఉంది మేమ్ !బయటకూర్చుని చదూకుంటాం! ఔనూఁ... బుక్స్ నీకిచ్చాను కదే- ఎక్కడ పెట్టావ్?" కామిని అడిగింది జ్ఞాపికను
    "ఎక్కడంటే.... ఎక్కడంటే.... రూమ్ లో! య్యా .... రూమ్ లో!" అని తన చేతిలోని బాటిల్ కామిని చేతిలో పెట్టి రూమ్ లో బుక్స్ తెచ్చింది పరిగెత్తుకుంటూ వెళ్లి.
     "ఆ బాటిల్ ఏంటి?" వార్డెన్ అడిగారు.
    "బాటిల్.... బాటిలే! జ్ఞాపిక ఏదో మాజిక్ చేస్తానంటే..." కామిని.
    "మాజిక్స్, జోక్స్ తర్వాత! ముందు సీరియస్ నెస్ హార్డ్ వర్క్ లో  ఉండాలి! మీరిద్దరూ ఓకే చోట కూర్చోకండి- డిస్టర్బ్ అవుతారు!" సలహా ఇచ్చింది.
    "ఓ.కే. మేమ్! థాంక్యూ!" ఇద్దరూ తప్పించుకున్నారు మెల్లగా!
    హాస్టల్ లాన్ లో కూర్చుని ఫాంట్ జేవులోంచి 'ప్రెగ్ కలర్' తీసింది! ఇన్ స్ట్రక్షన్స్ చదివింది- కామినికి వినిపించేలా!
    "కమాన్... ఓపెన్ ఇట్!" అనగానే- ఓపెన్ చేసింది కామిని పాక్ ను.
    చిన్న బాటిల్, ఒక పిల్లర్!
    "య్యా! పిల్లర్ కు హొల్ వేసి బాటిల్ లో ఉన్న బాల్ మీద పిల్లర్ లోని లిక్విడ్ డ్రాప్ వెయ్యి జ్ఞాపిక చెప్పింది.... కామిని చేసింది!
    "షేకిట్ వెల్!" జ్ఞాపిక అనగానే బాగా కదిపింది. అది రాణీపింక్ కలర్ లోకి మారింది.
    "ఇప్పుడు యూరిన్- మూడంటే మూడుచుక్కలే పిల్లర్ తో వెయ్యి!" జ్ఞాపిక అంది- ఇన్ స్ట్రక్షన్స్ చూస్తూ! వేసింది కామిని.
    "మళ్లీ బాగా షెక్ చెయ్యి!" అంది జ్ఞాపిక.
    కామిని చేసింది!
    "ఇక....ఈ పింక్ కలర్ పోయి నీళ్లలాగే అయిపోతే- పాజిటివ్! అంటే .... ప్రెగ్నెన్సీ! పింక్ కలర్ పింక్ కలర్ లోనే ఉంటే - నెగెటివ్! అంటే.... ప్రెగ్నెన్నీ కాదు! కలర్ మారనే మారదు. చూడూ! నువ్వూరికే భయపడుతున్నావు" అన్న జ్ఞాపికకు దడగానే ఉంది.
    వార్డెన్ దూరంగా  కనిపించడంతో ఇద్దరూ దూరంగా జరిగారు బుక్స్ తీసుకుని! కాసేపయ్యాక చూస్తే పింక్ కలర్ పోయి నీళ్లలాగా  అయిపోయిందా బాటిల్ లో ద్రవం!
    "మైగాడ్! పాజిటివ్! అంటే.... ప్రెగ్నెన్సీ!" ఇద్దరూ బిత్తరపోయారు.
    చెమటలు పట్టాయి! గబగబా పేపర్స్, పిల్లర్ అన్నీ నలిపేసి దూరంగా డస్ట్ బిన్ లోకి విసిరేసింది కామిని. బాటిల్ ఒక్కటీ ఉంచుకుంది!
    "ఏం చేద్దామే..?" కామిని.
    "తెలీదు! ఏం చేద్దామే..?" జ్ఞాపిక!
    "నాకూ తెలీదు!: ఏడుపు గొంతు ఇద్దరికీ!
    ఆడపిల్లలు  జీన్స్ వేసుకున్నా, పరికిణీలు కట్టుకున్నా సున్నితమైన మనసు ఆకృతేం మారదు. శరీరం గెటప్ మారినా మనసు గెటప్ మారదు. బేలగా అయిపోతుందొకొక్కసారి. అలాగే అయిపోయారు. వెంటనే వాళ్ళకు ఫ్రెండ్స్ గుర్తొచ్చారు!
    అందుకే వార్డెన్ దగ్గరికెళ్లి  "మేమ్ లైబ్రరీకి వెళ్లొస్తాం మేమ్! ఆఫ్ అన్ అవర్! ప్లీజ్..." రిక్వెస్ట్ చేసుకుని  బయటపడ్డారు- రూమ్ కెళ్లకుండానే!
    అంతా విని, "వ్వాట్! మైగాడ్! ఆర్ యూ ష్యూర్...?!" రేవంత్ నమ్మలా!
    ట్యూబ్ చేతికిచ్చింది కామిని- "మేం పర్ ఫెక్ట్ గానే చేశాం!" అంది.
    "అయినా డాక్టర్ ను కన్ సల్ట్ చెయ్యాలి! స్ఫూర్తిని తెలియని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం! తీసుకురాగలరా?" అడిగాడు రేవంత్.
    "వితిన్  టెన్ మినిట్స్!" అని కైనటిక్ మలిపింది జ్ఞాపిక! నిజంగానే తీసుకొచ్చింది!
    లేడీడాక్టర్ దగ్గరి కెళ్లారు!
    స్ఫూర్తి నడుము నొప్పిని చెప్పింది. జ్ఞాపికా, కామినీ ఆమెతో పర్సనల్ గా మాట్లాడారు. ఆమె కన్ ఫర్మ్ చేసింది ప్రెగ్నెన్సీ  అని! పెద్ద  సమస్య! ఏంచెయ్యాలో అర్థంకాలా!
    "అదేవిటేఁ...డాక్టర్ నడుమునొప్పంటే వర్జినిటీ టెస్ట్  చేసినట్టు చేసింది- నడుం వదిలేసి!" స్ఫూర్తి నవ్వుతూ అడిగింది కామినిని - గుసగుసగా, జోక్ గా!
    "ఇన్నర్ గా ఏవయినా ఎఫెక్ట్  అయిందనేమో లేవే! నాకేం తెలుసూ!" కామిని సీరియస్ గా గదిమింది... ఇంకో క్వశ్చన్ కు ఛాన్స్  ఇవ్వకుండా!
    "మెడిసిన్స్ రాసిందా!" మళ్లీ డౌట్ స్ఫూర్తికి.
    "ఆఁ... మేం తీసుకొస్తాం! నువ్వు పద! ఎక్కువసేపు ఇక్కడొద్దు" అంది జ్ఞాపిక.
    కామిని కైనటిక్ మీద స్ఫూర్తిని తీసుకెళ్లింది.
    "నువ్వు మళ్లీ రాకు! నన్ను రేవంత్  డ్రాప్చేస్తాడు" అని చెప్పింది జ్ఞాపిక - కామినీకి.
    "బై..!" అనేసి వెళ్లిపోయారిద్దరూ.
    "జ్ఞాపీ! ఏం చేస్తారిప్పుడు?"
    "స్ఫూర్తికి చెప్పేయాలి! ఇక దాచుకోకూడదు!"
    "తట్టుకోగలదా...?"
    "తట్టుకునేలా ప్రిపేర్ చెయ్యాలి!"
    "ఎవరికయినా తెలిస్తే బావుంటుందా?" రేవంత్.
    "అదేం తప్పు చేసిందని!"
    "తప్పుచేయడం, చేయకపోవడం కాదు. కానీ పనిష్ మెంట్ తనకేగా!"
    "అదే ప్రకృతిలోని లోపమేమో! ఇష్టమయితేనే ప్రెగ్నెన్సీ రావాలి, లేకపోతే లేదు.... అనే సిస్టమ్ లేదా ఎంజైమ్స్ లేడీబాడీలో ఉండి ఉంటే ప్రకృతి ఇంకా పరిపూర్ణమయి ఉండేది! మాతృత్వం ఇంకా విఅలువ పోంది ఉండేది!" అంది జ్ఞాపిక.
    "అప్పుడు జాతి నిర్మాణం ఆగిపోయేది! జాతి నిర్మాణమే ప్రకృతి లక్షణం! ఇష్టాఇష్టాలు కాదు."
    "ఎందుక్కాదు? ఏ జంతువునైనా ఏ జంతువైనా రేప్ చెయ్యగలదా? ఆడ జంతువు కిష్టం లేందే ఏ మగ జంతువైనా  దరి చేరగలదా? అది మొరలెత్తి పిలిస్తేనేగా మగ జంతువు వెళ్లేది! మానవ జంతుజాలంలోనే ఈలోపం! ఆడదాని కిష్టం ఉన్నా, లేకపోయినా బలవంతపు మిధునం - అనవసరపు గర్భం! ఇదే ఇదే.... ప్రకృతిలోని ప్రముఖ లోపం! ఈ లోపం  స్త్రీని నిస్త్రాణం చేసి  అబలను అశక్తురాలిని చేసి అయిష్టమయిన లైంగికజీవితాన్ని అసహ్యంగా కూడా అనుభవించేలా చేసి స్త్రీ దృష్టిలో లైంగికజీవితం ప్రాధాన్యతను తగ్గించింది. ఎంతమంది భార్యలు ప్రతిరోజూ తాము ఇష్టపూర్వకంగా తమకోసం సెక్స్ లో పాల్గొంటున్నారు? వంట చేసినట్టూ, ఇల్లు తుడిచినట్టు అదీ ఒక పని! నిద్రపోయే ముందు భోజనం వడ్డించినట్టు భర్తకు శరీరాన్ని వడ్డించడం, తనకిష్టం ఉన్నా, లేకపోయినా- గొడవెందుకులే.... అని  సర్దుకుపోవడం! మనసుకు ఇష్టంలేదని శరీరం లూబ్రికేషన్ ఆపేస్తుందా?... లేదే! ఆడదాని మనసుకూ, శరీరానికే కోఆర్డి నేషన్ లేదు! ఇక ఆడతనానికీ, మగతనానికీ కో ఆర్డినేషన్ ఎక్కడా? ఏ మగాడయినా రేప్ చెయ్యబడ్డాడా? అతనికిష్టం లేందే ఆడది ఏవయిన చెయ్యగలదా? ఎప్పుడయినా, ఏ న్యూస్ పేపరయినా 'బలత్కారం చేయబడ్డ పురుషుడు' అని రాసిందా? ఆ గొప్పతనం పురుషుడిది కాదు.... ప్రకృతిది! అతనికి మనసుకూ, శరీరానికి కోఆర్డినేషన్ ఇచ్చింది! స్త్రీ విషయంలో ఆ లోపాన్ని సవరించకపోగా.... శాపంగా చేసింది! అందుకే ఈ రేప్ లూ, అనవసరపు కడుపులు! ఏం... ఆడదానికి ఇష్టంలేనపుడు లూబ్రికేషన్ ఆపేసే సిస్టమ్ ఆడదాని శారీరకనిర్మాణంలో ఉండిఉంటే మగవాడు ఇంటర్ కోర్స్ చెయ్యగలిగేవాడా? రేపులు జరిగేవా? అనాధలు పుట్టేవారా? ప్రకృతీ.... ఈ విషయంలో మాత్రం నేను నీకు  వ్యతిరేకం!" ఉద్రేకంగా చుట్టూ చూస్తూ అంది.
    "పైగా.... "స్ఫూర్తి ఒక్కతే కాదు - భారతదేశంలో ఎంతోమంది భార్యలూ రోజూ భర్తలతో రేప్ చెయ్యబడుతున్నారు!" అని కూడా అంది.
    జ్ఞాపికకు అన్నిమాటలు వచ్చనీ, తన అభిప్రాయాన్ని మొహమాట పడకుండా అలా అభివ్యక్తీకరించే అద్రేకం తనకుందనీ ఏనాడూ రేవంత్ కు అనిపించలా! తన స్నేహితురాలికి  జరిగిన ఘోరం కళ్ళతో చూసింది కాబట్టి- తనలో తాను ఇంతగా రగిలి ఇంత లోతుగా ఆలోచించగలిగిందన్నమాట! ఇంతసేపు ఆపకుండా మాట్లాడగలదని కూడా అనుకోలా! అమాయకంగా కనిపించే జ్ఞాపిక మొహం- కోపంతో, అసహనంతో ఎర్రబడి కాంతిలా వెలుగుతోంది! అది అనుభవం  తెచ్చిన కాంతి! రాపిడి సృష్టించిన మెరుపు! అసలు అల్లరి చేసే వీళ్ళకు లైంగిక జీవితం పట్ల, ప్రసవం పట్ల ఇంత టెక్నికల్ తెలుసనే విషయం రేవంత్ ను అబ్బురపరచింది.
    "ఎక్స్ పీరియన్స్ ఈజ్ ది బెస్ట్ టీచర్ ఇన్ ద లైఫ్!" అన్నా-
    "బాధల తరంగాలు   
    పాఠశాలల వంటివి!
    ప్రతి తెప్పా అందులోన
    గురువు చెంపదెబ్బ!" అని గాలిబ్ అన్నా - ఇదేనేమో అర్థం!! జ్ఞాపిక ఆవేదన అర్థమయింది. అందులో ఆవేశం కూడా అర్థమయింది. మెత్తగా చెయ్యి నొక్కి లాలనగా-
    "ప్లీజ్ జ్ఞాపీ... కూల్ డౌన్! ఇప్పుడాలోచించాల్సింది ప్రకృతి గురించి కాదు! స్ఫూర్తి గురించి!"
    "స్ఫూర్తి గురించి మేమాలోచిస్తాం! మరి, 'ఈష్ కు రేప్ జరిగిందని చెప్పడం ఎలాగ?' అనుకున్నాం! ఈ విషయం చెప్పొద్దూ? చెప్పకపోవడం తప్పుకాదూ? చెప్తే ఈష్ ప్రేమను  విత్ డ్రా  చేసుకోడూ?" అంది జ్ఞాపిక- కంగారుగా వచ్చిన అనుమానాలతో.
    "ఏమో చెప్పలేను! ఏ మనిషినీ  తోందపడి అంచనా వేయకూడదేమో! ఈష్ తో యాజే ఫ్రెండ్ గా చెబుతాను. ఇష్టపడితే, నిజంగా ప్రేమిస్తే స్ఫూర్తిని వదులుకోడు. ఒకవేళ వదులుకున్నా- స్ఫూర్తికీ ఈష్ ప్రేమిస్తున్నాడన్న విషయం తెలీదు కనుక తను బాధపడే అవకాశమే లేదు!" అని బైక్ స్టార్ట్ చేశాడు జ్ఞాపికను డ్రాప్ చేయడానికి!
    "ఈష్ తో ఈరోజే విషయం చెప్పు! కానీ,  స్ఫూర్తికి ఒక ఫ్రెండ్ గా మాత్రమే!" జ్ఞాపిక గుర్తుచేసింది.
    "య్యా! ఇక ఆలస్యం చెయ్యకూడదు!"
    "బై! గుడ్ నైట్!" వెళ్లిపోయాడు.
    "బై...!" చెప్పి అలాగే చూస్తూండిపోయింది-
    కన్నతండ్రిని, పరిసరాలను అన్నింటినీ మరిపించి తన మనసుకు తీసుకుని వెళ్లిపోతున్నట్టు- తనలో ఏదో ఖాళీ అయినట్టు- అతనెళ్లగానే ఏదో తెలీని ఒంటరితనం కమ్ముకున్నట్టు- 'తనతోపాటు వెళ్లిపోతే బావుండు... అన్నట్టు- ఇదేనా ప్రేమ! ఇలా ఉంటుందా? బావుంది- బావుంది! బావుం...దనుకుంది.
    రేవంత్ క్కూడా "బై...." చెప్పాక-
    ఇంకొంచెంసేపు ఉందామనిపించింది. ఏ క్షణానికా క్షణం ఇంకొక్క క్షణాన్ని తన సమక్షంలో కోరుకుంటోంది. కాలమెంత మధురమైంది! క్షణాలెంత మరపురానివి.... జ్ఞాపీ సన్నిధిలో! యుగాలను క్షణాలనూ, క్షణాలను యుగాలనూ చేయగలశక్తి ఈ విశ్వంలో ప్రేమకు మాత్రమే ఉంది! కాలచక్ర గమనాన్నే మార్చేస్తుంది.... మనిషి మెదడులో! ఈ పని ఇంకే శక్తయిన చేయగలదా? చేయలేదు...,, చెయ్యదు! పగటిని రాత్రినీ, రాత్రిని పగటినీ చేసే శక్తి కూడా ప్రేమకుంది! రాత్రంతా పలవరింతగా  మేలుకొలుపుతుంది! పగలంతా కలవరింతగా మైమరపు గోపులుతుంది!
    ఏ జంతుజాలంలోనూ లేనిశక్తి మానవ హృదయానికి మాత్రమే ఇచ్చిన ప్రకృతీ.... జేజేలు- నీ అద్భుతానందలహరీ విలాస వినోదలాస్య విన్యాసపు వరానికి!
                                                                                            7
    క్లాస్ రూమ్ లో ఆరోజు జరిగిన క్లాస్ మీద కాన్ సన్ ట్రేషన్ చెయ్యలేకపోయారు... జ్ఞాపికా, కామినీ!
    ఈరోజు టాపిక్ - సిమ్సన్స్ రూల్స్,' సైమల్ టేనియస్ ఈక్వేషన్స్!'
    ఇవి ఒక పది ఉంటాయి! ప్రాక్టికల్ లో తప్పుకుండా టచ్ చేసే టాపిక్..., అండ్ వెరీ ఇంపార్టేంట్! అందులోనూ-'ఇంటిగ్రల్ వాల్యూ' ఎక్స్ ప్లనేషన్! ఎంత సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని కాన్ సన్ ట్రేట్ చేద్దామన్నా వీలుకుదరలా!
    స్ఫూర్తీ రేవతీ కాచ్ చేసినా.... కామిని అసలు కాచ్ చెయ్యలేకపోయింది. రేప్ జరిగినరోజు కలిగిన షాక్ కంటే పెద్దషాక్ లో ఉన్నారిద్దరూ! బ్రెయిన్ కామ్ అయిపోయింది! క్లాసయిపోయాక స్ఫూర్తి అడిగింది-
    "వెరీ ఇంట్రస్టింగ్ కదా! ఇందులో ఏదోచ్చినా నేను కరెక్ట్ పర్ ఫామ్ చేస్తా!" అంది.
    "నీ మొహంఁ.... ఎంత చేసినా నాలా చెయ్యలేవు" రేవతి యుద్దానికి దిగింది.
    "అవును మరి! నువ్వన్నీ తలకిందులుగా చేస్తావు. నేనలా చెయ్యలేను."
    "పిచ్చిగా వాక్కు! నిన్నిపుడు తలకిందులు చెయ్యాల్సోస్తుంది. అసలే మిడ్డీలో ఉన్నావు! క్యూ కడతారు స్టూడెంట్స్!"   

 Previous Page Next Page